అమ్మా ఒడి
అమ్మా ఒడి
పసినవ్వుల పసిడిబొమ్మ ఆదేవుని వరమేకద
నోచిన నోముల పండిన అమ్మతనపు గెలుపే కద
అద్భుతాలు చూపించును చిన్నినోట మాటలన్ని
అమ్మా అను తనపిలుపే ఆవేణువు స్వరమేకద
సిరిమువ్వల పదములలా ఇంటిలోన నడయాడిన
తల్లిమురియు ఆకృష్ణుని చిలిపిపనుల సొగసే కద
చిన్ని చిన్ని ఊసులతో తరిమికొట్టు చింతలనే
అమృతాలను చిలికించే పంచదార చిలుకే కద
అందమైన గులాబులకు రక్షణగా ముల్లుంటాయ్
పెద్దవారి ఆంక్షలన్ని పసివారికి కంచేకద..
పదిమందీ మెచ్చుకున్న రోజే పుత్రోత్సాహం
ఉన్నతంగ ఎదిగే పిల్లలు పొందుట గొప్పేకద...
సుజాతమై మెరవాలిర చిన్నారుల భవితవ్యం
అమ్మఒడే మొదటిబడై నేర్చుకొనుట లెస్సే కద

