ఆశల అలలు
ఆశల అలలు
పొద్దున్నే అందరి ఇళ్లలోకి తొంగిచూసే సూరీడు
ఇంకా నిద్దుర లేవ లేదేమో
ప్రకృతి ఎదురుచూస్తోంది తనును చూసి పులకరించాలని
అప్పుడే మెలుకవ వచ్చిందేమో పాపం
ఆదరర బాదరగా అందరిని పలకరించాలని వచ్చేస్తున్నాడు
ఎర్రని నుదుటి బొట్టులా చిరునవ్వులు చిందిస్తూ
నునువెచ్చని కిరణాలతో నేలను తాకుతూ
కొత్త ఆశలు కోరికలతో ప్రపంచం మేల్కొంటోంది
మబ్బులు వీడిన కొండా కోనలు ఒళ్ళువిరుస్తున్నాయి
తలతల మెరిసే అలలు మెల్లగా తీరాన్ని తాకుతున్నాయి
పచ్చని ప్రకృతి పరవశంతో కొత్త చిగురులు తొడుగుతోంది
పాపం పసిపిల్లలా అమాయకంగా గడ్డి చేమంతులు
కామాంధులు కాలితో తొక్కేస్తారని భయంతో వణుకుతున్నాయి
మంచు దుప్పట్లలో సిగ్గుతో ముడుచుకున్న గులాబీలు
గుండెపై వాలినా గొంతు పిసికేస్తారని విచ్చుకోనంటున్నాయి
స్వచ్ఛమైన నీటితో గలగల పారే వాగులు వంకలు
ఒంటినిండా విష కాలుష్యాలు నింపుతారని
వడివడిగా వంకలు తిరుగుతూ పరిగెడుతున్నాయి
దారితప్పితే జాగ్రత్తా అంటూ ముళ్ళకంచెలు
మనుషుల ముఖాలను తాకి హెచ్చరిస్తున్నాయి
తోకపై నిలుచుని సూర్యనమస్కారాలు చేసే నాగుపాములు
మాకన్నా విషమున్న మనుషుల కోరలు పీకేయమంటున్నాయి
ప్రకృతి నేర్పే పాఠాలు చిత్తు కాగితంలా చింపేస్తూ
యధావిధిగా మనిషి తన జీవిత యాత్ర కొనసాగిస్తున్నాడు
పొట్ట నింపుకోవడానికి పేదవాడు పనికోసం పరిగెడుతున్నాడు
పంట పొలాలను కాపాడుకోవడానికి రైతన్న పలుగు పారా పట్టుకున్నాడు
దోపిడీచేసే దళారులు దేవుడికి దండంపెట్టి బయలుదేరారు
అలసట లేకుండా పనిచేసే ఆడవాళ్లు వంటింట్లో జొరబడ్డారు
ఖద్దరు బట్టలేసుకున్న నాయకులు ఊర్లపై పడ్డారు
ప్రతి ఉషోదయం కొరకు ఆశతో ఎదురుచూసే సగటు మనిషి
తన కోరికలేమి తీరక నిరాశ నిస్పృహలతో
రేపటి కొత్త వెలుగు కోసం వేచి చూస్తున్నాడు
భానుడు మాత్రం భూగోళాన్ని చూడకుండా ఉండలేనంటూ
అంధకారాన్ని పారద్రోలుతూ ఆత్రుతగా వస్తూనేఉన్నాడు.
