kottapalli udayababu

Drama Classics Inspirational

4  

kottapalli udayababu

Drama Classics Inspirational

మనసు చేసిన న్యాయం - 23 వ భాగం

మనసు చేసిన న్యాయం - 23 వ భాగం

3 mins
29


మనసు చేసిన న్యాయం - 23 వ భాగం

కూర్చున్నచోట నుంచి లేచి ఆమెకి నమస్కారం పెడుతూ సర్పద్రష్టలా ఆగిపోయాను. ఆమె కూడా నా వైపు చూసి "బుజ్జీ...వైభవ్ అంటే నువ్వా?" అంది.

"వదినా...మీరా...మీరిక్కడ?"అన్నాను సంభ్రమంగా.

"బుజ్జీనా...అదేం పిలుపు విజయా? ఇతను..ఇతను నీకు తెలుసా?" పల్లవి మేడం అడిగారు.

" తెలియడం ఏమిటి మేడం? అతను స్వయంగా నా మరిది"

"అంటే నువు...గంగాధరంగారి..." పల్లవిమేడం అమ్మగారు అడిగారు.

"పెద్దకోడలిని ఆంటీ."

" అలాగా ఎంత విచిత్రం? మీ ఇద్దరు స్వయంగా వదిన మరదులు అయినప్పుడు ఇంక నేను కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం ఏం ఉంది? మీరు మాట్లాడుకోండి.సొంత మరిది కదా. కొంచెం పెద్ద పాలసీ చేయించు. వైభవ్. ఒక్కమాట. తాను జీవితంలో ఎంతో కోల్పోయిన అమ్మాయిగా నాకు తెలుసు. తనకు కొంచెం హెల్ప్ చెయ్యి.అది నీ కుటుంబాన్ని ఎపుడూ కాపాడుతుంది. అమ్మా! నాకు టిఫిన్ పెట్టు!" అంటూ తల్లిని తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది పల్లవి.

"వదినా..మీరు...ఇక్కడ....ఎలా?''

"నాన్నగారు పోయాక అక్కడి అధికారులు, పోలీసుల వేధింపులు, బెదిరింపులు భరించలేక అమ్మ మమ్మల్ని హైద్రాబాద్ తీసుకువచ్చేసింది . ఆతరువాత చాలా జరిగాయి. బుజ్జీ. అవన్నీ తరవాత చెబుతాను. సాత్విక ఎలా ఉంది?"

"బాగుంది వదినా.పదవతరగతి చదువుతోంది.మిమ్మల్ని ఒక్క మాట అడగవచ్చా?"

"ముందు నువు కూర్చో బుజ్జీ.ప్లీజ్."నేను కుర్చీలో కూర్చున్నాను.

"మీరు మా ఇంట్లో కూడా నాతో ఎక్కువగా ఏనాడూ మాట్లాడలేదు. మా ఇంటికి అత్తయ్యగారితో వచ్చినప్పుడు కూడా మీరు మాఇంట్లో జరుగుతున్నవన్నీ చూస్తూనే ఒక్కరితో ఒక్కమాట కూడా మాట్లాడలేదు. ఈ వేళ ఎలా మాట్లాడగలుగుతున్నారు?నాకు....నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది."

"తన వేలుతో తన కన్ను కావాలని ఎవరూ పొడుచుకోరు బుజ్జీ. కానీ తన పంతం నెగ్గించుకోవడం కోసం కన్నబిడ్డ కన్ను కన్నతల్లే పొడిచేస్తే?" వదిన కళ్ళనిండా కన్నీళ్లు.

"అదేంటి వదినా?అలా ఏ కన్న తల్లైనా చేస్తుందా?" అన్నాను బాధగా.

"ఈ సృష్టిలో అందరు జీవులూ పుట్టడం మామూలుగానే పుడతారు. వారు పెరిగిన వాతావరణం, పెంచిన మనస్తత్వాలు...స్నేహితులు ..ఇలా ఎన్నెన్నో ప్రభావితం చేస్తే ఒక మనిషి తయారవుతాడు. అతను తన బ్రతుకు తాను బతుకుతాడు సహజంగా... కొందరు సమాజానికి కొంత చేసి, కొంత తమకోసం చేసుకుంటారు. మరికొందరు పూర్తిగా సమాజం కోసమే బ్రతుకుతారు. కానీ యాంటీ ఎలెమెంట్స్ లాగా పెరిగిన వ్యక్తులు తాము మనశ్శాన్తి గా ఉండలేరు. తనమీద ఆధారపడిన వారిని ప్రశాంతంగా బతకనివ్వరు. తాము ఏంచేసినా చెల్లుతుంది, తాము ఏమి అనుకుంటే అలా జరగాల్సిందే అనుకున్నవాళ్ళకి పరిస్థితులే సమాధానం చెబుతాయి. ఏనాడో ఒకనాడు వాళ్ళు తామెంత తప్పుగా ప్రవర్తించిందీ అర్ధం అయ్యేసరికి వారిని ఆదరించేవారు, ఆప్యాయంగా పలకరించేవారు, బాధపడేవారు ఒక్కరు కూడా మిగలరు. అలా మిగలకుండా పోయింది అమ్మ కూడా.'' అంది వదిన . 


నాకు నోటా మాట రాలేదు.విస్తుపోతూ అడిగాను.


''వదినా...మీరు ...మీరు చెప్పేది నిజమా?'' 


''అవును బుజ్జీ....'' అని వదిన ఏదో చెప్పబోతున్నంతలో పన్నెండు సంవత్సరాల అబ్బాయి లోపలి వచ్చాడు.


''అత్తా...ఇదిగో టిఫిన్. '' అని క్యారీబాగ్ అందించాడు.


''అంకుల్ కి నమస్తే చెప్పు. '' అంది వదిన..


''నమస్తే అంకుల్.''


''నమస్తే బాబు..ఏం చదువుకుంటున్నావ్?నీపేరు? "


''సెవెంత్ క్లాస్ సార్.ప్రణవసాయి ''


''సరే..నువ్వు నీకు కావలసిన టిఫిన్ తినేసి డ్రాయింగ్ క్లాస్ కి వెళ్ళిపో.'' అంది వదిన.


''సరే అత్తా...అని ఆ అబ్బాయి టిఫిన్ క్యారీ బాగ్ తో లోపలి వెళ్లిపోయాడు .''


'' ఈ బాబు?'' 


"ఆరోజు మీ ఇంటికి వచ్చాడుగా మా తమ్ముడు... వాడి కొడుకు. వాటికి నేను...నాకు వాడు దిక్కు మొక్కూ గా మిగిలాము.'' అంది వదిన.


నాకు మరో షాక్.


''వాళ్ళ నాన్నగారు?''


''తమ్ముడు జాస్మిన్ అని ఒక చర్చ్ ఫాదర్ గారి అమ్మాయిని చేసుకున్నాడు. ఆ పెళ్లి జరిగాకా అమ్మకి, తమ్ముడికి చాలా గొడవలు అయ్యాయి. చెల్లెళ్లకు తాము ప్రేమించినవారికి తెచ్చుకుంటే పెళ్లి చేస్తానని చెప్పి తానే పెళ్లిళ్లు చేసి అత్తవారిళ్లకు పంపేశాడు. అది భరించలేని అమ్మ తన కొడుకు తనను చూడటం లేదని పోలీసు రిపోర్ట్ ఇవ్వడానికి వెళ్తూ బైక్ ప్రమాదానికి గురై అక్కడకక్కడే చనిపోయింది. 


తనకు నాన్నగారి ఉద్యోగం రావడం కోసం అమ్మపడిన కష్టం గుర్తుకు వచ్చిన తమ్ముడు అమ్మ కార్యక్రమాలు అన్నీ పూర్తి చేసాకా మనఃశాంతి కోసం వారం రోజులలు విశ్రాన్తి తీసుకుందామని తన భార్య , మామగార్లతో ఊటీకి  వెళ్తోంటే అతివేగం వల్ల కారు లోయలో పడి ముగ్గురూ స్పాట్ డెడ్ అట. అదృష్టం ...ఆరోజు వీడిని తీసుకువెళ్లకుండా నాదగ్గర వదిలి వెళ్లారు. తమ్ముడు ఎంతటివాళ్ళకైనా విలువ ఇచ్చేవాడు కాదు ...లెక్క చేసేవాడు కాదు.  .అలాంటిది నన్ను మాత్రం 'అమ్మ'లా, ఇంకా సరిగ్గా చెప్పాలంటే ' మీ అమ్మగారిలా' చూసుకున్నాడు. వాడే నాకు అండగా లేకపోతే నేను ఈనాడు నీకు కనిపించి ఉండేదాన్ని కాదు. వాడిలో రెండోకోణం ఇది. సమాజంలో అలా ప్రవర్తించేవాడు నా దగ్గర ఎందుకు అలా ఉండేవాడో నాకు తెలీదు. ఒకటి రెండు సందర్భాలలో మాత్రం నాతో అన్నాడు 'మన అమ్మలాంటి అమ్మ ఈ లోకంలో మరొకరు ఉండరు అక్కా' అని. .'' అంది వదిన. 


''వదినా...వదినా...ఇదంతా నిజమా...వింటుంటే నాకు సినిమా కధలా ఉంది .ఒకదాని వెనుక ఒకటి అన్నట్టు ఇంత దారుణమా...''అన్నాను ఆవేదనగా..


''కొన్ని నిజాలు భరించాలి బుజ్జీ. తప్పదు. మా నాన్నగారు నిజంగా దేవుడు. అమ్మ చేసిన నేరాలన్నిటిని ఆయన ఎంతగా భరించాడంటే ...శ్రీకృష్ణుడు శిశుపాలుడిని వంద తప్పుల వరకే భరించగలిగాడు. కానీ నాన్నగారు అమ్మ చేసిన తప్పుల్ని భరించినట్లుగా నాకు తెలిసిన కుటుంబాలలో ఏ భర్త భరించి ఉండడు . ఈ ప్రపంచంలో నాకు ...ఉన్న ఒకే ఒక స్నేహితుడు ఆయన. అటువంటి అజాత శత్రువుని కూడా అన్యాయంగా ఆ దేవుడు పొట్టన పెట్టుకున్నాడు. బుజ్జీ..నాకు అర్ధమైనదేమిటంటే మంచివాళ్ళకి ఈ లోకంలో ఆయుర్దాయం ఎక్కువ ఉండదని ఎక్కడో చదివాను. అలాగే చెడ్డగా, దారుణంగా జనాలని హింసించి బ్రతికే వాడి చావుకూడా భయంకరంగా ఉంటుందనే విన్నాను. 'గొడవలు వచ్చిన తరువాత మా ఇంటి కొచ్చినప్పుడు మీరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు.'..అని అడిగావే... నిజమే. నేనపుడు మాట్లాడలేని స్థితిలోనే ఉన్నాను. ఎటువంటి మందులు అవసరం లేకపోయినా భయంకరమైన మందులు అమ్మ మింగించింది నా చేత. ఆ స్థితినుంచి నన్ను ఎందరో మంచి వైద్యులకు చూపించి మామూలు స్థితికి తీసుకువచ్చినవాడు నా తమ్ముడే. అందుకే నీతో ఇంతగా మాట్లాడగలుగుతున్నాను.'' అంది వదిన.


''మరో మాట...మీరు సాత్వికను గురించి అడిగారు గానీ మా ఇంట్లో ఇంకెవ్వరి గురించి అడగలేదు. కారణం తెలుసుకోవచ్చా?''


''ఇందులో తెలుసుకోకపోవడానికి ఏమీ లేదు బుజ్జీ.. వారి పేర్లు కూడా ఉఛ్చరించే అర్హత నాకు లేకపోవడమే.అంతటి గొప్పవాళ్ళు మీ కుటుంబంలో వ్యక్తులు.నువ్వు ఇంకా ఎక్కువ అడిగితే నేను...నేను నా దుఃఖాన్ని ఆపుకోలేను.'' అని ఒక్కసారిగా దీర్ఘశ్వాస పీల్చుకోవడానికి అన్నట్టు ఆగింది వదిన.


ప్రణవసాయి లోపలినుంచి వచ్చి '' అత్తా నేను వెళ్ళొస్తాను. బై అంకుల్'' అని వెళ్ళిపోయాడు.


(మిగతా 24వభాగం లో) 



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Drama