ఎవరక్కడ..
ఎవరక్కడ..
బాత్రూమ్ లో పాటలు పాడడం నాకు చాలా ఇష్టమైన పని.
ఇంకా గోడల మీద నీళ్లు చల్లుతూ ఆడుకోవడం కూడా.
ఇప్పటికీ ఎక్కువ సేపు నేను బాత్రూం లో ఉంటే మా నాన్న బయట నీటి వాల్వ్ ఆఫ్ చేసి పెడతాడు. లేకుంటే నీళ్లు చల్లుకుంటూ నేను గంట సేపు లోపలే ఉంటాను అని.
అందులో ఏముంది అంటారా. ఏమో? అదో తృప్తి. అంతే.
ఇక స్నానం చేశాక టవల్ కట్టుకుని బయటికి వచ్చి ఎవరక్కడా అంటూ పాత సినిమాల్లో రాజులు పిలుస్తారే అలా నేనూ అరుస్తాను.
అమ్మ చెప్పండి రాజు గారూ అంటుంది. అమ్మకు కోపం వచ్చింది అనుకో.. ఇక అంతే. స్కూలుకు లేట్ అవుతోంది. ఇలానే యాక్షన్లు చేశావనుకో దోసె కాడతో వాతలు పెడతాను అంటుంది.
వాతలు పెడతాను అంటుంది కానీ, ఎప్పుడూ పెట్టదు. మరి అవి కూడా వడల్లానే ఉంటాయో ఏమో అనుకుని నువ్వే పెట్టుకో, నేను తినను అని పరుగెత్తేవాణ్ణి.
ఇంకోటి. గట్టిగా టీవీలో పాటలు పెట్టుకుని బాత్రూం లోకి దూరి స్నానం చేస్తే కూడా ఎంత బాగుండేది అప్పుడు.
తాతయ్య వచ్చి పాటలు ఆపి న్యూస్ పెట్టేస్తాడు. అసలు అంత పొద్దుటే న్యూస్ చదివే వాళ్ళు ఎలా వస్తారే అని ఓరోజు అమ్మమ్మని అడిగాను.
అమ్మమ్మ నాకంటే తెలివైనది కదా. అలా అని అమ్మ అప్పుడప్పుడూ అంటూ ఉంటుందిలే. అదేం లేదురా
పిడుగూ! వాళ్ళు స్నానం అవీ చెయ్యరు. పొద్దుటే లేచి ముఖానికి పౌడర్ కొట్టుకుని టీవీ ముందు కూర్చుంటారు అని చెప్పింది.
తాతయ్య ఒప్పుకోలేదు. అలా ఏం కాదు. వాళ్ళు స్నానం చేసి, బ్రెడ్ తిని వచ్చేస్తారు అన్నాడు.
ఇలాంటి ప్రశ్నలు అడుగుతానని అమ్మ నన్ను స్కూల్లో వేసిందట. ఇది కూడా అమ్మమ్మ చెప్పింది.
ఈసారికి ఈ కబుర్లు చాలు. మళ్లీ కుంచెం ఎక్కువ చెప్తానే. టాటా.
