ఆన్ లైన్ స్నేహాలు
ఆన్ లైన్ స్నేహాలు
మరకలు, మాసికలు, చీలికలు పేలికలు లేకుండా
స్నేహం స్నేహంలా నిలుస్తే ఫర్వాలేదు
చిరిగిన చోట పిన్నీసులు పెట్టుకున్నా
కిందికి జారే లాగుకు మొలతాడు బిగించినా సరే
ఆకలి ముఖాన్ని చేతులతో కప్పుకున్నా సరే
స్నేహాన్ని నోట్లతో కొలువనంతకాలం
విలువల తువ్వాలతో చెమట తుడిచినంత కాలం
మనం కనుమరుగైనా నిలుస్తాయి జ్ఞాపకాలుగా
ముక్కు ముఖం అగుపిస్తాయి బాగానే
బాహర్ షేర్వానీ అందర్ పరేశానీ చెప్పలేం
కనిపించే సౌందర్యం మేకప్ పొర విప్పలేం
మనసులో ఏముందో, నాలుక ఏం పలుకుతుందో
కనిపెట్టలేని గారడీ ఆట
ఆన్ లైన్ స్నేహాలు కొన్ని అద్భుతంగా నిలువొచ్చు
అలాగని అన్నింటికీ సాలు పోయలేం
కుబుసం పాములా ఏమారుస్తాయో తెల్వదు
మోసాల చిట్టా తెరిచేవే ప్రచార పదనిసలు
బ్యాంకు ఖాతాల్లో తీసివేతలు
బ్లాక్ మెయిల్ అంగాంగ ప్రదర్శనలు
ఆన్ లైన్ స్నేహాల ముసుగులే
ఆన్ లైన్ లో వస్తువులు కొంటే
పైసా ఖర్చు లేకుండా వాపసివ్వొచ్చు బాగా లేకుంటే
వారంటీలు, గ్యారంటీలు అచ్చి రావచ్చు
ఆన్ లైన్ స్నేహాలకు వర్తించవు ఏవీ
దెబ్బతింటే తట్టుకోవడం, తలెత్తుకోలేకపోవడం
లోలోపల తన్నుకు చావడం తప్పదు
మోసపోయినప్పుడు వెర్రి చూపులు చూడాల్సిందే
నాలుక మంచిదైతే ఊరు మనదౌతుంది
మనిషి నడవడి పరిచయమౌతుంది అందరికీ
ఆన్ లైన్ స్నేహాలలో సినీ హీరోలు కనిపించవచ్చు
నటన తారా స్థాయిలో ఉన్నా నిజరూపం మరొకటి
పరిమితిలో స్నేహాలు మంచివే
పరిచయాల విస్తృతికి తోవ పరుస్తాయి
కవిత్వం, విజ్ఞానం పంచుకోవడానికి చేస్తాయి దోహదం
ఆన్ లైన్ స్నేహాలతో దేశ విదేశాలు
కొలువుదీరుతాయి వాకిట్లో మనోఫలకాలపై
దేన్నైనా విద్యుత్ స్విచ్ లో వేలు పెట్టకుండా
తెలియాలి వాడుకోవడం, పదిలపరుచుకోవడం

