ఒక విప్లవ కవి
ఒక విప్లవ కవి
ఓ మంచి కవిత వ్రాసి పెట్టు అన్నాడు రాజీవ్. శ్రీహర్ష అప్పటికప్పుడే వ్రాసి ఇచ్చాడు.
ఓ వైపు పేగుల్లో ఆకలి కేకలు
మరో వైపు అతిగా తిని అసిడిటీ సమస్యలు
అన్నీ ఇక్కడే
అంతా మనమే
నినాదాలతో అసమానతలు తొలగిపోతాయా అన్నా
ఏమో..
ఇంకోటి ఏమైనా వ్రాయరాదూ.. రాజీవ్ దీనంగా ముఖం పెట్టి అడిగాడు.
కులం పేరు చెప్పనప్పుడు
మొదటి సారి బూటు కాలు ముఖాన్ని తాకింది
ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా అన్న ప్రశ్న వినబడింది
ఆపు. ఆపెయ్ అంటూ అరిచాడు రాజీవ్. ఏదైనా కొంచెం రొమాంటిక్ గా వ్రాయరా. నేను శృంగార కవితలు, ప్రేమ కథలు ఇవ్వాలి పోటీకి అన్నాడు.
విప్లవ కవితలు ఇస్తే వద్దంటారా అన్నాడు శ్రీహర్ష.
వద్దనరు. కాకుంటే చదివి అర్థం చేసుకునే వాళ్ళు తక్కువ. ఆ వెబ్సైట్లో ఎంత మంది మనకు లైక్స్, రేటింగ్స్ ఇస్తే మనం గెలవడానికి అంత ఛాన్స్ ఉంటుంది. గెలిస్తే వేలల్లో బహుమతులు. రొమాన్స్ అంశం అయితే ఎక్కువ మంది ఆసక్తిగా చదువుతారు అని బ్రతిమిలాడాడు రాజీవ్.
శ్రీహర్ష మళ్లీ పెన్ పట్టుకుని వ్రాసాడు.
ఆమె జాకెట్ మీద అతని పెదాలు తొలి ముద్ర వేశాయి
కొద్ది క్షణాల కోసం శరీరాలు బంధాల్ని మరచాయి
తృప్తి ఒక మిథ్య అని..
వద్దు బాబూ. నీకూ, నీ కవితలకూ ఒక నమస్కారం. ఇంక వ్రాయకు అంటూ శ్రీహర్ష వ్రాస్తున్న ఆ పేపర్ లాక్కున్నాడు. ఏదో బాగా వ్రాస్తావ్ కదా అని నిన్ను అడిగితే నువ్వు ఇదా వ్రాసేది. మనం వ్రాసేది జనాలు ఎంజాయ్ చెయ్యాలి. ఆ ప్రియుడి కౌగిల్లో ఒదిగి బంధింపబడినందుకు ప్రియురాలు ఆనందించాలి. ఇలా ఈ బంధాలు, మిథ్య అంటూ వేదాంతం చెప్పి మూడ్ చెడగొట్టే పనులు చేయకూడదు అని రాజీవ్ ఇంకో రచయితను వెతికే పనుల్లో పడ్డాడు.
శ్రీహర్ష నవ్వుకున్నాడు.
