Varun Ravalakollu

Comedy

4.6  

Varun Ravalakollu

Comedy

మా టీవీ

మా టీవీ

6 mins
453


సురక్షితప్రాంతం అయిన ఈ మంచం క్రింద దాక్కున్నాం భయంతో. ఏ ముప్పు చీపురు రూపంలోనో, అట్లకర్ర రూపంలోనో ఎటు పక్క నుండి ముంచుకొస్తుందోనని బిక్కుబిక్కుమంటున్నాం. మేము ఏడుస్తున్నాం. చెమటలు పడుతున్నాయి. ఓ పక్క కంగారుగా ఉంది. ఏం జరిగిందో తెలియాలంటే మా ఎక్స్పరిమెంట్ వన్ గురించి తెలియాలి మీకు.

ఎక్స్పరిమెంట్ నెంబర్ : 1

ఎయిమ్ : టీవీ కొనాలి

ఆపరేటర్స్ : నేను, అక్క.

ప్రోసెస్ : మరికాసేపట్లో మొదలవబోతుంది.

టెక్నీషియన్ : అమ్మ

రిజల్ట్ : అప్పుడే చెప్పలేం.

“కొత్తగా కలర్ టీవీ కొన్నారట పక్కింటి కవితగారు, పొద్దున్న నుండీ పదిసార్లు చూపించింది. ఆవిడ బడాయి చూడండి” అంటూ పెనివిటిని సతాయిస్తుంది సత్యవతి.

“నేను చూడను..., దయచేసి నువ్వు కూడా అటుపక్క చూడకు. ఆవిడ నచ్చకపోతే చెప్పు..., వేరే ఇల్లు మారిపోదాం” అన్నాడు దుర్గారావు చమత్కారంగా.

“అంతేకాని మనమూ కలర్ టీవీ కొందాం అని మాత్రం అనరు” విసుక్కుంటూ లోపలికి పోయింది వాళ్ళావిడ.

ఆ సత్యవతి మా అమ్మ.

ఆ దుర్గారావు మా నాన్న.

నా పేరు చివర్లో చెప్తాను.

“పోన్లే నాన్న..., అమ్మ కోసం మనమూ కలర్ టీవీ కొనుక్కుందాం” అని పట్టెమంచం పై వాలిన నాన్నను పట్టుబట్టి అడిగింది అక్క.

“టీవీ ఉంటే మీ చదువు ఎలా సాగుతుంది?” అన్న నాన్న మాటకు, “వంక లేనివాడు డొంక పట్టుకున్నట్లు, కొనడం ఇష్టం లేకపోతే మానేయండి. అంతేకాని మా చదువులని అనకండి” అని బదులిచ్చింది అక్క.

“మా పెళ్లి నాటి ఈ బ్లాక్ అండ్ వైట్ టీవీ చాలదా మనకు?”

“అయ్యో నాన్నా..., అప్పటి టీవీ! సినిమాలో బొమ్మ కన్నా చుక్కలే బాగా కనిపిస్తాయి. సౌండ్ కూడా వినపడటం లేదు. ఎంత ఇస్తావ్ ఈ టీవీకి అని పొగరుగా అమ్మ అంటే, అరకిలో ఉల్లిపాయలు కూడా ఇవ్వను అని ఇంకా పొగరుగా అన్నాడట ఆ పాత సామాన్లవాడు. చెప్పండి నాన్న..., మనం కొనుక్కుందామా?” అని బాగానే మాట్లాడుతుంది అక్క.

నిన్న రాత్రి వంట గదిలో అమ్మ, నేను, అక్క... ముగ్గురం ఇలా అడుగుదాం అని ముందే అనుకున్నాం. ఎక్కువ మాటలు అక్కకు ఉన్నాయి మరి.

“డబ్బుల్లేవు బంగారం. ఇప్పట్లో అలాంటిది కొనేంత స్తోమత మనకు లేదు. బాగా ఖరీదు కూడా ఉంటుంది” అన్నాడు నాన్న.

“హయ్యో..., లేదటండీ ఇన్స్టాల్మెంట్ లో నెలకు అయిదు వందల రూపాయలు చొప్పున రెండు సంవత్సరాలు కడితే సరిపోతుందట. తీసుకున్నప్పుడు మాత్రం అయిదు వేలు కట్టాలి అంట. నేను కనుక్కున్నాను” అంటూ వంట మధ్యలో ఆపేసి వంటగది నుండి వస్తూ అంది అమ్మ.

“నువ్వంతా వింటున్నావేంటే సూర్యకాంతం” అని కాస్త ఆలోచించి నిలకడగా ఉన్న నాన్న నిర్మలంగా ఉన్న మా వైపు చూసి హఠాత్తుగా, “ఆహా..., మీరెంతన్నా నా దగ్గర ఇప్పుడు అంత డబ్బు లేదు” అని గసురుతూ లోపలికి వెళ్ళిపోయాడు.

టైర్ లో గాలి తీసేసినట్టు చల్లారిపోయాం నేను, అక్క.

అమ్మ మాత్రం ప్లాన్ బి ఆలోచిస్తుంది.

రాత్రి తినే సమయం అయ్యింది. అమ్మ నాన్నకు అన్నం వడ్డించింది.

“అన్నం ఏంటి ఇంత వేడిగా ఉంది?”

‘అన్నం మాత్రమేనా... అమ్మ కూడా ఉంది’ అనుకున్నా.

“హుమ్.... పిల్లలకు పెట్టావా?”

“వాళ్ళు కొత్త టీవీ వచ్చేవరకూ తినరట” అని నాన్న మాటకు బదులిచ్చింది అమ్మ.

“ఏంటీ..., ఖాళీ కడుపుతో పడుకున్నారా? నువ్వే వాళ్ళను అలా తయారు చేశావ్. సరే కొందాంలే. ఓ రెండు రోజులు ఆగండి”

ఆ మాట వినగానే అమ్మ ఆనందం మేము చూడలేదు.

“బంగారం... బుజ్జి” అంటూ పడుకున్నట్లు నటిస్తున్న మా దగ్గరకు వస్తున్నాడు నాన్న.

దుప్పట్లోనే ఆనందంగా నవ్వుతున్నాం. హఠాత్తుగా, “థాంక్స్ నాన్న, ఈ ఆదివారమే కొంటున్నామా?” అంటూ నేనూ, అక్కా నాన్నను హత్తుకున్నాం.

“మీకోసం ఏదైనా కొనేస్తాను బంగారం” అంటూ బుగ్గను మా ముఖం ముందు పెట్టి ముద్దు అడిగాడు నాన్న.

టీవీ కోసం తప్పదుగా... ఎండల్లో కష్టపడి, వానల్లో తడిసి, రెక్కలు ముక్కలు చేసుకొని అలిసి మాసిన గడ్డం గుచ్చుకున్నా పర్లేదు అని ముద్దుపెట్టేశాం.

“వాళ్ళు తినేశారు లెండి. సరదాగా అన్నాను” అంది అమ్మ.

“సరే అయితే, కొందాంలే నాన్న ఆదివారం. పడుకోండి మీరు” అని కాసేపు జోకొట్టి వెళ్లిపోయాడు.

కొత్త కలర్ టీవీ రాబోతుంది అంటే నిద్ర ఎవడికైనా పడుతుందా?

ఆదివారం రావాలంటే శుక్రవారం, ఇంకా శనివారం రెండు రోజులు గడవాలి. అబ్బో చాలా రోజులు ఉన్నాయని కొత్త కలర్ టీవీ గురించి కలర్ కలలు కంటున్నాం నేనూ, అక్కా.

మేము కొత్త కలర్ టీవీ కొంటున్నాం అని నేను చిన్నపిల్లాడిని కాబట్టి బడ్డీకొట్టు సురేష్ కూ, సైకిల్ కొట్టు రవికీ, చీమిడుముక్కు నవిన్ కూ చెప్పొచ్చు. నాకన్నా పెద్దది అయినా అక్క కూడా చిన్నపిల్లే కాబట్టి ఆ ఎత్తుపళ్ళు సుజాతకూ, నీలాంబరి అక్కకూ, సాకలి బానుకీ కూడా చెప్పొచ్చు. కానీ అమ్మ మాత్రం నీళ్ల కోసం వెళ్ళినప్పుడు మాత్రమే కలిసే రమణి ఆంటీకి, ఎప్పుడో బట్టలు ఇస్త్రీకి వేసినప్పుడు మాత్రమే కలిసే సీత ఆంటీతో కూడా చెప్పడం అమ్మ బడాయి కాదా? ఏంటో అమ్మ ఇలా తయారయ్యింది అని అక్కా, నేనూ ఒకరి ముఖం ఒకరు చూస్కుంటూ ఉన్నాం.

దేవుడు ఉన్నాడు..., ఎందుకంటే శుక్రవారం అయిపోయిందిగా.

ఇంక రేపు కొనేస్తాం కొత్త కలర్ టీవీ అని ఉత్సాహంతో శనివారం ఉదయం లేచాం. మేము లేచేసరికి అమ్మ ఇంట్లో మిగతా పనులు చేస్తుంది.

“అమ్మో..., అమ్మ మాకన్నా ఉత్సాహంగా ఉంది” అనుకున్నాం.

చకచకా చక్కగా శనివారం రాత్రి అయ్యింది. ఎక్కడో కుడి కన్ను అదురుతుంది అనుకుంటా అమ్మ, “భగవంతుడా..., ఆదివారం టీవీ కొంటే నా కొడుకుకి గుండు కొట్టి తీసుకొస్తా నీ కోవెలకి” అని నాకు వినపడేలా మొక్కుకుంటుంది.

అనువుగా నా తల ఉంది మరి.

“అమ్మా..., అదేం కుదరదు. అక్కకు గుండు కొట్టిస్తా అని మొక్కుకో ఇంకా మంచి ఫలితం ఉంటుంది” అన్నాను అమ్మతో.

నా వైపు జాలిగా చూసి నవ్వింది. మరి అమ్మ ఏమని మొక్కుకుందో శివయ్యకే ఎరుక. సైకిల్ సౌండు ట్రింగ్... ట్రింగ్... ట్రింగ్... అంటూ వినిపించింది. నాన్న వచ్చేసారు. నాకూ, అక్కకూ ఎంతో ఇష్టం అయిన చికెన్ పకోడీ కూడా తెచ్చారు. తింటూ అమ్మ అక్కకు సైగ చేసింది. నేను చిన్న పిల్లోడిని కదా, నాకు ఆ సైగకు అర్థం అర్థమవ్వలేదు.

“ఏంటి నాన్నా..., రేపు మనం కలర్ టీవీ కొనడానికి వెళ్తున్నాం కదా?” అక్క ప్రశ్న పూర్తి అయింది.

సమాధానం కోసం ఆరు కళ్ళు ఆశగా చూస్తున్నాయి.

“తప్పకుండా వెళ్దాం నాన్న, రాజీవ్ గారిని కాసేపు బ్రతిమాలితే వచ్చే నెల జీతం తగ్గిస్తానని చెప్పి ఇచ్చారు” అని నాన్న అమ్మతో అన్నాడు.

ఆనందంగా అందరం అన్నం తినేసాం. నేను మాత్రం జాలిగా... హీనంగా... ఎందుకు పనికి రాని, ఏ పనీ చేతకాని పాత టీవీని చూస్తూ, “రేపు నువ్వు ఆ పాత సామాన్లు వాడి దగ్గరకు పోవాల్సిందే” అని వెక్కిరిస్తున్నాను.

ముందు అమ్మ గురించి చెప్తా..., అయిబాబోయి రేపటి నుండి సత్యవతిగారింట్లో కొత్త కలర్ టీవీ ఉందట అని అమ్మ గురించి చాలామంది చెప్పుకుంటారు. అమ్మకు మరి నిద్రపట్టదు.

మరి అక్క?..., బోలెడన్ని సినిమాలు రోజుకు ఒకటి చొప్పున బోలెడన్ని సినిమాలు చూడొచ్చు. అక్కకు అస్సలు నిద్రపట్టదు.

ఒక్కసారిగా ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తున్నానేమో అన్న భయం నాన్న మాకు కనపడకుండా దాచేస్తున్నాడు. మధ్యతరగతి కుటుంబంలో ఇంటి పెద్దగా ఉన్న నాన్నకు ఎప్పుడూ అంత త్వరగా నిద్రపట్టదు.

ఇంకా నా..., క్షమించండి నిద్రొచ్చేస్తుంది.

ఉదయాన్నే అమ్మ నిద్ర లేపింది. స్నానం చేసి మొన్న సంక్రాంతికి వేసుకున్న కొత్త బట్టలు తొడుక్కోమంది అమ్మ. నాకు కూడా అవే వేసుకోవాలనిపించింది. సమయం ఉదయం పది అయ్యింది. నలుగురం బాగా ముస్తాబయ్యాం. ఒకేసారి ఇంటి నుండి బయల్దేరాం. అమ్మ ఒడియాల ముసలమ్మకు దొరికిపోయింది.

“ఎటూ..., ఊరు వెళ్తున్నార్రా?” అని అడిగింది.

“లేదు మామ్మా..., మీ కొడుకు కొత్త కలర్ టీవీ కొంటున్నాడు” గర్వాంగా అని కాసేపు, నిజానికి ఎక్కువసేపే చెప్పి బయల్దేరింది.

స్యామ్సంగ్ టీవీ షాప్ దగ్గర రిక్షా ఆగింది. మా వేగం ఎవరు ఆపుతారు? తొందరగా దిగి లోపలికి వెళ్ళి ఓ టీవీ చూశాం. చూడగానే నచ్చేసింది ఆ టీవీ. చింతపిక్క రంగులో ఒక వ్యక్తి వచ్చి, “దస్ హాజర్ దేనా పడేగా” అన్నాడు.

నాకు హింది రాకపోయినా మా అమ్మ, అక్క ముఖంలో చూస్తే అర్థం అయిపోయింది అయిదు వేలతో పని అవ్వదు అని. అప్పుడే శ్రీ వేంకటేశ్వరుడు, ఆపద మొక్కులవాడు, అనాధ రక్షకుడు, నాన్న ఆఫీస్ మేనేజర్ రాజీవ్ గారి రూపంలో బైక్ పైన వచ్చారు. షాపు వాడు అతనికి బాగా తెలుసు కాబోలు కాసేపు అతను మాట్లాడాక ఆ చింతపిక్క రంగు ముఖం అంకుల్ అయిదు వేలు పుచ్చుకొని కొన్ని కాగితాల పై నాన్న సంతకం తీసుకొని కలర్ టీవీ ఇచ్చారు. జాగ్రత్తగా తీసుకొచ్చి ఇంట్లో పెట్టాం. నిన్ననే మాట్లాడి ఉంచిన కేబుల్ వాడు వచ్చి కేబుల్ కనెక్షన్ ఇచ్చి వెళ్ళిపోయాడు. వెళ్తూ,

“ఈ టీవీ రిమోట్ జాగ్రత్తా..., ఈ రిమోట్ పోతే ఇంక టీవీ పని చెయ్యదు” అని ఉచిత సలహా ఇచ్చాడు.

“హా..., మాకు తెలుసులే పో” అని వాడిని కంగారుగా గసిరేసాం అంతా.

అస్సలు..., చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని నాన్న నాకూ, అక్కకూ, తెలీకుండానే అమ్మకూ కూడా వార్నింగ్ ఇచ్చాడు. రేపు ఆ నవిన్ ని ఇంటికి తీసుకొచ్చి చూపించాలి. వాళ్ళ టీవీ కన్నా మా టీవీ పెద్దదిగా మరి. కానీ ఇంతలో మా తిక్క కుదర్చడానికే అన్నట్లు కరెంట్ పోయింది.

“వచ్చేసరికి పొద్దు ఎక్కిపోతుంది” అన్న పక్కింటి బామ్మగారి మాటకు అందరి ఉత్సాహం ఆవిరయిపోయింది.

అలిసిపోయిన నాన్న అలా బయటకు వెళ్ళాడు. పక్కింటావిడ కొత్త చీరలు కొందట చూడటానికి అమ్మ కూడా వెళ్ళిపోయింది. ఆరిపోయిన కొవ్వొత్తులవలే నేనూ, అక్కా నిర్మలంగా టీవీ ముందు కూర్చున్నాం. కాసేపటికి అద్భుతం జరిగింది. కరెంట్ వచ్చేసింది.

టీవీ ఆన్ చేసాం అక్కా, నేనూ.

ఇద్దరి ఆనందాలకు అవధుల్లేవ్. అక్క వాళ్ళ ఫ్రెండ్స్ ఇంట్లో, నేను నా ఫ్రెండ్స్ ఇంట్లో టీవీ చాలాసార్లు చూసాం. చానల్ మార్చడం, సౌండ్ మార్చడం కూడా మాకు తెలుసు.

నేను కార్టూన్ పెడదాం అన్నాను. అక్క సినిమా పెడదాం అంటుంది. ససేమిరా ఒప్పుకోలేదు. టీవీ కొన్న క్షణమే డోరేమాన్ పెట్టుకోవాలి అనుకున్నాను. ఇంట్లో చిన్నవాడిని నా మాటే నెగ్గాలి అని నేను. అదేం కుదరదు అంటూ అక్క. అక్కకూ, నాకూ వాగ్వాదం మొదలైంది. అది అంత పని చేస్తుంది అని మాకు అప్పుడు తెలీలేదు. అక్క జడ పట్టుకొని చటుక్కున లాగాను. నా గుండు పై అక్క రెండు మొట్టికాయలు వేసింది. నాకు కోపం చిర్రెత్తుకొచ్చేసింది. చెయ్యి కొరికాను. అక్క గోళ్ళతో రాక్షసిలా గీరేసింది.

ఇంకేముంది..., అంతర్యుద్ధం మొదలయింది.

ఆయుధాలు తలగడలు... దుప్పట్లు... స్కేలు... విసినకర్ర నుండి మాకు తెలీకుండానే టీవీ రిమోట్ వరకూ మారాయి.

అక్కా, నేనూ కలిసి (నిజానికి తప్పంతా అక్కదే) టీవీ రిమోట్ పగలగొట్టేశాం.

నన్ను నాన్న, అక్కను అమ్మ చంపడం ఖాయం అని అర్థం అయిపోయింది.

కాసేపటికి, “అక్కా..., మనం పగలగొట్టింది టీవీ రిమోట్ నే కదా. నువ్వు ఏడుస్తూ నాన్న దగ్గరకు వెళ్లావంటే ఏమనడు. క్షమించేస్తాడు” అన్నాను.

“రే పంది! టీవీ రిమోట్ టీవీకి విసిరి పగలగొట్టాం కదా..., టీవీ అద్దం కూడా పగిలిపోయింది. అక్కడ అద్దం ముక్కలు చూడలేదా?” అంది మా నక్క సారీ అక్క.

ఒహ్హో... మీతో చెప్పడానికి సిగ్గెందుకు ఆ మాట వినగానే నా నిక్కర్ తడిచిపోయింది.

అమ్మోయ్... మన మరణం తథ్యం అనుకున్నా. ఒక్కసారి టైం మిషన్ లాంటిది ఉంటే ఎంత బాగున్ను అనుకున్నా. అక్క అడిగిన సినిమాలే చక్కగా చూసుకొనే వాళ్ళం. అమ్మానాన్నల కోపం తీరం దాటే అవకాశాలు ఉన్నాయని వాతావరణం చూస్తే అర్థం అయిపోయింది. అమ్మ అడుగు చప్పుళ్లు, నాన్న సైకిల్ ట్రింగ్... ట్రింగ్... శబ్దం ఎప్పుడు వినాల్సి వస్తుందోనని బిక్కుబిక్కుమంటున్నాం. సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని క్షతగాత్రులమైన మేము ఈ మంచం క్రింద చేరాం, ఇంక మా ప్రాణాలు పైవాడే కాపాడాలి అని.

గుండెను వణుకుతున్న పిడికిలితో పట్టుకుని చూస్తున్నాం.

అన్నట్టు నా పేరు అభయ్.

మా అక్క పేరు సరస్వతి.

మళ్ళీ చెప్తున్నా నిజానికి తప్పంతా అక్కదే.



Rate this content
Log in

Similar telugu story from Comedy