Dinakar Reddy

Abstract Romance

4.5  

Dinakar Reddy

Abstract Romance

హిమ హేమంతం

హిమ హేమంతం

1 min
353


ఇప్పుడు నేనేమన్నాను. ఏదో పాలు పొంగిపోయి గ్యాసు మంట ఆరిపోవడంతో అంత పరధ్యానంగా పాటలు వింటున్నావేం అన్నాను. అంతేగా. దాని కోసమని నాతో మాట్లాడ్డం మానేయాలా. హేమంత్ తన భార్య హిమ మీద కోపాన్ని ప్రదర్శించాడు.


హిమ తనకేమీ పట్టనట్టు డ్రస్సింగ్ టేబుల్ దగ్గర కూర్చుని జుట్టు దువ్వుకుంటూ ఉంది. ఆమె కళ్ళు ఏడ్వడం వల్ల ఎరుపెక్కాయి. హేమంత్ కాస్సేపు ఆలోచించి ఈ విషయం హిమ వాళ్ళమ్మకు చెబుదామని అనుకుని ఆఫీసుకు వెళ్ళిపోయాడు. 


ఆ రోజంతా హేమంత్ కు కాస్త చిరాగ్గా ఉంది. సృజన్ హేమంత్ చిరాకును గమనిస్తూ ఉన్నాడు. 


ఏమైంది భయ్యా! మస్తు గరమ్ గున్నవు. మా వొదిన పరేషాన్ చేసిందా ఏమి? అంటూ లంచ్ బ్రేకులో హేమంత్ ని పలకరించాడు సృజన్. 


అబ్బే. ఏం లేదు. ఏదో మూడ్ ఆఫ్ లో ఉన్నాను. అంతే అని చెప్పాడు హేమంత్.


సృజన్ నవ్వుతూ సరేలే భయ్యా. కొత్తగ లగ్గమయినోళ్లు నూనెలో ఏసిన పోపు గింజల్లెక్క సిటపట అంటరట. మల్ల సీకటి పడంగనే సప్పుడు సేయకుండా కలిసిపోతరట. ఒకరి మీద ఒకరికి ప్రేముండాలె. మా అవ్వ సెప్పేది ఇట్ల అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు సృజన్.


హేమంత్ బలవంతంగా నవ్వుకుని తన పెళ్లిని హిమతో తను చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకున్నాడు. 


నీ మీద కోపం వచ్చినా నేను ప్రేమగా నిన్ను దగ్గరకు తీసుకుంటాను. నీ కళ్ళల్లో నీళ్ళు రానివ్వను అని ఇలా ఏవేవో చెప్పినట్లు గుర్తుకు వచ్చింది.


లంచ్ చేయడం మర్చిపోకండి. హిమ నుండి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. అతని కోపమంతా గాలికి దుమ్ము ఎగిరినట్లు ఎగిరిపోయింది దూరంగా.


అయినా భార్యా భర్తా ఒకరినొకరు ప్రేమించుకుంటే వారి మధ్య గొడవల పంచాయితీలు తీర్చడానికి మూడో వ్యక్తి అవసరమే లేదు కదా అని అనుకున్నాడు. 


గబగబా పనులు పూర్తి చేసుకుని సాయంత్రం అవ్వగానే హిమ కౌగిల్లోకి వాలిపోవాలి అనుకుంటూ లంచ్ పూర్తి చేశాడు.


అక్కడ ఇంట్లో హిమ అతని రాకకై ఎదురు చూస్తూ ఉంది.

హేమంత కాలపు హిమం వారిద్దరినీ చూసి నవ్వుకుంది.


Rate this content
Log in

Similar telugu story from Abstract