పిల్లలు.. పిడుగులు..
పిల్లలు.. పిడుగులు..
బుజ్జీ. ఇప్పుడు నీకు లెక్కల పరీక్ష పెడతాను అన్నాడు ట్యూషన్ మాస్టర్. బుజ్జి చదివేది ఐదో తరగతి. సార్ ఇవ్వాళ లెక్కల పరీక్ష వద్దు సార్. మంగళవారం. మా నాన్న డబ్బులకు సంబంధించిన విషయాలు మాట్లాడొద్దు అన్నాడు సార్ అని చెప్పాడు.
ట్యూషన్ మాస్టర్ వీడితో ఎందుకులే అని రవి దగ్గరికి వెళ్లాడు.
బాబూ రవీ! నీకు ఇవాళ ఇంగ్లీష్ పరీక్ష పెడతాను. Vowels అంటే ఏమిటో చెప్పు అన్నాడు. రవిది ఆరో తరగతి. సార్. అసుర సంధ్య వేళ owls అంటూ గుడ్లగూబల గురించి ఎందుకు సార్. అవంటే నాకు భయం కూడాను. ఎంచక్కా మనం ఆవు గురించి చెప్పుకుందాం.
Cow eats grass. Cow gives milk అంటూ చెప్పుకుపోయాడు.
ఈ మగ వెధవలు తెలివి మీరిపోయారు. ఇలా కాదు గానీ అమ్మాయ్ సుచరితా! నువ్వు "అట జని కాంచె" పద్యం చెప్పు. అది చాలా ఇంపార్టెంట్ అమ్మాయ్ సిలబస్ లో అని అన్నాడు.
సార్. ఈవేళకి టైమ్ అయిపోయింది సార్. ఇప్పుడు నా ఫేవరెట్ హిందీ డబ్బింగ్ సీరియల్ వస్తుంది. ఇంటికి వెళ్ళి చూడాలి అంది.
అయిపోయిందా. మీలాంటి ఆణిముత్యాలతో పెట్టుకుంటే అయిపోదూ మరి. ఇవాళ వెళ్లి రేపు రండి. అప్పుడు చెబుతాను మీ పని అని కళ్ళజోడు సరిచేసుకున్నాడు ట్యూషన్ మాస్టర్.
