నిజం
నిజం


నిజం ఎందరికో తెలియదు. నచ్చదు.
నిజం నిష్ఠూరం అని ఊరికే అనలేదు.
వాళ్ళ వాళ్ళకి అప్పటికే కల అభిప్రాయాలకు
అనుగుణంగా విషయం ఉంటేనే దానిని నిజం అంటారు. అనుకుంటారు.
త్రిమతాచార్యుల అనుయాయులు, శిష్య కోటి తమ తమ వేదాంతాలనే మన్నిస్తారు. ఇతర వేదాంతాలను ఖండిస్తారు.
మరి ఈ త్రిమతాలలో ఏది నిజం? ఏది మన్నించదగినది? ఏది ఖండించదగినది?
ఎవరి మట్టుకు వారికి వారి సిద్ధాంతమే నిజం. అయితే నిజం ఎన్ని రకాలు? ఎన్ని విధాలు?
నిజం ఎప్పుడూ ఒక్కటే ఉంటుంది కదా! మరి ఇన్ని "నిజాలు" ఏమిటి? ఇజాల లాగా!?
వ్యక్తి వ్యక్తికీ తన సంస్కారాల, నమ్మకాల ఆధారంగా నిజం గోచరిస్తుంది. దానిని మాత్రమే నిజం అంటాడు. తదితరాన్ని అబద్ధం అంటాడు.
అంచేత నిజం, వ్యక్తి వ్యక్తికీ తలో నిజంలా తయారవుతుంది. వ్యక్తి వ్యక్తిత్వానికి, సంస్కారానికి, నమ్మకాలకు అతీతంగా నిజం ఉంటుందా? ఉండగలదా?
నిజం ఇంత సున్నితమైనదా? ఇంతలా వ్యక్తుల అభీష్టాలకు, సంప్రదాయాలకు అనుగుణంగా మారిపోతుందా? నిజం మైనపు బొమ్మా? జ్ఞాన ప్రకాశమా?
వ్యక్తులకూ, వ్యక్తిత్వాలకు, వారి నమ్మకాలకూ
మించిన అవగాహనగా, అనుభవంగా నిజం ఉండదా?
నిజం నిజమైన నిర్వచనం అదే. వ్యక్తిని బట్టి, సంస్కారాన్ని బట్టి, సంప్రదాయాన్ని బట్టి, నమ్మకాలను బట్టి నిజం మారదు.
ఏ వ్యక్తి, వారి వ్యక్తిత్వము, వ్యక్తిగత నమ్మకాలకు, సంప్రదాయాలకు అతీతమైనది నిజం. దీనినే సత్యం అంటారు. సత్ అనే సంస్కృత పదం యొక్క అపభ్రంశం, తెనుగు సేత, సత్యం.
సత్ అంటే సదా ఉండేది.
సదా అంటే సర్వకాల, సర్వావస్థలయందూ.
యా విద్యతే సా విద్యా
ఏది అయితే అస్తమానూ ఉంటుందో అది విద్య. అదే సత్యం. అదే నిజం.
వ్యక్తికీ, వ్యక్తిత్వానికీ, వారి, వారి సాంప్రదాయాలకు భిన్నంగా, వీటి స్పర్శ లేక సర్వకాల, సర్వావస్థలయందూ నిలిచి వెలిగేది, వెలిగించేది, నిజం. కాల దేశములకు అతీతమైనది నిజం.
స్వయంసిద్ధ, స్వయంగత, సహజ ఉనికియే నిజం. దర్శించే వ్యక్తిని బట్టి సత్యం మారదు. మారరాదు.
నిజం వ్యక్తిత్వాలకీ, సాంప్రదాయాలకూ, నమ్మకాలకూ అతీతమైనది. వ్యక్తిత్వం, సంస్కారం, నమ్మకం అదృశ్యమైనపుడు అంతరంగంలో కలిగే నిర్మలానుభవమే నిజం.
ఇదే జ్ఞానం. ఇదే భక్తి. ఇదే యోగము.
నిజాన్ని తెలిసికొని నిజంగా నిలవడం మానవ జన్మకు ధన్యతనిస్తుంది.
ఓం తత్ సత్!