తల్లీనిన్ను తలంచి
తల్లీనిన్ను తలంచి


గణపతి రాత్రి 11 గంటలకు అమెరికానుండి ఫోన్ చేస్తాడని రోజూ అమ్మ,నాన్నలు- శివయ్య, పార్వతి మేలుకొని టివిసినిమాలు చూస్తూ కూర్చుంటారు
ఆరాత్రి 1 గంట అయినా మాట్లాడ లేదు
పార్వతమ్మ కంగారు పడుతూ ప్రార్ధనలు మొదులుపెట్టింది
అతిస్నేహీ పాప శంకీఅన్నారు పెద్దలు. నీకు వాడిమీద ప్రేమ ఎక్కువ.అన్నిటికీ అనుమానం-అంటూ శివయ్య కసురుకున్నాడు
మీకు మాత్రం గాబరా లేదూ? అంది
తెల్లవారింది
ఆరోజుల్లో ఇప్పటిలాగ ఇండియా నుంచి సులభంగా ఫోన్ చేసి అమెరికాకు మాట్లాడే వసతి పల్లెల్లో లేదు
శివయ్య పెందలాడే నిద్రలేచి స్నానంచేసి శివాలయాని కెళ్ళి మొక్కుకొని వచ్చాడు
మర్నాడు రాత్రి గణపతి ఫోన్ వచ్చింది
కంపెనీ గొడవల్లో ఫోన్ చేయడం కుదర లేదన్నాడు
ఆ రోజూ యధాప్రకారం గణపతి అమ్మానాన్నలను అమెరికా వచ్చి స్థిరపడమని కోరాడు
ఏళ్ళు గడిచాయి
ఇద్దరూ పెద్దవాళ్ళయ్యారు
పల్లె వాతావరణం వదలి వాళ్ళు వెళ్ళలేరు
గణపతి అమెరికాలో అప్పుచేసి బ్రంహాండమైన ఇల్లు కొన్నాడు
కూతురు ,కొడుకు స్కూళ్ళలో చదువుతున్నారు
తాను ఈదశలో మరోఉద్యోగం వెతుక్కొని ఇండియా రాలేడు
తానో ఊబిలో చిక్కిన పరిస్థితి
పార్వతి పొద్దుటే తులసికోటకు ప్రదక్షిణ చేయడం, బావి నీళ్ళ స్నానం, సాయంకాలం శివాలయాని కెళ్ళడం అమెరికాలో కుదరదని భీష్మించుకొని కూచుంది
ఓ రోజు రాత్రి పార్వతికి హార్ట్ అటాక్ వచ్చి పట్నానికి తీసుకెళ్లి
ఐ సి యు లో పెట్టారు
నాలుగో రోజుకు హుటాహుటిన గణపతి వచ్చాడు
మానసికంగా ఆమె కుంగి పోయిందని డాక్టర్ చెప్పాడు
వారం రోజుల్లో డిశ్చార్జి చేశారు
కొడుకును అమెరికాకు సాగనంపుతూ పార్వతి భోరున ఏడ్చింది
నీ వొడిలో తలపెట్టి నేను చస్తాను లేరా । అంటూ సాగనంపింది
గణపతి అమెరికా కెళ్ళినా మనసు నిలకడ చేసుకో లేక పోయాడు
ఒకే ఒక్క కొడుకుగా తను వాళ్ళను వొంటరి చేయగూడదని నిశ్చయించుకున్నాడు
అమ్మకోసం ఇండియా రావాలని ఉద్యోగప్రయత్నం చేశాడు
తనహోదాకు తగినది దొరక లేదు
జీతమూ తక్కువ
ఇంటి అప్పు తీర్చాలి
‘ఏది ఏమైనాసరే ఇండియా కెళ్ళాలి
అమ్మ చివరి క్షణాలు తనతో గడపాలి’ అని మూడో నెలలో కార్తీక పూర్ణిమ నాడు అమ్మానాన్న శివాలయంలో ఉన్న సమయంలో సకుటుంబంగా కార్లో వచ్చి ఊళ్ళో దిగాడు
అంతా ఆ శివుని దయ -అని మనవరాలిని గుండెలకు హత్తుకుంది పార్వతమ్మ కంట తడపెట్టి
ఆలయంలో హారతి గంటలు మోగాయి