పెద్దగీత – చిన్నగీత!(కథ )
పెద్దగీత – చిన్నగీత!(కథ )
పెద్దగీత – చిన్నగీత!(కథ )
‘’ఈవేళ సాయంత్రం కళాకేంద్రంలో మా నాన్నగారి కార్యక్రమం ఉంది మాష్టారు.నాన్నగారే స్వయంగా వచ్చి ఆహ్వానిద్దామనుకున్నారు. పండగ సీజన్ వల్ల కొంచెం బిజీగా ఉన్నారు"అంటూ నా శిష్యులు శ్వేత, స్వాతి అందించిన కరపత్రం తీసుకుని చూడనైనా చూడకుండా పక్కన పెట్టి...
"ముందు బోర్డ్ మీద లెక్క ఎక్కించేసుకొండమ్మా.ఆతరువాత మీకు దానిని వివరించి బోర్డ్ చేరిపేస్తాను. ట్యూషన్ అయిపోయాక ఒక పదినిమిషాలు ఉండడమ్మా. మీతో మాట్లాడాలి." అన్నాను చిరాకును బయటపడనీయకుండా.
ట్యూషన్ అయిపోయాక పిల్లలందరూ వెళ్లిపోయాక శ్వేత స్వాతి కూడా లేచి నిలబడ్డారు.
"మీరు ప్రైవేటు లో చేరినప్పటి నుంచి నుంచి చూస్తున్నాను రోజు ఆలస్యంగా వస్తారేమిటమ్మా?" అడిగాను.
" మా ఇంట్లో పనులు,మా పెద్దమ్మ గారి ఇంట్లో పనూలు చేసుకుని మరీ వస్తాం సార్. అక్కడికి నాలుగు గంటలకు లేస్తే ఆరు గంటలకి సగం పని పూర్తి అవుతుంది సర్.మా పెద్దమ్మ గారికి పిల్లలు లేరు సార్. మా నాన్నగారు మా అమ్మగారిని పెళ్లి చేసుకున్నాక మేము ఇద్దరం, తమ్ముడు పుట్టాము. పైగా మా పెద్దమ్మకు క్యాన్సర్. నాన్నగారు వారంలో మూడు రోజులు పెద్దమ్మ ఇంట్లో ఉంటారు సర్.అక్క, నేను వంతులుగా పనులు చేసుకుని వస్తాం సర్" అని చెప్పిందిశ్వేత.
" సరే ఆ సమయానికి రావడానికి ప్రయత్నం చేయండి మరి" అన్నాను.
నేను ప్రైవేట్ చెబుతానని తెలుసి నెల క్రితం తన తండ్రి ని తీసుకొని శ్వేత,స్వాతి నా దగ్గరికి వచ్చారు.
"సర్. నాపేరు సూరి బాబు. నేను టైలర్ గా పని చేస్తాను. నా పిల్లలు ఇద్దరు మీ పాఠశాలల్లో చదువుతున్నారు. వాళ్లకు నచ్చిన చోట ప్రైవేటు చెప్పిస్తే బాగా రాణిస్తారని నాకు నమ్మకం..మీ పుణ్యమా అని మా పిల్లలిద్దరూ ఈ సంవత్సరం మంచి మార్కులతో పాస్ అయితే జీవితాంతం మీ పేరు చెప్పుకుంటాం సార్. ఎందుకంటే పదవతరగతి విద్యార్థుల జీవితానికి పునాది అని నా నమ్మకం" అని ఎంతో వినయంగా, చూడటానికి సన్నగా రివటలా ఆరడుగుల పొడుగు ఉండి నా ముందు చేతులు కట్టుకుని మాట్లాడిన అతనికి దగ్గర రెండు కుటుంబాలు నిర్వహించెంటంత విషయం ఉందని నేను ఊహించలేదు.ఏదో తెలియని చులకన భావం కలిగింది అతనిమీద.
"నేను సహజంగా ఎప్పుడు ఎక్కడ బేరం ఆడను సర్ . అలా అడిగితే అవతలి వ్యక్తికి వచ్చే రూపాయి నావల్ల పోతుంది అని నా నమ్మకం .అలా అని ఎక్కువ డబ్బు పెట్టను. న్యాయబద్ధంగా అందరూ ఎలా డబ్బులు ఇస్తే నేను అలాగే ఇస్తాను. అయితే మీరు ఒక యాభై రూపాయలు కనుక డబ్బు తగ్గిస్తే అది నాకు మరొకందుకు ఉపయోగపడుతుంది." అడిగాడు అతను.
"చూడండి. నేను కచ్చితంగా చదువు చెప్తాను. ఫీజు విషయంలో కూడా అంతే కచ్చితంగా ఉంటాను" అన్నాను మాటకి అవకాశం ఇవ్వకుండా. అతను నా చేతిలో ఐదు వందలు పెట్టి నమస్కరించి వెళ్ళిపోయాడు. నేను సంతృప్తిగా చూసుకుని జేబులో పెట్టుకున్నాను.నా ఆశలు నాకున్నాయి మరి!
****
భారతీయ కాలమానం ప్రకారం7 గంటలకు కళాకేంద్రం కి వెళ్లాను. కళా కేంద్రంలో జరిగే ఒక నెల వారి కార్యక్రమం అది. బోర్ కొడితే లేచి వెళ్లి పోవచ్చు అన్నట్టుగా ఆఖరి వరుసలో మొదటి కుర్చీలో కూర్చున్నాను.
నన్ను చూస్తూనే శ్వేత, స్వాతి ఇద్దరు వచ్చి పలకరించి వెళ్ళారు.
సభా కార్యక్రమం మొదలైంది
అనంతరం తర్వాత విశ్వామిత్రుడు ఏకపాత్రాభినయం ప్రదర్శన జరిగింది. ఆ వ్యక్తి వాక్ప్రవాహం,అపర ఘంటసాలలా పాడిన పద్యాలు, సంభాషణలు పలికే తీరు వింటూనే నన్ను నేను మరిచిపోయాను.
ఈ కాలంలో కూడా ఎంతటి ఉత్తమ కళాకారులు ఉన్నారు? అతను పాడిన పద్యాలలో తెలుగు వాడినై ఉండి ఒక్క పద్యం రాదు నాకు .తర్వాత ఆ పాత్రధారుణ్ణి పరిచయం చేస్తున్నప్పుడు నేను నిర్ఘాంత పోయాను. ఆయన సూరిబాబు గారు.
ఎందుకో మనసు ముడుచుకుపోతున్న భావన నాలో మొదలైంది. ఏదో తెలియని బాధ మనసును మెలిపెట్టడం ప్రారంభించింది. తానుగా వచ్చి ఒక్క 50 రూపాయల జీతం తగ్గించమని నన్ను కోరినప్పుడు నిర్ధాక్షణ్యంగా తిరస్కరించాను. అతను పాడిన ఒక పద్యానికి నా మొత్తం జీవితం తూకం వేసినా సరిపోదు. ఎంత తప్పు పని చేశాను అనుకున్నాను.
అనంతరం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ మంచం మీద నుంచి లేవలేని స్థితిలో ఉన్న ఒక నిరుపేద కళాకారునికి మోసుకొచ్చి సన్మానం చేశారు.
శ్వేత స్వాతి హారతి ఉన్న ఒక పళ్ళాన్ని తీసుకుని ప్రేక్షకులందరి దగ్గరికి వచ్చారు. అందరూ ఎవరికి తోచింది వారు వేశారు.నేను జేబులో డబ్బులు వేసుకు రాలేదు. వాళ్ళు నా దగ్గరికి వచ్చినపుడు వేదిక వైపు చూస్తూ ఉన్నట్టు నటించి, వాళ్ళు వెళ్లిపోయాక సిగ్గుతో తలవంచుకొన్నాను.
అనంతరం ఆ కార్యక్రమ ప్రధాన కార్యదర్శి సూరిబాబు గారు అప్పటికప్పుడు సభలో సేకరించిన 10500 కళాకారునికి ముఖ్య అతిధి చేతులమీదుగా అందచేస్తూ, తనవంతుగా 25 కిలోలబియ్యపు బస్తాను ఆ కుటుంబానికి ఇస్తున్నట్టుగా ప్రకటించారు. నన్ను, నా మనసును, నా వ్యక్తిత్వాన్ని గుండ్రాయితో కుంకుడుకాయని చితక్కొట్టేస్తున్నట్టుగా బాధపడ్డాను.
పెద్ద గీతను అని విర్రవీగుతున్న నేను , అతని ముందు చిన్నగీతగా కుంచించుకు పోసాగాను.
సూరి బాబు గారు హఠాత్తుగా నన్ను వేదికపైకి ఆహ్వానించారు. తన కుమార్తెలకు విద్యాబోధన చేస్తున్న ఉపాధ్యాయుడిగా నన్ను పరిచయం చేసి వృత్తికి అంకితమైన వ్యక్తి గా నన్ను అభివర్ణించి దుశ్శాలువా కప్పి పుష్పగుచ్ఛంతో సత్కరించారు.
నేను కనీవినీ ఎరుగని ఊహించని జీవితంలో మొదటి సన్మానం. కళకు జీవితాన్ని అంకితం చేసుకున్న ఆ పేద కళాకారునికి కనీసం ఒక 100 రూపాయలు కూడా ఇవ్వలేని నిస్సహాయస్థితిలో వచ్చినందుకు సిగ్గుతో చచ్చిపోయాను. అప్రయత్నంగా కుడి చేయి తొడమీద వేసుకున్నాను.
పాంటు కుడి జేబులో ఏదో ఎత్తుగా ఉన్న స్పర్శ.ఏమిటా అని చూస్తే ఎల్.ఐ.సి.కడదామని నోటీసుకాగితంలో దాచిన రెండు 500 రూపాయల నోట్లు. ఆలోచించకుండా ఆ సొమ్మును సూరిబాబుగారికి అందించాను.
'మీరు ఒక్క 50 రూపాయలు ఫీజు తగ్గిస్తే అది మరొకరూపంలో ఉపయోగపడుతుంది' అన్న అతని మాటలలోని అంతరార్ధం మనసును ఛెళ్లున తాకింది.
అయితేనేం? మనసు సంతృప్తి తో నిండిపోయింది, కరతాళధ్వనులతో ఆ ప్రాంగణం ప్రతిధ్వనించింది.
సమాప్తం.
