ఇక్కడ అంతా క్షేమం
ఇక్కడ అంతా క్షేమం


డియర్ సుధా. 011 23445522
సంక్రాంతి శుభాకాంక్షలు. ఢిల్లీ
రెండు మూడు సార్లు ఉత్తరం మొదలు పెట్టాను. 15-1-1972
పనులు వొత్తిడి లో రాయలేక పోయాను.క్షమించు. Is
నెలకు రెండు ఉత్తరాలు రాసేదాన్ని ఢిల్లీ వచ్చిన కొత్తల్లో.
మన ఊళ్ళో శివాలయం స్వామిని హాస్పిటల్లో అడ్మిట్ చేశా రని మొన్న మా యింటికి వచ్చిన సుకుమార్ చెప్పాడు.ఎలావుంది?
రామాలయం కృష్ణమూర్తి శాస్త్రి గారు బాగున్నారా?
మీ అమ్మ, నాన్నలకు నమస్కారం
ఈరోజు ఏ.పి.భవన్లో ఢిల్లీ తెలుగు అకాడమీ అవార్డు మీ బావగారు తీసుకో బోతున్నారు
మావారు గొప్ప వారని నీకు తెలుసు. ఏదో హడావిడి జీవితం గడుపుతూ ఉంటారు
మేమిద్దరం ప్రేమించుకున్నాం.పెళ్ళి చేసుకున్నాడు.కానీ.......
మా ఇంట్లో గొడవలు నీకెందుకు లే!
నా కూతురు సరళ పెద్ద దయింది. చదివిస్తున్నాం.
రామ్ జస్ కాలేజి లో ఫైనల్ బి.ఏ చదువు తోంది
ఆమధ్య వాళ్ళ క్లాస్ మేట్ అబ్రహాం అనే కుర్రాడిని వాడి బర్త్ డే అని ఇంటి కి తీసుకొచ్చి పార్టీ పేరుతో విచ్చలవిడిగా తిరిగింది
వాళ్ళ నాన్న డ్యూటీ మీద నాగపూర్ వెళ్ళారు.ఆయన వుండి వుంటే శివుడు మన్మధుడిని భస్మం చేసి నట్లు నానా హంగామా చేసేవారు
ప్రేమ పెళ్లి చేసుకోవడం ఘోరనేరమని స్వయంగా తెలుసు కున్నానని ఫ్రెండ్స్ తో వాపోయారు
నా ఆఫీసు హడావిడిలో ఈమధ్య ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోంది. నాకు జాయింట్ డైరెక్టర్ ప్రమోషన్ వచ్చింది.
మరిన్ని వివరాలు రేపు ఉదయం వ్రాసి ఇన్లాండ్ లెటర్ పోస్ట్ చేస్తాను
..........
టూర్ వెళ్లి రావడం వల్ల లెటర్ పూర్తి చేయడం కుదరలేదు. 2-2-72
మన మిద్దరం రోజూ రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న హైస్కూల్ కి సైకిల్ మీద వెళ్ళి రావడం గుర్తు కొస్తోంది
ఒకరోజు స్పీడ్ గా వస్తున్న నాగార్జున స్కూటర్ తగిలి నేను పడి పోయాను. నువు ఏడుస్తూ కూర్చుంటే మన ఊరి పెద్ద కాపు నన్ను హాస్పిటల్ తీసుకెళ్లి
కాలికి బ్యాండేజ్ కట్టించాడు.
నా గొడవ ఇంకచాలు
మీ ఇంట్లో వాళ్లు ఎలా ఉన్నా రురా సుధా!
ఏరికోరి మీవాళ్ళు మీబావకే ఇచ్చి పెళ్లి చేసారు. నాలుగు రోజుల్లోనే నా పెళ్లి. ఒకరిపెళ్ళికి ఒకరు రాలేక పోయాం!
మీ బావ సినిమా హీరో లా వుంటాడనేదానివి.
నీ కొడుకు మా అమ్మాయి కంటే రెండు సంవత్సరాల ముందు పుట్టాడు
మన ఊరికి రోడ్ వేసి ఆర్.టి.సి బస్సు సౌకర్యం వచ్చిందని తెలిసింది
మీవారు వ్యవసాయ పనులు చూసుకుంటుంటే నీవు కడుపులో చల్ల కదలకుండా కూర్చుని ఇద్దరు పిల్లలతో కడుపు పండించుకున్నావు.
నీకేవమ్మా పెట్టి పుట్టిన దానవు!
మేం కడుపు చేతపట్టుకొని ఛప్పన్నదేశాలు తిరిగి ఢిల్లీ నగరకాలుష్యం పంచుకొంటున్నాం
ఢిల్లీ రమ్మని ఎన్ని సార్లు చెప్పినా నువు మీబావను వొప్పించలేక పోయావు
ఈ పరుగు జీవితం నాకు బోర్ కొడుతోంది
మా వారికీ,ఆయన ముద్దుల కూతురికీ ఏదో ఒక రోజు టాటా చెప్పేసి అరుణా చలం లో శేషజీవితాన్ని గడిపేస్తాను.
ఈవిషయంలో నీవు నా తో ఏకీభవించవని తెలుసు.
అంతా భగవదేఛ్ఛ!
బోర్ కొట్టించాను. టాటా!
నీ ప్రాణస్నేహితురాలు
రాధాకుమారి