Jyothi Muvvala

Drama Action Others

4.3  

Jyothi Muvvala

Drama Action Others

సహస్ర !

సహస్ర !

7 mins
418



సహస్ర! పేరుకు తగ్గట్టే నవతరం ఇల్లాలు. ఉదయాన్నే లేచి వంటపని ఇంటిపని ముగించుకొని పిల్లలను స్కూలుకు తయారుచేసి అత్తమామలకు కావలసినవన్నీ ఏర్పాటుచేసి గబగబా రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరింది సహస్ర.

గబగబా నడుచుకుంటూ మెయిన్ రోడ్కి వెళ్లింది. ఆ పక్కనే ఉన్న బస్టాండ్లో భగభగ మండే ఎండకు ముఖాన్ని దాచుకొని బస్సు కోసం ఎదురు చూస్తూ ఉంది. రాక రాక చాలా సేపటికి ఒక బస్సు వచ్చింది కానీ బస్సులో పాదం మోపడానికి కూడా స్థలం లేకుండా మనుషులు కిక్కిరిసిపోయి ఉన్నారు.

ఇప్పుడు ఈ బస్సు మిస్ అయిపోతే మళ్ళీ అరగంట వరకు మరో బస్సు లేదు.

దర్జాగా ఏ బైకో కొనుక్కొని వెళితే బాగుండు. కానీ తన భర్తకి సంపాదన లేదు. తన సంపాదనతోనే ఇల్లు మొత్తం గడవాలి. పిల్లల చదువులు, ఇంటి అద్దె, అత్తమామల అనారోగ్యానికి మందులు. అన్ని బాధ్యతలు చూసుకోగా మిగిలిన డబ్బులు భవిష్యత్తు కోసం దాచుకోవలసి వస్తుంది. అందుకే ఎప్పటినుంచో ఒక స్కూటీ కనుక్కోవాలి అన్న కోరిక ఉన్నా కొనుక్కో లేకపోతుంది సహస్ర !

ఇలా...ఆలోచించుకుంటూ కూర్చుంటే బస్సు వెళ్లి పోతుంది. అని అదే బస్సులో తొక్కిసలాటల మధ్య ఎలాగైతేనేం మొత్తనికి బస్సు ఎక్కింది సహస్ర.

ఆఫీసు చేరుకునేసరికి ఒంటిమీద చీర కాస్త నలిగిపోయింది. ఒడ్డు పొడుగు అందం చందం ఉన్న సహస్ర నలిగిన చీరలో కూడా కడిగిన ముత్యంలా ఉంటుంది. అందుకే ఆ ఆఫీసులో అందరికీ

సహస్ర మీదే కన్ను.

కానీ సహస్ర తన పని తాను చేసుకుని ఇంటి దగ్గర దించిన తల ఆఫీసులోని, ఆఫీసులో దించిన తల మళ్లీ ఇంటి దగ్గర మాత్రమే ఎత్తుతుంది. అంత మంచి అమ్మాయి.ఆఫీసులో పని మొత్తం చేసుకొని ఇంటికి చేరేసరికి రోజు రాత్రి7గంటలు అవుతుంది.

పక్షవాతంతో బాధపడుతున్న అత్తగారు శాంతమ్మ! కనీసం కూరగాయలు కూడా తరిగి పెట్టడానికి ఆసరాగా లేకుండా మంచం మీదే ఉంటారు. కానీ సహస్ర మీద రోజు కూతురికి చాడీలు మాత్రం చెప్తుంది. అందుకేనేమో భగవంతుడు ఆమెకు ఆ శిక్ష వేశాడు. కానీ మామగారు పరంధామయ్య! చాలా మంచి మనిషి,పిల్లలను స్కూల్కి తీసుకొని వెళ్లి తీసుకొని వస్తుంటారు.

కోడలు కష్టాన్ని చూసి పరంధామయ్య అప్పుడప్పుడు ఇంట్లో ఆమెకు సాయం చేస్తూ ఉండేవారు.కానీ పెద్దవారు తండ్రి సమానులు అయినా మామ గారి చేత చేయించుకోవడం ఇష్టం లేని సహస్ర ఆయనకి ఏ పని చెప్పేది కాదు.

తన భర్త సందీప్!అన్ని చెడు అలవాట్లకు బాగా అలవాటు పడ్డాడు. చెడు స్నేహాలతో తిరిగి ఎప్పుడో రాత్రి 10 అయ్యాక ఇంటికి వస్తాడు. మాట పడని తత్వం వల్ల సందీప్నీ ఎవరు ఎక్కువకాలం ఉద్యోగంలో ఉంచుకునే వారు కాదు. ఆ డిప్రెషన్లో అలా చెడు అలవాట్లకు బానిస అయిపోయాడు.

కనీసం పిల్లలకు చదువు కూడా చెప్పేవాడు కాదు.

సందీప్! ఎప్పుడైనా పిల్లలు ఏదైనా డౌట్ అడిగినా ...అమ్మని అడగండి అని అనేవాడు.

ఏదైనా అంటే నువ్వు ఉద్యోగం చేస్తున్నావు అని నీకు పొగరు అని తిట్టేవాడు. సహస్రానీ ఎప్పుడు భార్యగా సుఖ పెట్టిందే లేదు. తన దారి తాను చూసుకుంటే తన పిల్లలు తండ్రి లేని వాళ్లు అయి పోతారని, పిల్లల మొఖం చూసి సహస్ర! సందీప్ని భరిస్తూ వస్తుంది.

బండెడు చాకిరీ చేసి ఇంటి పని మొత్తం చూసుకొని ఆఫీసులో కూడా తన పని మొత్తం చేసుకొని అలసిపోయి ఇంటికి వచ్చిన సహస్రకి సాయం చేసే వాళ్ళు ఎవరూ లేరు. ఆఫీస్ నుండి వచ్చాక కూడా తానే ఇంటి పని మొత్తం చేసుకోవాల్సి వచ్చేది. కనీసం పనిమనిషిని అయినా పెట్టుకుందామంటే అత్త గారి మాటలకు వచ్చిన పనివాళ్ళు అందరూ వెళ్ళి పోయేవారు. అందుకే ఇంటి పని మొత్తం తానే చేసుకోవాల్సి వస్తుంది. ఇక పిల్లలకి చదువు కూడా తానే చెప్పుకోవాలి. పైగా అత్తగారు భర్త అన్న మాటలకి తానే సర్దుకుపోవాలి తప్ప, తన కష్టాన్ని గుర్తించే వారు ఎవరూ లేరు. ఆమె జీవితం ఆ ఇంట్లో

జీతం లేని పని మనిషిగా మారింది.

సందీప్కి ఒక చెల్లెలు ఉంది. సందీప్ తల్లిదండ్రులు ఉన్నదంతా కాస్త అమ్మి కూతురికి ఘనంగా పెళ్ళి చేసి పంపించారు. ఉన్నింటి అత్తగారు రావటంతో సందీప్ చెల్లెలు... గీత! స్టేటస్ మెయింటెన్ చేస్తూ ఎప్పుడు అత్తగారింటి గొప్పలు చెప్పడం తోటే సరిపోతుంది ఆమెకు.

ఇంట్లో పని వాళ్ళు మెండుగా ఉండటం వల్ల, తన పిల్లలను చూసుకోవడం తప్ప తనకి ఇంటి పని అసలు ఉండేది కాదు.అత్తగారు కూడా ఆరోగ్యంగా ఉన్నారు కనుక ఆమెనే పనివాళ్ళతో చెప్పి ఇంటి పని మొత్తం చేయించుకొనేవారు.అందుకే సుఖానికి అలవాటుపడిన గీత!అసలు పుట్టింటికి రావడం కూడా మానేసింది.

అలా ఒక రోజు గీత భర్త క్యాంపుకి వెళ్లాల్సి వచ్చింది. అందుకే భర్త లేని నాలుగు రోజులు తల్లిదండ్రులతో గడపాలని, పిల్లలను తీసుకొని అమ్మ గారి ఇంటికి వచ్చింది గీత.!వచ్చినప్పుటి కానించి వాళ్ళ అత్తగారింటికి... అమ్మగారిని కంపేర్ చేస్తూ సహస్రాని తక్కువ చేస్తూ మాట్లాడుతూ ఉండేది. తన భర్త తనకు కొన్న ఆభరణాలని చూపించి మురిసిపోయేది.

ఏదో మధ్యతరగతి కుటుంబంలో ఉన్నదానితో సరిపెట్టుకుంటూ, మూడో కంటికి తెలియకుండా. ఒక టు బెడ్ రూమ్ హౌస్లో గుట్టుగా కాపురం చేసుకుంటున్నా సహస్రకి! గీత రాక పుండు మీద కారం చల్లినట్టు అయింది. పైగా ఆమె స్టేటస్ మెయింటైన్ చేస్తూ ఉంటది. ఆమె కోరిన గొంతెమ్మ కోరికలు తీర్చటం కూడా సహస్రకి కష్టమే . గీతకు తోడు వాళ్ళ అమ్మ శాంతమ్మ!" ఒక గాని ఒక బిడ్డ రాకరాక వచ్చింది. నా కూతురికి అచ్చట ముచ్చట జరగలేదు అని దీర్ఘాలు తీసేది."

ఇక తప్పని పరిస్థితుల్లో వాళ్లందరికీ కూడా సహస్రానే చేసి పెట్టాల్సి వచ్చేది. అమ్మ గారి ఇంటికి రెస్ట్ తీసుకోవడానికే వచ్చినట్టు గది నుంచి బయటకు వచ్చేది కాదు గీత. ఎప్పుడైనా గీత తండ్రి పరంధామయ్య! వదినకి సాయం చేయమని చెప్తే నిష్టూరంగా మాట్లాడేది. తన ఇంట్లో పని వాళ్ళు ఉంటారు అని, కాళ్లు కింద కూడా పెట్టను అని తన గొప్పలు చెప్పేది.మీ కన్నా మా అత్తగారి ఇల్లే మేలు అని చక్కగా చూసుకుంటారని. పుట్టినిల్లు అని రావటమే గాని ఎప్పుడు పప్పు, పచ్చడేగా అని ముఖం మీదే అంటూ ఉండేది గీత!

ఎందుకంటే తన ఉద్దేశంలో తాను రావడం వాళ్ల వదినకి ఇష్టం లేక, కావాలనే అలా చేస్తుంది అని అనుకునేది.పైగా వాళ్ళ అమ్మ చెప్పిన చాడీలు అన్ని నమ్మి వదినని సాధించడం మొదలు పెట్టేది.

ఎన్ని కష్టాలు ఉన్నా మూడో కంటికి తెలియకుండా భర్త విలువ పోకుండా గుటుగా కాపురం చేసుకుంటున్నా సహస్ర ! వచ్చిన నాలుగు రోజులకి ఆడపడుచుకి పని చెప్తే బాగుండదని, ఒక్క పని కూడా చెప్పకుండా,ఆమె ఎన్ని గొడవలు పెట్టిన సర్దుకుపోతూ ఉండేది.

కానీ ఒక రోజు ఆఫీసులో పని ఎక్కువగా ఉండటం వల్ల కొద్దిగా లేటుగా బయలుదేరింది సహస్ర ! అంతలోనే మాయదారి వర్షం పట్టుకుంది.వర్షం కాస్త తగ్గితే బయల్దేరుదాం అని చూస్తుంది సహస్ర! కానీ ఎంత సమయం అయినప్పటికీ కూడా వర్షం తగ్గేటట్టు కనిపించడం లేదు.

ఇక ఇలానే ఉంటే పిల్లలు ఆకలితో ఎదురు చూస్తారని పరుగుపరుగున కష్టపడి ఇంటికి చేరుకుంది సహస్ర.

ఇంటికి వెళ్లేసరికి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది.

ఇంట్లో కరెంటు లేదు. మెల్లగా తన గదిలోకి వెళ్లి బట్టలు మార్చుకొని క్యాండిల్ వెలిగించింది.

పిల్లలు సహస్ర రాగానే ఆకలేస్తుంది అమ్మ ! ఏదైనా పెట్టు అని అడిగారు. అత్తని అడగలేక పోయారా? అని అన్నది సహస్ర. అత్త ఇంట్లో లేదు వెళ్ళిపోయింది అని చెప్పాడు తన కొడుకు.

ఏం జరిగిందో అర్థం కాక! అత్తగారిని అడగాలని వాళ్ల గదికి వెళ్ళింది సహస్ర. అప్పటికే కన్నీరు పెట్టుకొని విలపిస్తూ ఉంది శాంతమ్మ! సహస్రకి ఏమీ అర్థం కాక మామగారిని అడిగింది.

ఎప్పుడూ లేటుగా వచ్చే సందీప్ ఈరోజు వర్షం పడుతుంది అని త్వరగా బయలుదేరాడు.

సాయంత్రం వచ్చే సరికి కరెంటు పోయింది. పిల్లలు గోల గోల పెడుతున్నారు. తన చెల్లెలు గీత! తన భర్తతో ఫోన్లో మాట్లాడుకుంటూ బాల్కనీలో కూర్చుంది. తల్లి మంచం మీద ఉంది. తన తండ్రి హాల్లో పేపర్ చదువుకుంటూ ఉన్నాడు. వచ్చీరాగానే సహస్ర కోసం ఇల్లంతా వెతికాడు సందీప్. కానీ సహస్ర కనిపించలేదు. "సహస్ర ఇంకా రాలేదు" అని పరంధామయ్య చెప్పారు.

బాగా వర్షం పడుతూ ఉండటంతో వేడి వేడిగా ఏదైనా తినాలి అనిపించింది సందీప్కి. పిల్లలు కూడా ఆకలి వేస్తుంది అని గోల చేస్తున్నారు. అందుకే సందీప్ తన చెల్లెలిని పిలిచి ఏదైనా చేసి పెట్టమని చెప్పాడు.

ఇక నోరు తెరిచి అన్నయ్య అడగడంతో కాదనలేక వంటగదిలోకి వెళ్ళింది గీత.

వంటగదిలోకి వెళ్ళి చూసేసరికి రేషన్ ఏమి లేదు. బియ్యం, ఉప్పు,పప్పులు,కూరగాయలు తప్ప ఆమెకి వండి పెట్టడానికి ఏమీ కనిపించడం లేదు. ఇంట్లో సామాన్లు అన్నీ ఖాళీగా కనిపించాయి.

రోజు వదిన తెల్లారు లేచి అందరికీ వండి, వెళ్తుందని అనుకున్నదే గాని అసలు ఇంట్లో ఏమీ లేకుండా ఎలా ఇలా సర్దుకువస్తుందో అర్థం కాక గీత ఆశ్చర్యపోయింది .

తన తల్లి చెప్పిన మాటలు అన్నీ నిజమే అని అనుకుంది.అన్న వదినలు తన తల్లిదండ్రులకి పెట్టడం ఇష్టం లేక ఇంట్లో ఏమి సామాన్లు సమకూర్చ లేదని తప్పుగా భావించింది.

హాల్లో కూర్చున్నా అన్నని నిలదీసింది గీత !

ఇంట్లో ఏమీ లేదు ఏం చేయమంటావు. నీ భార్య మోచేతి నీళ్లు తాగమని పెత్తనం మొత్తం ఆమెకిచ్చి తల్లిదండ్రులని కష్టాలు పెడుతున్నావని నిష్టూరంగా మాట్లాడింది. తన చెల్లెలు అలా తన బీదరికాన్ని ప్రశ్నించే సరికి మనసు చివుక్కుమంది సందీప్కి. ఇన్నేళ్ల కాపురంలో తన భార్య ఏ రోజు కూడా తనని ఇది తీసుకొని రా... అది తీసుకొని రా... అని ఏ రోజు అడిగింది లేదు. ఇంటికి వచ్చేసరికి నవ్వుతూ ఏదో ఒకటి వండి పెడుతూ ఉండేది. అసలు ఇంట్లో ఏమీ ఉన్నాయో? ఏమీ లేవో కూడా సందీప్కి తెలియదు.

సరిగ్గా ఉద్యోగం చేసేవాడు కాదు సందీప్. మూడు నెలలకు ఒక ఉద్యోగం మారటం వల్ల,జీతం కూడా రాక భార్య సంపాదనతోనే ఇల్లు గడపాల్సి వస్తుంది

గీత అలా అడిగే సరికి మొఖం చూపించుకో లేకపోయాడు సందీప్.

గీతా నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే తన తండ్రి పరంధామయ్య కూతుర్ని తిట్టాడు."నీకు నోటికి వచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నావు అసలు నీకు ఏం తెలుసు సహస్ర కోసం.ఎవరో చెప్పిన మాటలు అన్నీ మనసులో పెట్టుకొని నువ్వు అలా మాట్లాడుతున్నావు" అని మందలించాడు."సందీప్ అసమర్ధత కారణంగానే ఇల్లు గడవడం కష్టం అవుతుంది"." ఒక ఉద్యోగంలో స్థిరంగా ఉండదు మీ అన్నయ్య". "పాపం ఆడపిల్ల...సహస్ర! తన సంపాదనతో ఇల్లు నెట్టుకొస్తుంది"." నా పెన్షన్ డబ్బులు మీ అమ్మ మందులకే సరిపోవడం లేదు" అని కూతురికి వివరించాడు పరంధామయ్య.

ఇన్నాళ్లు తమ పేదరికాన్ని దాచుకుంటూ సహస్ర ! తన మెట్టినింటికి గౌరవాన్ని కాపాడిందని అర్థం చేసుకుంది గీత. బయట వారి దగ్గర పరువు పోకుండా తిన్న తినకపోయినా అందరిని ఆదరించిన సహస్ర ! సంస్కారానికి గీత మెచ్చుకుంది. ఇన్నాళ్లు తన తల్లి చెప్పిన మాటలు విని వదినని తప్పుగా అర్థం చేసుకున్నందుకు సిగ్గు పడింది.

తన అన్న చేతకానితనాన్ని అర్థమయ్యేలా చెప్పింది.

" నీ లాంటి భర్త ఉంటే నేను ఎప్పుడో వదిలేసి వచ్చే దానిని" కానీ "నీ భార్య... దేవత. ఇంటి పని చేసుకొని ఆఫీసులో పని చేసుకుని వచ్చి పిల్లలని, అత్తమామల్ని చూసుకుంటుంది. ఇంటి ని చక్కగా చక్క దిద్దుకుంటుంది. ఆమెకి సాయం చేయకపోగా భారంగా మిగిలి పోయావు అని అన్నకు చీవాట్లు పెట్టింది ". మీరు ఇంత కష్టంలో ఉన్నారని తెలిస్తే వచ్చే దాన్ని కాదు. నా రాకతో పాపం వదినకి ఇంకా భారంగా మిగిలాను అని కుమిలిపోయింది. ఇన్నాళ్ళుగా తన తల్లి చెప్పిన మాటలకు సహస్రని అపార్థం చేసుకున్న గీత... తల్లికి నాలుగు చీవాట్లు పెట్టింది."నీ పరిస్థితిలో మా అత్తగారు ఉంటే నేను వదిన అంతా బాగా చూసుకొనేదాన్ని కాదేమో "ఏ జన్మలోనో పుణ్యం చేసుకో బట్టి నీకు మంచి కోడలు దొరికింది. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని వదినని...కూతురిలా చూసుకో అని చెప్పి పెట్టే బేడా సర్దుకుని పిల్లల్ని తీసుకుని తన ఇంటికి వెళ్లి పోయింది గీత. 

అలా గీత వెళ్ళిపోగానే సందీప్ కూడా ఎక్కడికో వెళ్ళిపోయాడు అని జరిగిందంతా సహస్రతో చెప్పారు పరంధామయ్య.

అలా ఇంటి నుంచి వెళ్లిపోయిన సందీప్! ఇంటికి దగ్గరలో ఉన్న పార్క్లో వెళ్లి ఒంటరిగా కూర్చున్నాడు.గీతా అన్న మాటలు గుర్తుకు తెచ్చుకొని సందీప్ సిగ్గుతో చచ్చిపోయాడు. ఒంటరి ఆడదాని మీద బండెడు కష్టం మోపి తానేదో కష్టపడి పోతున్నట్టుగా ప్రతి చిన్నదానికి సహస్ర మీద విసుక్కునే తన ప్రవర్తనని తలుచుకొని సిగ్గుపడ్డాడు.

"ఇలాంటి భర్త దొరికితే వదిలేసి వస్తాను అని గీత అన్నమాట సందీప్ చెవిలో పదేపదే మారుమ్రోగుతుంది". తన ఇంట్లో పుట్టి పెరిగినా తన చెల్లెలే తన చేతకానితనాన్ని దుమ్మెత్తిపోసింది.

అలాంటిది తన భార్య ఎక్కడో పుట్టి, బాగా బతికి మంచి కుటుంబంలో నుంచి వచ్చింది. కానీ ఏనాడు పల్లెత్తు మాట అనలేదు.

మూడు ముళ్ళు, ఏడడుగులు వేసినందుకు ఇన్నేళ్లుగా తన కష్టాన్ని బాధని అన్నిటినీ భరిస్తూ తన ఇంటి గౌరవాన్ని నిలబెడుతూ తన తల్లిదండ్రులను , చెల్లిని ఆదరిస్తూ వచ్చింది. ఏనాడు ఎవరి కోసం చాడీలు చెప్పలేదు. అనారోగ్యంతో ఉన్న తన తల్లికి సేవలు చేస్తుంది. అని సహస్ర గొప్పతనాన్ని గుర్తించాడు సందీప్. ఇన్నాళ్ళుగా తనని బాధ పెట్టినందుకు చాలా బాధపడ్డాడు.

ఆవేశంలో తన భర్త ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అని భయపడిపోయింది సహస్ర. సందీప్కి ఫోన్ చేసింది. కానీ సందీప్ ఫోన్ ఇంట్లోనే వదిలేసి వెళ్ళిపోయాడు.

కాసేపటికి ఇంటికి చేరుకున్న సందీప్ని చూసి అమాంతంగా వెళ్లి అతన్ని పట్టుకుని ఏడ్చింది సహస్ర.

"నువ్వు ఎందుకు ఏడుస్తున్నావ్ సహస్ర. తప్పు నాదే... నేనే...నా బాధ్యతను మరిచి నిన్ను ఇన్నాళ్లుగా కష్ట పెట్టాను."

మీ ఇంట్లో ఎంతో అల్లారుముద్దుగా పెరిగిన నిన్ను మా ఇంట్లో ఒక పని మనిషిని చేశాను". "ఎంత కష్టం వచ్చినా ఓర్చుకుంటూ, ఎదురు మాట్లాడకుండా నన్ను భరిస్తూ వచ్చావు. నీ లాంటి భార్య దొరకడం నా అదృష్టం!అని తాను చేసిన పనికి సిగ్గుపడి, సహస్రకు క్షమాపణ చెప్పాడు సందీప్."

"ఆ మాటలకు సహస్ర! నేను ఎవరికీ పని మనిషిని కాదు. ఈ ఇల్లు నాది ! మీరందరూ నా వాళ్ళు... నా ఇంటి పని చేసుకోవడం నా ధర్మం. నేను ఏ రోజు అత్తయ్య మావయ్య నాకు భారం అనుకోలేదు. మీరు బాధ్యత లేకుండా జాబులు మారుతుంటే... మీరు చేసింది తప్పు అని చెప్పలేక నాలో నేను నలిగిపోయను." "నా పుట్టింటి వారు ఎంత గొప్ప వారైనా.. నా భర్త విలువ తీసుకోలేను."మీరు ఉన్నది పూరిపాక అయినా నాకు స్వర్గంతో సమానం. మీరు నన్ను భార్యగా గుర్తించకపోయినా నా బిడ్డలకు అన్యాయం జరగకూడదని మీలోని మార్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నాను."

"మాటపడని మీ తత్వాన్ని మార్చుకోమని చెప్పలేకపోయాను. అందుకే నాకు నేను సర్ది చెప్పుకుంటూ రోజులు వెళ్లబుచ్చుతున్నాను. అని తన మనసులోని బాధ మొత్తం భర్తకి చెప్పి సందీప్ని పట్టుకొని ఏడ్చింది సహస్ర."

ఇన్నాళ్లు తాను ఏ తప్పు చేశాడో తెలుసుకున్నాడు సందీప్ ! తన ప్రవర్తన మార్చుకుని, కుటుంబ బాధ్యత తీసుకుంటానని సహస్రకు మాట ఇచ్చాడు.

భర్తలో వచ్చిన మార్పును చూసి సంతోషపడింది సహస్ర. ఇక తమకు మంచి రోజులు వస్తున్నాయి అని ఆనందించింది. అనుకున్నట్టుగానే తన తప్పు తెలుసుకున్న సందీప్ తన స్నేహితుడు సహాయంతో మంచి ఉద్యోగం సంపాదించాడు. తన మొదటి సంపాదనతో తన భార్యకి ఒక స్కూటీ కొని బహుమతిగా ఇచ్చాడు.

తన భార్య బిడ్డలని, తల్లిదండ్రులని చక్కగా చూసుకోవడం మొదలుపెట్టాడు. భార్యాభర్తలిద్దరూ కష్టపడి తమ జీవితాన్ని ఆనందంగా మార్చుకున్నారు. ఒక మంచి ఇంటిని కొనుక్కొని సంతోషంగా ఉన్నారు.

శుభం !

 



Rate this content
Log in

Similar telugu story from Drama