kottapalli udayababu

Tragedy

4  

kottapalli udayababu

Tragedy

ఎగిరిపోతే ఎంతబాగుంటుందీ?

ఎగిరిపోతే ఎంతబాగుంటుందీ?

10 mins
380


ఎగిరిపొతే ఎంతబాగుంటుందీ...? (కథ )

సమయం సాయంత్రం అయిదు ముప్పయ్ నిముషాలైంది.రాజమండ్రిలో నేను వచ్చిన ఆఫీస్ పని అయిపోవడంతో షాపింగ్ కి బయల్దేరాను.

రాజమండ్రి వచ్చినప్పుడల్లా నేను జనపనార బాగ్స్ రకరకాలవి కొని పట్టుకు వెళ్తూ ఉంటాను. అది నాకిష్టమైన హాబీ. నాకు నచ్చిన మంచి మోడల్స్ లో బాగ్స్ కనిపిస్తే ధర గురించి ఆలోచించను. వెంటనే కొనేస్తాను. మా ఇంట్లో నలుగురు సభ్యులం ఎవరి అవసరాలకైనా బయటకు వెళ్ళేటప్పుడు ఎవరి బాగ్ వాళ్ళు తీసుకునేలా అలవాటు చేసాను. మేమంటే నచ్చని వాళ్ళు మాకు '' జూట్ ఫామిలీ'' అనే నిక్ ని కూడా తగిలించేసారు.

దానికి కారణం ఉంది. చదువుకున్న వాళ్ళకి సంస్కారం కూడా ఉండాలి పూవికి తావి అన్నట్టుగా. అలా లేనప్పుడు ఆ పూవు గడ్డిపువ్వుతో సమానం. అలాగే చదువుకుని సంస్కారం లేకపోతే ఆ విద్య కూడా పనికిమాలిన విద్య అన్నది నా ఉద్దేశం.

ప్లాస్టిక్స్ వాడవద్దు. .. మన పర్యావరణానికి హాని అని ఎందరో మేధావులు దాని గురించి నెత్తి నోరు మొత్తుకుంటున్నా, దాని వాడకం మనిషి నిర్లక్ష్యం వల్ల ఇంకా ఇంకా సమాజం లో పెరుగుతోంది తప్ప. ..ఇంతమంది విద్యావంతులున్న సమాజం లో మాత్రం ఏమార్పూ కనిపించడం లేదు. ప్లాస్టిక్ వాడకం వల్ల జరుగుతున్న అనర్ధాలు నిత్యం పత్రికలు ఘోషిస్తున్నా , మీడియా లో ప్రకటనలద్వారా హోరెత్తిస్తున్నా, కొంతమంది అధికారులు తాము పనిచేస్తున్న పట్టణాలలో కొంతకాలం నిర్బంధంగా అమలు చేస్తున్నా, వారి ప్రభావాలు తొలగిపోగానే. ..మళ్ళీ మామూలే.

సమాజం లోని పౌరులుగా, చదువు నేర్పిన విజ్ఞత ఉన్నవారమై ఉండి కూడా దానిని పాటించలేకపోతే మన తరం గడిచిపోతుంది సరే. భావి తరాల మాటేమిటి? ఆ దూరాలోచన చేసుకోకపోతే ప్లాస్టిక్ కవర్లలో పెట్టి చుట్టి విసిరేసిన విస్తరాకులోకి పదార్ధం కోసం పాస్టిక్ కవరునే తినేసే జంతువుకు మనకు తేడా ఏమిటి? తానూ కూర్చున్న కొమ్మను తానె నరుక్కునే మనిషిని చూసి ఎవరు జాలి పడతారు? రేపు మన పిల్లల పరిస్థితి ఏమిటి? వాళ్ళ పిల్లల పరిస్థితి ఏమిటి?

అందుకే సమాజం లో పౌరునిగా నా వంతు నేను పర్యావరణానికి హాని కలిగించకూడదనే నినాదంతో నా కుటుంబ సభ్యులందరిచేత ప్రమాణం నేను చేస్తూ చేయించాను '' ఎట్టి పరిస్థితులలోనూ ప్లాస్టిక్ తయారీ వస్తువులు వాడబోము '' అని.

మాకు తెలిసిన కుటుంబాలను కూడా మా పరిజ్ఞానం మేరకు ఎడ్యుకేట్ చేస్తున్నాము. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న మా పిల్లలు పాఠశాలకు జనపనార బాగ్స్ లోనే తమ పుస్తకాలను తీసుకు వెళ్తున్నారు . వారి వారి స్నేహితులలో కొందరు కూడా పాటించేలా నచ్చచెప్పడంలో కృతకృత్యులయ్యారనే చెప్పాలి. మా ఇంటినిండా జనపనారతో చేసిన వస్తువులను ఎక్కువగా ఉపయోగిస్తున్నామని ఖచ్చితంగా చెప్పగలను.

 నేను ఇంటికి వెళ్ళగానే ఎదురు వచ్చి ‘ఈ సారి కొత్త మోడల్స్ ఎం తెచ్చారు నాన్నగారు? ‘అని పిల్లలు అడిగేస్తారు. అందుకోసం లేపాక్షి లోకి దారితీసాను.

షాపు యజమాని లేడేమో ...అందరూ హుషారుగా కబుర్లు చెప్పుకుంటూ కస్టమర్స్ అడిగినవి చూపిస్తున్నారు.

జూట్ బాగ్స్ ఉన్నచోటుకు వెళ్లి అక్కడున్న సేల్స్ గర్ల్ ని కొత్త మోడల్స్ ఏం వచ్చాయో చూపించమని అడిగాను. అటు తిరిగి ఉన్న అమ్మాయి నావైపు తిరిగి '' కొత్త స్టాకు రెండు రోజుల్లో వస్తుంది సర్. ..మేము ఆర్డర్ పెట్టినవి చూపిస్తాను. మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకుంటే మేము కొరియర్ లో పంపిస్తాము మీరు మీ చిరునామా ఇచ్చి వెళ్తే . '' అని కొన్ని మోడల్స్ ను నా ముందు పడేస్తూ అంది. అప్పుడు చూసాను. తనని పరీక్షగా. .

'' నువ్వు..నువ్వు మధు వి కదూ...'' అడిగాను. ఆ అమ్మాయి ఏమాత్రం తడబడలేదు. సమాధానమూ చెప్పలేదు.

''ఆ అమ్మాయి పేరు వర్షిణి సర్. మధు కాదు. వర్షా. ..నీకోసం ఎవరో వచ్చారు వెళ్లి అయిదు నిముషాల్లో వచ్చేసేయ్. మళ్లీ బాస్ వస్తే కేకలేస్తాడు ఈయనకి నేను చూపిస్తాలే.'' అని మరోఅమ్మాయి సమాధానం చెప్పింది నవ్వుతూ.

మధు. ..నన్ను కోరగా చూసి చిరునవ్వు నవ్వుతూ వెళ్ళిపోయింది.

ఇపుడు నాకు ఖచ్చితంగా కన్ఫర్మ్ అయింది. తను మధు. మా మేనమామ కూతురు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆనాటి పల్లెటూరి పిల్ల ఈనాడు పట్నం సీతాకోక చిలుక లా రూపాంతరం చెందింది. అంతే . తనని చూసి పది సంవత్సరాల పైనే అయింది. ఆ మాటే ఆ అమ్మాయితో చెప్పి అన్నాను..

''మధు ఎంతకాలం నుంచి ఇక్కడ పని చేస్తోంది? ''

'' సర్...మీకు మరోసారి చెబుతున్నాను. ఆ అమ్మాయి పేరు వర్షిణి,తాను ఇక్కడ చేరి కేవలం నెలరోజులైంది. మీరు ఇక్కడకు అలవాటుగా వచ్చే కష్టమర్ అని నాకు తెలుసు. క్రితం సారి వచ్చినప్పుడు మీరు ఆమెను చూసారా?''

'' లేదు''

'' ఆ అమ్మాయి మీ మరదలే అయితే ఇంతకాలం తర్వాత చూసిన మీకు కనీసం సమాధానం చెప్పకుండా వెళిపోతుందా? మీరు పొరబడ్డారు.సర్లెండి. మీకు వీటిల్లో నచ్చిన వి సెలెక్ట్ చేసుకోండి. వచ్చిన వెంటనే మీకు కొరియర్లో పంపే ఏర్పాటు నేను చేస్తాను. ''

'' సరే.'' అని నాకు నచ్చిన నాలుగు మోడల్స్ ఎంచుకుని నా విజిటింగ్ కార్ద్ ఇచ్చాను.

డబ్బు చెల్లించేశాను. మధు వస్తుందేమో. .మరోసారి చూడవచ్చు అనుకున్న నా ఆశ అడియాసే అయింది. రైలు వచ్చేసమయానికి స్టేషన్ లో ఉండాలి అన్న విషయం గుర్తువచ్చి అక్కడనుంచి బయటపడ్డాను.

                                                            *****

ఏ. సి. కంపార్ట్మెంట్ లో నా బెర్త్ మీదకు వచ్చి పడ్డాను. ట్రైన్ ఎక్కేముందు టిఫిన్ కట్టించుకున్నాను గానీ తిన బుద్ధి కాలేదు. కళ్ళముందు మధు రూపమే నన్ను వెక్కిరిస్తున్నట్టుగా కదలాడుతోంది. అమ్మ ఒప్పుకుని ఉంటే మధు నా భార్య స్థానం లో ఉండేది. కానీ సొంత తమ్ముడి కూతురైనా అమ్మ ఎందుకో ఒప్పుకోలేదు. మధు మీద నాకు ఏ అభిప్రాయం లేదు. అయినా అమ్మని అడిగాను 'ఎందుకు వద్దంటున్నావు' అని.

''నీకు తను మ్యాచ్ కాదు నాన్నా. నీ మనస్తత్వం నాకు తెలుసు. అతి చిన్న విషయానికి కూడా నువ్వు చలించిపోతావ్. అదంటే నాకు ఇష్టమే. ఎందుకంటే నా చేతులమీదుగా పుట్టిన పిల్ల అది. కానీ పెంపకం వాళ్ళ అమ్మది. అందుకే ఆడపిల్లగా అదంటే ఇష్టంతో కూడిన జాలి. అంతే తప్ప దాన్ని కోడలిని చేసుకునే అంత గొప్ప గుణం నాలో లేదు.'' అంది అమ్మ.

అమ్మ మాట నాకు శిరోధార్యం.

అమ్మకు ఒక తమ్ముడు. పోస్ట్ ఆఫీసులో గుమాస్తాగా చేసేవాడు. అత్తయ్య లక్ష్మి కి నేను అంటే చాలా ఇష్టం. పేరుకు తగ్గట్టు లక్ష్మీ దేవిలాగే కళకళలాడిపోతూ ఉండేది.

నాకు అప్పుడప్పుడే జ్ఞానం తెలుస్తున్న రోజులు. వేసవి సెలవుల ప్రారంభం లో నన్ను అమ్మ అత్తయ్య దగ్గర దింపేసి రెండు రోజులుండి నాన్నగారికి భోజనం ఇబ్బంది అని వెళ్లిపోయేది. నన్ను తీసుకు వెళ్ళడానికి రెండు రోజులు ముందు తానూ వస్తున్నట్లు మావయ్యకు వుత్తరం రాసేది. ఆవిధంగానే నన్ను తీసుకువెళ్లేది. అమ్మ నన్ను అత్తయ్య దగ్గర ఉంచడానికి కారణం అత్తయ్యకు పిల్లలు కలగలేదు. అత్తయ్య కు అమ్మ కాకుండా మరో ఇద్దరు ఆడపడుచులు ఉన్నా వాళ్ళ పిల్లలు వాళ్ళ అమ్మలతో సెలవులకు వఛ్చి రెండు రోజులు ఉండి వెళ్ళిపోయేవారు. అందుచేత వాళ్ళు అత్తయ్యకు పెద్దగా అలవాటు లేదు.

సెలవులకు తాతగారింటికి వెళ్ళినప్పుడల్లా అత్తయ్య నన్ను ఎంతో ప్రేమగా ప్రత్యేకంగాచూసుకునేది. తన దగ్గర ఉన్నప్పుడు అలవాటులో పొరపాటుగా ''అమ్మా '' అని పిలిస్తే ఉప్పొంగిపోయేది. నన్ను ఒక్క సారిగా గుండెలకు హత్తుకుని ''నువ్వు నా కృష్ణయ్యవయ్యా. ..'' అని తాదాత్మ్యంతో కళ్ళుమూసుకునేది. అమ్మ ఒడిలో ఉన్నంత హాయిగా ఉండటం తో నేనూ అలాగే ఆమె మీద చుట్టూ చేతులు వేసి ఒదిగిపోయేవాడిని. నాకు చిన్ని కృష్ణుడి వేషం వేసి ముచ్చట పడిపోయేది. తాను వూళ్ళో ఎవరింటికి వెళ్లినా నన్ను తీసుకువెళ్లేది. అందరికీ ''పేరుకు మా ఆడపడుచుగారి అబ్బాయే గానీ. ..ఇక్కడకొస్తే వీడే నాకు పిల్లలు లేని లోటు తీర్చే పెంపుడు కొడుకు '' అని అందరితో చెప్పేది.

అలాంటి అత్తయ్యకి పుట్టపర్తి సాయిబాబా అంటే చాలా నమ్మకంగా ఉండేది. జీవితం లో ఒక్కసారైనా ఆయన దర్శనం చేసుకోవాలని ముచ్చట పడేది. అలాంటి అత్తయ్యకి ఒంట్లో బాగోలేదట. ''ఒక్కసారి నన్ను స్వామీ దగ్గరకు ''తీసుకువెళ్ళండి అని అత్తయ్య మామయ్యని అడిగిందట, సరే నని మావయ్య ఆమెను పుట్టపర్తి తీసుకువెళ్లాడట. భక్తులలో అందరూ ఆశ్చర్యపోయే విధంగా సాయిబాబా గారు అత్తయ్య దగ్గరగా వచ్చి తలా నిమురుతూ. ..'' ఈ సీసా మందు వాడు. నీ బాధలన్నీ తొలగిపోతాయి'' ఒక టానిక్ సీసా ఇచ్చి దీవించారట. ఆ సీసా మందు వాడాకా అత్తయ్య బాధలన్నీ నిజంగానే తీరిపోయి స్వర్గానికి వెళ్లిపోయిందట.

ఆ వార్త తెలిసిన వెంటనే అమ్మ నన్ను నాన్నగారి దగ్గరే వదిలేసి వెళ్లి ఆ కార్యక్రమం అయ్యాకా వచ్చేసింది.

''నేనూ వస్తానమ్మా అత్తయ్యని చూడటానికి '' అని అమ్మతో అంటే ''నువ్వు భయపడతావ్ నాన్నా. నేనూ చూసి వచ్చేస్తానంతే ..'' అంది అమ్మ. ఆ తర్వాత మూడు నెలలకే మావయ్యకి పెళ్లి చేశారు. ఈ అత్తయ్య చాలా గడుగ్గాయని, కాపురానికి వస్తూనే వేరే కాపురం పెట్టించిందని అమ్మ నాన్నగారితో అంటుంటే విన్నాను. ఆ తర్వాత చాలా కాలం నేను మావయ్య ఇంటికి వెళ్ళలేదు.

ఏడాది తిరగకుండానే తాతయ్య, అమ్మమ్మ పోయారు. ప్రతి నెలా తన క్షేమ సమాచారాలు తెలుపుతూ ఒక వుత్తరం, వాళ్ళ తద్దినాలకు రమ్మని మరో వుత్తరం మావయ్య ఠంఛను గా రాసేవాడు. అమ్మ వీలయితే వెళ్ళేది...

లక్ష్మి అత్తయ్య పోయాకా మావయ్య కోరికమీద అమ్మ నన్ను తీసుకుని ఈ రెండవ అత్తయ్య పురిటికి సాయంగా వచ్చింది. అమ్మాయి పుట్టింది. తనే మధు. మధు పుట్టేనాటికి నాకు ఏడేళ్లు. పురిటి మంచం మీద ఉన్న ఈ రెండో అత్తయ్య నన్ను చూస్తూనే '' అబ్బో. .నా అల్లుడు ఎంత అందగాడో. వదినగారు.మీకు ఇదే చెబుతున్నా..ఈ పురిటి మంచం మీద నుంచి అడుగుతున్నా. మీరు మాత్రం నా కూతురిని కోడలిగా చేసుకోవాల్సిందే. ఏదీ మాట ఇవ్వండి? '' అంది అమ్మ చేతిని తన చేతిలోకి తీసుకుంటూ. ..

అమ్మ ఆ చేతిని సున్నితంగా విడిపించుకుంటూ మధుని చూస్తో అంది. '' దానికేం భాగ్యం కృష్ణవేణీ...అలాగే చూద్దాం. వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాకా ఎలా ఉంటారో. ..అయినా నా కోడలికేం తక్కువ? రాజా లాంటి మొగుడొస్తాడు. భగవంతుడి దయ వల్ల నీ కోరిక తీరుతుందనే ఆశిద్దాం. '' అంది లౌక్యంగా.

నేను పదవ తరగతికి రావడం తో, తాతయ్య, అమ్మమ్మ లేకపోవడంతో, కృష్ణవేణి అత్తయ్య మొరటు ప్రవర్తన ఇష్టం లేకపోవడం తో అమ్మ పుట్టింటికి వెళ్లడం తగ్గించేసింది.

అయితే ఏదో ఒక వంకతో అత్తయ్యే మావయ్యని,కూతురిని తీసుకుని మా ఇంటికి వచ్చేది. జీతాలు రాలేదనో, వచ్చిన జీతం అయిపోయిందనో, ఎల్. ఐ. సి. కట్టాలనో డబ్బు అడిగి పట్టుకెళ్ళేది.

'' ఆడపడుచుకు పెట్టాల్సింది పోయి మీ దగ్గరే తీసుకెళ్తున్నాం అని ఏమీ అనుకోకండి వదినగారు. రేపు మీ అబ్బాయికి ఇంతకూ ఇంత కట్నం ఇఛ్చి పెళ్లి చేస్తాంగా''అనేది అమ్మతో. వచ్చిన ప్రతీ సినిమా చూసి తీరాలట. లేకపోతే మావయ్యని దుంపశార్ధాలు పెట్టేదట . నెలకి తనకో చీర పిల్లకు రెండు కొత్త డ్రెస్సులు రెండు కొనాల్సిందేనట. 'నన్ను పోషించలేనివాడివి పెళ్ళెందుకు చేసుకున్నావ్ అనేదట' మావయ్యని. మధుకి సినిమా హీరోయిన్ షోకు చేసి సంబరపడిపోయేదట.

తన మాట విన లేదో ఆడపిల్ల అని కూడా చూడకుండా మధు ని చీపురు కట్ట తిరగేసి పరుగెత్తించి మరీ కొట్టేస్తుందట. ఇవన్నీ అత్తయ్య లేని సమయం చూసి మావయ్య అమ్మతో చెప్పుకుని కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడట.

''ఉన్న కాసేపు బావని లైన్లో పెట్టుకో''' అని నామీదకు ఉసిగొల్పేది. మధు చేసుకున్న అలంకారానికి తోడు ఆ పల్లెటూరి భాష నాకు అర్ధం కాక చచ్ఛే వాడిని.

ఒక రాత్రి అమ్మ నా దగ్గరకు వచ్చి ''నేను లేనపుడు మీ అత్తయ్య పాలు కూతురితో పంపినా, ఏమైనా పెట్టినా తినకు నాన్నా. అది అవసరమైతే మందు పెట్టె రకం. జాగ్రత్త. వీలయితే భయ పెట్టి వదిలించుకో.'' అని సలహా ఇచ్చింది.

మరునాడు నా దగ్గరకు వచ్చినప్పుడు మధుని బాగా వాగనిఛ్చి ఒక్క కసురు కసురుకున్నాను.'మళ్ళీ నాజోలీకి వస్తే నువ్వు ఎవడినో లవ్ చేస్తున్నావని మీ అమ్మకు ఆకాశరామన్న ఉత్తరం రాస్తా'నని బెదిరించాను.ఆ తర్వాత అత్తయ్య నా దగ్గరకు వెళ్ళమన్నా మధు వచ్ఛేది కాదు. '' బావ చదువుకుంటున్నాడమ్మా. తర్వాత వెళ్తాలే. ''అని తానే తప్పించుకునేది.

నేను ఇంజనీరింగ్ పూర్తీ చేసాను.కాంపస్ లోఉండగానే హైదరాబాద్ లో ఎం.ఎన్.సి. లో ఉద్యోగం వచ్చింది.

అమ్మ దగ్గర తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వలేకపోవడం తో మధు తో నా పెళ్లి గోల విరగడ అయిందని అమ్మ ఎంతో సంతోషించింది. ఆ వేసవిలోనే మధుకు పెళ్లి అయింది. అదీ ఒక పౌరోహిత్యం చేసుకునే బ్రాహ్మణుడితో...

దానికి కారణం మధు పెళ్ళికి ముందే ఎవడినో ప్రేమిస్తే మూడో నెల గర్భం అని తెలిసాకా వాడు మోసం చేస్తే ఆ విషయం దాచిపెట్టి పెళ్లి చేయించేసింది అత్తయ్య.

పెళ్లి అయిన ఏడో నెల కే పురుడు రావడం ఏమిటని అల్లుడు ప్రశ్నిస్తే, ఫాల్స్ పెయిన్స్ వల్ల డెలివరీ జరిగిపోయిందని చెప్పింది అత్తయ్య. అదృష్టమో దురదృష్టమో ఆ పుట్టిన బిడ్డ పదకొండో రోజు నాటికి కన్నుమూసింది. చివరకు అల్లుడికి విషయం తెలిసి నిలదీస్తే వాడు అనుమానం మొగుడని పోలీసు కేసుపెట్టి మధు చేత వాడికి విడాకులు ఇప్పించేసింది అత్తయ్య.

ఎవరికీ చెప్పు కోలేక భార్యకు నచ్చచెప్పుకోలేక మనో వేదనతో మామయ్య మరణించాడు. ఆ భరణం అత్తయ్యకు వచ్చేలా నాన్నగారు ఎంతో ప్రయత్నం చేసి రప్పించారు.అప్పుడు తెలిసాయి నాకీ విషయాలన్నీ.

ఆ శ్రావణ మాసం లో నేను ప్రేమించిన స్నిగ్ధ తో నా వివాహం అమ్మ నాన్నల ఆశీర్వాదం తో జరిగింది.

ఆ తరువాత అత్తయ్య మధుని ఒక లాడ్జి లో రిసెప్షనిస్ట్ గా చేర్పించిందట . మా పెద్దమ్మ కొడుకు అదే వూరిలో ఎల్. ఐ. సి. ఏజెంట్ గా చేస్తూ ఉండటం తో వాడి పర్యవేక్షణలో ఉంచిందట . ఆ లాడ్జి కి వచ్చిన ఒక కస్టమర్ మధుని చూసి పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో కూతురికి ఏనాటికైనా మగ తోడు అవసరం అని ముందు వెనుకలు ఆలోచించకుండా వేరే కులం వాడైనా వాడికిచ్చి పెళ్లి చేసేసిందట . దాంతో పెద్దమ్మ కొడుక్కి కోపం వచ్చి మధుని పట్టించుకోవడం మానేసాడట . వాడు మధు తో మోజు తీరాకా తప్పతాగి రోజు ఇంటికి వచ్చి అత్తగారిని , మధుని చితక బాది ఆ పెన్షన్ డబ్బులు కూడా లాక్కుపోయేవాడట. మరో మూడు నెలలు తిరగకుండానే విపరీతంగా తాగి తాగి వాడూ చచ్చిపోయాడట.

బతికి ఉండగా ఒక్కనాడు కూడా తన భర్త తనను ఒక్క మాట కూడా అనలేదని, అటువంటిది అల్లుడి చేతిలో దెబ్బలు తిన్నానన్న మాససిక వేదనతో దిగులుతో అత్తయ్య కన్ను మూసిందట.

ఒకరోజు నేను పూజలో ఉండగా మధు ఫోన్ చేసింది. '' బావా. ..మా అమ్మ చచ్చి పోయింది. నాకు ఇంక దిక్కు ఎవ్వరూ లేరు బావా. .ఒక్కసారి రా బావా. .నిన్నెప్పుడూ ఏదీ అడగలేదు. నాకు భయంగా ఉంది. '' అని వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పింది.

ఇపుడు మధు పూర్తిగా ఒంటరిదైపోయింది. నా గుండె కలచివేసింది. వెళదామనుకున్నాను .

మా కంపెనీకి ఫారిన్ డెలిగేట్స్ వస్తూండటంతో వారు వచ్చి వెళ్ళేదాకా ఆ బాధ్యత కంపెనీ నా భుజస్కందాలపై పెట్టడం తో వెళ్ళలేకపోయాను.

ఆ తర్వాత మధు ఎపుడైనా గుర్తొస్తే మా పెద్దమ్మ కొడుకునే అడిగేవాడిని. ..''ఎలా ఉందిరా. .ఏంచేస్తోంది?'' అని.

వాడికి తెలిస్తే సమాధానం చెప్పేవాడు. లేకపోతే ''ఎక్కడుందో తెలీదురా. మొత్తానికి ఈ ఊళ్ళోనే ఉంది. ఈ సారి వివరాలు తెలుసుకుని చెబుతాలే'' అనేవాడు.

నా సంసారం, నా ఉద్యోగం, నా ప్రపంచంలో పడి నేను మధుని పూర్తిగా మర్చిపోయాను. మళ్ళీ ఇదే చూడటం. ఎందుకో నా కళ్ళు     చెమర్చాయి. వద్దన్నా దుఃఖం ఒక్కసారిగా పొంగుకు వచ్చింది.

రావణుడు సీతమ్మను తీసుకుని వెళ్ళిపోతుంటే ఆమెకు మధ్య దారిలో మెలకువ వచ్చి ''నేను దశరధుని కోడలిని. నన్ను రక్షించేవారు ఎవరూ లేరా.?'' అన్న సన్నివేశం, మహా పతివ్రత ద్రౌపదిని కౌరవ సభలో నిర్దాక్షిణ్యంగా జుట్టు పుచ్చుకుని ఈడ్చుకువెళ్లినపుడు నిస్సహాయ స్థితిలో ''నన్ను కాపాడే వారే ఈ సభలో లేరా'' అని ఆక్రోశించిన సన్నివేశం లో ఆడదాన్ని నిస్సహాయురాలిని చేసిన మగవాడి మదాన్ని తలుచుకుంటే నా గుండె మండి పోతుంది. ఆ సమయాలలో ఆ స్త్రీమూర్తుల మాససిక క్షోభ వర్ణించడానికి ఏ భాషా చాలదు అనిపిస్తుంది నాకైతే.

మరి ఈ కలియుగంలో ఈ మృగాళ్ల మధ్య మధు ఎలా బతుకుతోందో పాపం?

ఆలోచిస్తున్న కొద్దీ ఆలోచనలతో నా బుర్ర వేడెక్కిపోసాగింది. ఇక లాభం లేదనుకుని రెండు అరటి పళ్ళు తిని , 'ఆల్జోలామ్ ' బిళ్ళ వేసుకుని ప్రశాంతంగా నిద్రపోయాను.

*****

వారం రోజుల్లో కొరియర్ లో నేను ఆర్డర్ చేసిన జనపనార బాగ్స్ నా ఇంటికి చేరాయి. వాటి తో పాటు మరొకటి కూడా నా ఆఫీసుకు చేరింది .అది. .అది మధు రాసిన వుత్తరం. విప్పి ఆతృతగా చదివాను.

''బావా...ఎంత మంచి పిలుపు బావా అది..ఈ ప్రపంచంలో నాకు తెలుగు భాషలో అత్యంత ఇష్టమైన పదం బావా అది. దాని తరువాత మీ మగజాతిలో కేవలం నువ్వంటే ఎంతో ఇష్టం బావా.ఎంత అంటే? మనసా. ..వాచా. ..కర్మణా. .అంటారే. ..అలాగ

ఇవేవో నిన్ను ఇంప్రెస్ చేసేసి నా పట్ల నువ్వు జాలి పడిపోయేలా చేసే మాటలు కావు బావా. ఒక్క మాటలో చెప్పాలంటే ఏనాడైతే మా అమ్మ నిన్ను చూపించి 'వాడే నీ మొగుడమ్మా' అని చెప్పిందో ఆరోజునుంచి నువ్వు నా ఆరాధ్య దైవానివి బావా.

నా జీవితం లోకి కొన్ని మగ జంతువులు వచ్చాయి . పోయాయి . కానీ వారిలో నేను అనుక్షణం చూసుకున్నది నిన్నే బావా...అందుకే జంతువులూ కూడా సిగ్గు పడిపోయేటట్లు వాళ్ళు ప్రవర్తించినా నీ పట్ల మధుర భావన తో అన్నీ భరించాను బావా.

నిన్ను ఎంత మనస్ఫూర్తిగా ప్రేమించానంటే,అమ్మ నాకు ఎవడినో ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నప్పుడు ఆలోచించకుండా చేతిని కోసేసుకుని హాస్పిటల్లో వారం రోజులు నరకం అనుభవించాను బావా. కానీ నీ పట్ల నా నిర్మలమైన ప్రేమ అంత బాధలోనూ హాయిని ఇచ్చి నన్ను బ్రతికించింది.

నేను ఇలా తయారవ్వడానికి కారణం నాలాంటి ఒక ఆడది అయిన మా అమ్మ. నా పట్ల అతి ప్రేమ పెంచుకుని, నన్ను నీ పక్కన ఊహించుకుని నాన్నను సాధించాననుకుని, ఆయన పోయాకా ఎదురైనా పరిస్థితులను సాధించలేక నన్ను ఆట బొమ్మను చేసి నా బ్రతుకు తనవల్ల ఇలా అయిపోయిందే అన్న మానసిక వేదనతో క్రుంగి, క్రుంగి కృశించి, కృశించి చచ్చిపోయింది బావా.

ఇపుడు నేను దిక్కు లేనిదాన్ని కాదు బావా. అనాధాశ్రమం నుంచి ఒక అబ్బాయిని తెచ్చుకుని పెంచుకుంటున్నాను. వాడి పేరు ఏమిటో తెలుసా బావా. నీ పేరే ‘వేణుగోపాల్ ‘. హాస్టల్ లో పెట్టి చదివిస్తున్నాను. ఇపుడు ఆరవ తరగతి చదువుతున్నాడు. నా స్వచ్ఛమైన కష్టార్జితం తో వాడిని పెంచుకుంటున్నాను బావా. వాడికి నా జీవితం గురించి తెలీదు. తెలిసిన మరుక్షణం ఈ లోకం లో నేను ఉండను.

ఇక చివరగా - నాకు జీవితం లో ఒకే ఒక్క కోరిక బావా. అది ఈ జన్మకు తీరదు. నేను చేసిన పాపాలకి మళ్లీ జన్మలో మనిషిగా మాత్రం పుట్టను. అందుకని నాకు ఇష్టమైన నీతో చెప్పుకుంటున్నాను బావా. నీ చేత మనస్ఫూర్తిగా ప్రేమించబడిన ఒక ప్రేమ పక్షిలా మనిద్దరం తనువూ మనసు ఏకమై ఎగిరిపోవాలని, నా జీవితమంతా అనుక్షణం నీ ప్రేమలో తరించిపోవాలని నా కోరిక బావా. అలా మనమిద్దరం 'ఎగిరిపోతే ఎంతబాగుంటుందీ?'

ఆ ఊహే నన్ను నిలవనీయడం లేదు బావా. ఆరోజు చివరగా కోపంతో నన్ను కసురుకున్నావు చూడు. ఎంత అదృష్ట వంతురాలిని బావా. .కనీసం ఆ జ్ఞాపకమైనా నాకు మిగిల్చావు. అందుకే నిన్ను లేపాక్షిలో పలకరించలేదు బావా. పలకరిస్తే ఆనందం తట్టుకోలేక అపుడే చచ్చిపోయి ఉండేదాన్ని. నా బిడ్డ అనాధ అయిపోతాడని నవ్వుతూ వెళ్ళిపోయాను. నన్ను మన్నించు బావా- నీ అమూల్యమైన కాలాన్ని ఈ ఉత్తరంతో వృధా చేస్తే.

ఎపుడైనా నేను లేను. ..అని తెలిస్తే నాకోసం ఒక్క కన్నీటి బొట్టు రాల్చు బావా. నా జీవితం దానితో ధన్యమౌతుంది. అన్నట్టు నీకు నా పూర్తి పేరు తెలీదు కదూ. నేను పుట్టినప్పుడు మా అమ్మ అడిగితే ''మధువర్షిణి '' అని పెట్టు అత్తయ్యా అది నాకు చాలా ఇష్టమైన పేరు - అన్నావటగా. అవును బావా నా పేరు అదే.

నీకు ఏమీ కాని - మధువర్షిణి. ''

ఎన్నిసార్లు చదివానో. ..ఎంతసేపు నా కళ్ళు వర్షించాయో తెలీదు. ''మధు. నీచేత ఇంతగా ప్రేమింప బడటం నా అదృష్టం. నిన్ను గాజు ముక్క అనుకున్నాను. దేవుని కిరీటం లో అలంకరించవలసిన వజ్రానివి నువ్వు. నిన్ను అర్ధం చేసుకున్న నాకు తెలుసు . క్షమించు మధు. మనస్పూర్తిగా నన్ను క్షమించు.'' అనుకుని నిర్లిప్తంగా కళ్ళుమూసుకున్నాను.

                                                        సమాప్తం


 

 

 

 

 



Rate this content
Log in

Similar telugu story from Tragedy