Varun Ravalakollu

Comedy Romance

4.8  

Varun Ravalakollu

Comedy Romance

#మీటూ ముద్దు

#మీటూ ముద్దు

8 mins
850


సౌమ్య మోహంతో దగ్గరికి వచ్చి విరాట్ తల పట్టుకొని ముద్దివ్వబోయింది.


విరాట్ అంతరాత్మ ప్రమాదాన్ని శంకించింది. “ఆగు..” అన్నాడు.


ఏం అన్నట్లుగా చూసింది ఆమె.


“ఎందుకయినా మంచిది నీనుండి అనుమతి పత్రం కావాలి”


“జస్ట్ ముద్దేలే”


“అయినా సరే. మీటూ ఉద్యమం ఎంత ఉధృతంగా వుందో తెలుసు కదా? ఒకరిమీద ఒకరికి నమ్మకాలు బాగా తగ్గాయి. ఎన్ని కేసులు చూడటం లేదు. రేపు నువ్వే నేను రేప్ చేసానని అన్నావనుకో ఈ సమాజమూ, స్నేహితులూ, పోలీసులూ, చట్టం అన్నీ నీ వైపే వుంటాయి. నేను కేవలం ముద్దే ఇచ్చా మొర్రో అంటే ఎవరూ వినిపించుకోరు. నేను కూడా ముద్దుకు మాత్రమే సిద్ధంగా వున్నా. అంతకుమించి ముందుకు వెళ్ళడం వల్ల చాలా లీగల్ కాంప్లికేషన్స్ వున్నాయి”


“అవును, బయట అంతా ఎలా వుందో తెలుసు. అందుకే నేను కూడా కేవలం ముద్దు ఇవ్వాలనే ముందుకు వచ్చా”


“అది అయినా సరే ముందుగా నీ అనుమతి పత్రం కావాలి. రెండు నిమిషాల పని. వ్రాసివ్వు. వెంటనే ఎంచక్కా ముద్దెట్టుకుందాం”


“అబ్బా..., ఒక్కటే ఒక్క ముద్దు, కానిచ్చేద్దాం” అంది ఆమె అసహనంగా.


“అనుమతి పత్రం లేకుండా ముద్దు ఇచ్చేప్పుడు కానీ ఇచ్చాక కానీ నేను ఆనందించగలనా చెప్పు. నాకు గాభరాగా వుంటుంది. అది నువ్వు అర్ధం చేసుకోవాలి”


“సరే మహాశయా. పెన్నూ, పేపర్ ఇటివ్వు” అంది వెనక్కు తగ్గుతూ.


“అవునూ..., దానికంటేనూ వీడియోలో నువ్వు అనుమతిస్తూ చెబితే మంచిదేమో? రేప్పొద్దున ఇది నువ్వు ఫోర్జరీ అన్నా అనగలవు”


ఆమె దానికి తేలిగ్గానే అంగీకరించింది. “ఇప్పుడు అదంతా వివరంగా వ్రాయడం కన్నా వీడియోలో మాట్లాడటమే మంచిది. అలా కానిచ్చేద్దాం. అలా ఎంత వివరంగా అయినా మాట్లాడొచ్చు”


విరాట్ తన ఫోన్ కెమెరా సిద్ధం చేసాడు.


“ఏం చెప్పాలి ఇప్పుడు నేను?” తన ముంగురులు వెనక్కి అనుకుంటూ అడిగింది. పక్కనే వున్న అద్దంలో తన మేకప్ చూసుకుని, “నా మేకప్ సరిగా లేదు” అంది.


“జస్ట్ నీ అనుమతి చదవడం కోసమే కదా. ఫర్వాలేదులే”


“అబ్బే. ఏదయినా కావొచ్చు కానీ మేకప్ సరిగా లేకుండా ఎలా వీడియోలో కనపడేదీ? ఒక అయిదు నిమిషాల సమయం ఇవ్వు. రెడీ అవుతాను”


ఆడవాళ్ళు మేకప్ కోసం అయిదు నిమిషాలు అన్నా అరగంట అయినా అవుతుందని అతనికి తెలియనిది కాదు. చేసేదేమీ లేక సరే అన్నాడు. తన హ్యాండుబ్యాగులో నుండి మేకప్ సామాగ్రి తీసి ఒక ఇరవై నిమిషాల్లో ఆ పని ముగించి, “ఎలా వుంది?” అని అడిగింది.


“సూపర్. అసలు నిన్ను చూస్తుంటే ఇప్పటికిప్పుడు ముద్దెట్టుకోవాలనిపిస్తోంది కానీ... ఫార్మాలిటీస్ తప్పవు కదా”


“పోనీ పెట్టేసుకో మరి. నామీద నమ్మకం లేదా?”


“నీ మీద బోలెడంత నమ్మకం - అయినా సరే జాగ్రత్త విషయంలో ఏమరపు వుండరాదు కదా”


“సరే, సరే. ఆ పనేదో తొందరగా కానిద్దాం మరి”


అతను ఫోనులో కెమెరా ఆన్ చేసి పట్టుకున్నాడు. ఆమె ముంగురులు సవరించుకుంటూ, “రెడీ” అంది. అతను రికార్డింగ్ మొదలెట్టాడు.


ఆమె మాట్లాడనారంభించింది. “ఇందుమూలంగా సమస్త ప్రజలకు తెలియజేయునది ఏమనగా విరాట్ నన్ను ముద్దు పెట్టుకొవడానికి నేను నా సమ్మతిని తెలియజేస్తున్నాను” పూర్తి చేసి, “ఓకేనా?” అని అడిగింది.


అతను వీడియో ప్లే చేసి చూసి, “ఇందులో నువ్వు నీ పేరు చెప్పలేదు” అన్నాడు.


“ఒహ్. అయినా ఏముందిలే. నేనే కదా అందులో వున్నది”


“అయినా సరే. అలా పేరు చెప్పకుండా ఇది కోర్టులో నిలబడదు”


“ఓహ్. అవునా. నాకు ఏం చెప్పాలో తెలియదు కనుకనే నిన్ను ఇందాకే అడిగా” అంది కాస్త చిరాగ్గా.


“ఓహ్, సారీ... మళ్ళీ చెప్పు” అని కెమెరా ఆన్ చేసాడు.


ఆమె తన పేరుతో సహా మళ్ళీ చెప్పింది. అతను అది ప్లే చేసి చూసి, “ఇలా చెబితే చాలు అంటావా లేక తేదీ, సమయం కూడా చెప్పాలా?” అన్నాడు.


ఆమె భుజాలు ఎగరేసింది.


“ఒకసారి నెట్టులో చూద్దాం” అని ఇంటర్నెట్టులో ఆ ప్రశ్నకి జవాబు వెతికాడు. ఒక్కొక్కరి నుండి ఒక్కో రకమయిన సమాధానాలు వున్నాయి అక్కడ. ఆమె వైపు తిరిగి చూసి, “సరి అయిన సమాధానం దొరకట్లేదు” అన్నాడు.


“ఓహ్” అంది ఆమె సింపుల్గా.


“ఒక పని చేస్తా వుండు. మా ఫ్యామిలి లాయర్ ని కనుక్కుంటా” అని అతనికి ఫోన్ చేసి పరిస్థితి వివరించాడు. “మా లాయర్ ఇది చిన్న విషయం కాదనీ, తన ఆఫీసుకి రమ్మని చెప్పాడు” అని అన్నాడు ఆమెతో.


ఆమె ముఖం చిట్లించింది. “ఏంటీ ఇప్పుడు మనం మీ లాయరు దగ్గరకి వెళ్ళాలా?”


“తప్పదు కదా. అతను లక్కీగా ఫ్రీగానే వున్నాట్ట. పది నిమిషాల్లో పని పూర్తి అవుతుందని అన్నాడు”


“సరే పద” అంది విసుగ్గా.


ఇద్దరూ కారులో వెళ్ళారు లాయర్ శశాంక్ దగ్గరికి. అతని గదిలోకి వెళ్ళగానే, “ఇద్దరూ వచ్చారా. అరెరే, ఒక్కరే నువ్వు ఒక్కడివే రావాల్సివుండే” అన్నాడు శశాంక్. ఎందుకో అర్ధం కాలేదు విరాట్ కి. “మీ ఇద్దరూ నా దగ్గరే సర్వీసెస్ తీసుకుంటే ‘కాన్ ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెస్ట్’ అవుతుంది. అందువల్ల తను వేరే లాయర్ని చూసుకోవాల్సి వుంటుంది”


“ఓహ్, అలాగా. ఇప్పటికిప్పుడు వేరే లాయర్ అంటే కష్టం కదా” అన్నాడు విరాట్.


“ప్రాబ్లెమ్ ఏముందీ? ఎదురుగానే గిరి అండ్ గిరి ఫర్మ్ వుంది కదా. నా ఫ్రెండుదే. నేను చెబుతానులే. కాస్త తక్కువకే చేస్తాడు”


సౌమకి ఇదంతా విసుగ్గా అనిపించింది. “ఇదంతా అవసరమా విరాట్? ఇప్పుడు నాకు లాయర్ అంటే డబ్బు పెట్టాలి కదా?”


“ఎంత డబ్బు ఖర్చు అయినా నేను చూసుకుంటాను. మనం ఎలాగయినా సరే ఇవాళ ముద్దు పెట్టుకోబోతున్నాము. నాది గ్యారంటీ” ఖర్చు తను పెట్టుకుంటానంటే ఇక ఇబ్బందేముందిలే అని సౌమ తల ఊపింది.


“కంగారేమీ లేదు. ఈరోజు ఎలాగయినా సరే మీ ముద్దు పూర్తి అవుతుంది” అని శశాంక్ హామీ ఇచ్చాడు. చిన్న నోట్ వ్రాసి సౌమకి ఇచ్చి, “ఇది ఆ ఫర్మ్ లో ఇవ్వండి” అన్నాడు. ఆమె వెళ్ళాక విరాట్ ని కూర్చోమన్నాడు. “నా దగ్గరికి వచ్చి మంచి పని చేసారు. మీలాంటి జాగ్రత్త అందరికీ వుంటే ఎంత బావుండును. యువతలో ఇంత నిర్లక్ష్యం ఎందుకో అర్ధం కాదు. అందుకే అన్ని కేసులు ఎదుర్కొంటున్నారు”


విరాట్ తల ఊపాడు.


“ఇప్పుడు పూర్తి వివరాలు చెప్పండి. ఎలాంటి ముద్దు, ఎంత సేపు పెట్టుకోబోతున్నారు వగైరా...”


ఈ ప్రశ్నకి విరాట్ సిద్ధంగా లేడు. “ముద్దంటే… ముద్దే. సింపుల్ ముద్దు అంతే”


“అలా కాదు. మేము ఇక్కడ సిద్ధం చేయబోయేది లీగల్ డాక్యుమెంట్ కాబట్టి అన్నీ ఖచ్చితంగా వుండాలి”


“ముద్దు అంటూ మొదలెట్టాకా అది ఎలా కొనసాగుతుందో ఎలా ముగుస్తుందో చెప్పలేము కదా”


“అలా కాదు. మీరు ముద్దు పెట్టుకునే ముందు మీకు ఆ విషయాల మీద పూర్తి ఐడియా వుండాలి. ఎందుకంటే ప్రతి నిమిషం మీరు ఏం చేస్తారు అందులో అన్నది ఆ డాక్యుమెంట్లో పొందుపరుస్తాము. దానిని అవతలి పార్టీ ఆమోదిస్తుంది. అటుపై మీరిద్దరూ ఖచ్చితంగా అలాగే ముద్దెట్టుకోవాల్సి వుంటుంది”


“ఓహ్. ఈ విషయంలో నాకు అంత అనుభవం లేదు. నిజం చెప్పాలీ అంటే నాకు ఇది మొదటి ముద్దు”


“సినిమాలల్లో, వీడియోలలో చాలా సార్లు చూసారు కదా. గుర్తుకు తెచ్చుకోండి”


“చూసాను కానీ మరీ అంత పరిశీలనగా చూడలేదే? ఎలా మరి?”


“ఒక పని చేద్దాం. నాకు బాగానే అనుభవం వుంది. నేను ఆ స్పెసిఫిక్స్ వ్రాస్తాను. మీరు అవి ఫాలో కండి”


“రక్షించారు. థాంక్స్” రిలీఫ్ చెందాడు విరాట్.


“నేను డ్రాఫ్ట్ తయారు చేసి వాళ్లకి పంపిస్తా, వాళ్ళ డ్రాఫ్ట్ మనకు పంపుతారు. రెండింటిలో కామన్ గా వున్నవాటిని కలిపి అగ్రిమెంట్ చేస్తాం. దానిమీద మీరు ఇద్దరూ ప్రమాణ పూర్తిగా సంతకం చెయ్యల్సి వుంటుంది. చెరొకరికి రెండు సాక్షి సంతకాలు కావాలి. తీసుకువచ్చారా?”


“అబ్బే లేదండీ. సాక్షుల అవసరం వుంటుందని అనుకోలేదు. ఇప్పుడెలా?”


“ఫర్వాలేదు లెండి. వాళ్ళని మేము ఎరేంజ్ చేస్తాము కానీ దానికి కొంత ఖర్చు అవుతుంది. నాకు తెలుసు - ఎంత ఖర్చు అయినా సరే మీకు ముద్దు కావాలి ఇవాళ”


“అవునవును”


“అవతల పార్టీ నుండి డ్రాఫ్ట్ వచ్చింది. అమ్మాయి తరఫున కదా, గిరి కాస్త స్ట్రిక్ట్ గానే తయారుచేసాడు”


“ఓహ్, అలాగా. ఏముందేంటీ?” ఆసక్తిగా ముందుకు వంగుతూ అడిగాడు.


“ఫ్రెంచ్ కిస్ కి ఆమె ఒప్పుకోవడం లేదు. పెదవులు కానీ, నాలుక కానీ కొరక కూడదు. రక్తం కనుక ఏమాత్రం వచ్చినా నష్టపరిహారం చెల్లించాల్సివుంటుంది. మూడు నిమిషాల వ్యవధి కంటే ఎక్కువ వుండకూడదు. తల తప్ప ఇతర అవయవాలేవీ మీరు తాక కూడదు”


“ఓహ్!”


“అవును, వాటన్నింటినీ మనం అంగీకరించక తప్పదు. మీరు ఆవేశంలో ఆమెను కొరికెయ్యకుండా జాగ్రత్త పడండి. అసలు అయితే ముద్దు ఇచ్చీ ఇవ్వనట్లుగా అలా పైపైన సుతారంగా కనుక మీరు ఇచ్చినట్లయితే కనుక ఏ ఇబ్బందీ వుండదు. అలా కాకుండా మీరు ఎంత లోతుకి వెళితే అంత కాంప్లికేషన్స్ వుంటాయి. అది మీరు గుర్తుపెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. మీ లాయరుగా ఈ జాగ్రత్తలు చెప్పడం నా విధి”


“థాంక్ యూ. మీ సూచనలని తప్పకుండా గుర్తుంచుకుంటాను. ఇంకా రిస్కులేమన్నా వున్నాయా?”


“మీరు ఏదన్నా కొరికేసినా లేక ఇంకెక్కడన్నా తాకేసినా వాళ్ళు మీమీద రేప్ కేస్ పెట్టే అవకాశం వుంటుంది. జాగ్రత్తగా వుండండి. గట్టిగా చుంబించకండి - అందువల్ల ఆమె పెదవులు చిట్లే అవకాశం వుంది. అందుకే అగ్రిమెంటులో మీరు సుతారంగా ముద్దెడతారనే వ్రాసాను. జస్ట్ ఆమె పెదవులని చప్పరించి వదిలెయ్యండి. అన్నట్లు మీరు పూర్తిగా ఆరోగ్యంగా వున్నట్లు హామీ కూడా ఇందులో ఇస్తున్నాను. ఆమెకు ఏదయినా అంటువ్యాదులు వస్తే మీరు నష్టపరిహారం చెల్లించాల్సివుంటుంది”


“ఒహ్. మరి నాకు అంటువ్యాదులు వస్తేనో?”


“సున్నా. మీకు తెలియనిది ఎముందీ..., చట్టం ఆడవాళ్లకే చుట్టం కదా. ఆ రిస్క్ మీరు తీసుకోవాల్సివుంటుంది. మీరు వాళ్ల మీద ఎలాంటి కేసూ వెయ్యడానికి కుదరదు. అసలు ఆమె మీతో ముద్దుకి సిద్ధపడటమే చాలా ఎక్కువ - అందుకు వాళ్లకి మీరు రుణపడివుండాలన్నమాట. అలా కాకుండా మీరు వాళ్ళ మీద కేసులు వేస్తే అది మానసిక హింసలా కోర్టు తీసుకుంటుంది. అందుకని అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోకండి. నాకు తెలుసు - ఇవన్నీ చేదు నిజాలు కానీ మగవాళ్ళంగా ఇలాంటివి తట్టుకొని నిలబడక తప్పదు”


“హ్మ్, ఏంటో ఇదంతా” నిట్టూర్చాడు విరాట్.


“మన పాత తరం వరకూ ఇలాంటి ఇబ్బందులు లేకుండా అందరూ హాయిగా ఆనందించేవాళ్లు. నాగరికత పెరుగుతున్న కొద్దీ జీవితంలో సంక్లిష్టత ఎక్కువై పోతోంది” నిర్లిప్తంగా అన్నాడు ఆ లాయర్. “ఈ కాలానికి తగ్గట్టు ఇవన్నీ చేయక తప్పదు”


“దీనికి ఏం పరిష్కారం లేదా?”


“ఎందుకు లేదూ. రోబో గర్ల్ ఫ్రెండ్ ని కొనుక్కోవడమే”


“కానీ అదంతా యాంత్రికంగా వుంటుంది కదా. ఎంతయినా లైవ్ ఫీలింగ్ అందులో రాదు కదా?”


“నిజమే. అంత ఫీల్ వుండదు కానీ జీరో రిస్క్”


విరాట్ ఏమీ మాట్లాడలేదు.


ఈ కుర్రాడికి ఇప్పుడు ఇలాంటివి చెబితే తలకు ఎక్కవు అనుకొని శశాంక్ కూడా ఇక రెట్టించలేదు. కొన్ని అనుభవాలు జరిగితే కానీ అప్పుడు ప్రత్యామ్నాయాల ప్రాధాన్యత తెలుస్తుంది అనుకున్నాడు. అతని అసిస్టెంట్ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకొని వచ్చాడు. “నా అఫీసులో స్టాఫ్ అంతా మగవాళ్ళే గమనించారా?”


“లేదు కానీ ఎందుకు అలా?”


“ఎందుకండీ.., అమ్మాయిలని ఉద్యోగంలో పెట్టుకొని అనవసరమయిన రిస్క్? ప్రాణానికి ఇలాగే హాయిగా వుంది”


“ముందు ముందు మగవాళ్ళూ మగవాళ్ళ మీద కేసులు వేస్తారేమో?”


“అవును. అదీ ఎంతో దూరంలో లేదు. అప్పుడు ఇక రోబోట్స్ నే గతి” అని అన్నాడు ఆ లాయర్ విచారంగా.


విరాట్ ఏమీ మాట్లాడలేదు.


“ఇదిగోండి, ఇక్కడ సంతకం చేయండి” అని పేపర్లు ముందుకు తోసాడు. విరాట్ నిశ్శబ్దంగా చెప్పిన చోటల్లా సంతకాలు చేసాడు. మొత్తం పదకొండు చోట్ల సంతకాలు. “ఇక వెళ్ళి హాయిగా ముద్దెట్టుకోండి కానీ జాగ్రత్తలు గుర్తు పెట్టుకోండి” చిరునవ్వుతో చెప్పాడు లాయర్.


విరాట్ కూడా నవ్వుతూ లేచి నిలబడ్డాడు. ఒకవైపు సంతోషం మరోవైపు ఆందోళనా మనస్సుని కమ్మేసాయి. అతను ఒకటి గమనించాడు - తొలిసారి ముద్దు కోసం ఎదురుచూస్తున్న ఎగ్జయిట్మెంట్ అతనిలో లేదు ఇప్పుడు. మనస్సులో ఆ ముద్దుకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మననం చేసుకోసాగాడు. అతనికి ఇదంతా ఒక పరీక్షలా అనిపిస్తోంది. ఒక సైంటిస్ట్ ప్రయోగానికి సిద్ధప్డుతున్నట్లుగా అనిపిస్తోంది అంతే కానీ ఒక అమ్మాయికి ముద్దు ఇవ్వబోతున్నట్లుగా లేదు.


విరాట్ వెళ్ళబోతుండగా లాయర్ చెప్పాడు, “మీరు కావాలంటే ఇంకో జాగ్రత్త కూడా తీసుకోవొచ్చు. మీరు ఇద్దరు ముద్దు తీసుకుంటున్నప్పుడు లాయర్లం మేము కూడా సాక్షులుగా వుంటే ఇంకా బావుంటుంది. ఇది మీకు ఓకే అయితే ఆ లాయర్ని కూడా ఇక్కడికే పిలిపిస్తాను. ఆ పనేదో మీరు ఇక్కడే పూర్తి చేయవచ్చును కదా?”


అతనికి కూడా ఇది మంచి ఆలోచన అనిపించింది. తాను ఏదయినా పొరపాట్లు చేస్తుంటే కనుక ఈ లాయర్ తనని హెచ్చరిస్తాడు.


“అలాగే”


సౌమ యొక్క లాయరుకి శశాంక్ ఫోన్ చేసి విషయం చెప్పి ఇద్దరినీ తన ఆఫీసుకి రమ్మన్నాడు. కొద్ది నిమిషాల తరువాత సౌమ, ఆమె లాయర్ గిరీ అక్కడికి వచ్చారు. సౌమని విరాట్ కాస్త పక్కకి తీసుకెళ్ళి వివరాలు, ఏర్పాట్లు చెప్పాడు. ఆమె నిర్లిప్తంగా విని తల ఊపింది. ఆమెలో కూడా ఆలోచన తప్ప ఎగ్జయిట్మెంట్ లేకపోవడం గమనించాడు విరాట్.


“మనం ఈ కార్యక్రమం అంతా వీడియో తీస్తే ఇంకా మంచిది కదా” అని గిరి సలహా ఇచ్చాడు. అందరూ అంగీకరించారు. గిరి కెమెరా ఆన్ చేసాడు. అందరూ ఎవరి స్థలాలలో వారు నిలబడ్డారు.


“నేను త్రీ, టు, వన్ అని కౌంట్ డౌన్ చేస్తాను. స్టాప్ వాచ్ కూడా మొదలు పెడతాను. సరిగా మూడు నిమిషాలకు అది మోగుతుంది. వెంటనే మీరు విడిపోవాలి” అని సూచనలు ఇచాడు శశాంక్. తల ఊపారు ఆ ఇద్దరూ.


“త్రీ...టు...వన్..”


“స్టాప్ దిస్ నాన్సెన్స్” అని విరాట్ ముఖాన్ని వెనక్కి తోసేసింది సౌమ. విరాట్ వెనక్కు తగ్గుతూ నిర్ఘాంతపోయాడు. ఆ ఇద్దరు లాయర్లు కూడా అవాక్కయ్యారు. “ఒక బంధంలో నమ్మకం అనేది ముఖ్యం. ఇంత జాగ్రత్తపరుడి స్నేహంతో నేనేం ఆనందపడగలను?” అని ఆమె తన డాక్యుమెంట్లు అన్నీ చించేసి విరాట్ మీద పోసి విసవిసా నడుచుకుంటూ బయటకి వెళ్ళింది.


విరాట్ ఒక క్షణం ఆలోచించి తన డాక్యుమెంట్స్ చెత్తబుట్టలో విసిరేసి బయటకి పరుగెత్తాడు. “ఆగు సౌమా, ఆగు. నువ్వు చెప్పింది నిజమే. నాదే పొరపాటు. మన్నించు” అని చెప్పాడు.


ఆమె విసురుగా వెళ్ళి కారులో కూర్చుంది. ఇతనూ కారులోకి వెళ్ళి ఇంకా ఏమీ ఆలోచించకుండా ఆమెను దగ్గరికి తీసుకుని గాఢంగా చుంబించి ఆమె కింది పెదవిని మునిపంటితో కొరికేసాడు. స్వల్పంగా కారిన ఆమె రక్తాన్ని తనివితీరా జుర్రుకున్నాడు. ఆమె కూడా ఇక తగ్గలేదు. ఆమె చేతులు అతనిలో ఎక్కడెక్కడో పరిశోధించసాగాయి. అతను కూడా అవేశంగా ఆమె అన్ని అవయవాల మీదా దాడిచెయ్యసాగాడు. వాళ్లకు మరింత ఏకాంతం ఇవ్వడం కోసమా అన్నట్లుగా సూర్యుడు గాఢమయిన మబ్బుల చాటుకి వెళ్ళిపోయాడు.


ఆ ఇద్దరు లాయర్లు బయటకి ఉరికి వచ్చి ఈ సంఘటణను గమనించసాగారు. “ఎందుకయినా మంచిది ఇది వీడియో తీద్దునా?” గిరి అడిగాడు.


“ఇక వాళ్ళకు కావాల్సింది వీడియో ఎవిడెన్స్ కాదు - పక్కా ప్రైవసీ! పద ఇక లోపలికి వెళదాం” అని సంతృప్తిగా తల పంకించి గిరిని తీసుకొని లోపలికి వెళ్ళాడు శశాంక్.


సన్నగా వాన ఝల్లు మొదలయ్యింది. పైరగాలి వీచసాగింది. ఆ గాలీ, ఆ వర్షపు విసురూ, తడిచిన నేల వాసనా ఆ కారు అద్దాలలోంచి వస్తూ వుండగా అతని ప్రేమావేశంలో ఆమె తడిచి ముద్దయ్యి ఎలాంటి సంకోచాలు లేకుండా తన సర్వస్వాన్ని అతనికి అప్పగించసాగింది. తమ చుట్టూ వున్న ప్రపంచాన్ని మరిచి ఆ ప్రకృతిలో పరశించసాగారు వాళ్ళు. వాళ్ళకి మరింత ప్రైవసీ కలిగిస్తూ వాన జోరుగా కురవడం మొదలెట్టింది. ఆమె తన కుడి చేతితో చేస్తున్న పనికి స్వల్ప విరామం ఇచ్చి కారు అద్దం మొత్తం పైకి లేపేసింది.


Everything is fair in love and war.


***



Rate this content
Log in

Similar telugu story from Comedy