అమ్మ ప్రేమ
అమ్మ ప్రేమ
అమాయికత ప్రవాహమే..అమలమైన అమ్మప్రేమ.!
పవిత్రతకు ఆలయమే..దివ్యమైన అమ్మప్రేమ..!
అమ్మపాల సాటివచ్చు..అమృతమేది ఉండదులే..
మధురరాగ భావనమే..నిత్యమైన అమ్మప్రేమ..!
అమ్మఒడిని తలపించే..స్వర్గమేది వేరేగా..
పరిమళించు సుమవనమే..భవ్యమైన అమ్మప్రేమ..!
దేశమాత,జగన్మాత..విశ్వమాత చూపిరెవరు..
నిజశ్వాసల సాగరమే..మధురమైన అమ్మప్రేమ..!
ఓనమాలు దిద్దించకె..నేర్పెను కద పదములెన్నొ..
భాషలకే అతీతమే..మౌనమైన అమ్మప్రేమ..!
లాలపోసి లాలిపాడి..ఊయలూపు జోలపాట..
అలుపెరుగని సరాగమే..గంధమైన అమ్మప్రేమ..!
