Aakash kumar

Comedy

4  

Aakash kumar

Comedy

పరమానందయ్య శిష్యుల కథలు

పరమానందయ్య శిష్యుల కథలు

3 mins
630


పరిచయం:

మనలో చాలా మందికి ఈ పరమానందయ్య శిష్యుల కథలు తెలుసు.నేను కూడా అక్కడక్కడా విన్న కథలని ఒక దగ్గర రాస్తున్నాను.

పరమానందయ్య:

ఒక నదీ తీరంలో ఉన్న ఒక అగ్రహారం లో పరమానందయ్య గారి తండ్రి నివసించే వారు.వారు ఆ చుట్టుపక్కల ఉన్న 20-30 గ్రామాలకు పౌరోహిత్యం చేసేవారు.ఆ గ్రామాల ప్రజలకు వారి మాట వేద వాక్కు.అలా వారు ఒక మఠం ని నెలకొల్పారు.

తల్లి లేని పరమానందయ్య ని గారాబం గా పెంచారు.

పరమానందయ్య కి తండ్రి అంతటి పాండిత్యం లేకపోయినా,మంచితనం ఇంకా అమాయకత్వం మాత్రం గంపెడు.వారి తండ్రి బ్రతికి ఉన్నప్పుడే ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసి నిశ్చింతగా కళ్ళు మూసారు.తండ్రి తర్వాత ఆ మఠం బాధ్యతలు పరమానందయ్య చూసుకుంటున్నాడు...

ఇది ఇలా ఉండగా,ఒక రోజు ...

ఇంద్రుని ముందు అప్సరసలు,నాట్యం చేస్తున్నారు.ఆ సభలో గంధర్వులు కూడా ఉన్నారు.వారి లో ఉన్న ఒక 10 మంది గంధర్వులు అదుపు తప్పి,ఆ అప్సరసల తో కలిసి నాట్యం చేయబోయారు.అది చూసి ఆగ్రహం కలిగిన దేవేంద్రుడు,ఆ 10 మందిని భూలోకం లో తెలివి తక్కువ సన్నాసులు గా పుట్టమని శపించాడు.

తమ తప్పు తెలుసుకున్న ఆ 10 మంది,ఇంద్రుని క్షమించమని వేడుకున్నారు.అప్పుడు శాంతి ని పొందిన ఇంద్రుడు,నా శాపం కారణంగా మీరు తెలివి తక్కువ సన్నాసులు గా పుట్టినప్పటికీ,కొంతకాలం భూమి మీద అందరికీ వినోదం కలిగించి తిరిగి స్వర్గ లోకం చేరుకుందురు గాక అని శాపం విముక్తిని అనుగ్రహించాడు.

ఆ తర్వాత ఆ పది మంది ,పది మంది శిష్యులు గా పుట్టి,పరమానందయ్య వద్ద శిష్యులు గా చేరారు.

తన 10 మంది శిష్యుల తో ఒక ఊరికి వెళ్లి ఒక శుభ కార్యక్రమం చేయించారు,పరమానందయ్య గారు.ఆ ఊరి వారు సంభావన గా ఇచ్చిన డబ్బు,బంగారం,వస్తువులు తీసుకొని,మఠం కి తిరుగు ప్రయాణం అయ్యారు.

దారి లో వారికి ఒక ఏరు అద్దం వచ్చింది.అందులో నీరు ఎక్కువ గా ఉంది.అది చూసి ఆ శిష్యుల లో ఒకడు,"మనం గ్రామస్థులు ఇచ్చిన సంభావన మొత్తం జాగ్రత్త గా తీసుకొని వస్తుంటే,ఈ ఏరు అసూయ తో మన దారికి అడ్డు వస్తోంది."అని అన్నాడు. మిగిలిన వారు కూడా అతని తో ఏకీభవించారు.అమాయకుడు అయిన పరమానందయ్య కూడా అంతేనేమో అని అనుకున్నాడు.ఏరు లోకి నీరు ఎప్పుడైనా రావచ్చు అన్న జ్ఞానం వారికీ,వారి గురువు పరమానందయ్య కి కూడా లేదు..😄.

ఇప్పుడు ఏం చేద్దాం అని అందరూ అనుకుంటూ ఉండగా ఇంకొక శిష్యుడు,"ఆ ఏరు అయిన ఎంత సేపు మేల్కొని ఉంటుంది? అది నిద్ర పోయినప్పుడు మనం ఏరు దాటేస్తే సరి.మన ప్రాణాలకు ఏ ప్రమాదం ఉండదు,మన సంభావన లు కూడా జాగ్రత్త గ ఉంటాయి."అని అన్నాడు.

అందరికీ అతని ఆలోచన నచ్చింది.అందుకని రాత్రి అయినంత వరకు వేచి ఉండాలని నిర్ణయించుకున్నారు.ఈ లోగా కాస్త చీకటి పడింది.ఇంతలో ఒక శిష్యుడు లేచి " గురువుగారు ఏటి ఒడ్డున దయ్యాలు సాయంత్రం వేళ తిరుగుతుంటాయి అని మీరు చెప్పారు కదా,ఇప్పుడు ఏం చేద్దాం" అని అన్నాడు.అప్పుడు పరమానందయ్య" నిజమే సమయానికి గుర్తు చేశావు.వెంటనే అందరూ ఆంజనేయ దండకం చదవండి అని అన్నారు.కానీ ఒక్కరికీ "శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం ప్రభదివ్య కాయం,ప్రకీర్తి ప్రదాయం" అని తప్ప మిగిలిన దండకం గుర్తు లేకపోవడం తో అందరూ తడుముకోసాగారు.

ఇంతలో అక్కడికి వచ్చిన ఒక చేపలు పట్టేవాడు,వీళ్ళని ఆటపట్టించాలి అని " బాబు ఈ ఏరు మంచిది కాదండీ...దీని నమ్మకండి ఒక సారి మా తాత ఉప్పు బస్తాలతో ఏరు దాటుతుంటే బండి ఏటి లో తిరగబడింది.మా తాత బండి నిలబెట్టి చూస్తే బస్తాల్లో ఉప్పు అంతా మాయం!!.మొత్తం ఉప్పు అంతా కాజేసింది ఈ దొంగ ఏరు.మీరు జాగ్రత్త బాబులు!!!" అని అంటూ జారుకున్నాడు.

అతని మాటలతో వారికి భయం పట్టుకుంది.ఒకవేళ ఈ ఏరు మా సంభావనలు కూడా కాజేస్తే?? అని అనుకున్నారు.

ఒక శిష్యుడు కాగడా వెలిగించి ఏరు లోకి వెళ్లి చటుక్కున ముంచాడు. "చుయ్" మని పెద్ద శబ్దం చేస్తూ కాగడా ఆరిపోయింది.అంతే ఆ శిష్యుడు పరుగున ఒడ్డుకి వచ్చి " ఆ ఏరు ఇంకా పడుకోలేదు,చురక పెడదాం అని పెడితే తిరిగి నా మీదే అరుస్తోంది" అని అన్నాడు.దీంతో పరమానందయ్య అందరినీ మరి కొంత సేపు ఆగమని అన్నాడు.

మళ్ళీ కాస్సేపటికి ఏరు నిద్ర పోయింది అని నిర్ధారించడం కోసం ఇందాకల ఆరిపోయిన కాగడా తీసుకొని వెళ్లి మళ్ళీ ఆ ఏరు లో ముంచారు.ఈ సారి ఏటువంటి శబ్దం రాకపోయేసరికి ఏరు నిద్రపోయింది అని ఏరు దాటి పోదామని బయల్దేరారు. మొత్తం సంభావనాలు అన్ని పైకి యెత్తి పట్టుకొని జాగ్రత్త గా ఏరు దాటారు.అందరూ హమ్మయ్య!!! అనుకున్నారు.

ఏరు దాటిన పరమానందయ్య ఇంకా అతని శిష్య బృందం,అందరూ క్షేమంగా గా ఏరు దాటారా...లేదా ఏరు,దొంగ నిద్ర నటిస్తూ మనం ఏరు దాటినప్పుడు,మనకి తెలియకుండా ఎవర్ని అయిన ముంచేసిందా?? అని అనుమానం పట్టుకుంది.

దాంతో ఒక శిష్యుడు అందరినీ లెక్కపెట్టడం మొదలుపెట్టాడు.11 మంది ఉండాల్సిన వాళ్ళు,10 మంది మాత్రమే లెక్క తేలుతున్నారు.ఇక్కడ అతను చేస్తున్న తప్పు ఏంటంటే,ముందు తనని తాను లెక్కపెట్టి,తర్వాత మిగిలిన వాళ్ళని లెక్కించాలి అని మర్చిపోవడం.దాంతో 10 మంది రావడం తో అతను ఏడుపు అందుకున్నాడు.

పరమానందయ్య గాబరా గా" ఏమయ్యింది రా ఎందుకు ఏడుస్తున్నావు??" అని అడిగేసరికి,ఆ శిష్యుడు, "గురువుగారు మీతో కలిపి మొత్తం 11 మంది ఉండాలి.కానీ 10 మంది మి వస్తున్నాం.ఏరు మనలో ఒకర్ని ముంచేసింది " అని మళ్ళీ ఏడుపు మొదలెట్టాడు.పరమానందయ్య మళ్ళీ ఒకసారి లెక్క పెట్టాడు.అమాయకపు పరమానందయ్య కూడా మళ్ళీ అదే తప్పు చేస్తూ,తనని తాను లెక్క లెట్టు కోలేదు...దాంతో అతను కూడా" అవునర్రా మీరు చెప్పేది నిజమే ఏరు మనలో ఒకర్ని ముంచేసింది" అని ఏడుపు అందుకున్నాడు...

ఇంక చేసేది ఏమి లేక,బాధ పడుతూ ఇంటికి వెళతారు.

అక్కడ గురు పత్ని విషయం తెల్సుకుని,అందర్నీ వరుస లో నిలబెట్టి,లెక్క పెడితే 11 మంది వచ్చారు.

అప్పుడు తప్పు తెల్సుకున్న పరమానందయ్య,ఇంకా అతని శిష్యులు సిగ్గు పడి,తర్వాత అందరూ క్షేమంగా తిరిగి వచ్చినందుకు,ఆనంద పడతారు.

త్వరలో మిగిలిన కథలను కూడా రాస్తాను.ఏమైనా సలహాలు ఇవ్వదలచుకుంటే కామెంట్ చెయ్యగలరు.ఈ ధారావాహిక ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను


Rate this content
Log in

Similar telugu story from Comedy