STORYMIRROR

kottapalli udayababu

Drama Classics Inspirational

4  

kottapalli udayababu

Drama Classics Inspirational

మనసు చేసిన న్యాయం - 18వ భాగం

మనసు చేసిన న్యాయం - 18వ భాగం

3 mins
2

మనసు చేసిన న్యాయం - 18వ భాగం

దాదాపు పదిహేను రోజుల తర్వాత ఇంటికి వచ్చాక ఇల్లంతా బోసిగా కనిపించింది. దానికి కారణం పాపతో మా ఇల్లు రెండు వారాలపాటు ఎంతో సందడిగా ఉండటమే.

అమ్మ పదేపదే పాపని గుర్తు చేసుకోసాగింది ఎలా ఉందో... ఏం చేస్తుందో అని.

అది చూసిన నాన్న గారు అన్నారు.

"లక్ష్మి! పాపని మనము ఎక్కడో వదిలి రాలేదు. తన కన్నతల్లి దగ్గర వదిలేసి వచ్చాం. కాబట్టి మనం ఏమి బాధ పడాల్సిన పనిలేదు.ఎటువంటి తల్లిదగ్గరైనా బిడ్డ క్షేమంగానే ఉంటుంది."

అమ్మ సర్దుకుంది. నాన్నగారు సెలవు అనంతరం ఆఫీసులో చేరారు.నేను నా కాలేజీ చదువులో పడిపోయాను.

********

మేము ఊరు నుంచి వచ్చామని తెలిసి అన్నయ్య ఆ శనివారం రాత్రి ఇంటికి వచ్చాడు.

మరునాడు ఉదయం టిఫిన్ చేసి అందరమూ టీవీ చూస్తున్నాం.

ఇంటి ముందు కారు ఆగింది. పాపను ఎత్తుకున్న వదిన, మావయ్య గారు లోపలికి వచ్చారు. డ్రైవర్ లగేజీ తీసుకువచ్చి లోపలపెట్టి వెళ్ళిపోయాడు.

మా ఆశ్చర్యానికి అంతులేదు. తప్పదన్నట్లు నాన్నగారు వాళ్ళని ఆహ్వానించారు.

"రండి బావగారు రండి కూర్చోండి" అంటూ సోఫా చూపించారు.

ఆయన నాన్నగారి పక్కన కూర్చుని చేతులు పట్టుకున్నారు

"బావగారు. ఇవి చేతులు కాదు. దయచేసి నన్ను క్షమించండి. అమ్మాయి పెళ్లి మంచి కుర్రవాడితో చేసాను, నా కూతుర్ని మంచి కుటుంబంలో ఇచ్చాను అని ఎంతో సంతోషపడ్డాను. ఏవేవో సందర్భాలలో ఆడవాళ్లు మాటకు మాట అనుకుంటారని, వాళ్ళల్లో వాళ్లే సర్దుకుపోతారని అనుకున్నాను. అవన్నీ పట్టించుకునే సమయం కూడా లేని ఉద్యోగం అయిపోయింది నాది. ఒకపక్క డిపార్ట్మెంట్ గొడవలతో సతమతమయ్యే పోతున్నాను. మీరు యాత్రలకు వెళ్ళేటప్పుడు పాపను తీసుకొచ్చి సరాసరి నా చేతుల్లో ఉంచితే ఆశ్చర్యపోయాను. 15 రోజుల తరువాత ఆ రోజే ఇంటికి వచ్చాను. ' మనవరాలు ఏది ?' అడిగితే మీరు కొంతకాలం వాళ్ల దగ్గర ఉంచుకుంటామని చెప్పారని, విజయ కొంచెం నీరసంగా ఉండడంతో మందులు వాడిన తరువాత తనని పంపించమని చెప్పారని నాతో చెప్పారు. మూడువారాలు అయింది కాబట్టి మీరు యాత్రల నుంచి వచ్చేసి ఉంటారన్న ఉద్దేశంతో ఈ వారం నేనే తీసుకువచ్చి మా అమ్మాయిని మనవరాలిని అప్పగిస్తున్నాను. తెలియక పిల్ల ఏమైనా తప్పులు చేసి ఉంటే మన్నించండి బావగారు " అన్నారు మావయ్యగారు.

"అయితే వీటి సంగతి కూడా మీకు తెలియదా మావగారు?" అంటూ అన్నయ్య లేచి వెళ్ళి తన గదిలో దాచిన ఉత్తరాలను తీసుకువచ్చి మావయ్యగారి చేతిలో పెట్టాడు.

ఆయన వాటిని పూర్తిగా చదివారు.

"చూడు బాబు! భార్యాభర్తల మధ్య ఉండాల్సింది నమ్మకం, ప్రేమ. అవి మీ ఇద్దరి మధ్య పుష్కలంగా ఉన్నాయి అని అనుకుంటున్నాను. అటువంటప్పుడు ఇలాంటి పిచ్చి ఉత్తరాలు ఎన్ని వచ్చినా మిమ్మల్ని ఇద్దరినీ ఎవరూ విడదీయలేరు. కాబట్టి దయచేసి ఈఉత్తరాల్ని మనసులో పెట్టుకుని మీ సంసారాన్ని నాశనం చేసుకోకండి "అన్నారు ఆయన.

"అయితే మొదటి ఉత్తరంలో రాసినట్లు నన్ను రైల్వే స్టేషన్ లో నలుగురు చేత కొట్టించడం అది కూడా అబద్ధమే అంటారా? "అన్నయ్య ప్రశ్న.

"పదిహేను రోజులపాటు వాడు మనిషి కాలేకపోయాడు అన్నయ్యగారు"అంది అమ్మ.

"నిజమా! అలా జరిగిందా! నాకు ఈ విషయాలన్నీ నిజంగా ఏమీ తెలియదు బాబు. నేను మిమ్మల్ని కోరేదొకటే. లేనిపోని అనుమానాలతో మనసు పాడు చేసుకుని ఇద్దరు ముగ్గురుగా మారిన మీ ఈ చిట్టి సంసారాన్ని చేజేతులారా పాడుచేసుకోవద్దు అని మాత్రం చిన్నవాడివైనా నిన్ను కోరి ప్రార్థిస్తున్నాను బాబు"అన్నారాయన చమర్చిన కళ్ళతో.

"ఆ ఉత్తరంలో విషయాలు తనకేమీ తెలియవని మీ అమ్మాయితో చెప్పించండి అంకుల్."అన్నాడు అన్నయ్య.

"ఏమ్మా...ఏమిటిదంతా?"అడిగారాయన వదిన రాసిన ఉత్తరం చూపిస్తూ.

వదిన నెమ్మదిగా తలెత్తింది.

"నాకు ఏ పాపం తెలీదు డాడీ. ఆ ఉత్తరం ఏమిటో నాకు తెలీదు."అంది వదిన.

"బాబు.చివరగా ఒకే ఒక మాట.అమ్మాయినిచ్చి కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన పెద్దవాడిగా అడుగుతున్నాను.ఈసారి అమ్మాయి ఏదైనా తప్పు చేసింది అనిపించినా, ఇలాంటి ఉత్తరాలు ఏమి వచ్చినా నువు నీ ఇష్టమైన నిర్ణయం తీసుకో. అపుడు నువ్వే నీ భార్యని నాదగ్గరకు తీసుకువచ్చి విడిచిపెట్టెయ్. కాదన్ను.ఈ ఒక్కసారికి మాత్రం నా మాట మన్నించు." అన్నారాయన.

అన్నయ్య అమ్మ, నాన్నగారికేసి చూసాడు.వాళ్ళు 'ఒప్పుకోబాబు'అన్నట్టు కళ్ళతో సైగ చేశారు.

అన్నయ్య వదినకేసి చూసాడు.

వదిన అలా తలదించుకుని ఒళ్ళో పాపాకేసి అలా చూస్తూనే ఉంది.

"సరే మామయ్యగారు"అన్నాడు.

ఆతరువాత భోజనాలు అయ్యాకా ఆయన వదినకు ఎన్నో జాగ్రత్తలు చెప్పి కారులో వెళ్లిపోయారు.

అమ్మ, నాన్న అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.

************

"వదిన ఇదివరకులా లేదురా...ఎందుకో చాలా బాధపడుతోంది" అంది అమ్మ నాతో.

"అన్నయ్య కనుక్కుంటాడులే అమ్మా..అటు వాళ్ళ అమ్మగారికి చెప్పుకోలేక, ఇటు అన్నయ్యతో చెప్పుకోలేక బాధపడుతోందేమో"అన్నాను.

వదిన ఇదివరకు అమ్మకు సాయంచేసేది. చేతిలో పని అందిపుచ్చుకునేది. ఇపుడు అలాంటివేమీ లేకుండా కేవలం పాప పని మాత్రమే చూస్తోంది.

ఆ రాత్రి అన్నయ్య గదిలోనే పడుకుంది వదిన. అమ్మ ఒక రెండురోజులపాటు ఉండమని చెప్పడంతో ఇక్కడనుంచే ఆఫీసుకు ఫోన్ చేసి బుధవారం డ్యూటీకి వస్తానని చెప్పాడు.

"సాయంత్రం పాపతో నువ్వు, కోడలు ఏదైనా గుడికి వెళ్ళిరండి నాన్న."అంది అమ్మ అన్నయ్యతో.

అన్నయ్య సరే అన్నాడు. నాన్నగారు ఆఫీసుకు, నేను కాలేజీకి వెళ్లిపోయాం.

మధ్యాహ్నం భోజనానికి వచ్చాను. నన్ను చూసి పడుకున్న అమ్మ లేచి అన్నం పెట్టింది.పాప ఒకటే ఏడుస్తోంది. అంతలో అన్నయ్య బయటకి వచ్చి "అమ్మా. విజయ ఏది?పాప పావుగంటనుంచి ఏడుస్తుంటే రాదేంటి?"అన్నాడు నిద్ర తీరని కళ్లతో.

అయిదు నిముషాల తర్వాత అర్ధమైంది.

వదిన మళ్లీ వెళ్ళిపోయింది అని.

(మిగతా 19 వ భాగంలో)



Rate this content
Log in

Similar telugu story from Drama