మస్తు కల
మస్తు కల
రాత్రి మస్తు కలొచ్చిందిరా. మనీష్ దోస్తులతో అన్నాడు. ఏందిరా కల. కొంప తీసి అమ్మాయి ఐ లవ్ యు అని చెప్పిందా అన్నాడు రాజు.
లేదురా. మనం క్లాసులో వెనుక బెంచీలో కూర్చుంటాం కదా. లెక్చరర్ నిన్ను మొదటి బెంచీలో కూర్చోబెట్టిందని కలొచ్చింది. మేము మంచిగ పంచ్ లు వేస్కుంటూ మాట్లాడుకుంటం అన్నాడు మనీష్.
అందరూ నవ్వుకున్నారు. నీకు తెలివి ఎక్కువైందిరా. అందుకే ఇట్లాంటి కలలు వస్తున్నయ్ అనుకున్నాడు రాజు మనసులో.
మరుసటి రోజు క్లాస్ జరుగుతోంది. లెక్చరర్ రమణి ఒక ఎలక్ట్రో మాగ్నెటిక్ ఈక్వేషన్ గురించి రాజుని అడిగింది. రాజు సమాధానం చెప్పాడు.
గుడ్ అంది రమణి. మేడమ్! మనీష్ మీ క్లాసులో రన్నింగ్ నోట్స్ వ్రాసాడు.అది చదవడం వల్లే నాకు ఈక్వేషన్స్ బాగా గుర్తున్నాయి అని చెప్పాడు రాజు.
మనీష్. నువ్వు ముందు బెంచీలో వచ్చి కూర్చో. అంత వెనుక కూర్చుని రన్నింగ్ నోట్స్ వ్రాయడానికి ఇబ్బంది పడకు అంది లెక్చరర్.
అసలు నోట్స్ వ్రాయకుండా జిరాక్స్ కాపీలు చదివే తను రన్నింగ్ నోట్స్ వ్రాయడమే. ఒరేయ్ రాజూ. నన్ను బాగా ఇరికించావ్ అని మనీష్ పళ్ళు పటపట కొరుక్కున్నాడు.
మనీష్ ఇబ్బందిగా వెళ్లి ముందు బెంచీలో కూర్చున్నాడు.
కలలు కనడం సరే. నేనైతే నిజం కూడా చేస్తున్నా అని రాజు జోక్ చేశాడు. బ్రేక్ లో నీ పని చెబుతా అని మనీష్ కళ్లతోనే రాజుకు సైగలు చేస్తూ, మధ్య మధ్యలో వెనక్కి తిరిగి లాస్ట్ బెంచీని అపురూపంగా చూసుకుంటూ గడిపాడు.
