kottapalli udayababu

Action Classics Inspirational

4  

kottapalli udayababu

Action Classics Inspirational

తులసిదళం(కథ)

తులసిదళం(కథ)

10 mins
319


తులసిదళం(కథ)


ఇంటి బయట ప్రహారీ గోడ వెలుపల ఈశాన్యం వైపు గా నేలబారుకు ఉన్న మురుకినీటి కుంట నిండి పొతే...సందు తుడవడానికి వచ్చిన స్కావెంజేర్ కు డబ్బు ఇస్తానని ఒప్పించి మురుగు అంతా రోడ్డుకు అవతలివైపు ఉన్న డ్రైనేజ్ లో పోయిస్తూ పర్యవేక్షిస్తున్నాను.


అంతలో ఎవరో సైకిల్ దిగి నిలబడ్డట్టు అనిపించి అటు చూసాను.


నన్ను చూస్తూనే 'నమస్కారం మాస్టారూ'..అని చేతులు జోడించాడు అతను. గుర్తు పట్టాను. ''బాలకృష్ణ '' కదూ అన్నాను.


'' అవును సర్.'' అన్నాడు అతను వినయంగా.


''పనిమీద వచ్చావా ?'' అడిగాను


''అవునండీ. మీ ఆరోగ్యం బాగుందా సర్?''


''రిటైర్ అయ్యి పదహారు సంవత్సరాలు అయింది. దేవుని దయవల్ల కాలం గడుస్తోంది.'' అన్నాను.


'' ఈవయసులో కూడా ఇంత కష్టం ఎందుకు మాస్టారూ. మీవైపున కూడా ఒక డ్రైనేజ్ కట్టించేయకపోయారా సర్? '' 


''ఏంచేయను నాయనా, మా కౌన్సిలర్ తో చెప్పి చెప్పి విసిగిపోయాను. అటువైపు వాళ్ళ బంధువుల ఇల్లు ఉంది.అందుకని డ్రైనేజ్ అటుపక్క శాంక్షన్ చేయించుకుని దగ్గరుండి కట్టించేసుకున్నాడు. నా దగ్గర చదువుకున్నవాడే. ఈ పక్కన కూడా కట్టించవయ్యా అంటే మళ్ళీ నిధులు వచ్చినప్పుడు తప్పకుండా మంజూరు చేయిస్తానండి అన్నాడు. ఏంచేస్తాం. అధికారం వాళ్ళది. వాళ్లు చేస్తామన్నప్పుడు చేయించుకోవడమే.'' అన్నాను.


''మీకు చెప్పేటంత వాడిని కాదుగానీ కొత్తనీరు వస్తే పాతనీరు బయటకు పోయి రోగాలు రాకుండా ఉంటాయి సర్. నిరంతర ప్రవాహం చైతన్యానికి స్ఫూర్తి కదా సర్.''


''లోపల కూర్చో.పదినిముషాలలో వస్తాను.ఒకవేళ పని ఉంటే చూసుకురా నీ సమయం పాడవకుండా'' అన్నాను. నా అసలు ఉద్దేశం 'నా పనికి అడ్డు రావద్దు నాయనా ' అని చెప్పడం . ఏదైనా ఒక పని చేసుకుంటుంటే ఎవరైనా అడ్డు వస్తే నాకు తగని చిరాకు.తప్పదని ఆ రెండు మాటలూ మాట్లాడాను.


''మీతో పని ఉండే వచ్చాను మాస్టారూ.లోపల కూర్చుంటాను.'' అన్నాడు బాలకృష్ణ. నేను విసుగ్గా చూసాను.


ఇంతలో నాకొడుకు శ్రీనివాస్ బయటకు వచ్చాడు.ఎల్. ఐ. సి. ఏజెంట్ గా స్థిరపడ్డాడు.


''ఒరేయ్. ఆ అబ్బాయిని లోపల నాగదిలో కూర్చోపెట్టు.నాతో ఏదో పని ఉండి వచ్చాట్ట."


మావాడు బాలక్రిష్ణని చూస్తూనే 'హాయ్ బాగున్నావా.' అని పలకరించాడు. బాలకృష్ణ ఏదో చెప్పబోయేటంతలో '' ఈమధ్య తెగ రాసేస్తున్నావట. పెద్ద రచయితవైపోయావట . మొన్న ఏదో పుస్తకం కూడా రిలీజ్ చేశావట .''అంటూ లోపలి దారితీసాడు. వాడి మాటల్లో వెటకారం ఆ అబ్బాయికి అర్ధం అయిందో లేదో తెలీదు గానీ నాకు అర్ధమైంది .వాడూ నాటైపే. అవతలి వాడు మనకన్నా గొప్పోడు అయిపోయాడని తెలిస్తే ' నీ గొప్పతనం నాముందా? ' అన్నట్టు మాట్లాడకపోతే రెచ్చిపోయే జనాలు ఎక్కువైపోయారు ఈ లోకంలో. అందుకే వాడికి ఆ బతుకుతెరువు నేర్పాను. ''కొత్తనీరు వస్తే పాతనీరు బయటకు పోయి రోగాలు రాకుండా ఉంటాయి'' అని నాకే చెప్పాడు. నాకు తెలీదు మరి. 


ఇంతలో పనివాడు ''అంతా నీట్ గా చేసేసానండయ్యా . చూసుకోండి'' అన్నాడు. అప్పటికి అరగంట నుంచీ పనిచేసి అద్దంలా శుభ్రం చేసిన వాడి పనిని మెచ్చుకోకుండా ఉండలేకపోయాను. వాడికి డబ్బులిచ్చి పంపేసి తీరిక గా నా గదిలోకి వచ్చాను. 


నాగదిలో పట్టెమంచం మీద కూర్చుంటూ అడిగాను. ''నాన్నగారు బాగున్నారా. ఎలా ఉంది ఆయన ఆరోగ్యం?'' 


నేను కూర్చున్నాకా బాలకృష్ణ నా పాదాలకు నమస్కరించాడు. ''బాగున్నారు సర్. ఆయన పనులు ఆయన చేసుకుంటున్నారు. '' 


''ఇంతకీ ఏంపని మీద వచ్చావు?" అడిగాను.


'' నేను రాసిన కధాసంపుటి నాలుగు రోజుల క్రితం ఆవిష్కరింపబడింది సర్. ఆ కాపీ ఒకటి తమరికిద్దామని వచ్చాను సర్.''


అంటూ నాచేతికి ఆ పుస్తకాన్ని అందించాడు. పుస్తకం పేజీలనీ ఒకసారి అటూ ఇటూ తిప్పి పక్కన పడేసాను. అతనిముందు చదవడం మొదలు పెడితే నా గొప్పేముంది?


"అందమైన తీగకు..." పేరు బాగుందోయ్. ఈ రోజుల్లో ప్రతీవాడూ కవీ, రచయితానూ. కర్త, కర్మ, క్రియ, ఉన్న వాక్యాలలో క్రియను ముందు పెట్టి రాసేసి, ప్రచురించబడ్డాకా తన పేరు కింద ''కవి'' అని తగిలించుకోవడం ఓ ఫ్యాషన్ అయిపొయింది. ఎనీ హౌ లెక్కల మాస్టారు గానే కాకుండా రచయితగా కూడా మంచి పేరు తెచ్చుకున్నావన్నమాట. చాలా సంతోషం.నేను కధలు రాసే రోజుల్లో ఎంత పోటీ పడేవాళ్ళం అనుకున్నావ్? ''


'' సార్. మీరు కధలు రాసేవారా సర్?'' సంభ్రమాశ్చర్యాలతో అడిగాడు బాల కృష్ణ.


'' మెల్లగా అంటావేమిటోయ్. అప్పుడున్న ప్రముఖ రచయితల్లో నేనూ ఒకడిని. రాసినవి ఓ నలభై కధలే అయినా సుమారు పన్నెండు కధలకు వివిధ పోటీలలో బహుమతులు పొందాను. ఆంధ్రప్రభ, పత్రిక, జ్యోతి, మాస పత్రిక యువ, భారతి...ఎంత మంచి సాహిత్యం వచ్చేది పుస్తకాలల్లో?ప్రతీ రోజు సాయంత్రం లైబ్రరీకి వెళ్ళేవాళ్ళం. చర్చల్లో పాల్గొనేవాళ్ళం. మరునాటి సాయంత్రానికి ఎవరో ఒకరం కథానికతో రెడీగా వెళ్లేవాళ్ళం. దానిమీద చర్చించేవాళ్ళం. అతన్ని ప్రోత్సహించి పోటీకి పంపిస్తే ఏదో ఒక బహుమతి రావాల్సిందే. అంత పాజిటివ్ అప్రోచ్ ఉండేది. ఆరోగ్యకరమైన పోటీ ఉండేది. అదే ఈరోజుల్లో ఏంరాస్తున్నారో తెలీదు. ఎందుకు రాస్తున్నారో తెలీదు. అంతా డామినేషన్ . సాహిత్యం లో కూడా రాజకీయమే.అందుకే విసిగి రాయడం ఆపేసాను. తరువాత తరువాత కుటుంబం బాధ్యతలు పెరిగిపోయి 'విరామ' రచయితనై పోయాననుకో.''


"సరే సర్. నేను ఈవేళ లెక్కల మాస్టారిగా రాణిస్తున్నానంటే అంతా మీరు పెట్టిన బిక్ష సర్. మీకు వీలున్నప్పుడు చదివి మంచి సూచనలు చెయ్యండి సర్. వస్తాను సర్. '' అని నా ఫోన్ నెంబర్ తీసుకుని వెళ్ళిపోయాడు బాలకృష్ణ.


నేను కధాసంపుటి తీసుకుని తిరగేసాను. మొత్తం ఇరవై అయిదు కధలు ఉన్నాయి. ఆనాటి నా సహచర రచయితలు ముందు మాట రాశారు. నేను రచయితనని తెలిస్తే నాచేత రాయించేవాడేమో. ఛ . మంచి అవకాశం పోగొట్టు కున్నాను అనిపించింది. కథాసంపుటిని తల్లితండ్రులకు అంకితం ఇచ్చాడు. 'అంతా మీరు పెట్టిన బిక్ష' అన్నాడు కదా. నాకు అంకితం ఇవ్వచ్చు కదా. ఒక్క క్షణం నా మనసు సంకుచిత భావం తో నిండిపోయింది. అతనిమీద కొంచం కోపం కూడా వచ్చిన మాట నిజం. 


అయితే అతను ఎప్పుడో ఆరో తరగతి చదివాడు నా దగ్గర. ముప్పై ఏడేళ్ల సర్వీసులో వేలాదిమంది కి చదువు చెప్పిన నాకు బాలకృష్ణ గుర్తు ఉండటానికి కారణం ఉంది. 


అతను ఆరోతరగతి నేను పనిచేసిన జిల్లా పరిషత్ హై స్కూల్ లోనే చదివాడు. వాళ్ళ నాన్నగారు ఈ ఊరి పెద్ద పోస్టే ఆఫీస్ లో పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ గా ట్రాన్సర్ అయి వచ్చారు. నేను ట్యూషన్స్ బాగా చెబుతానని తెలిసి నా దగ్గరకు ట్యూషన్కి తీసుకు వచ్చారు. నా విధానం లో చెప్పడం మొదలు పెట్టాను. 


నిజానికి బాలకృష్ణ యావరేజ్ విద్యార్థి. అప్పట్లో చాలా పొగరుగా ఉండేవాడిని. సబ్జెక్టు పరిపూర్ణంగా ఉందన్న గర్వం నా నిలువెల్లా తొణికిసలాడేదని చాలా మంది నా వెనుక మాట్లాడటం విన్నాను. అది నాకు చాలా 'కిక్ ' ఇచ్చేది. పిల్లలకు చదువు చెప్పేటప్పుడు వాడి స్థాయికి దిగి బోధించేవాడిని. ఒకటికి రెండుసార్లు కూడా చెప్పేవాడిని. అయినా చెప్పినదాన్ని అర్ధం చేసుకోకపోతే నాకు అరికాలు మంట నెత్తి కెక్కిపోయేది. దాంతో వాడిని వీపుమీద అరచేత్తో ఒక్క చరుపు చరిచేవాడిని. ఆ దెబ్బకు వాడి వెన్నులో నరాలన్నీ తీవ్ర ఉత్తేజాన్ని పొంది శరీరమంతా వణుకు ప్రారంభం అయేది . ఆ దెబ్బతో దానిమీద దృష్టి నిలిపి పిల్లలందరూ తమ ఆకతాయితనాన్ని వదిలి నెమ్మదిగా అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించేవారు. అలా అర్ధం చేసుకున్నవాడు ముందుకు సాగి పోయేవాడు. పరీక్షల్లో మంచి మార్కులు వచ్చేవి. కొంతమంది ఆగిపోయేవారు. వాళ్ళు నిత్యమూ దెబ్బలు తింటూ ఉండేవారు. 


తల్లితండ్రులు వచ్చి 'మా అబ్బాయిని ఎందుకు కొట్టారు సర్' అని అడిగే ధైర్యం లేకపోయేది. ఒక వేళా వాడు వెళ్లానని మారం చేస్తే రెండురోజులు మానిపించి మళ్ళీ పంపించేసేవారు. దాంతో ఇది తప్పనిసరి ''చదువు'' అని అర్ధం చేసుకుని అలవాటు పడిపోయేవారు. 


కానీ బాలకృష్ణ ట్యూషన్ కి వచ్చి వారం రోజులైనా అలవాటు పడలేదు. దాంతో రోజూ వేసే దెబ్బలకన్నా మరో రెండు ఎక్కువేసాను. దెబ్బతో వాడు ట్యూషన్ కి రావడం మానేసాడు. 


స్కూల్లో వాడు 'ఏ ' సెక్షన్ విద్యార్థి.వాళ్లకు గణితం బోధించడానికి రాజు మాస్టారు వెళ్ళేవాడు. నేను 'బి 'సెక్షన్ క్లాస్ టీచర్ని .నన్ను చూసి గోడచాటున దాక్కునేవాడు. పిలుద్దామని అనిపించినా నా అహం అడ్డొచ్చేది.


ఆలా ఒక పదిహేను రోజులు గడిచింది. బాలకృష్ణ ఫాదర్ నేను పాఠశాలకు వెళ్తుంటే ఒకరోజు నాకు ఎదురు వచ్చారు. 'అబ్బాయి ఎలా చదువుతున్నాడు సర్?' అని అడిగారు.


''మీవాడిని ట్యూషన్ మానిపించేసారుగా. ఇంకోచోట ఎక్కడో చేర్పించారటకదా '' అన్నాను నేను సేకరించిన సమాచారాన్ని బట్టి.


''బలేవారే సార్. వూరు ఊరంతా లెక్కలు నేర్చుకుంటే 'రామకృష్ణ 'మాస్టారిదగ్గరే నేర్చు కోవాలని కోడై కూస్తుంటే మావాడిని ట్యూషన్ ఎందుకు మాన్పిస్తా సర్? ఇంతకీ ఎవరున్నారామాట?'' అడిగాడు ఆయన ఆశ్చర్యపోతూ


''మీ అబ్బాయి తన ఫ్రెండ్స్ తో చెప్పాడట. వాళ్ళు వచ్చి నాతొ చెప్పారు. '' అన్నాను నేను


''పోనీ మీరే ఒక్కసారి మా ఇంటికి కబురు పెట్టకపోయారా సర్? '' అన్నాడాయన.


'' ఇళ్ళిళ్ళూ తిరిగి ట్యూషన్స్ అడుక్కునేస్థాయిలో నేను లేను. మీ అబ్బాయి సరిగా వెళ్తున్నాడా లేదా అని చూసుకోవలసిన బాధ్యత మీది. ''అన్నాను కోపంగా.


ఆయన సైకిల్ కి స్టాన్డ్ వేసి కంగారుగా వఛ్చి నా చేతులు పట్టుకున్నాడు. 


''అయ్యో. నేను ఆ ఉద్దేశంతో అనలేదు సర్. మా బంధువులు ఒకరు మరణిస్తే మూడు రోజులు వూరు వెళ్లిన మాటనిజం. వాడిని అన్నివిధాలా విచారించి నేను పంపిస్తాను.దయచేసి వాడికి చదువు బిక్ష పెట్టండి సర్. ప్లీజ్.'' అన్నాడు.


''మీరంటే నాకు ఎంతో గౌరవం సర్. మా పాఠశాల స్టాఫ్ ఎవరు పోస్ట్ ఆఫీస్ కు వచ్చినా దగ్గరుండి వాళ్ళ పని పూర్తిచేసి పంపిస్తారని మా స్టాఫ్ చెప్పగా విన్నాను. అందుకే మీవాడిని పంపండి. నా అంతటి వాడిని చేస్తాను.''


ఆయన చేటంత మొహం చేసుకుని వెళ్ళిపోయాడు. 


మరుసటి రోజు ఉదయం నేనే ఇద్దరు పిల్లల్ని వాళ్ళ ఇంటికి పంపాను. 


బాలకృష్ణ ఇంట్లో లేడట . నాదగ్గరకే ట్యూషన్ కి వెళ్ళాడట. అని చెప్పారట వాళ్ళ అమ్మగారు. రాలేదని చెప్పారట నేను పంపిన పిల్లలు. ఆమె నూట మూడు డిగ్రీల జ్వరంతో ఉన్నారట. ఆమె వారిద్దరిని వీధి తలుపు కిరువైపులా దాచి బాలకృష్ణ రాకకోసం వేచి ఉందట. తొమ్మిదింటికి బాలకృష్ణ ఇంటికి వచ్చాడట. 'ఎక్కడకు వెళ్లావురా .ట్యూషన్ లేటు అయిందేమి నాన్నా? 'అని అడిగారట. 


''సార్ ఈవేళ ఎక్కువసేపు చెప్పారు'' అన్నాడట వాడు.


''సరే లోపలి రా అన్నం తిని స్కూల్ కి వెళ్లుదువుగాని'' అని ఆమె వాడిని లోపలి రానిచ్చి తలుపులు వేసేశారట. బెల్టు తీసి ఎక్కడ తగులుతుందో కూడా చూడకుండా బాదేశారట. 'ఇపుడు తీసుకెళ్లండి వెధవని 'అని నేను పంపిన పిల్లలకు చెప్పారట.


వాళ్ళు ఏడుస్తున్న వాడిని రెండు జబ్బలూ గట్టిగా పుచ్ఛు కుని నా దగ్గరకు తీసుకు వచ్చారు. నేను స్కూల్ కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను.


''వాడిని ఇక్కడ వదిలేసి మీ పుస్తకాలు తీసుకుని ఆ తలుపులు వేసేసి ఇంటి కెళ్ళండి. ''అని చెప్పాను. 


వాళ్ళు వెళ్లిపోయారు. బాలకృష్ణ ని చూసాను. బోనులో ఆకలితో ఉన్న సింహం ముందు నిలబడ్డ లేడిపిల్లలా ఉన్నాడు. కన్నీళ్లు చారికలు కట్టిన బుగ్గలతో చేతులమీద కాళ్ళమీద బెల్ట్ వాతల తో అమాయకంగా ఏమీ తెలియండివాడిలా బేలగా నాకేసి చూస్తుంటే నాకు నవ్వొచ్చింది.


'పిల్లికి చెలగాటం - ఎలక్కి ప్రాణసంకటం' అన్నప్పుడు పిల్లికి కలిగిన తాలూకు ఆనందం నాది. 


గదిలో ఉన్న స్టూల్ మీద కూర్చున్నాను. ''దగ్గరకు రా. '' అన్నాను 


బాలకృష్ణ భయపడుతూనే దగ్గరకు వచ్చాడు. 


''ట్యూషన్ కి ఎందుకు మానేశావ్?'' అడిగాను. ముందు మాట్లాడలేదు.''భయపడకు.చెప్పు'' అన్నాను


''మీరు కొట్టే దెబ్బలకి భయమేసి సర్''


''మరి రోజూ ట్యూషన్కి వెళ్తున్నాను అని ఇంట్లో చెప్పి పొద్దున్న ఏడుగంటలకే ఇంటిలొంచి వెళ్ళిపోతున్నావట. మళ్ళీ సరిగ్గా స్కూల్ కి వెళ్లే టైం కి ఇంటికి వెళ్తున్నావట.మధ్యలో ఏం చేస్తున్నావ్?'' వద్దనుకున్నా నాకంఠం కరుకుగా పలికింది.


వాడు మళ్ళీ బేలగా చూసాడు. నేను మళ్లీ బలవంతంగా నవ్వు ఆపుకున్నాను.


''చెప్పూ'' అన్నాను నవ్వును అదిమిపెట్టే బలాన్ని కోపంగా మార్చుతూ.


''అదీ..అదీ...ఒక రోజు బస్సు స్టాండ్ కి, ఒక రోజు రైల్వే స్టేషన్ కి వెళ్లి అక్కడ అందర్నీ చూస్తూ స్కూల్ హోంవర్క్ చేసుకుని టైం గడిపేస్తున్నాను. కొద్దీ సేపయ్యాకా ఎవరినైనా టైం ఎంత అయిందో అడిగి అపుడు ఇంటికి వెళ్ళిపోతున్నాను.''


'అమ్మ వెధవా. ఇంత చిన్నవయసులో ఎన్ని తెలివితేటలు? వాడు అమాయకుడా' అనిపించింది నాకు.ఆమాట అనుకోగానే నాకు బి. పి. రైజ్ అయ్యింది.


''మరి స్కూల్లో నన్ను చూసి ఎందుకు దాక్కునేవాడివి?'' అడిగాను.


''మీరు మీ క్లాస్ లోకి వెళ్లిపోయాకా ఇంక మా క్లాస్ లోకి రాలేరుగా. అందుకని మీరు వెళ్లిపోయేవరకు దాక్కుని తరువాత నా క్లాస్ లోకి వెళ్లిపోయేవాడిని.''


అంతే. నాకు కోపం నషాళానికెక్కేసింది. వాడిని వంగదీసి వీపుమీద బలమంతా ఉపయోగించి ఒక్క చరుపు చరిచాను. ''అమ్మా. '' అన్న వాడి ఆర్తనాదం గది గోడల్లో ప్రతిధ్వనించింది. వాదీని జబ్బ పుచ్చుకున్నాను. ''సర్ సర్. ..కొట్టొద్దు సర్. రేపటినుంచి ట్యూషన్కి మానకుండా వచ్చేస్తాను సర్. '' అని కన్నీళ్ళలో ప్రాధేయపడ్డాడు. నామనసు కరగలేదు. నేను ఊహించని విషయాలు వాడు చెప్పడమే అందుకు కారణం కావచ్ఛు .


'' ఈ తెలివితేటలూ చదువులో ఉపయోగిస్తే ప్రయోజకుడివౌతావ్. నా దగ్గర ఇంతమంది ట్యూషన్ చదువుతూ. ఒక్కడు కూడా నీలా ప్రవర్తించలేదు. మాష్టారంటే నీకు లెక్కలేదా? కస్టపడి చదువు చెప్పేస్తున్నా అమ్మా నాన్నల ని మోసం చేస్తావా.." అని రెండు లెంపలూ టప టపా వాయించేసాను. వాడు నా కాళ్లకు చుట్టుకుపోయాడు. అంతే. ఎక్కడ తన్నానో తెలీదు. బలంగా తన్నేశాను. గోడకు బండి లా వెళ్లి కొట్టు కున్నాడు. మళ్ళీ అక్కడకు వెళ్లి తన్నాను. ఇంకో గోడకు వెళ్లి కొట్టుకున్నాడు. అలా నాలుగైదు సార్లు తన్నేశాను. వాడు స్పృహ తప్పిపోయాడు. 


అప్పుడు భయమేసింది. వాడికి పదకొండేళ్లు. వాడెంత? వాడి ప్రాణమెంత? ఏంచేయాలో తోచలేదు. గబగబా మావీధిలోనే ఉన్న పిల్లల డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లాను.


ఆయన పిల్లాడి వొళ్ళంతా చూసి ''ఎవరిలా కొట్టింది మనుషులా పశువులా? తగలరాని చోట తగిలితే వాడి ప్రాణం పోయేది తెలుసా. ''అని నన్ను తిట్టి వాడికి ట్రీట్మెంట్ మొదలు పెట్టారు. వాడి ప్రాణానికి ప్రమాదం లేదని డాక్టర్ చెప్పాకా నేను స్కూల్ కి వెళ్లి ఒక పూట సెలవు పెట్టి పోస్ట్ ఆఫీస్ కు వెళ్లి వాళ్ళ నాన్నగారితో పిల్లవాడిని హాస్పిటల్ లో చేర్చానని చెప్పాను. అయితే ఆయనకు నేను వాడిని కొట్టినట్టు చెప్పలేదు. ఆయన వెంటనే ఆఫీస్ కు సెలవుపెట్టి ఇంటికి వెళ్లి తన భార్యను తీసుకుని హాస్పిటల్ కు వచ్చారు.


ఆవిడను చూస్తూనే డాక్టర్ '' పిల్లలను అలా వాతలు తేలేలా కొట్టుకుంటారటమ్మా? తగిలేది తప్పేది చూసుకోవద్దు? '' అని కేకలేశారు. వాడు కళ్ళు తెరవకుండానే '' అవసరం అయితే నాకు కబురు పంపండి సర్. '' అని వాళ్ళ ఫాదర్ తో చెప్పి అక్కడనుంచి వచ్చేసాను. నా భయమంతా వాడు మెలకువ వచ్చాకా నేను కొట్టిన దెబ్బలు, తన్నిన తన్నుల గురించి చెప్పేస్తాడేమో అని. 


కానీ వాడు మెలకువ వచ్చాకా వాళ్ళ తలిదండ్రులను చూసి వెక్కి వెక్కి ఏడ్చేశాడట. 'ఆ మాస్టారి దగ్గరకు ట్యూషన్ కి వెళ్ళాను అమ్మా.' అని నిద్దట్లో ఒకటే కలవరింతలట .మూడు రోజులు విపరీతమైన జ్వరమట వాడికి. కానీ వాడు నేను కొట్టానని ఎక్కడా చెప్పలేదట . 


అందుకోసమేనా వాడికి నా అహం చంపుకుని ఓపికగా చదువు చెప్పి లెక్కల్లో ఎలాగైనా పునాది వేయాలని కృతజ్ఞతగా అనుకున్నాను . పదిహేను రోజుల్లో వాడు మామూలు మనిషయ్యాడు. 


తల్లి తండ్రులు ఏం నూరిపోశారో ఏమో వాడిని తీసుకుని వాళ్లిద్దరూ మళ్ళీ నా ట్యూషన్ లో చేర్పించారు. అక్కడనుంచి భయం పోయేవరకు వాళ్ళ నాన్నగారు వచ్చి దిగబెట్టి ట్యూషన్ అయ్యాకా దగ్గరుండి తీసుకెళ్లిపోయేవారు. ఆ త్రైమాసిక పరీక్షలలోనే వాడు వాళ్ళ సెక్షన్ లో లెక్కల్లో ఫస్ట్ మార్క్ సంపాదించాడు. అప్పటి నుండి వెనుతిరిగి చూడని వాడు పదవతరగతి స్కూల్ ఫస్ట్ వచ్చాడు. ఆతరువాత ఇంటర్ చదువుకోసం రాజమండ్రి లో చేరాడని తెలిసింది. 


బి. ఎస్. సి., బి. ఎడ్.చేసి జెడ్. పి . లో లెక్కల టీచర్ గా జాబ్ సంపాదించాడని మా అబ్బాయి చెప్పాడు .తాను జాయిన్ అయ్యాకా మొదటి గురుపూజోత్సవం నాడు వచ్చి నాకు పళ్ళు ఇచ్చి పాదాలకు నమస్కరించాడు. పెళ్ళికి పిలిచాడు. అహంకారం కదా. వెళ్ళలేదు నేను. ఈవూళ్ళోనే వాళ్ళ నాన్నగారు కట్టిన ఇంట్లో ఉంటూ చుట్టుపక్కల గ్రామంలో పనిచేస్తున్నాడట. ఉదయం వెళ్లి సాయంత్రం ఇంటికొచ్చేస్తాడట. నేను అతన్ని చూసి సుమారు పదేళ్లు అయ్యింది. అందుకే వెంటనే గుర్తు పట్టలేకపోయాను. 


*****


ఐదారు కధలు చదివాకా బాలకృష్ణ కి ఇంత టాలెంట్ ఉందా అని ఆశ్చర్యపోయాను. ముఖ్యం గా రసాయన శాస్త్రం లో పరమాణు బంధం పాఠం లోని రసాయన బంధాలలో రకాలను జీవితానికి అన్వయం చేస్తూ రాసిన "ముద్దబంతి నవ్వులో...'' కధ నాకు బాగా నచ్చింది.


వ్రాసి పెట్టుకుని ఏ పత్రికకీ పంపించని నా అముద్రిత నవల ''రాగం తీసే కోయిల'' ను ఈనాటి వాతావరణానికి తగ్గట్టుగా రాసి ప్రచురించే బాధ్యత బాలకృష్ణ కు ఇద్దామని అనిపించింది.


ఆ సాయంత్రం అతనికి ఫోన్ చేసాను. ''చెప్పండి సార్ " అంటూ వినయంగా వఛ్చి కూర్చున్నాడు. నేను మాసిపోయిన నా నవలను అతని చేతికి ఇచ్చి నా ఉద్దేశ్యం చెప్పాను. ''ఎంత కాలంలో పూర్తి చేసి ఇవ్వగలవు?'' అని అడిగాను.


'' టైం బాగా పడుతుంది సర్.మీరు రాసింది చదవాలి. దానిని ఇప్పటి వాతావరణానికి తగ్గట్టు మలచగలగాలి. మలిచినదానిని రాయగలగాలి. అటు వుద్యోగం చేస్తూ ఈ పని పూర్తి చెయ్యడం అంటే టైం పడుతుంది సర్. నా శక్తి వంచన లేకుండా మీరు అప్పగించిన పనికి న్యాయం చేస్తాను." అని ఆ వ్రాత ప్రతి పట్టుకు వెళ్ళాడు.


ఆ మరునాటి నుంచి నాకు నిద్ర పట్టలేదు. ఆ నవల చదివి తన సొంత నవలగా అచ్ఛు వేసేసుకుంటే ? ఈరోజుల్లో కధా చౌర్యం బాగా ఉంది. సినిమాల వాళ్ళు ఏదో ఒక సినిమాఆ కధ నాదంటే నాది అని ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకుంటున్నారు. అలాంటి వార్తలు ఈమధ్య పేపర్ లో చదివాడు తాను. పోనీ వెనక్కి తెప్పించేస్తే? విరామ రచయిత అయిన తాను ఎవరికీ గుర్తు ఉంటాడు? ఈ వయసులో ఈ పని అవసరమా?


ఇలాంటి ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోయి అతనికి ఫోన్ చేసాను ఆ నవల వెనక్కి తెచ్చేయమని. బాలకృష్ణ ఆ నవల ను భద్రంగా తెచ్చి అప్పగించేస్తూ " ఏమైంది సర్? " అని అడిగాడు. 


"ఈరోజుల్లో సాహిత్యం ఎవడు చదువుతున్నాడయ్యా? 'ఆ డబ్బులు నాకు గిఫ్ట్ గా ఇస్తే ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకుంటాను' అన్నాడు మావాడు. అందుకని ఆపేశానయ్యా. ఏమీ అనుకోకు." అన్నాను.


'' సరే సర్.'' బాలకృష్ణ వెళ్ళిపోయాడు.


తరువాత వారం రోజులకే అతని కధాసంపుటి కి '' కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం'' లభించిందన్న వార్త పేపర్ లో చదివాను. సంతోషం బదులు ఏదో అసూయ. నా దగ్గర చదువుకున్నవాడికి అంత పెద్ద పురస్కారమా? 


మూడు నెలల తర్వాత బాల కృష్ణ నుంచి నాకు ఓ ఉత్తరం వచ్చింది. అందులో ...


"పూజ్యులైన రామకృష్ణ మాస్టారికి,


మీ శిష్యుడు బాలకృష్ణ హృదయపూర్వక నమస్కారాలు. మీ చక్కని శిష్యరికం వలన , నా తల్లితండ్రుల ఆశీర్వాదం వలన నా కధాసంపుటికి ఒక అత్యుత్తమ పురస్కారం అందుకున్నాను సర్.


శిష్యుడినుంచి తన స్వార్ధానికి ఉపయోగించే దేనినీ ఆశించకుండా అతడు తన లక్ష్యాన్ని చేరుకునేలా దిశానిర్దేశం చేసే మార్గదర్శి ని 'గురువు' అంటారని అమ్మ చెప్పింది సర్. 


ఆరోజు హాస్పిటల్ నుంచి వచ్చాకా అమ్మ నన్ను ఒడిలో పడుకోపెట్టుకుని తాను కొట్టిన బెల్ట్ దెబ్బల కు వెన్నపూసరాస్తూ '' చదువు చెప్పే ఉపాధ్యాయుడు చల్లని చంద్రుని వంటి వాడు. అతనిలో కోపం, ద్వేషం , అసూయ ఇలాంటి లక్షణాలు వెదికినా కనపడవు. ఒకవేళ కోపంతో కొట్టినా అవే నీ జీవితానికి పునాది రాళ్లు అనుకోవాలి. ఆయన దగ్గర చదువుకునే నువ్వు ''వాడు నాదగ్గర చదువుకున్నాడు '' అని ఆయన చెప్పుకునేటంత స్థాయికి నువ్ ఎదగాలి నాన్న. ఆయన ఏంచెప్పినా ఇది నా జీవితానికి పనికొస్తుంది అని అనుకో. నువ్ తప్పకగొప్పవాడివి అవుతావు. " అంది మాస్టారు.


మీరు నన్ను చితకొట్టేశారు అని అమ్మకు మాత్రం చెబుదామనుకున్న నేను ఆగిపోయాను. ఎందుకంటే అమ్మ ఒకటే మాట అంది సర్. 'వంకాయకు పుచ్చు ఉంటే అది ఆ వంకాయనే కుళ్లిపోయేలా చేస్తుంది. అలాగే ఏ కర్రకు నిప్పు ఉంటె అది ఆ కర్రనే దహించి వేస్తుంది. ఎదుటివారు నీమీద ప్రదర్శించిన కోప తాపాలు అసూయా ద్వేషాలు నీ సోపానాలుగా మార్చుకో నాన్నా. అలా చేస్తానని నాకు మాటివ్వు అని నా దగ్గర మాట తీసుకుంది సర్. మీరు ఆనాడు నన్ను ఆలా కొట్టి ఉండకపోతే నాలో మార్పు వచ్చేది కాదు సర్. అందుకే నా ఈ పురస్కారాన్ని మీకు అంకితం చేస్తున్నాను సర్. మీ ఆశీర్వాదం కోసం వీలు చూసుకుని వస్తాను సర్. 


నమస్కారాలతో -


బాలకృష్ణ .''


ఆ లేఖను ఇప్పటికి వందసార్లకు పైగా చదివాను. ఎపుడు చదివినా కన్నీళ్ల పొరలతో మసకగానే చదివాను. అతను నన్ను శ్రీకృష్ణుణ్ణి చేసి తాను తులసీదళమయ్యాడు. కానీ ఆ అర్హత నాకు ఉందా అన్నదే నా ప్రశ్న. మీరే తీర్చాలి నా ఈ ధర్మసందేహం. 



సమాప్తం




Rate this content
Log in

Similar telugu story from Action