సాహితీ పఠనం
సాహితీ పఠనం


ఇంచు మించు ఇరవై ఏళ్ల క్రితం వరకు, ఏదన్నా చదవాలంటే, ఏదైనా అచ్చువేసిన దాన్ని, లేదా పుస్తకాన్ని ఆశ్రయించడం తప్పని సరి అయ్యేది. వార్తాపత్రికలు, వారపత్రికలు, పక్ష, మాస పత్రికలు, పుస్తకాలు, పఠనా, సాహితీ పిపాసలను తీర్చేవి.
అంతర్జాలం వచ్చేక ఈ అవకాశం వటుడింతై, అంతై అన్నట్లు పెరిగిపోయింది. కవులకు, రచయితలకు, వ్యాస రచయితలకు పాఠకులు, పాఠకులకు రచనలు ఇబ్బడి ముబ్బడిగా దొరుకుతున్నాయి.
ఇలా రచయితలు, రచనలు కోకొల్లలు అవడం డిమాండ్ కన్న, సప్లై ఎక్కువైన వాతావరణం నెలకొంది. గీటుగీసి ఇది మేలిమి బంగారం, ఇది సత్తు అని తేల్చే సత్తా కలవారు బాగా అరుదైపోయారు.
దీనికి ఒక కారణం, సాహితీ స్రష్టలు, విమర్శకులు, పాఠకులు వివిధ వర్గాలుగా విడిపోవడం. ఈ విడిపోవడాల వల్ల, ఏది గింజ, ఏది పొల్లు నిర్ణయించడం వర్గాల వర్గీకరణ మీద ఆధారపడుతోంది. సర్వ జన శ్రేయస్సును కోరుకునే రచనలు, రచయితలు లేకుండా పోతున్నారు.
సాహితీ పఠనం వర్గాలకు అనుగుణంగా, వర్గాల వారీగా సాగడం, సాహిత్యాన్ని వర్గ సాహిత్యంగా విడదీసి పొగడడం, దునుమానడం ఒక అప్రియమైన, అసాంఘిక వ్యవహారంగా తయారైంది. భాషను, స్రష్టలను యాసను బట్టి, ప్రాంతాన్ని బట్టి, కులాన్ని బట్టి పొగడడం, లేదా తెగడడం ఎక్కువైపోయింది. వస్తువు, సాహితీ మధురిమలు, సొబగులు, అలంకారాలు, శబ్ద, భావ పరిపుష్టి, పరిణితి, ప్రేమ, ప్రణయం, తత్త్వం, భక్తి, భగవంతుడు, ఇలాంటివి అస్సలు గణింపబడడం లేదు. గుర్తింపు కు నోచుకోవడం లేదు.
ఎంతసేపూ వర్గబాధలు, వాద ప్రియత్వం, ఊహలలో ద్వేషం, విద్వేషం రంగరించి తిట్టడం, తప్పు పట్టడం ఊపులో ఉంది. అది మాత్రమే సాహిత్యం అనే మూర్ఖత్వాలు పెరిగి పోయాయి. సామరస్యం అటకెక్కింది.
సౌమ్య వాదము ఎవరికీ పట్టడం లేదు.