Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".
Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".

Raja Ivaturi

Tragedy


4.9  

Raja Ivaturi

Tragedy


వీడ్కోలు

వీడ్కోలు

5 mins 409 5 mins 409

'ఒరేయ్ ఎవడ్రా మా రాజాని అదమాయిస్తున్నాడు ? వాడి పేగులు తోడేస్తాను' అని చొక్కా చేతులు మీదికి మడుస్తున్నాడు అప్పుడే కొంచెం పొడుగయ్యి మొదటి సారి ప్యాంటు వేసుకున్నకొండా  వెంకటేశ్వర్లు. 
'ఒరేయ్ రాజా! నా జట్టులో ఉండరా!' అని అరుస్తున్నాడు అప్పలరాజు నీలం రంగు లాగు తెల్ల చొక్కాతో.
'రాజమోహన్! నాకీ లెక్క ఎలా చెయ్యాలో చెప్పవా?' అని అడుగుతోంది లక్ష్మి రెండు జడలతో ఒక జడ నుంచి ఊడిపోయిన రిబ్బన్ తో.
'ఒరేయ్! మనం క్రితంసారి వచ్చినపుడు మనం సరిగ్గా గడపలేకపోయాం. మరోసారి నా ఒక్కడికోసం రారా' ఆఫీస్ బల్ల మీద పేరుకుపోయిన ఫైల్స్ మధ్య నుంచి అంటున్నాడు చలపతి.
ఇంకా ఏవేవో వింత శబ్దాలతో ఎడిట్ చెయ్యని తమిళ జానపద సినిమాలో సంభాషణాల్లా వినపడుతుంటే హఠాత్తుగా మెలుకువ వచ్చింది. ఇదంతా మోగుతున్న నా ఫోన్ తాలూకు శబ్దాలు.
అంటే ఇదంతా కలా! ఫోన్ అప్పలరాజు నుంచి. ఫోన్ వాడి నుంచి అయినా విషయం చలపతి గాడూ నేను కలుసుకోవటం గురించే!
నేను బడిలో చదువుకున్నపుడు 150 మంది ఉన్న గదిలో చదువుకున్నాం. అది కార్పొరేట్ స్కూల్ కాదు కాబట్టి మా గురువులందరికీ ప్రతి ఒక్క విద్యార్థి గురించీ పూర్తిగా తెలుసు. మాకు కూడా ఆ గురువులందరిమీదా ఎంతో గౌరవం ఉండేది.

ప్రతి విద్యార్థీ మిగతా అందరికీ మిత్రుడే. ఈరోజు ఉన్న దిక్కుమాలిన బహుళజాతి సంస్కృతిలో ప్రతీవాడి ఇంటిపేరూ వాటితో పాటు కులమూ మతమూ తెలుసుకుని మరీ శత్రుత్వం పెంచుకునే వెసులుబాటు అప్పట్లో లేకపోవటం వలన అందరూ అందరితో స్నేహంగా ఉండేవాళ్ళం.
అందులోనే నాకు బలరాం, చలపతి, అప్పలరాజు తో ఎక్కువ సఖ్యత ఉండేది. బలరాం నాకు తెలియని జీవితం చూపించి నాలో పరిపక్వత కలిగిస్తే అప్పలరాజు అన్నింట్లోనూ నా తోడుగా ఉండేవాడు. చలపతితో నా బంధం ఈ రెండింటి కలగలుపు. వాడి దగ్గర బలరాం కన్నా ఎక్కువ చనువు ఉండేది. వాడి మంచి తనం స్వచ్ఛమైన వ్యక్తిత్వం నాకెప్పుడూ ఉత్సాహం ఇచ్చేది. మేము నలుగురం కొంచెం ఎక్కువ స్నేహంగా ఉన్నా ఇంకా శ్రీనూ, బుజ్జాయీ, శ్యామూ, మౌళీ మరెందరో అందరూ మాకు మిత్రులే.
విశాఖ వదిలి ఎక్కడెక్కడో ఉద్యోగరీత్యా తిరిగిన ఎన్నో ఏళ్ళ తర్వాత మళ్ళీ నా బాల్య స్నేహితులని వెతికి పట్టుకున్నాక కూడా రెండేళ్ళ తర్వాతనే దొరికిన అవకాశంతో ఆరు నెలల క్రితం విశాఖపట్నం వెళ్లి మళ్ళీ ఒక బడి పిల్లాడినయిపోయి నా పాత స్నేహితులతో ఆనందంగా గడిపి వచ్చిన నాకు ఇంకా ఆ బాల్యం గుర్తుకు వస్తూ కలలో కూడా రకరకాలుగా కనిపిస్తూనే ఉంది. కలలో నేను చూసే సంఘటనలన్నీ నా చిన్నప్పటివే కావటం వలన కనపడే మిత్రులు కూడా ఆరోజుల్లో ఉన్నట్టే కనిపించినా చలపతి గాడు మాత్రం ఇప్పటి రూపంతో మాటాడుతున్నాడు. వాడు కలలో చెప్పింది కూడా ఇప్పటి విషయమే.

వైజాగ్ వెళ్ళినపుడు నేను కుదిరినంత మంది బాల్య మిత్రులని కలిసినా వాడితో మాత్రం ఎక్కువ సేపు గడపలేకపోయాను. వాడిది ప్రభుత్వ ఉద్యోగం కావటం వలనా మంత్రుల జోక్యాలు ఎక్కువ ఉండే ఉద్యోగం కావటం వలనా పని వత్తిడిలో వాడు నేనుండటానికి ఏర్పాటు చేసిన అతిధి గృహానికి కూడా రాలేకపోయాడు. వాడి కార్యాలయానికే వచ్చి గడపమని వాడు అడిగితే నాకు కుదరలేదు. నేను వాడి ఆఫీస్ కి రాలేదని వాడూ వాడు నాతో ఎక్కువ సేపు గడపలేదని నేనూ ఇద్దరం ఒకరి మీద ఒకరు అలిగాం.

వాడి కార్యాలయంలో వాడి సమయమంతా అధికారుల చేతిలో ఉంది కనుక నేను అక్కడ గడపటం కన్నా వాడినే రెండు రోజులు సెలవు తీసుకుని శనాదివారాలు కలుపుకుని ఇక్కడే హైదరాబాద్ లో ప్రశాంతంగా గడపరా అని నేనంటే 'నాకు సెలవు కూడా దొరకదు. ఆఫీస్ లో నేను ఉండాలి. అయితే అంత పనేమీ ఉండకపోయినప్పుడు మనం ఆఫీస్ లోనే కబుర్లు చెప్పుకుంటూ గడపటానికి ఇబ్బంది ఉండదు నువ్వే రారా' అని వాడు అంటున్నాడు. నేను అక్కడికి వెళ్లి వాడొక్కడితోనే గడిపితే మిగతా స్నేహితులు నొచ్చుకుంటారని నేనంటాను. మొత్తానికి ఇది తెగటం లేదు.

ఇలాగే ఆరు నెలలు గడిచిపోయాయి.
మరి ఈ విషయమే మనసులో ఉంది కాబోలు. ఎన్నో అందమైన చిన్నతనం జ్ఞాపకాలతో పాటు వీడు నా కలలోకి వచ్చి ప్రతిరోజూ నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నాడు.

ఇదంతా తలుచుకుంటూ నేను ఫోన్ తీసుకుని అప్పలరాజుకి కాల్ చేసాను.
వాడేం చెప్తాడో నాకు తెలుసు కనుక నేనే మొదలెట్టాను.
'ఒరేయ్! ఏప్రిల్ కేలండర్ చూసాను. నేను అప్పటికి ఉద్యోగం కూడా మానేస్తాను కనుక మొత్తం టైమంతా నాదే. 4 వ తారీకు నుంచి రెండు రోజులు సెలవు పెట్టుకుంటే పండగ సెలవులతో పాటు శనాదివారాలు కలిసి మనకి 9 రోజులు వస్తుంది. ఇక్కడ బుజ్జాయి గాడిని కూడా కలుపుకుని నలుగురం నా కార్ లో ప్రతిరోజూ బైటికి వెళ్లి సాయంత్రానికి చేరేలా ప్లాన్ చేస్తాను. సాయంత్రం కూడా ఆనందంగా గడపటానికి మనకి కావలసిన "పూజా సామగ్రి" 9 రోజులకీ సిద్ధం చేసేస్తాను. వాడిని రెండు రోజుల సెలవు కి ఇప్పుడే అనుమతి తీసుకోమను.ఇంకా రెండు నెలలు టైముంది' అనేశాను గబగబా.

'ప్లాన్ బావుంది. నేను అలాగే సెలవు తీసుకుంటారా. వాడికీ చెప్తాను. కానీ వాడికిప్పుడు సెలవుకి అనుమతిచ్చినా ఒక రోజు ముందు కూడా ఆ సెలవు రద్దు కావచ్చు' అన్నాడు వాడు.
'వాడి ధోరణి చూస్తే ఈ జీవితానికి నన్ను కలిసే ఉద్దేశం లేదనుకుంటా. నీతోపాటు వస్తే రమ్మను. నేను మాత్రం వాడు రాకపోతే వైజాగ్ మొహం చూడను.' అన్నాను కోపంగా.
'అప్పటికి ఎలాగూ ఉద్యోగం మానేసేటట్టయితే నువ్వే రావచ్చు కదురా' అన్నాడు అప్పలరాజు.
'నేనొచ్చి వాడొక్కడి కోసం ఎలా కూర్చుంటాను? పైగా అక్కడ వాడిని అధికారులు చీటికీ మాటికీ విసిగిస్తారు. వాడు ఆ గొడవలు వదిలి దూరంగా ప్రశాంతంగా మనతో గడిపితే బావుంటుందని నేనాలోచిస్తుంటే నన్నే అక్కడికే వచ్చి వాడి దిక్కుమాలిన ఆఫీస్ లో కూర్చోమంటాడేమిటి? నువ్వు వాడికి వంత పాడతావేమిటి?' అని అరిచాను.
'ఒరేయ్ మీ కారణాలు మీకు ఉన్నాయి. మధ్యలో నేను ఇరుక్కుంటున్నాను. వాడికి మన ప్లాన్ నేను చెప్తాను గానీ వాడు ఏ కారణం వలనయినా రాకపోయినా నేను వస్తాను. మనం ముగ్గురమయినా కొన్నిరోజులు ఆనందంగా గడుపుదాం. ' అన్నాడు అప్పలరాజు. 
'సరే!' అని ఫోన్ పెట్టేసాను.
మేమేమి ముహూర్తంలో అనుకున్నామో గానీ కొత్త అంటు రోగం మా జీవితాల్లోకి వచ్చి ప్రపంచాన్నే కుదిపెయ్యటం మొదలయ్యేసరికి ప్రయాణాలు ఆగిపోయి నలుగురం నిరాశపడ్డాం. కొన్ని రోజుల్లో ఇదంతా సద్దుమణుగుతుందని 
అనుకుంటే నెలలు కూడా గడిచి ఏడాది కూడా దాటిపోయింది.
ఎప్పటికో అప్పటికి ఇదంతా సద్దుకుంటుందని అనుకుంటూ ఇళ్లలోనే గడుపుతున్నా నాకు నా మిత్రులందరూ కలలోకి వస్తున్నారు. మిగతావారంతా నీలం రంగు పొడుగు లాగు, తెల్ల చొక్కాలో (అది మా స్కూల్ యూనిఫామ్) కనిపిస్తుంటే చలపతి మాత్రం ఇప్పటి ఆఫీస్ బట్టలతో నన్ను అక్కడికి రమ్మంటున్నాడు. వీడు కలలో కూడా వాళ్ళ ఆఫీస్ కే అంకితమయిపోయి నన్నే తగ్గమంటాడేమిటి? అని నేను అలుగుతూనే ఉన్నాను.
ఈ లోపున ఆ అంటురోగానికి ఒక వాక్సిన్ పడ్డాక ఇక నేనే కొంచెం తగ్గి రెండో వాక్సిన్ కూడా కాగానే వాడి దగ్గరికి వెళదామా అనుకుంటుంటే మళ్ళీ ఫోన్ మోగింది.
ఉద్యోగం మానేసాక నాకు వచ్చే కాల్స్ ఎక్కువ అప్పలరాజు నుంచే కనుక ఈసారీ అదే అనుకున్నాను.
కానీ ఈ కాల్ శ్రీని నుంచి. శ్రీని కూడా మా మనసులకి బాగా దగ్గరయిన వాడే. ఎప్పుడూ ఎవరో ఒకరికి సాయం చేసే మనస్తత్వం.
'చెప్పరా శ్రీనూ' అన్నాను.
'ఒరేయ్ చెప్పటం ఇష్టం లేదు గానీ చెప్పాలి. చలపతి గాడు ఆ మాయరోగం వలన ఆసుపత్రిలో వెంటిలేటర్ మీద ఉన్నాడు. ప్రస్తుతానికి మన వాళ్ళెవరికీ ఇంకా చెప్పలేదు. నువ్వూ చెప్పకు' అన్నాడు.
ఒక్క క్షణం నాకు గుండాగినంత పనయ్యి 'మరేమీ మాటాడకు. నేను బైల్దేరుతున్నాను' అని ఫోన్ పెట్టేసాను.
కానీ అదంత సులభం కాలేదు. ఈ సమయంలో ప్రయాణం ప్రమాదమని నా కుటుంబమంతా ఏకగ్రీవంగా నన్ను ఆపెయ్యటమే కాక నా వాలెట్, నా కార్డ్స్ అన్నీ దాచేసి నన్ను నిస్సహాయుడిని చేసేసారు. నేను వేరే మార్గాలతో వనరులు సమకూర్చుకుని ప్రయాణం చేసే ప్రయత్నాలలో ఉండగా అప్పలరాజు ఫోన్ చేసి ఆసుపత్రిలో చలపతి దగ్గరికి భార్యతో సహా ఎవ్వరినీ వెళ్లనివ్వటం లేదనీ నేను ప్రయాణం ప్రయత్నం చెయ్యటం వలన ప్రయోజనం లేదని చెప్పాడు.
నేను ఇంకా ఊగిసలాడుతుంటే మరో రెండు రోజులలో శ్రీని మళ్ళీ ఫోన్ చేసాడు.
'ఒరేయ్ చలపతి ని ICU నుంచి విడుదల చేస్తున్నారు. నెలరోజులు వాడు ఇంట్లోనే ఉండి ఊపిరి మెరుగుపరుచుకోవటానికి చేయవలసినవన్నీ శ్రద్దగా చేసుకుంటే అంతా సరిపోతుంది.' అన్నాడు
'చాలా మంచి వార్త చెప్పావు రా. అయితే ఈ వారం చివర్లో నేను రెండో వాక్సిన్ వేసుకున్న వెంటనే వాడి దగ్గరికి వెళ్తాను. మనమంతా కలిసి వాడు కోలుకోవడానికి మానసికంగా బలం ఇద్దాం' అన్నాను.
'వద్దురా. వాక్సిన్ వేసుకున్నాక రెండు వారాలు నీ రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. ఆ సమయంలో ప్రయాణం ఇంకా ప్రమాదం. వాడు కోలుకునేటప్పటికి నీకు రెండో వాక్సిన్ అయిపోయి 3 వారాలు అవుతుంది కనుక అప్పుడు వస్తే మనం వాడితో సరదాగా గడపచ్చు.' అన్నాడు వాడు.
'సరే!' అన్నాను.
ఇక అంతా బావుంది అని తెలిసింది కనుక తేలిక పడిన మనసుతో 'ఇదంతా ఎలా అయ్యింది? ' అని అడిగాను.
'వాడు తిరుపతి వెళ్లి వచ్చాక కొంచెం దగ్గు వస్తోందని గమనించి అప్పలరాజు, నేను అందరం వైద్యుడి దగ్గరికి పద మన్నాము. ఎందుకు రా నేనే మందేసుకుంటున్నాను అని తేలిగ్గా చెప్పేసాడు. పైగా ప్రభుత్వ కార్యక్రమం అంటూ ఇంకో వారం ఊరు మీదే తిరిగాడు. అప్పటికి రోగం కొంచెం ముదిరి ఈ రభసంతా అయ్యింది' అన్నాడు శీను.
'ప్రభుత్వంతో సహా అందరూ అనవసరంగా గుమ్మం దాటద్దంటుంటే వీడు ఇష్టమొచ్చినట్టు తిరుగుతాడా!' అన్నాను కోపంగా. అప్పటికే వాడి మీద ముందున్న కోపం ఇంకా పెరుగుతోంది.
'వాడికి పూర్తిగా తగ్గనీ. నేను వైజాగ్ రాగానే మనందరం వీడిని తన్నే ప్రణాళిక చేద్దాం' అన్నాను.
కొంచెం బరువు తగ్గిన మనసుతో ఆరోజు పడుకుంటే ఇప్పుడు చలపతి గాడు కలలోకొచ్చి 'ఏరా నన్ను తంతావా! నేనే నిన్ను చితక్కొడతానురా. సరదాగా నా దగ్గరికి రారా అంటే రాకుండా ఇన్నాళ్లూ గడిపేసి ఇప్పుడు ఈ సమయంలో రావటానికి తయారయ్యావా ? పైగా నన్ను తన్నటానికా?' అంటున్నాడు. ఇంతకు ముందు కలల్లా కాకుండా ఇది నాకు సరదాగానే ఉంది.
కానీ మరో మూడు రోజుల్లోనే మళ్ళీ వార్త వచ్చింది. ఆసుపత్రి నుంచి రాకుండానే చలపతి మమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడు. నేను మనసులోనే కుప్పకూలిపోయాను. అంతా సరిగా ఉందని భరోసా ఇచ్చిన తర్వాత ఈ దుర్వార్త రావటంతో కలిగిన నిరాశ వలన ఇంకా దెబ్బ తిన్నాను.
ఇదేమిటి? ఇలా ఎలా జరుగుతుంది? వాడు బతికి వస్తున్నాడు. వాళ్ళు చెప్పిన వ్యాయామాలు చేసుకుంటే సరిపోతుందని నమ్మకంగా చెప్పిన వైద్యులు ఇప్పుడు ఏమంటున్నారు? ఇంకా ఎన్నెన్నో సమాధానం లేని ప్రశ్నలు వేసాను. వాడు లేడని అప్పటికే కుంగిపోయిన శ్రీను కి గానీ అప్పలరాజుకి గానీ సమాధానాలు లేవు.
అంటురోగం కావటం వలన చలపతిని ఇంటికి తీసుకెళ్ళటానికి కూడా ఆసుపత్రి అధికారులు అనుమతి ఇవ్వలేదు. వాడి ని మరి చూసే అవకాశం లేదు. 
ఆసుపత్రి లో ఒంటరిగా ఆ గదిలో ఉండి అక్కడనుంచే నిష్కర్షగా వెళ్లిపోయిన చలపతి అక్కడ ఉన్న ఆ కొన్ని రోజులూ ఏమి చేసి ఉంటాడు? వాడు ఎంత వ్యధ అనుభవించి ఉంటాడు? ఎవరికీ ఏమీ చెప్పుకోలేని ఆ పరిస్థితిలో వాడు ఏమి ఆలోచించి ఉంటాడు?
ఎన్నెన్నో ఆలోచనలతో వాడి జ్ఞాపకాలతో నేను కొన్ని రోజులు నిద్రపోనే లేదు. ఎన్నో రోజుల తర్వాత మనసు బాధతో ఉన్నా ఇవేమీ పట్టని సిగ్గు లేని నా దేహం విశ్రాంతి కోరుకుంది కనుక ఒక రోజు నాకు తెలియకుండానే నిద్రపోయాను.
ఇప్పుడు కలలేం వస్తాయి?
కానీ చలపతి మళ్ళీ కలలోకి వచ్చాడు!!!
'ఒరేయ్ చవటా! నేనెన్నో సార్లు పిలిచినా ఆఫీస్ వాళ్ళు డిస్టర్బ్చే చేసేస్తారు, మా కుటుంబం వెళ్లనివ్వటం లేదు, హైదరాబాద్ లోనే ఇంకా బావుంటుంది నువ్వే ఇక్కడికి రా అంటూ అడ్డదిడ్డమైన కారణాలు చెప్పి నాకు దూరంగానే ఉండిపోయావు కదురా. ఇప్పుడు చెప్తున్నా. ఇక నువ్వే నా దగ్గరికి రావాలి. ఇప్పుడు వద్దులే. తృప్తిగా బతికినన్నాళ్లు బతికి అప్పుడు శాశ్వతంగా నా దగ్గరకే రా' అంటున్నాడు.
ఈ కల నాకు రోజూ వస్తూనే ఉంది. నేను వాడి దగ్గరకెళ్ళే వరకూ వస్తుంది. 


Rate this content
Log in

More telugu story from Raja Ivaturi

Similar telugu story from Tragedy