SATYA PAVAN GANDHAM

Classics Inspirational Others

4  

SATYA PAVAN GANDHAM

Classics Inspirational Others

"థాంక్యూ టీచర్...!"

"థాంక్యూ టీచర్...!"

9 mins
507


తల్లి జన్మనిచ్చి జీవితాన్ని ప్రసాదిస్తే,

తండ్రి ఆ జీవితానికో దారిని చూపిస్తాడు.

కానీ, ఆ దారిలో చీకటిని పాలద్రోలి వెలుగును నింపేది మాత్రం గురువు.

అందుకే, అంటారు కాబోలు...

"మాతృదేవోభవ !

పితృదేవోభవ !

గురుదేవోభవ !"

నన్ను కన్నారు కాబట్టి, నేను వాళ్ళ సొత్తు కాబట్టి,

నా తల్లిదండ్రులకు నా బాగోగులు గురించి పట్టక తప్పదు!

కానీ, చీకటి అలుముకొని అజ్ఞానంతో ప్రయాణిస్తున్న నా జీవితంలో, నాకోసం పరితపిస్తూ...

ఏ సంబంధం లేని నన్ను ఒక గొప్ప స్థానంలో నిలపడం కోసం అహర్నిశలూ శ్రమించి, 

ఎప్పటికప్పుడు విజ్ఞానాన్ని పెంపొందించి వెలుగును ప్రసాదించిన నా గురువులకు కృతజ్ఞతగా,

వాళ్ళకి ఓ గురుదక్షిణగా,

నా ఈ చిన్న ప్రయత్నం.

"థాంక్యూ టీచర్...!"

ద్వారా నా ఈ జీవిత ప్రయాణం లో నాకు తోడ్పడిన ప్రతీ టీచర్ గురించి వివరించాలనుకుంటున్నాను.

ముందుగా మా స్కూల్ టీచర్స్ దగ్గర నుండే మొదలుపెడదాం.

"పద్మ టీచర్...!"

జీవితమనే గమ్యానికి తొలిమెట్టు ఆ ఒకటవ తరగతి. అప్పట్లో ఇప్పుడున్నట్టు నర్సరీ, ఎల్ కె జీ, యూ కే జీ లంటూ ఏమీ లేవు. అందులోకి ప్రభుత్వ పాఠశాల. స్కూల్ అన్నా, టీచర్ అన్నా ప్రతి పిల్లాడికి భయం ఉన్నట్టే, నేను కూడా భయపడుతూనే, నా తల్లిదండ్రుల బలవంతంతో

(అయిష్టంగానే, ఈ రోజు తెలిసొచ్చింది ఆ రోజు వాళ్ళు నాకెంత మేలు చేసారోనని) చేరక తప్పలేదు.

ఆ పాఠశాలలో ఒకే ఒక్క టీచర్, పేరు పద్మ.

చాలా అంటే చాలా సున్నిత మనస్కురాలు. స్కూల్కి రానంటూ మారం చేసే పిల్లల్ని సైతం, తన చంటి బిడ్డలలా ఒళ్ళో కూర్చోపెట్టుకుని ఓనమాలు నేర్పిన తీరు,

ఆవిడ విద్యార్థులతో మమేకమైన విధానం చూసిన నాకు

ఆ బాల్య దశలోనే టీచర్ అంటే కొడతారు, తిడతారు అనే ఎన్నో అపోహలకు తెరదించుతూ మరొక అమ్మని పరిచయం చేసింది ఆవిడలోని ఆ గొప్పతనం.

అయినా..., నా వయసున్న అంత మంది పిల్లల అల్లరిని ఆ ఒక్కావిడే తట్టుకోవడం చాలా కష్టం కదూ!

కానీ, తన కర్తవ్యాన్ని, విధి నిర్వహణను సమర్ధవంతంగా నిర్వహించారు.

దాంతో టీచర్స్ అంటే అప్పటివరకూ నాకున్న భయాలు పోయి, గౌరవం మరియు ఇష్టం పెరిగాయి.

ఈ రోజు పెద్దవారి పట్ల మర్యాదగా ప్రవర్తిస్తున్నానే గుర్తింపు నాకుందంటే, ఆ గొప్పతనం ఆనాడు నా ఆ చిట్టి మెదడులో సరైన భీజం నాటిన ఆ పద్మా టీచర్ కే చెందాలి.

అందుకే, పద్మ గారు...!

థాంక్యూ టీచర్...!

                             ****************

విమల, మంగమ్మ , శారదా టీచర్లు...!

రెండో, నాలుగో తరగతిలో విమలా టీచర్, కొంచెం గాంభీర్యం కలవారే, కానీ ఆవిడ పాఠ్యాంశాలు వివరించే తీరు ఇప్పటికీ మర్చిపోలేను. నా రచనలలో సరళమైన వివరణ ఈవిడ దగ్గర నుండి పుట్టుకొచ్చిందే.

మూడో తరగతిలో మంగమ్మ టీచర్ ఈవిడ కూడా పిల్లల పట్ల దయాహృదయం కల్గిన వారే, ఈవిడ చెప్పే ప్రతి కథ మానవతా విలువలను చాటిచెప్పే లా ఉండేవి. నాలో ఎంతోకొంతో మానవత్వం దాగుందంటే అది ఈవిడ చలవే!

ఐదవ తరగతిలో శారదా టీచర్.. స్కూల్ కి హెడ్. 

తరచూ డిక్టేషన్ (కొన్ని పదాలు చెప్తే రాయడం)లు పెట్టీ అప్పట్లోనే మాకు పదాలపై పట్టు సాధించేలా ప్రేరేపించేవారు. ఇదిగో ఇప్పుడు నేను రాస్తున్న ప్రతి పదం అక్షర దోషం లేకుండా రాయగలుగుతున్నానంటే, దానికి కారణం ఆవిడే.

మేము ప్రైమరీ స్కూల్ నుండి హై స్కూల్ కి వెళ్ళినా కూడా వీళ్ళని అప్పుడప్పుడు వెళ్లి కలుస్తుండేవాల్లం. అలాంటి చక్కటి బంధం ఉండేది మాకు వీరికి మధ్య.

నాలో ఇన్ని సులక్షణాలు పుట్టుకురావడానికి కారకులైన వాళ్ళు వీళ్ళే!

అందుకే,

విమల గారు..!, మంగమ్మ గారు...!, శారద గారు...!

థాంక్యూ టీచర్స్...!

                             ****************

సురేష్ మాస్టారు...!

అప్పటికే ప్రైమరీ స్కూల్ లో ఆడుతూ పాడుతూ చదువు పూర్తి చేసి, సెకండరీ స్కూల్ కి వెళ్ళిన నాకు!

అదంతా ఒక కొత్త లోకంలా కనిపించింది. పరీక్షలంటే భయం మొదలైంది. అలాంటి సమయంలో నాకు ధైర్యం చెప్పి నాలో పట్టుదలను రేకెత్తించారు ఆ సైన్స్ మాస్టారు సురేష్ గారు.

ఆయన సలహాలు సూచనలతోనే...ఆరవ తరగతి మొట్ట మొదటి యూనిట్ టెస్ట్ లో దాదాపు తొంభై మంది గల తరగతిలో రెండవ ర్యాంక్ సాధించగలిగాను. మొట్ట మొదటి సారిగా మెరిట్ స్టూడెంట్ అనే గుర్తింపుని, ఆ గుర్తింపుతో వచ్చిన అనుభూతిని పొందగలిగాను.

ఇప్పటికీ ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా విజయం పొందాలనే కాంక్ష, పట్టుదల ఆయన ద్వారా పొందినదే!

అందుకే, సురేష్ గారు..!

థాంక్యూ టీచర్...!

                             ****************

కళ్యాణి టీచర్...!

ఆరవ తరగతి మధ్య కొచ్చేసరికి మాకున్న ఆ టీచర్ లందరూ బదిలీ అయిపోయి, కొత్త టీచర్లు వచ్చారు. అలా మా పాఠశాలకు బదిలీ అయిన వాళ్ళలో కళ్యాణి గారు ఒకరు. ఇంగ్లీష్ టీచర్ ఆవిడా. ప్రైవేటు స్కూలల్లో ఇంగ్లీష్ టీచర్ల మాదిరిగానే ఆవిడ కూడా రూపంలోనే కాదు, క్లాసులు చెప్పే విధానం కూడా సౌందర్యమే. మేము చేసే చిన్న చిన్న పొరపాట్లకు బాధను కలిగించేలా దండించడం బదులు బాధ్యత తెలిసేలా సరికొత్త శిక్షలు విధించేవారు.

ఏవైనా తప్పులు చేస్తే, ఫైన్ విధించడం. అలా పోగు పడిన డబ్బులతో లేనివారికి సాయం చేయడం లాంటి ఒక మంచి పనికి ఉపయోగించడం. నాకు సాయం చేసే గుణం పుట్టిందక్కడే!

స్కూల్ కి లేట్ గా వస్తె, క్లాస్ బయట నిల్చోబెట్టడం, గోడ కుర్చీలు వేయించడం, మోకాళ్ళ పై నిలబెట్టడం ... అప్పట్లో మాకవి సిగ్గుగా అనిపించినా, ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది మేము జీవితంలో ఎదుర్కునే పెద్ద పెద్ద సమస్యలకు అవొక వ్యాయామ సాధనాలని.

ఇప్పటిికీ నాలోని క్రమశిక్షణకు కారకురాలు ఆవిడే.

ఆవిడ నిర్వహించిన క్విజ్ పోటీలలో మొట్ట మొదటి సారి పాల్గొన్న నేను, ఆపై గెలుపొంది, ఆవిడ చేతుల మీదుగానే బహుమతులు అందుకున్నప్పుడు అర్థమైంది, నాలో ఓ ప్రయత్నించే పోటీదారుడు దాగున్నాడని.

అప్పట్లో మరుగున పడుతున్న నైపుణ్యాన్ని వెలికితీసిన ఆవిడ, ఇప్పటికీ నేనోడిపోతూ పడిపోతున్న ప్రతిసారీ నాకు చేయుతనందిస్తూ..., ధైర్యం చెప్తూ...

ఒక టీచర్ లానే కాకుండా, ఒక స్నేహితురాలిగా, ఒక సన్నిహితురాలిగా, ఓ సోదరిలా అంతకుమించిన ఒక తల్లిగా నా వెన్నంటే ఉంటూ ప్రతిక్షణం నన్ను ప్రోత్సహిస్తున్నారు. నాకండగా నిలుస్తున్నారు.

ఒకప్పుడు ఆవిడ ప్రతి కార్యాచరణకు స్ఫూర్తి పొందిన నేను, ఈ రోజు నేను చేసే ప్రతి కార్యాచరణకు తనని

మెప్పించగలుగుతున్నాను. ఒక రకంగా అది కూడా ఆవిడ గొప్పతనమే!

అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మా బంధం ఇంతే కాదండోయ్!

ఒక రచయితగా ఆవిడకి నా రచనలంటే మక్కువ. నేను రాసే ప్రతి రచనకి ముందడుగు పడే ఓ మద్దతు ఆవిడ దగ్గర నుండి రావడం పరిపాటే. అదొక వర్ణించరాని ఓ గొప్ప అనుభూతి.

నా రచనలను మెచ్చిన ఆవిడ!,

నన్ను మాటల మాంత్రికుడంటూ, తన కవిత మిత్రుడుగా భావిస్తుంటే, అంతకంటే గొప్ప బిరుదులు ఏముంటాయి చెప్పండి.?

మా కళ్యాణి గారి గురించి రాయాలంటే అక్షరాలు కూడా అలసిపోతాయి, పదాలు నీరసించిపోతాయి, వాక్యాలు నలిగిపోతాయి.

ఇప్పటికీ ఆవిడ చెసే ఆ మాట సహాయాలు, దిశానిర్దేశం చేసి, నాలో ఆత్మ స్థైర్యాన్ని నింపి నాకొక పునర్జ్మనిచ్చి, ఈ రోజు మీ ముందు నన్నిలా నిలబెట్టాయి.

నా జీవితమొక తెరిచిన పుస్తకమైతే, దాన్ని క్షుణ్ణంగా చదువుతుంది ఆవిడేనని, సగర్వంగా చెప్పుకోగలను.

అందుకే,

కల్యాణి గారు...

థాంక్యూ టీచర్...!

                             ****************

విజయ్ భాస్కర్ సార్...!, స్వాతి టీచర్...!

మెరిట్ స్టూడెంట్ అనే ట్యాగ్ లైన్ ఆ ఒక్క యూనిట్ టెస్ట్ కే పరిమితమై పడుతూ..! లేస్తూ..!, సాగుతున్న నా చదువుల ప్రయాణానికి, ఓ కొత్త చిగురు పూయించిన వాళ్ళల్లో మా విజయ్ భాస్కర్ గారు ఒకరు, ఆయనతో పాటు మాకు ఏడవ తరగతిలో ట్యూషన్ చెప్పిన ఆయన సతీమణి స్వాతి టీచర్ గారు కూడా.

నేనొక కనుమరగువుతున్న మెరిట్ విద్యార్ధినని తెలుసుకున్న వాళ్ళు, ఏడవ తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ కి నన్ను టాపర్ గా నిలిపి, నాలో సమాధవుతున్న నైపుణ్యాన్ని వెలికితియ్యాలనే సంకల్పంతో, పగలు రాత్రి నన్ను సాన బెట్టారు.

కానీ, వాళ్ళిద్దరీ ఆశలకు కళ్లెం వేస్తూ ఆ ఎగ్జామ్స్ లో ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించకపోయినా...

వాళ్ళు నిరుత్సాహ పడలేదు.

అప్పటికే బావిలో కప్పలా ఉన్న నాతో, బయట జరిగే అనేక స్కూల్ ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేయించి, నాలో ఉన్న భయమనే చీకటిని తొలగించి ఎప్పటికప్పుడు దైర్యాన్ని నింపేవారు.

చివరికి తొమ్మిదో తరగతిలో ఒక సాధారణ విద్యార్థిగా నున్న నాతో, మెరిట్ స్కాలర్ షిప్ టెస్ట్ లో రాష్ట్ర స్థాయిలో 290 వ ర్యాంక్ , జిల్లా స్థాయిలో 90వ ర్యాంక్, స్కూల్ లో మొదటి ర్యాంక్ సాధించేవరకు పట్టు విడువలేదు వాళ్ళు.

ఆఖరికి మేము పదవ తరగతికి వచ్చే సరికి, ఆయన వేరే చోటికి బదిలీ అయినా కూడా... మా స్కూల్ లో ఆ టైంకి టీచర్స్ కొరత ఉండడంతో, ఆదివారం కాళీ చేసుకుని మాకోసం వచ్చేవారు, మాకు పాఠాలు బోధించేవారు.

తమ విద్యార్థుల జీవితాల పట్ల గురువులు ఎంత బాధ్యతగా వ్యవహరిస్తారో ..! చెప్పడానికి ఈ ఒక్క సంఘటన నిలువెత్తు నిదర్శనం.

ఆయన కూడా నేను చేసే సమాజ సేవంటే ఇష్టపడతారని ఈ మధ్యన ఒకానొక సందర్భంలో చెప్తుంటే, అంతకన్నా తగిన గుర్తింపు ఇంకెక్కడ దొరుకుతుందని సంబరపడ్డాను.

ఈ రోజు నేను దైర్యంతో వేసే ప్రతి అడుగులో వాళ్ళ పాత్ర ఎంతైనా ఉంది. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను, శివపార్వతుల లాంటి మీ ముందు ఓ నందిలా పడుండడం తప్ప!

అందుకే,

విజయ్ భాస్కర్ గారు, స్వాతి గారు

థాంక్యూ టీచర్స్...!

                             ****************

ముత్యం మాస్టారు..!

చెరగని చిరునవ్వుతో, ఆ వయసులో కూడా ఉరకలెత్తే ఉత్సాహంతో మాతో కలిసిపోయి ఒక స్నేహితుడిలా విద్యార్థులతో ఎప్పటికప్పుడు వ్యాయామాలు చేయించి, ఆటలతో ఉత్తేజపరుస్తూ వాళ్ళకున్న మానసిక ఒత్తిడిని అధిగమించడం లో ముఖ్యమైన భూమిక పోషించిన వాళ్ళలో ఒక డ్రిల్ మాస్టారుగా సహనసీలి, మృదు స్వభావైన ముత్యం గారు ఎప్పటికీ నాకొక ఆదర్శం.

ఈ రోజు క్రీడలలో కూడా భౌతికంగా, మానసికంగా ఎంతో కొంత దృఢంగా నిలబడగలగుతున్నానంటే ఆది ఆయన చలవే!

అందుకే,

ముత్యం గారు...!

థాంక్యూ టీచర్...!

                             ****************

నరసింహారావు మాస్టారు...!

సరిగ్గా పదవ తరగతికి వచ్చే సరికి, అప్పటివరకూ మాతోనున్న టీచర్స్ అందరూ బదిలీ అయిపోయారు. అప్పటికే వాళ్ళతో మాకు బలమైన సంబంధం ఏర్పడింది. వాళ్ళు వదిలి వెళ్తుంటే, మాలో ఎక్కడలేని ఆందోళన!

వాళ్ళతో అంత మమేకమైపోయాము మేము.

తర్వాత మాకొచ్చిన టీచర్స్ బృందం కూడా తక్కువే. అలాంటి పరిస్థితిలో మాలో దైర్యం నింపారు నరసింహారావు గారు. ఆయన మా ఊరికి చెందినవారే కావడం కొంతలో కొంత మేము సంతోషించదగ్గ విషయం.

ఒక యూనిట్ టెస్ట్, ఆయనతో బంధాన్ని మరింత బలపరిచింది.

ఆ యూనిట్ టెస్ట్ లో, ఎగ్జాం టైం అయ్యాక అందరూ ఆన్సర్ షీట్స్ సబ్మిట్ చేసి వెళ్లిపోతుంటే, నేను మాత్రమే కూర్చుని కంగారుగా రాయడంతో..

అది చూసిన ఆయన, నా పట్టుదల అర్ధం చేసుకుని, ఇంకొంచెం అదనపు సమయాన్ని కేటాయించారు.

నాకు ఆయనెవరో తెలియక పోయినా, నా ఒక్కడి కోసం ఆయన కూడా నాతో పాటే ఉండిపోవడంతో ఆశ్చర్యపోయాను.

కానీ, అప్పటికే నేనొక మెరిట్ స్టూడెంట్ నని (తొమ్మిదవ తరగతిలో స్కాలర్షిప్ రావడం తెలిసి) , ఫలానా వాళ్ళ అబ్బాయినని తెలుసుకున్నారు. (ఒకే ఊరివాళ్ళం అవ్వడం వల్ల)

నా ప్రతి పరీక్షలో నేను చేసే ఆ చిన్న చిన్న పొరపాట్లను గుర్తించి, వాటిని ఆయనే స్వయంగా దగ్గరుండి చెప్పేవారు, వాటిని సరిదిద్దుకునేలా ప్రోత్సహించేవారు.

దాంతో సాదా సీదా విద్యార్థిగానే పదవ తరగతి మొదలుపెట్టిన నేను...

చివరికి స్కూల్ టాపర్ గా నిలవడంలో ఆయన పాత్ర అధికం.

స్కూలింగ్ పూర్తయ్యి పదేళ్ల పైమాటే అవుతున్నా..

ఇప్పటికీ నేను నా జీవితంలో ఎదుర్కుంటున్న సమస్యలకి సూచనలు, సలహాలిస్తుంటారు. నాలో అనుక్షణం స్ఫూర్తిని నింపుతుంటారు. నా వ్యక్తిత్వాన్ని ఇనుమడింప చేసే నిబద్ధతను నేర్పిన వ్యక్తి ఆయన.

అందుకే,

నరసింహారావు గారు...!

థాంక్యూ టీచర్...!

                             ****************

మంగ తాయారు టీచర్...!

ఒక పక్క అంగ వైకల్యం వెక్కిరించినా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా... మరేన్ని అవరోధాలు అడ్డుపడినా...

నిరంతరం అకుంఠిత దీక్షతో మాలాంటి ఎందరో విద్యార్థుల పాలిట బాసటగా నిలుస్తూ మమ్మల్ని విజయ కాంక్ష వైపు నడిపిన వారు మంగ తాయారు గారు (సైన్స్ టీచర్).

నన్ను ఒక టాపర్ గా చూడాలన్న ఆమె కలకి, నాకన్నా ఎక్కువ కష్ట పడింది, ప్రయాస పడింది ఆవిడే.

చాలి చాలని ఉపాధ్యాయులతో పదవ తరగతి అప్పటికే సగం గడిచిపోయింది. కానీ, ఆవిడ ఎంచుకున్న ప్రణాళికతో త్వరితగతిన పాఠ్యాంశాలు పూర్తి చేయడమే కాకుండా, ఆమె చూపిన తెగువ మాలో స్థైర్యాన్ని నింపి ఆ పదవ తరగతి పరీక్షలలోనే కాదు, ఇప్పటికీ జీవితంలో ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది.

అందుకే,

మంగ తాయారు గారు

థాంక్యూ టీచర్...!

                             ****************

లక్ష్మీనారాయణ సార్...!

పదవ తరగతి ట్యూషన్ టీచర్...

మా మండలంలోనే వేరొక పాఠశాలకు టీచర్ అయినా ... సొంత వూరి విద్యార్థుల మీద మమకారమో, లేక మా భవిష్యత్తు నాశనం అవుతుందనో...

అసలే టీచర్స్ కొరతతో కొన్ని కొన్ని సబ్జెక్ట్స్ అసలు మొదలవ్వక సత్తమవుతున్న మాకు... ఏ కల్మషం, పారదర్శకత చూపకుండా... తనకున్న ఆ తక్కువ సమయంలోనే అన్ని సబ్జెక్టులలో పాఠ్యాంశాలు సవివిరంగా వివరించి, ఆయన స్కూల్ విద్యార్థులతోనే పోటీ పడేట్టు తీర్చిదిద్దారు మమ్మల్ని.

ఆయన నుండి నేర్చుకున్నది పారదర్శకత లేని మనస్తత్వం. ఆ పదవ తరగతిలో నేను మంచి ఫలితాలు సాధించడంలో ఆయన కృషి కూడా ఎనలేనది.

అందుకే,

లక్ష్మీనారాయణ గారు...!

థాంక్యూ టీచర్...!

                             ****************

వీళ్ళే కాదు,

✓లెక్కలంటే మల్లగుల్లాలు పడుతూ భయపడుతున్న ఎందరో విద్యార్థులకు సులుభ రీతిలో వివరించడమే కాకుండా అల భయపడ్డ వారికే వాటి పై ఇష్టం పెరిగేలా చేసినటువంటి వెంకన్న గారు (పెద్ద లెక్కల మాస్టారు)

✓వయసులు మల్లుతున్నా .. సహనం, ఓపిక కోల్పోకుండా    

 తమతమ అనుభవాలు పంచిన

శారంభ గారు(తెలుగు టీచర్)

నాగమణి గారు (హిందీ టీచర్)

✓తాను నిండు గర్భిణిగా ఉన్నా.. విద్యార్థుల కోసం తన 

  విధులను మరవని

 సరిత గారు(సైన్స్, మాథ్స్ టీచర్)

✓సైన్స్ అంటే పుస్తకంలో చూసి నేర్చుకునేది కాదు, బయట చుట్టూన్న పరిసరాల నుండి నేర్చుకునేదని, ఆచరణాత్మక విజ్ఞాన్ని పంచిన రామ్మోహన్ గారు 

✓హోం వర్క్ ఇస్తే పిల్లలు ఎక్కడ ఇబ్బంది పడిపోతారోనని, ఆ కష్టం కూడా ఆయనే తీసుకుని, సరళంగా, సులభ రీతిలో అర్థమయెట్టు చెప్పి, మమ్మల్ని తీర్చి దిద్దిన లెక్కల మాస్టారు, మృధుస్వభావి శ్రీకాంత్ గారు.

✓ఎంత పెద్ద తప్పు చేసినా తమకున్న క్షమాగుణంతో, మమ్మల్ని ప్రతిసారీ మన్నించి వదిలేసే సోషల్ టీచర్స్ నరసింహా మూర్తి గారు, పాఠ్యాంశాలతో పాటు వినోదాన్ని పంచే రంగావలి గారు.

✓ విషయాన్ని వివరించడంలో తనదైన శైలిలో ఓ కొత్త వరవడిని సృష్టిస్తూ కల్యాణి గారి లోటు పూరించిన ఇంగ్లీష్ మాస్టారు ఆంజనేయులు గారు.

✓ ఎప్పటికప్పుడు మానసికోల్లాసం పంచిన లైబ్రేరియన్ అంభికా గారు.

✓ కంప్యూటర్ పాఠాలు అందించిన రాజు గారు,.

✓ఇంత మంది ఉపాధ్యాయులు మాలాంటి విద్యార్థులు వెనకుండి నడిపిస్తుంటే, వాళ్ల వెనకుండి వాళ్ళకి బాసటగా నిలిచిన ప్రధానోపాధ్యయులు

ప్రభాకర్ గారు

తదుపరి,

ఓరుగంటి సత్యనారాయణ గారు

✓ అప్పటి వరకూ తెలుగు మీడియం స్కూల్ లో చదివి ఇంటర్ మీడియెట్లో ఇంగ్లీష్ మీడియం దెబ్బకి ఒక్కసారిగా పెనవేసుకుంటున్న నా పతనానికి అడ్డుగా నిలిచిన

కెమిస్ట్రీ డిపార్ట్ మెంట్ హెడ్, కెమిస్ట్రీ ప్రసాద్ గారు,

ఫిజిక్స్ లెక్చరర్ రంగనాథ్ గారు

మాథ్స్ లెక్చరర్ వెంకటేశ్వరరావు గారు

✓ గ్రాడ్యుయేషన్ లో IES అవ్వాలనే (కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోయిందనుకోండి) నా లక్ష్యం వైపు నన్ను నడిపించిన ప్రవీణ్ గారు

✓నా ఎదుగుదలలో తమ వంతు తోడ్పాటు అందించిన మా సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ హెడ్ ప్రసాద్ గారు

ప్రతిక్షణం ప్రోత్సహించిన

శర్మ గారు,

రాజు గారు

చైతన్య గారు,

సాగర్ గారు

✓పాఠాలతో పాటు తమ చలాకి తనంతో మాకు సరదాలు పంచిన

అలిషా గారు,

సాయి కృప గారు, 

దివ్య శ్రీ గారు,

జీగీశ గారు,

కీర్తి గారు

అందుకే, అందరికీ

థాంక్యూ టీచర్స్...!

ఇంకా ఎందరో (పేర్లు మర్చిపోతే క్షమించాలి) .....

మరెందరో మహా మంచి మనస్కులు

అందరికీ నా పాదాభివందనాలు

నా ఈ విద్యార్థి జీవితం వెనుక ఓ ఉపాధ్యాయ సైన్యమే ఉంది. ఎవరైనా నువ్వు జీవితంలో ఏం సాధించవనే ప్రశ్నకు, నా సమాధానం ఆ ఉపాధ్యాయ సైన్యపు మనసులో ఓ అణువంత స్థానమని సగర్వంగా చెప్పుకోగలను.

దారిలో పడున్న రాయి లాంటి మనల్ని, రూపమున్న శిలగా మలిచి దేవుదంతటి గొప్పవాడని చేసిన ఆ శిల్పి లాంటి గురువులు మాత్రం బాహ్య ప్రపంచానికి ఓ గుర్తింపు లేని పరిచయస్తులు.

ఇంత చేసినా... సాదాసీదాగా ఓ శిల్పిలానే ఉండిపోతూ, ఏ ఈర్ష్యా లేకుండా ఎప్పటికప్పుడు కొత్త శిలలను సృష్టించడం వాళ్ళ నైజం. మనలాంటి విద్యార్థి జీవితాల ఎదుగుదలలనే వాళ్ళ ఎదుగుదలనుకుని పరవశించిపోయే నిరాశ వాదులు.

వాళ్లకు గురుదక్షిణగా ఏమిచ్చినా, ఎన్ని జన్మలెత్తినా వాళ్ళ రుణం తీర్చుకోలేనిది.

ఈ కథ లోనే కాదు, నేను చేస్తున్న ప్రతీ రచనలలోని అక్షరాల మాటున దాగున్నది నా గురువుల ఎనలేని కృషే!

అందుకే, నేను రాసిన ప్రతి అక్షర విజయంలో..

సగభాగం ..!

లేదు.. లేదు..

సింహభాగం మీదే ఓ ఆచార్య!

నా లాంటి ప్రతి విద్యార్థి జీవితంలో చెరగని ముద్ర వేసిన నా గురువులలాంటి గురువులందరికీ ఈ థాంక్యూ టీచర్..! అంకితం.

నా మనసు లోగిళ్లలో వాళ్ళకై పెనవేసుకున్న ఓ చిరు కవితా కానుక...

"అక్షరాభ్యాసంతో నా విజయాలకి శ్రీకారం చుట్టి, నా ప్రతి విజయంలో తొలి సోపానముగా నిలిచింది నీ జ్ఞానామే కదా!

అందుకే, ఓ గురువర్యా...!

అందుకో నా ఆరాధన నీరాజనం "ఆచార్య దేవోభవ!"

సంద్రపు జీవితంలో ప్రతీ ఆటుపోట్ల ఒడిదుడుకలకు ఎదురొడ్డి నిలిచే దైర్యం, ఆనాడు నా చిన్న చిన్న పొరపాట్లును గుర్తించి సరైన మార్గంలో పెట్టిన నీ బెత్తపు దండనదే కదా!

అందుకే, ఓ గురువర్యా...!

అందుకో నా ఆరాధన నీరాజనం "ఆచార్య దేవోభవ!"

దారిలో పడివున్న రాయి లాంటి నన్ను రూపమున్న ఓ శిలగా మలచి, నువు పడిన ఆ శ్రమకు ప్రతిఫలం నా ఎదుగుదలను ఆస్వాదించడమేనన్నది నీ ఔదార్యమే కదా!

అందుకే, ఓ గురువర్యా...!

అందుకో నా ఆరాధన నీరాజనం "ఆచార్య దేవోభవ!"

అపరిపక్వ నిర్ణయాలతో చీకటి అలుముకున్న నా గమ్యానికి,

కాంతిని ప్రసరింపచేసి, దిశానిర్దేశం చేసింది నీ సలహాలు, సూచనలే కదా!

అందుకే, ఓ గురువర్యా...!

అందుకో నా ఆరాధన నీరాజనం "ఆచార్య దేవోభవ!"

పరుగులు తీస్తూ అలసిన నా దేహానికి, వెన్నుతట్టి ఊతమిచ్చినది నీ స్ఫూర్తిదాయక సూక్తులు, ప్రేరణనిచ్చే పంక్తులే కదా!

అందుకే, ఓ గురువర్యా...!

అందుకో నా ఆరాధన నీరాజనం "ఆచార్య దేవోభవ!"

ఆనాడు మీరు నా మదిలో నాటిన ఆ అక్షరాలనే అమర్చి,

మీ యొక్క గొప్పతనాన్ని ఓ కవితలా కూర్చి,

ఆ భావాన్ని ఈనాడు ఈ ప్రపంచానికి వర్ణించతగగలనో లేదో!!

కానీ,

మీదైన ఈ రోజున గురు దక్షిణగా ఈ చిరుకానుక మీకందించాలని మీ శిష్యుడిగా నా ఈ చిన్న తపన.

తప్పులుంటే ఎప్పటిలానే మన్నించి మీ పెద్ద మనసుతో స్వీకరిస్తారని ఆకాంక్షిస్తూ...

                         తమ విధేయుడుగా

                    ఎప్పటికీ మీ విద్య"ఆర్ధి" గా

                    సత్య పవన్ గంధం ✍️✍️



Rate this content
Log in

Similar telugu story from Classics