ఆమె
ఆమె
కష్టాలు అనేవి ఒక్కసారిగా
వచ్చి చేరాయి ఆమె జీవితంలో
తొనకని నిండు కుండలా
బెదరలేదు ఆమె....
గుండె నిండా నమ్మకాన్ని ఆయువు
చేసి ముందడుగు వేసింది.
సమస్యలన్నీ త్రాచుపాములై
బుసలు కొడుతూ చుట్టుముడుతున్నా
ఒడుపుగా అన్నిటిని దాటుకుంటూ
ముందుకు సాగింది ఆమె....
సమాజం చూసి నవ్వసాగింది ఆమెను....
మరింత బలహీనపరచాలని,
ఓ చిరునవ్వే ఆ సమాజానికి
బదులిచ్చింది ఆమె....
బంధువులు రాబంధులై
కబలించారు ఆమెను...
ఆత్మబలంతో
వారిని వదిలించుకుని
స్వశక్తితో తన సొంత కాళ్ళపై
నిలబడింది ఆమె....
నిలిచి పోరాడింది....
కాలం కనికరించలేదు ఆమెను...
తన తోడైన వారిని తనకు
దూరం చేసింది.
ఉబికి వచ్చే కన్నీళ్లను
కంటిలో దాచేసి
ధైర్యాన్ని ఆయుధంలా చేసి
ఆ కాలంతోనే పయనించింది.
ఇప్పుడు ఆశలు లేవు ఆమెకు...
వచ్చే బాధలు మీద దిగులులేదు ఆమెకు...
ఎవరో చేయూత ఇస్తారని
ఎదురు చూడడం లేదు ఆమె....
తనకై తాను బ్రతకడం
నేర్చుకుంది ఆమె....
ఈసారి కాలం ఆమె ముందు దీనంగా
మోకరిల్లింది.....
చిరునవ్వుతో ఆహ్వానించింది ఆమె....
ఎందుకంటే నేడు
ఎగసిన కెరటం ఆమె....!
