అమ్మ మనసే
అమ్మ మనసే
అమ్మమనసే కొడుకుకుంటే
జీవితాన వెలతే వుండదుగా,
నడకనేర్పి నడతనేర్పిన
అమ్మ జన్మే ధన్యముగా.
లోకంచూడని వయసు
బుద్ధుల సుద్దులతో
కలిసి పెరిగితే
బంధాల గంధాల పరిమళం తరగదుగా,
నీతికథలెన్నో చెప్పిన అమ్మకు
భ్రమలుకాని సంతోష జీవితం తనదైతే నిరాశలు వుండవుగా,
ఎదుగుతున్న కొడుకే
ఆశలింటి తలపైతే
విరహ జపమే తెలియదుగా,
బ్రతుకు సమరంలో
మమతలు నిండిన మనసు తోడుంటే
భారపుబండి దిగులే వుండదుగా.
ఊహల్లోని బాధ
మమకారపు స్పర్శతో తొలిగిపోతే
ధైర్యమే ఊపిరవ్వునుగా,
నవ్వినోళ్ల కళ్ళకు
ప్రేమ ప్రపంచాన్ని చూపగలిగితే
నా కన్నా గొప్ప ఎవ్వరుండరుగా,
గాయపడిన హృదయానికి
అనుబంధం వరమై నిలిస్తే
లేపనంతో పనే వుండదుగా,
శ్రమజీవుల చెమటచుక్కలు
బ్రతుకు మార్చే కొడుకై పుడితే
మూగబోయిన గొంతే
ఆనందరాగం పాడునుగా.
