Dinakar Reddy

Abstract Comedy Drama

4.5  

Dinakar Reddy

Abstract Comedy Drama

కొత్త సీరియల్ స్క్రిప్ట్

కొత్త సీరియల్ స్క్రిప్ట్

2 mins
359


సిద్దార్థ్. నీకు పదిహేను నిమిషాలు టైం ఇస్తాను. నువ్వు సీరియల్ స్క్రిప్ట్ చెప్పి నన్ను ఓకే చేయించగలిగితే నేనే పెద్ద బ్యానర్లో నీ సీరియల్ తీసేట్లు చేస్తాను అని ఒక టీవీ ఛానెల్ హెడ్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది.


గబగబా వెళ్ళాను వాళ్ళ ఆఫీసుకు. నా దగ్గర స్క్రిప్ట్ పేపరు కూడా లేదు.


కానీ చెప్పాలి. ఎలాగోలా ఓకే చెయ్యాలి. నాలుగేళ్లయ్యింది నేను ఒక సీరియల్ కి మాటలు రాయడం మొదలు పెట్టి. నాకంటూ సొంత సీరియల్ ఉండాలనుకోవడం తప్పు కాదు కదా.


ఛానెల్ హెడ్ టీ తాగుతూ కూర్చున్నాడు. నేను నిలబడే ఉన్నాను. ఇక మొదలు పెట్టు అన్నాడు.


నేను అప్పటికప్పుడు ఏదో ఆలోచించాను.


సార్. సీరియల్ ఫస్ట్ షాట్ ఇద్దరు స్నేహితులు కూర్చుని మాట్లాడుకుంటున్నట్లు మొదలవుతుంది.


ఇక వినండి.


అనగనగా ఒక రాణి. అని నేను మొదలుపెట్టాను.

అవునూ. అనగనగా ఒక రాజు అని కదా అనాలి అని నా స్నేహితుడు అడిగాడు. 


ఎబ్బే. ఇది కొత్త రకం ఫెమినిస్ట్ సర్కిల్ వాళ్ళ కోసం వ్రాస్తున్న కథ. ఇది ఇలానే వ్రాయాలి అన్నాను.

సరే. ఆ రాణి తన ప్రియుడి చెల్లెలి తోడి కోడలి ఇంట్లో అద్దెకు ఉండే ప్రతిక్రియ అనే అమ్మాయి సమస్యను ఎవరికీ తెలియకుండా.. 


రేయ్. ఆగు. రాణి అన్నావ్. మరి ఇదంతా ఏంటి? అని మళ్లీ డౌట్ వచ్చింది వాడికి.


నువ్వాగరా. రాణి అనేది అమ్మాయి పేరు. అంతే. ఇప్పుడు టీవీలో వచ్చే సీరియళ్లు అన్నీ అలానే ఉన్నాయి. నోరు మూసుకుని విను.


అంటే సీరియల్లో సీరియల్ స్క్రిప్ట్ అన్నమాట. గుడ్ అని అన్నాడు ఛానెల్ హెడ్.


నేను మరింత ఉత్సాహంతో రెచ్చిపోయి చెప్పడం మొదలు పెట్టాను.


ఆ రాణి తన సమస్యను పరిష్కరిస్తుంది అని ప్రతిక్రియ వాళ్ళ బాబాయితో చెబుతుంది. ఈ విషయం తెలుసుకుని వాళ్ళ పిన్ని ప్రతిక్రియ మనశ్శాంతిగా ఉండకూడదు అని మంత్రించిన కోడిని బలి ఇస్తుంది. ఆ తరువాత మాంసాన్ని చికెన్ షాపు వాడికి అమ్మేస్తుంది.


ఆదివారం మార్కెట్ కి వెళ్ళిన రాణికి డిస్కౌంట్ లో అదే కోడి మాంసం దొరుకుతుంది. ప్రొటీన్ల సంగతి ఎలా ఉన్నా లివర్ పీస్ కోసమే చికెన్ తెచ్చుకున్న విషయం పసిగట్టిన రాణి ప్రియుడు దాన్ని రాణికి తెలీకుండా రెస్టారెంట్ కి అమ్మేస్తాడు.


అబ్బో. చాలా ట్విస్ట్ లు ఉన్నాయి అన్నాడు ఛానెల్ హెడ్.


అవును సార్ అని నేను మళ్లీ చెప్పడం మొదలు పెట్టాను.


ప్రతిక్రియ ఆఫీసులో పార్టీ జరుగుతోంది. ఫుడ్ రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేశారు. అదే కోడి మాంసం ప్రతిక్రియ ప్లేట్లోకి బటర్ చికెన్ మసాలా కర్రీగా చేరింది.


ప్రతిక్రియ చికెన్ తినబోతుండగా ఆమె ఫోన్ మోగుతుంది.


ఇప్పుడు ప్రతిక్రియ చికెన్ తింటుందా? తినకుండా రాణి ఎలా ఆపగలదు? 


సూపర్ సిద్దార్థ్. నాకు ఈ లైన్ బాగా నచ్చింది అన్నాడు ఛానెల్ హెడ్. కాకపోతే మనం కోడి గురించి ఎక్కువగా డిస్కస్ చేస్తే ప్రాబ్లం రావొచ్చు. వెజిటేరియన్ అయితే బెటర్ అన్నాడు.


సార్. పన్నీర్ పెడదాం సార్ అన్నాన్నేను.


మరి మంత్రించిన కోడి అనుకున్నాం కాదు. కథలో లూప్ హోల్స్ కనిపిస్తాయేమో అని సందేహం వచ్చింది ఛానెల్ హెడ్ కి.


సార్. అసలు ఆ లైన్ కట్ చేసి పన్నీరు అమ్మే వాడితో ప్రతిక్రియ తిరుగుతోందని వాణ్ణే పెళ్లి చేసుకోవాలని వాళ్ళ పిన్ని ప్లాన్ చేస్తే మీకు ఓకే కదా అన్నాను నేను.


ఎక్సలెంట్ పాయింట్. ఈ ఒక్క పాయింట్ పట్టుకుని మూడు నెలల ఎపిసోడ్స్ చెయ్యొచ్చు. మనం వారంలో సీరియల్ స్టార్ట్ చేద్దాం. చెక్కు ఇంటికి పంపిస్తాను అని ఛానెల్ హెడ్ బయటికి వెళ్ళాడు.


నేను డైరెక్ట్ సీరియల్ టైటిల్ సాంగ్ అందరి ఇళ్లలోనూ ప్రైమ్ టైమ్ లో వినిపిస్తుంటే అలా అది వింటూ వెళుతున్నట్లు ఫీలవుతూ ఇంటి వైపు నడిచాను.



Rate this content
Log in

Similar telugu story from Abstract