గోడకు వేసిన సున్నం
గోడకు వేసిన సున్నం
గోడకు వేసిన సున్నం
సీతానగరం గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న పున్నమి, వెన్నెల మంచి స్నేహితులు, ఇద్దరూ చాలా తెలివైన వారు, చురుకైన వారు. పున్నమి ధనవంతుల బిడ్డ. తండ్రి వ్యాపారస్తుడు. వెన్నెల పేదపిల్ల. తల్లి, తండ్రి చనిపోవడంతో వెన్నెల చిన్నప్పటి నుంచి నాయినమ్మ గంగవ్వ సంరక్షణలో ఉంటోంది. గంగవ్వ కూలినాలి చేసి మనవరాలిని చదివించేది.
ఆగష్టు 15వ తేదీన పున్నమి పుట్టిన రోజు. ఆ వేడుకను స్థానిక హెూటల్లో ఘనంగా చేయాలని పున్నమి తల్లి దండ్రులు నిర్ణయించుకున్నారు. ఆ రోజు రానే వచ్చింది. ఉదయం పాఠశాలలో జరిగే స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో తన స్నేహితులతో సరదాగా గడిపింది పున్నమి. సాయంత్రం జరిగే తన పుట్టిన రోజు వేడుకకు రమ్మనమని స్నేహితులందరిని ఆహ్వానించింది.
హెూటల్ ని కళ్ళుమిరుమిట్లు గొలిపే కాంతులతో రంగు రంగుల బూరలతో అందంగా అలంకరించారు. పున్నమి స్నేహితులు, చుట్టాలతో ఆ ప్రాంతం అంతా సందడిగా ఉంది. పున్నమి పుట్టినరోజు వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. అక్కడికి అందరూ వచ్చారు కానీ వెన్నెల రాలేదు. తన స్నేహితురాలు రానందుకు ఎంతగానో బాధ పడింది పున్నమి.
మర్నాడు వెన్నెలకోసం కొన్ని మిఠాయిలు పట్టుకుని బడికి వెళ్ళింది పున్నమి. బడికి కూడా వెన్నెల రాలేదు. సాయంత్రం బడి వదలగానే పరుగు పరుగున వెన్నెల
వాళ్ల ఇంటికి వెళ్ళింది పున్నమి. కుక్కి మంచంమీద గంగవ్వ మూలుగుతూ ఉంది.
పక్కనే ఏడుస్తూ కూర్చుంది వెన్నెల. "ఏమైంది వెన్నెలా” అని అడిగింది పున్నమి.
“అవ్వకు నాలుగు రోజుల నుంచి విపరీతమైన జ్వరం. ఆసుపత్రికి తీసుకువెళ్ళే వారు లేరు. నా దగ్గర డబ్బులు లేవు. వంట చేద్దామంటే సరుకులు లేవు." అని ఏడ్చుకుంటూ చెప్పింది వెన్నెల.
పున్నమి నోట మాట రాలేదు. వారి పరిస్థితి చూసిన
పున్నమి మనసు చలించిపోయింది. ముందురోజు పాఠశాలలో ఉపాద్యాయులు చెప్పిన "గోడకు వేసిన సున్నం" జాతీయం అప్పుడు టక్కున తనకు గుర్తుకు వచ్చింది. "తిరిగిరాని పెట్టుబడిని గోడకు వేసిన సున్నం అంటాము. శుభకార్యం జరిపే సందర్భాలలో ఇళ్ళ గోడలకు వెల్ల(సున్నం) వేస్తుంటాము. గోడలు తెల్లగా అందంగా ఉంటాయి. ఆ తరువాత మళ్ళీ ఆ సున్నం మనకి తిరిగి రావాలంటే రాదు.
ఇలా కొన్ని కొన్ని సందర్భలలో కొన్ని చోట్ల మనం పెట్టే పెట్టుబడి ఏపరిస్థితులలోనూ తిరిగిరాదు" అని మాష్టారు చెప్పిన మాటల్లో వాస్తవాన్ని అప్పుడు గ్రహించింది పున్నమి. తన పుట్టినరోజు నాడు ఆడంబరాలకు, విలాసాలకు తాము చేసిన ఖర్చు గుర్తుకు వచ్చి, చాలా బాధపడింది. అది కూడా గోడకు వేసిన సున్నం లాంటిదేనని తనకు అర్ధం అయింది.
ఇంటికి వెళ్లి అమ్మ నాన్నలకు తన మనసులోని మాటను చెప్పింది. కూతురి ఆలోచనకు ఎంతగానో పొంగిపోయారు తల్లిదండ్రులు. గంగవ్వకి మెరుగైన వైద్యం చేయించారు. అవసరమైన ఆర్థిక సహాయం చేశారు. ఇక నుండి తన పుట్టినరోజును అనాధ పిల్లల మధ్య మాత్రమే జరుపుకుంటానని చెప్పింది. దీంతో గంగవ్వ, వెన్నెల ఎంతో సంతోషించారు. వారి కళ్ళల్లో ఆనందాన్ని చూసి పొంగి పోయింది పున్నమి.
"గోడకు వేసిన సున్నమే" జాతీయం వివరణ :
మనం ఏదో ఆశించి వెచ్చిస్తాం. కొన్నిసార్లు ఆ వెచ్చించిన ధనం ఇక ఎట్టి పరిస్థితులలోనూ వెనక్కి రాదనుకున్నప్పుడు ఉపయోగించే జాతీయమిది. కొందరు అప్పులు చేయడంలో సిద్ధహస్తులు. వారి మాయ మాటలు నమ్మి కొంతమంది వారికి డబ్బులు ఇస్తారు. ఎంత కాలమైనా ఎన్ని సార్లు అడిగినా రేపు, మాపు అంటారే తప్ప డబ్బులు తిరిగి ఇవ్వరు. అలాంటి సందర్భాలలో ఆ డబ్బులు 'గోడకు వేసిన సున్నమే' అని అంటారు. అంటే గోడకు వేసిన సున్నం ఎలా తిరిగి రాదో అలాగే ఈ డబ్బులు తిరిగి రావని అర్థం. ఇలా ఈ జాతీయం అనేక సందర్భాలలో తెలుగునాట ప్రచారంలో కనిపిస్తుంది.
(చెకుముకి మాసపత్రిక ఆగష్టు 2024 సంచికలో ప్రచురితమైంది)
