శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Classics

3.6  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Classics

పెళ్లిచూపులు

పెళ్లిచూపులు

4 mins
430


            పెళ్లిచూపులు

          -శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి


  ఉదయం ఆరు గంటలు. అప్పుడే సూర్యుడు ఆకాశాన్ని ఆక్రమిస్తున్నాడు.పచ్చని పొలాలమధ్యగా పారుతున్న పంట కాలువ చప్పుడు ఆహ్లాదకరమైన సంగీతంలా వినిపిస్తుంది.


  కారులో రాత్రి నుంచి ప్రయాణం చేస్తూ వచ్చారేమో... ప్రశాంతమైన ఆ పల్లె వాతావరణానికి చేరగానే.... మనసుకెంతో ముచ్చటగా అనిపించింది.

   

  సూరవరం గ్రామం...! ఆ పల్లెకు పెళ్లిచూపుల కొచ్చాడు కార్తీక్.

  

  " ఆ పచ్చటి పొలాల మధ్య కార్లో కాకుండా... ఎడ్లబండి అయితే...ఇంకెంత హాయిగా ఉండేదో..."? మనసులో అనుకుంటూనే పైకి అనేశాడు కార్తీక్. 


   సరిగా అప్పుడే మంచినీళ్ల బాటిల్ని ఎత్తి నీళ్లు తాగుతున్న అనసూయకు పొలమారింది... కొడుకు మాటలు విని. 


   "అయ్యో...జాగ్రత్త. నెమ్మదిగా తాగొచ్చు కదా"... ఉక్కిరి బిక్కిరవుతున్న భార్య తలమీద తడుతూ సముదాయించాడు రవీంద్ర. 


    దాన్నుంచి తేరుకున్నాక...."చూసారా మరి వాడి మాటలు. కార్లో సరిపోలేదు అంట. ఎడ్ల బండి మీద వెళ్తే ఇంకా బాగుండేది అంటున్నాడు...అమెరికా వెళ్లినా...వీడింకా పాతరోజుల్లాగే ఆలోచిస్తుంటే ఎలా చెప్పండి..."? కొడుకు వరసేమీ బాగోలేదన్నట్టు భర్తతో అంది అనసూయ.


    "పోన్లేవే...అమెరికా నుంచి వచ్చిన వాళ్లందరికీ...ఇలాంటి దృశ్యాలు కనిపించేసరికి అన్నివిధాలుగా ఆనందించి పోవాలని చూస్తారు. ఆ బిజీ జీవితాల్లోంచి వచ్చి ఇలాంటివ వాతావరణాలు చూస్తే మనసు గెంతులేయక ఏమవుతుంది...? అలాగే...ఈ వరిచేలల్లో అందమైన ఓ పడుచుపిల్ల కూడా కనిపిస్తే మరీ బాగుంటుంది".  అన్నాడు కొడుకుని వెనకేసుకొస్తూ. 


   భర్త మాటలకు మరికాస్త చిరుబుర్రులాడినా...కొడుకు మాత్రం పెద్దగా నవ్వేసాడు తండ్రి మాటలకు.


   అసలు అనసూయకు ఆ ఊరి సంబంధమే ఇష్టం లేదు. శుభ్రంగా హైద్రాబాద్ లోనే...మంచి మంచి సంబంధాలు వస్తే...అవన్నీ కాదని పల్లెటూరు సంబంధం కావాలన్నాడు కొడుకు. అప్పటికప్పుడు పెళ్లిళ్ల పేరయ్యని అడిగితే ...మీకు అన్ని విధాలా నప్పే మంచి సంబంధం అని చెప్పడంతో ఇంత దూరం రావాల్సివచ్చింది. అసలు అమెరికాలో వుంటున్నందుకు చేసుకోబోయే అమ్మాయి చలాకీగా ఉండి...మోడరన్ గా ఉంటే..విదేశాల్లో నెగ్గుకురాగలదు. కానీ వీడేంటో...పల్లెటూరి పప్పుసుద్దని చేసుకుని అక్కడెలా గడుపుతాడో అనే ఆ తల్లి బెంగ. పైగా అంత దూరం వెళ్తున్నాం కదా...ముందు ఫోటో పంపించమని చెప్పి... బాగుంటే అప్పుడెల్దాం అంటే....అలా చూడనంటే చూడనన్నాడు. ఏదైనా...ముఖాముఖి చూసినప్పుడు నచ్చితేనే...తనకు అసలైన పెళ్ళిచూపులన్నాడు. ఇప్పుడు ఆఅమ్మాయి ఎలా ఉంటుందో ఏమో...? అనసూయ ఆలోచనలో వుండగానే...అమ్మాయి ఇంటికి చేరుకున్నారు. 


   పల్లెటూరు కావడంతో....మండువా లోగిలితో ఉన్న లంకంత ఇల్లు అది. అతిథులను గౌరవంగా లోనికి తీసుకెళ్లారు. వెళ్ళగానే కొబ్బరి బొండాలు అందించడంలోనే పల్లెటూరి మర్యాద చూపించారు. ఆ తర్వాత ఇక చెప్పక్కర్లేదు...నాలుగైదు పిండి వంటలతో పాటూ...జున్నుతో సహా ఫలహారాలు పెట్టారు. అక్కడ వరకూ బానే జరిగింది...వారి ఆస్తిపాస్తులు, కుటుంబం అన్నీ నచ్చాయి అనసూయకు. రవీంద్ర కూడా ఇష్టపడ్డాడు.  


   ఇకపోతే... అమ్మాయిని చూడ్డం కోసమే...కార్తీక్ ఎదురుచూసేది. 


   పల్లెటూరు కదా...దుర్ముహూర్తం అవీ లేకుండా చూసి...అమ్మాయిని తీసుకొచ్చారు. చూసీ చూడంగానే...అనసూయకు తెగ నచ్చేసింది. ఏ పప్పుసుద్దని చూడాల్సి వస్తుందో అనుకుని కంగారు పడింది గానీ...తాను అనుకున్నట్టుగానే ఈ పల్లెటూళ్ళోకూడా అలాంటి అమ్మాయి దొరకడం ఎంతో అదృష్టంగా పొంగిపోయింది. 


   ఆపల్లెటూరి ప్రకృతిని చూసి ఆనందించినంత సంతోషం కనిపించలేదు ఆ అమ్మాయిని చూసాక కార్తిక్ ముఖంలో. ఆ విషయం గమనించిన తండ్రి భార్య పక్కగా జరిగాడు....

"ఉండు...నువ్వేమీ తొందరపడి మాట ఇచ్చేయకు. ఒక విషయం మనవాడిని కూడా అడిగాక కబురుచేద్దాం అని చెబుదాం" అన్నాడు భార్య చెవిలో గుసగుసగా రవీంద్ర. 


          *          *         *


  కాకినాడ.. టౌన్...!


  మంచి సిటీల్లో ఉన్న సంబంధాలు మానేసి...ఇలాంటి టౌనులో ఉన్న పిల్లని చూడ్డానికి వచ్చాం. వీడి మనసేమిటో అర్థం కావడం లేదు. ట్రైన్ దిగుతూ...తనలో తాను అనుకుంది అనసూయ .


  హోటల్ రూంలో ఫ్రెష్ అయి...పెళ్లిచూపుల కోసం అమ్మాయిని చూడ్డానికి వెళ్లారు. 


  అమ్మాయిని ఇవ్వాలనుకున్నప్పుడు ....ఆ ఇల్లంతా హడావిడిగానే ఉంటుంది. అతి మర్యాదలు చేస్తూ..అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఒకరికొకరు చూసుకున్నారు. అనసూయకు ఈ సంబంధం కూడా బానే ఉందనిపించింది. "అబ్బాయి అమ్మాయినేమైనా అడుగుతాడేమో అడగమనండి..." అన్నాడు పిల్ల తండ్రి.


   కార్తీక్...తల అడ్డంగా ఊపుతూ ....చిన్న నవ్వు నవ్వాడు.

కొడుకు వాలకం చూసి...అనసూయకు కూడా అర్థమయ్యింది. వారేం అనుకుంటారో అని తానే రెండు మూడు ప్రశ్నలు వేసింది...అబ్బాయి తల్లిననే హోదాలో. 


   అన్నిట్టికీ తడుముకోకుండా సమాధానం చెప్పింది. కార్తీక్ కైతే చాలా ఇబ్బందిగా ఉంది. మధ్యమధ్యలో అమ్మాయి తననే చూస్తుంటే...


   ఇక బయలుదేరుదాం అన్నాడు రవీంద్ర. 

   "ఏ విషయమూ చెప్తారు కదూ"  అన్నాడు పిల్ల తండ్రి.

   "అలాగేనండీ..." రెండు మూడు రోజుల్లో ఏ విషయమూ చెప్తాము అంది అనసూయ. 


        *          *         *


   హైద్రాబాద్ నగరం....!

   

   హమ్మయ్య అనుకుంది అనసూయ. తన పోరు పడలేక ఎట్టకేలకు పొరుగూరు వెళ్లే ప్రసక్తి లేకుండా....ఇక్కడ తనకు అన్నివిధాలా నచ్చిన సంబంధానికి పెళ్లి చూపులు చూడటానికి కొడుకు ఒప్పుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అనసూయ.


   సిటీ కదా...అమ్మాయి వుండే ఏరియా చాలా దూరమే అయినా...లోకల్లోనే అనే సంతృప్తి ఆమెకు.  "దేవుడి దయ వలన ఈఅమ్మాయైనా నచ్చితే బాగుండును. వెంటనే తాంబూలాలు పుచ్చేసుకుని....పెళ్లి జరిపించేయాలి". భర్తతో అంది అనసూయ.

    

   "ముందు వాడికి అమ్మాయంటూ నచ్చితే పెళ్లి సంగతి ఆలోచించొచ్చు" అన్నాడు రవీంద్ర.

    

   "మీరు మరీనూ. కోరి కోరి అడుగుతున్నారు. లక్షణమైన సంబంధం. అమెరికాకి సూటయ్యే పిల్ల కూడాను. ఇంగ్లీషు అదీ చక్కగా మాట్లాడుతుంది అంట. ఈ అమ్మాయి తప్పకుండా మనోడికి నచ్చుతుంది చూడండి. మనం తల్చుకోవాలే గానీ పెళ్లి కుదిరిన వారం రోజుల్లోనే అయిపోతున్న పెళ్లిళ్లు ఎన్ని చూడ్డం లేదు. మళ్లీ మళ్లీ అంత దూరం నుంచి ఏం వస్తాడు...? మాఘమాసం కూడానూ. పెళ్లి ముహూర్తాలకు కొదవేం లేదు". ఎంతో ధృడనిశ్చయంతో ఉంది అనసూయ. 


   అమ్మాయి ఇంటికి వెళ్లారు. పెళ్లి చూపుల తతంగం అవుతుంది.


   అమ్మాయితో అబ్బాయిని మాట్లాడమన్నారు. 


    కార్తీక్ ఏమీ మాట్లాడకపోయేసరికి...అమ్మాయే చొరవదీసుకుని...యక్ష ప్రశ్నలు వేసింది . అన్నిట్టికీ దిక్కులు చూస్తూనే సమాధానం చెప్పాడు .


    కార్తీక్ వాలకం చూస్తుంటే...ఈ సంబంధం కూడా 'నో' అనేవాడిలా కనిపిస్తున్నాడని అర్థమైపోయింది తల్లిదండ్రులకు.


     *             *            *


    అమెరికా...దేశం...!


    తెలిసినవాళ్ళు ఒక పార్టీకి ఆహ్వానిస్తే వెళ్ళాడు కార్తీక్. అక్కడకు వచ్చిన ఒక అమ్మాయిని చూసి ఆశ్చర్యపోయాడు కార్తీక్.


    చూడగానే కళ్ళు మెరిసాయి.

    మనసు ముచ్చటపడింది.

    వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టయ్యింది. 

    "నమస్కారం" అంటూ ఎంతో శ్రావ్యంగా పలికింది. పరిచయం అయిన కొంచెం సేపట్లోనే...ఆమె ఎలాంటిదో అర్థమయ్యింది.


    ఆ విషయం తల్లిదండ్రులకు చెప్పాలనుకున్నాడు. ఇప్పటికే తనపై కోపంగా ఉంది తల్లి. నిక్షేపం లాంటి సంబంధాలు కాదని వచ్చేశాడని. తల్లిదండ్రులకు అర్థమయ్యేట్టు ఎలా చెప్పాలి...? ఇలాంటి సున్నితమైన విషయాల్ని ఒక్కోసారి నోటితో కంటే...రాతలతోనే మనసులోని మాటల్నీ , భావాల్ని విప్పిచెపితే అవతలవారి మనసుని కరిగిస్తుంది. ఎప్పుడూ ఉత్తరం రాసే అలవాటు లేకపోయినా...మొదటిసారి రాయాలనే ప్రయత్నం చేద్దామనుకున్నాడు. 


    ఆ ఆలోచన తట్టగానే...

    లాప్టాప్ ఓపెన్ చేసాడు...అమ్మకు మెయిల్ పెట్టడానికి.


    ప్రియమైన అమ్మకు,

     

    నేను ఇక్కడ బాగున్నాను. మీరెలా వున్నారు..? నాకు తెలుసు ...నామీద నీకు కోపం పోలేదని. నీకు నచ్చిన అమ్మాయిలు నాకు నచ్చలేదనే కదా. 

     

    నిజానికి నువ్వు చూపించిన అమ్మాయిలందరూ బాగున్నారు. నీ సెలక్షన్ లో లోపమేమీ లేదు. అందరూ బాగా చదువుకున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. మన అంతస్తుకు తగ్గ సంబంధాలే చూసారు. కానీ నేనెవరినీ ఇష్టపడలేక పోయాను. కారణం నా ఊహల్లో అమ్మాయిలు వేరు. అలాంటి ఊహలతోనే  పెళ్లిచూపులకు వచ్చేవాడిని. నేను చేసుకోబోయే అమ్మాయి నాకు నచ్చే విధంగా కళ్ళముందు కనిపించాలని ఎన్నో అనుకున్నాను. కానీ నాకెవరూ అలా కనిపించలేదు. 


    నా మనసు వేరు...నా భావాలు వేరు. నా ఇష్టాలు వేరు.


    అవునమ్మా...ఇక్కడ అమెరికాలో అర్థనగ్నమైన దుస్తుల్లోనే అమ్మాయిల్ని ఎక్కువగా చూసాను. వీళ్లనిలా చూసి చూసి మనసు విసిగిపోయింది. అచ్చంగా ఆడపిల్లంటే ఆడపిల్లగా మన సాంప్రదాయ పద్దతిలో లక్షణంగా పెరిగిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. నువ్వెంత మంది అమ్మాయిల ఫోటోలు చూపిస్తానన్నా చూడడానికి ఇష్టపడలేదందుకే. నా మనసులో కోరిక ముందుగా నీకు చెప్పేస్తే...అలాంటి డ్రెస్సుతో ఫొటోస్ కావాలని నువ్వు వాళ్ళని అడిగేదానివేమో...? ఫొటోస్ కోసం ఫోజులిచ్చే ఆ ఫోటోలు చూస్తే...నామనసు నిజంగానే మోసపోయేది. నా పిచ్చి గానీ...పల్లెటూరి పిల్లయితే...నాకు ఊహకు తగ్గట్టుగా దొరుకుతారనిపించింది. 

అక్కడ కూడా వస్త్రధారణ మారిపోయింది. నీకర్థమయ్యేలా చెప్పాలంటే...

    

    సూరవరం లాంటి పల్లెటూరులో కూడా.... పెళ్ళిచూపులకు చుడీధర్ లో వచ్చి కూర్చుంది. 


    కాకినాడ టౌన్ లో అమ్మాయి గాగ్రా డ్రెస్ తో వచ్చి కూర్చుంది.


    హైద్రాబాద్ నగరాన్న చూసినమ్మాయైతే నాకు లాగే జీన్స్ టీషర్టుతో వచ్చి కూర్చుంది. 


     అందరిలోనూ అన్ని విషయాలూ నచ్చినా...ఆ డ్రెస్ తీరు నాకు నచ్చలేదు.  నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ...నువ్వు టీనేజ్ లో ఎలా అయితే వస్త్రధారణ చేసుకున్నావో అలా ధరించే లక్షణమైన అమ్మాయి నాకు కావాలనుకున్నాను. అలాంటి వారు నాకెక్కడా ఇండియాలో కనిపించలేదు. అందుకే...పెళ్లి ఇప్పట్లో చేసుకోనని తిరిగి అమెరికా వచ్చేసాను.


     ఇదిగో ఈరోజే...నా ఊహల సుందరి ఒక పార్టీలో దర్శనం ఇచ్చింది. అచ్చం నాకు ఎలాంటి దుస్తులు ధరించే అమ్మాయి కావాలనుకున్నానో...అలా సాంప్రదాయకమైన పట్టులంగా,ఓణీ , జాకెట్టు వేసుకుని...పొడవాటి జడలో పూలను పెట్టి...కాళ్లకు చిరుశబ్దం చేస్తున్న పట్టీలతో...చేతుల నిండుగా గలగల మంటూ గాజులతో...విల్లంటి కనుబొమ్మల మధ్య తీర్చిదిద్దిన గుండ్రటి బొట్టు...కోటేరు ముక్కుకు తళుక్కుమనిపించే ముక్కుపుడకతో....అందంగా అలంకరించుకున్న ముద్దబంతిలాంటి పల్లె పడుచును మనదేశ అమ్మాయిల్లో చూడలేకపోయినా...ఒక విదేశీ అమ్మాయిలో చూడ్డంతో...ఆమెందుకో నామనసు నాకట్టుకుంది. నా భావాలకు అద్దం పట్టినట్టు అనిపించింది. 

     

   మన ట్రెడిషన్ లో తయారవ్వడమన్నా...కట్టుబాట్లన్నా తన కెంతో ఇష్టమంట.  ఓ ఇండియా అబ్బాయిని పెళ్లిచేసుకుని...మన సాంప్రదాయాల్లో జీవించాలని కూడా ఆ అమ్మాయి ఆశ పడుతుంది. 


  అందుకే ఆమె అమెరికన్ అయినా... నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. మీరు మనస్ఫూర్తిగా ఒప్పుకుని...మా పెళ్లికి అంగీకరిస్తారనే అనుకుంటున్నాను. నన్నర్థం చేసుకుంటారు కదూ...!!


                        ఇట్లు,

                       కార్తీక్.


  మనసులోని భావాన్ని, ఇష్టాన్ని అక్షరరూపాన్నిచ్చి తృప్తిగా తల్లికి సెండ్ చేసాడు ఆ మెయిల్ ని. తాను తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి పొరపాటూ లేదనే నమ్మకంతో కార్తీక్.*


      

     ***            ***             ***


 



Rate this content
Log in

Similar telugu story from Classics