STORYMIRROR

kottapalli udayababu

Drama Classics Inspirational

4  

kottapalli udayababu

Drama Classics Inspirational

మనసు చేసిన న్యాయం - 16 వ భాగం

మనసు చేసిన న్యాయం - 16 వ భాగం

4 mins
7

మనసు చేసిన న్యాయం - 16 వ భాగం

"ఏం చేద్దామండి ఇప్పుడు?" అడిగింది అమ్మ అయోమయంగా.

" ఇదంతా చూస్తుంటే ఆ తల్లీ కూతుళ్లు ఇద్దరు వాళ్లచేతికి మట్టి అంటకుండా తమ పని తాము చేసుకుపోతున్నారు లక్ష్మి. ముందు కోడలు వాళ్ళ ఇంటికి వెళ్లిందా లేదా మరి ఎక్కడికైనా వెళ్ళిందో మనం తెలుసుకోవాలి. అందుకే నేను ఆఫీసుకి వెళ్ళిన వెంటనే అబ్బాయికి ఫోన్ చేసి విషయం చెబుతాను. అలాగే బావగారికి కూడా ఫోన్ చేసి విజయ విషయం కనుక్కుంటాను. సాయంత్రం ఏం చేయాలో ఆలోచిద్దాం. మన ఇంట్లో ఇన్నాళ్ళకు ఆడపిల్ల అడుగు పెట్టింది. కాబట్టి నువ్వు మరేమీ ఆలోచించకుండా పాప సంరక్షణ చూసుకో. ధైర్యంగా ఉండు .ఏం జరిగినా నేనున్నాను"అన్నారు నాన్నగారు.

అమ్మ సమాధానపడింది. పని ఉన్నప్పుడు పాపని నా చేతికి ఇవ్వడం, అయిపోయాక తాను పాపని చూసుకోవడం చెయ్యసాగింది అమ్మ.

నాన్నగారు ఆఫీస్ కి వెళ్ళాక ఫోన్ చేశారు. అమ్మ మాట్లాడింది.

" లక్ష్మి నేను బావగారికి ఫోన్ చేశాను. కోడలు మీఇంటికేమైనా వచ్చిందా అని?

ఆయన కంగారుగా -

'నాకు తెలియదు. నేను డ్యూటీలో ఉన్నాను. ఇంటికి ఫోన్ చేసి ఇప్పుడే కనుక్కుంటాను.' అని మళ్ళీ 5 నిమిషాలు అయినాక ఫోన్ చేశాడు.

'విజయ ఇంటికి వచ్చేసిందట. ఏమిటి? మీరు ఏమైనా అన్నారా?' అనిఅడిగాడు కంగారుగా...

నేను జరిగింది చెప్పాను. ఆయన మరేమీ మాట్లాడకుండా ఫోన్ కట్ చేశాడు.

ఇకపోతే అబ్బాయికి ఫోన్ చేశాను. వాడు

' అంటే తాను అనుకున్న పథకం ప్రకారమే చేసిందన్నమాట. అంటే ఖచ్చితంగా ఆ అమ్మాయికి ఆ లవర్ తో సంబంధం ఉంది నాన్నగారు. రెండు రోజులు సెలవు పెట్టి రాత్రికే తిరిగి వస్తాను .ఈసారి ఊరుకునే ప్రసక్తి లేదు విషయం ఏమిటో తేల్చేద్దాం" అన్నాడు అని ఫోన్ సారాంశం చెప్పింది అమ్మ.


ఆరాత్రి పదకొండు గంటలకు అన్నయ్య ఇంటికి వచ్చేసాడు.


పాపని నిద్రబోతున్నప్పుడు తన పక్కలో వేసుకుని మరీ పడుకున్నాడు.


నాన్నగారు మరునాడు ఆఫీసుకు వెళ్తూ అన్నయ్యతో అన్నారు.'


''ప్రభా..వాళ్ళు మనని ఎలాగైనా అప్రతిష్టపాలు చేద్దామనే లక్ష్యంతో ఉన్నారు. నాకు తెలిసి ఇంట్లో మీ మావగారు నిమిత్తమాత్రుడు. ఒకవేళ ఆయన ఎగరబోయినా ఆవిడకి అతన్ని ఎక్కడ నొక్కాలో తెలుసు. నేను ఆఫీసుకు వెళ్తున్నాను. వాళ్ళు వస్తే మాత్రం నాకు వెంటనే ఫోన్ చెయ్యి. నేను సెలవు పెట్టి వచ్చేస్తాను.'' అని ఆఫీసుకు వెళ్లిపోయారు.  


పాప నిద్రట్లో నవ్వుకుంటుంటే అన్నయ్య ఎంత ముచ్చటపడిపోయాడో. దాదాపు పదకొండుగంటలకు వదినతో అత్తయ్యగారు, వాళ్ళ పిన్ని వచ్చారు.


గుమ్మంలో అడుగు పెడుతూనే  '' ఏం వదినా? నిన్న పొద్దున్న నా కూతుర్ని, మనవరాలిని నీకు బాధ్యతగా అప్పగించి వెళ్ళానా? మనవరాలిని ఉంచేసుకుని తెల్లవారకుండా నా కూతుర్ని ఇంట్లోంచి గెంటేస్తారా? మీరసలు మనుషులేనా?ఏం?  నా కూతురు ఏం తప్పు చేసిందని?"


''దానికి నేను చెబుతాను సమాధానం? ఇవి చదువుకోండి.'' అని అన్నయ్య తన దగ్గర సిద్ధంగా ఉన్న మూడు ఉత్తరాలు విసురుగా వదిన ముఖం కేసి కొట్టాడు. 


వదిన అన్నయ్య కళ్ళల్లోకి చూసి తప్పుచేసిన దానిలా తలవంచుకుంది. 


అత్తయ్యగారు, ఆవిడ చెల్లెలు ఆ ఉత్తరాలు చూసి ఒక్కొక్క దానిని గబగబా చదివేసారు.


'' చూసావా ..చూసావా... చెల్లాయ్...ఈ ఉత్తరాలు ఏవో సృష్టించి నా బిడ్డ జీవితం నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారు వీళ్ళందరూ. అయిపోయింది అమ్మా..నేను అనుకున్నదంతా అయ్యింది. నీ జీవితం నాశనమైపోయిందే అమ్మా..'' అని వదిన తలను తన గుండెలకి అదుముకుని సోకన్నాలు మొదలెట్టింది అత్తయ్యగారు. 


 అన్నయ్య ఆ ఉత్తరాలు వెంటనే తీసేసుకున్నాడు.


''మీ అమ్మాయికి వాడెవడితోనో సంబంధం లేకపోతే ఎందుకు ఈ ఉత్తరాలు మాఇంటికి చేరాయి? తన తప్పేమీ లేకపోతే మీ అమ్మాయి నోరు విప్పి సమాధానం చెప్పదేమి?'' అన్నాడు అన్నయ్య ఆవేశంగా. 


''చూడు బాబు. కళ్ళెదురుగా తన జీవితం సర్వనాశనం అయిపోతుంటే ఏ ఆడపిల్ల మాత్రం మాట్లాడగలదు?''అంది అన్నయ్య పిన్నత్తగారు. 


''మీ అమ్మాయి జీవితమేనా నాశనమయ్యేది? నాజీవితం ఈ ఉత్తరాలవల్ల నాశనం అయిందంటాను.దానికి మీరేం చెబుతారు? మీ అమ్మాయి ఎవరినో ప్రేమిస్తే...ఆవిషయం దాచిపెట్టి నా జీవితం నాశనం చేశారు. అన్యోన్యంగా ఉన్న మా మధ్య లేనిపోని గొడవలు సృష్టించి గౌరవంగా బతుకుతున్న మమ్మల్ని వీధిలోకి లాగుతున్నది మీరు. పదండి మేమంతా మీ ఇంటికి వస్తాం. ఈవిషయాలన్నీ అక్కడే తేల్చుకుందాం.'' అన్నాడు అన్నయ్య ఆవేశంగా. 


ఇంతలో ఎలా వచ్చారో నాన్నగారు ఇంట్లో అడుగుపెట్టారు.


''ఏం అన్నయ్యా ? నిన్నవచ్చి నా కూతుర్ని కాపురానికి పంపించి వెళ్లానే .  తెల్లవారకుండా మనవరాలిని ఉంచేసుకుని నా కూతుర్ని ఇంట్లోంచి గెంటేస్తావా?'' 


''ఏమ్మా..విజయా...మేము వెళ్లిపొమ్మంటే నువ్వు వెళ్లిపోయావా...నీ అంతట నువ్వే వెళ్లిపోయావా?''నాన్నగారు అడిగారు.


వదిన ఒక్క మాట మాట్లాడలేదు. అలా శిలలా తల వంచుకునే నిలబడింది. 


''నాన్నగారు. మనం మనం దెబ్బలాడుకోవడం వల్ల ఈ సమస్యకు పరిష్కారం దొరకదు నాన్నగారు. పెళ్ళికాకముందు ఎవడితోనో సంబంధం ఉన్న ఆ అమ్మాయి నాకు అక్కర్లేదు.ఇది నా నిర్ణయం. నాదగ్గర ఈ మూడు ఉత్తరాలేకాదు..నన్ను బెదిరిస్తూ వచ్చిన ఉత్తరాలు ఎన్నో ఉన్నాయి. మీ అమ్మాయితో నేను కాపురం చేయను. మీరు మీ అమ్మాయిని తీసుకుపోవచ్చు.'' అనేశాడు అన్నయ్య.


అమ్మ అన్నయ్యను వెనక్కు లాగుతూ అంది.'' ఒరేయ్ ..తొందరపడకురా నాన్నా..నా మాట విను,'' 


''అలాంటి ఉత్తరాలు వంద సృష్టించి నేను నీమీద కోర్టులో కేసు వేస్తాను. నా బిడ్డ జీవితం నాశనం చేసిన నీ అంతు చూస్తాను. నాకూతురు అమాయకురాలు కావచ్చు. ఈ నాగమణి సంగతి నీకు తెలీదు. నా పిల్ల ఒంటిమీద బంగారం దోచేసుకుని, దానికి వాతలు పెట్టి ఇంట్లోంచి గెంటేసినందుకు మీ కుటుంబంలో ఏ ఒక్కరిని వదలను. పద విజయా..పద.'' కోపంతో ఊగిపోతూ అంది అత్తయ్యగారు. 


''ఒకసారి అసలు ఏం జరిగిందో పూర్తిగా వినవే ....ఆవేశపడకు అక్కయ్యా...తెంచుకోవడానికి క్షణం పట్టదు..ముందు వందేళ్ల జీవితం ఉంది... ఆలోచించవే. వదినా మీరు చెప్పండి...అసలు ఏంజరిగింది?''.'' అడిగింది వదిన పిన్నిగారు. 


అమ్మ నిన్న వాళ్ళు వెళ్లిపోయాకా ఉదయం వదిన వెళ్ళిపోయినంతవరకు అన్నీ వివరంగా చెప్పింది.


''చూసావా? వాళ్ళు ఏమీ అనలేదట....నా కూతురు నిద్రలోనడిచినట్లు పొద్దున్నే లేచి రైలెక్కి విజయవాడ వచ్చేసిందట. ఇదేమైనా నమ్మశక్యంగా ఉందా? ఇంకా ఎవరికి చెబుతారే కధలు? లే..పదండి.. వీళ్ళ సంగతి కోర్టులో తేల్చుకుంటాను.'' అంది అత్తయ్యగారు. 


చిన్నత్తయ్యగారు ఏమీ చెయ్యలేక ''పదమ్మా విజయా..'' అంది కన్నీళ్లతో...


''వదినా తప్పు చేస్తున్నావ్...ఒక్క తప్పు లేకపోయినా మా ఇంటికి వచ్చి మమ్మల్ని అల్లరిపెడుతున్నావ్.. పిల్లల బంగారంలాంటి భవిష్యత్తు నాశనం చేస్తున్నావ్, నీ కూతుర్ని తీసుకెళ్తే సరిపోతుందా? నీ మనవరాలిని కూడా తీసుకెళ్ళు.ఉండు తీసుకొస్తాను ''అని అమ్మ కదలబోయింది.


''అది మీ ఇంటిపిల్ల. ఇష్టమైతే పెంచుకో..లేకపోతే పెంటకుప్పమీద పడేసుకో. ఆ పిల్ల మాకు అక్కర్లేదు. నా కూతురి జీవితం నాకు ముఖ్యం . పద విజయా..'' అంది అత్తయ్యగారు.


'' అమ్మ..విజయా...అది..పాలుతాగే పసిగుడ్డు...అభం శుభం తెలియని ఆడపిల్ల. పుట్టి మూడు నెలలు కాలేదు. దానికి భవిష్యత్తే లేకుండా చెయ్యొద్దు...నీ కాళ్ళు పట్టుకుంటాను వదినా..ప్లీజ్...'' అని అమ్మ అత్తయ్యగారి కాళ్ళ మీద పడబోయింది. 


''అమ్మ...నీకు మతి పోయిందా..మన పిల్లని మనం పెంచుకోగలం . బిడ్డ ఉండీ గొడ్రాలుగా బతికే ఖర్మ దాని ముఖాన రాసిపెట్టి ఉంటే మనం ఏంచెయ్యగలం? వాళ్ళని వెంటనే ఇక్కడనుంచి వెళ్ళమను.'' అని అరిచాడు అన్నయ్య.


''హు. చెబుతాను మీ పని...మీ అంతు చూడకపోతే నా పేరు నాగమణి కాదు.'' అని తలవంచుకున్న వదినను తీసుకుని కళ్ళనీళ్లు తుడుచుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళు.


కేవలం ఒక్క గంటలోపు సమయంలో అంతా జరిగిపోయింది.


అందరమూ ఎవరికీ వాళ్ళం కొయ్యబొమ్మల్లా ఉండిపోయాము.


(మిగతా 17 వ భాగంలో)  


       


          



Rate this content
Log in

Similar telugu story from Drama