మంత్రాల గిన్నె
మంత్రాల గిన్నె
ఒరేయ్ డుంబు కనిపించాడా? శివ ఆయాసంతో రొప్పుతూ అడిగాడు. రామూ తల అడ్డంగా ఊపాడు. ఏమైందిరా అని రామూ పెట్టుకున్న వేలు నోట్లో నుంచి తీసి అడిగాడు.
పదేళ్లు వచ్చినా ఇప్పటికీ రామూకి వేలు నోటిలో పెట్టుకునే అలవాటు పోలేదు.
వాడు మా ఇంట్లోంచి మంత్రాల గిన్నె తీసుకొచ్చాడు. మా నాన్నారికి తెలిస్తే అంతే సంగతి. అందుకే వెతుకుతున్నాను అని చెప్పాడు శివ.
మంత్రాల గిన్నె తో ఏం చెయ్యొచ్చు అని అడిగాడు రాము.
నువ్వు ఏం కావాలంటే అది ఇస్తుందిరా మంత్రాల గిన్నె. మా నాన్న ఏడాదికి ఒక్కసారి మాత్రమే దాన్ని వాడుకుని, మిగతా రోజుల్లో లాకర్ లో పెట్టేస్తాడు. నేను లాకర్ తెరిచి చూశాను. పక్కనే ఉన్న డుంబు దాన్ని పట్టుకుని పరుగెత్తాడు అని చెప్పాడు శివ.
శివ ఇంకా ముందుకు వెళ్ళిపోయాడు. రామూ కూర్చున్న చెట్టు నీడలో ఎవరో కనిపించినట్లయ్యింది. రామూ పైకి చూశాడు. డుంబు అక్కడే ఉన్నాడు. అతడి చేతిలో మెరిసిపోతోంది వెండి గిన్నె.
రామూ డుంబూని మంత్రాల గిన్నె నుండి చింతపండు కావాలని అడగమన్నాడు. అది కూడా బాగా ఉప్పు, కారం, జీలకర్ర వేసి రోటిలో దంచిన చింతపండు ముద్ద కావాలన్నాడు.
డుంబు అలాగే అంటూ మంత్రాల గిన్నెను అడిగాడు.
వారి ముందు పెద్ద పర్వతమంత చింతపండు ముద్ద వచ్చి చేరింది.
వాళ్ళు దాంట్లో కొంచెం తీసుకుని, నాలుక మంట పుట్టే వరకూ తిని, మిగతాది ఏం చేయాలా ఆలోచిస్తున్నారు.
శివ అదే దారిలో చింతపండు వాసన రావడంతో అటుగా వచ్చాడు. దాని కోసమే ఒక ఎగిరే ఎలుక కూడా అటు వచ్చింది. మంత్రాల గిన్నె మనం అడిగింది ఇవ్వడంతో పాటూ, ఒక విచిత్రమైన జంతువును కూడా ఇస్తుందని శివకు కూడా తెలియదు.
