ప్రేమ పిపాసి
ప్రేమ పిపాసి
నేనొక ప్రేమ పిపాసిని అన్నాడు రవి. ఒరేయ్. గోల చెయ్యకు. పడుకో అని సత్య దిండు విసిరాడు.
ఏంట్రా. నిద్రా. నిద్రా అంటావు. ఇక్కడ ఒక ప్రేమికుడు అల్లల్లాడిపోతుంటే అని అదే దిండుని సత్య మీదికి విసిరాడు.
సత్య వెంటనే లేచి నీళ్ల సీసాలోంచి నీళ్లు చేతిలోకి తీసుకుని వాటిని రవి ముఖం మీద చల్లాడు. రవి లేచి కూర్చున్నాడు.
ఏంట్రా ఇది. నీళ్లు ఎందుకు చల్లావ్ అన్నాడు ఆ నీటితో ముఖం కడుక్కుంటున్నట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తూ.
ప్రేమ గురించి ఇష్టం లేకపోతే ఆంథ్రోపాలజీ థీసిస్ కి ఎందుకురా ఆ టాపిక్ తీసుకున్నావు. పైగా రీసెర్చ్ చేసి మరీ వ్రాయాలి అన్నాడు సత్య.
అదేరా నా బాధ. ఇప్పుడు రేపు పొద్దున్నుంచి వీలైనంత మందిని నిజమైన ప్రేమ అంటే అభిప్రాయం అడగాలి.
కానీ ఎవరు చెప్తారంటావు అన్నాడు సత్య ఆవులిస్తూ.
ఎవరో ఎందుకు మిత్రమా. నువ్వుండగా. అసలు నిజమైన ప్రేమంటే ఏమిటో చెప్పు అన్నాడు రవి.
ఆశ దోశ అప్పడం వడ అన్నాడు సత్యం
వాటితో పాటు ఇడ్లీ, ఉప్మా పెసరట్టు కూడా పెట్టిస్తాను. కాస్త చెప్పరా అని బతిమిలాడాడు రవి.
నిజమైన ప్రేమంటే నిద్ర అంటూ ముసుగుతన్ని పడుకున్నాడు.
