సచ్చినోడు - దగడ్ మియా
సచ్చినోడు - దగడ్ మియా
సూడుమ్మే. ఆ చిన్నయ్యోళ్ళ శీనుగాడు నిన్నే పిలుస్తాండు. అని మాధవి నా చేతి మీద గిల్లింది.
మే మాధవి. నోరు మూసుకుని నడుసు. వాడు పిలిస్తే నాకేమి అని తలకాయ ఎత్తకండా నడిసినా.
మాధవి ఎనకబడింది. నేను ఈది మలుపు దాంకాబొయ్యి ఎనిక్కి జూసినా. ఆ శీనుగాడు ఏదో చెప్తాండు మాధవికి.
ఏందో ఏమో రోడ్డు మింద నంబర్రాయిలాగా నిలబడేవోళ్ళు ఎక్కువయినారు అని గట్టిగా అరిసినాడు.
అట్టా అరిసినప్పుడు వాని ముఖం చూడాల. నాకు నవ్వాగదు. అబ్బా. ఎవురు ఇనాలని అరిసేది. నాకు తెలీదూ. అయినా నవ్వగుడదు. ఎనిక్కి తిరిగి చూడకుండా ఇల్లు జేరినా.
సానం చేసి నైటీ ఏసుకోని మిద్దె మింద జాజిపూలు
తెంపుదామని గిన్నె తీసుకొని పోతాంటే అమ్మ జడ వేసుకోమనింది. అబ్బా. అసలు ఈ ఎంట్రికలు ఇంతింత పెంచుకోవడం ఎందుకు. ఈ జడలు ఏసుకోవడం ఎందుకు అని అనుకుంటూ మిద్దె ఎక్కినా. మొన్న ఆదివారం మాధవి పుట్టిన రోజుకి జడ వేసిందీ. ఎంత ఓపికో.
మా ఇంటి పక్కనే మాధవి వాళ్ళ ఇల్లు. ఇంట్లో బ్యాగు పడేసి పరుగెత్తుకుంటూ వచ్చింది మా మిద్దె మిందెకి.
మే సునితా. ఇద్దో రేణిగాయలు అని పిడికిలి తెరిసింది. వాడిచ్చినాడా అని అన్యా.
వాడేందిమే. ఎంచక్కా శీను అనొచ్చు గదా. నువ్వంటే ఎంత ఇస్టమో శీనుకి తెలుసా అని మాధవి గుడక జాజిపూలు తెంపుతా ఉంది.
నాకు ఒళ్ళంతా మండిపోయింది. మేయ్. నువ్వు నా ఫ్రెండువి. ఎప్పుడూ వానికే సపోర్టు చేస్తావు. నేనొద్దని చెప్పినంక కూడా వాడు ఎచ్చులు పడతా భోగమోళ్ళ దగ్గరికి పొయ్యి డ్యాన్సులు చేసినంక నాకూ వానికి ఇంక ఏం లేదు అని నేను కిందికి పోవడానికి మెటికల దగ్గరికి పుయినా.
మాధవి నన్ను ఎనిక్కి లాగింది. పోతే పోనీలే. ఇంగ
పోడంటలే. సావాసగాళ్ల కోసం పుయినాడు అంతే అని చెప్పింది.
నేనైతే మాట్లాడను ఎట్టన్నా సావమను అని కిందికి దిగినా.
మళ్లా కనపడ్లా వాడు. నూరు దినాలైంది కాలేజీకి బొయ్యి. లాక్ డౌన్ అని అందరమూ ఇండ్లల్లోనే ఉండాము. ఈ కరోనా వచ్చి మనసల్ని సంపకతింటా ఉంది.
మాధవి రోజూ మిద్దె మింద కనబడతాంది. నేనూ మాట్లాడలా. ఏం అది పలకరీయచ్చు కదా.
టైమ్ అట్టే గడిసిపాయె.
లాక్ డౌన్ ఎత్తేసినారు. కాలేజీకి పొయిన రోజు కూడా వాడు కనబళ్ళా. సాయంత్రం మాధవిని అడిగినా. ఏమ్మే ఏడి మా దగడ్ మియా అని. అదేందో బూతులా ఉన్నా ఫోన్లో ఎక్కువ వాడు విసిగిచ్చినప్పుదు మాధవితో అంటా ఉన్యా. ఈ శీను గాడు నాకు దగడ్ మియా అనుకుంటామ్మే అని. మాధవి పకపకా నవ్వేది.
ఈసారి నవ్వలా. మేయ్ ఏమైంది అని జడ గుంజినా. దాని కండ్లల్లో నీళ్లు.
ఇంగా యాడమ్మే. కరోనాతో సచ్చిపుయినాడు. రేపుటికి నెలవుతుందిమ్మే అని సెప్పింది. నా చెయ్యి పట్టుకుని ఏడ్చింది. నేనేడవలా.
నేనేమీ మాట్లాడలా. ఒళ్ళంతా బరువుగా ఉండాది. ఇంటికి పొయ్యి మిద్దె మింద కూర్చున్యా. మాధవిని పిలిచినా. మాధవి వచ్చింది.
మాధవీ! వాడే గెలిసినాడు. ఇంగిప్పుడు నేను బతుకంతా ఏడ్సాల. నాకు కడుపునొప్పి అని మా అమ్మకు సెప్పు. తనివితీరా ఏడ్సాలనుందిమే. ప్లీజ్ మే.
మాధవి సరేనని మెటికలు దిగి కిందికి పోయింది. అమ్మా అని బాధతో మూలిగాను. వాడిన జాజిపూలు కొన్ని రాలిపడ్డాయి.
