ఏంటి బావ మరీనూ...!!!(సరసమైన కధ
ఏంటి బావ మరీనూ...!!!(సరసమైన కధ
ఏంటి బావ మరీనూ...!!!(సరసమైన కధ)
” అక్కా! బావ గారి ఫ్రెండ్స్ నేను కంటికి కనిపిస్తే చాలు ఏదో ఒకటి తెమ్మనో, ఇమ్మనో, అవసరం లేకపోయినా అడుగుతున్నారే...!” అక్క అఖిలాతో ఫిర్యాదు చేసింది అవంతి.
‘’అయితే అటు వైపు వెళ్ళకు’’ ఠకీమని సమస్యకు పరిష్కారం వచ్చింది అఖిల.
కొంగుముడి విడతీయకుండా అప్పుడే అన్ని సాంప్రదాయిక పూజలు పూర్తి చేసుకున్న ఆ నవ దంపతులు ఆ గదిలో దూరదూరంగా ఒకే మంచం పై నడుములు వాల్చారు.
అంబరీష్ కి బాగా అలసటగా ఉంది కళ్ళు మూతలు పడిపోతున్నాయి. తెల్లవారుజాము ముహూర్తమేమో, అందునా పెళ్లి చేయించే పురోహితుడు పరమ శ్రోత్రియుడు, పండితుడు కావడంతో రాత్రి ఒంటిగంటకే పీటల మీద కూర్చో పెట్టేశాడు. ఉదయం 10:00 వరకు అలానే ఆ సరదాలు ఈ ముచ్చట్లు అంటూ అన్ని కార్యక్రమాలు పూర్తయి నడుము వాల్చి విశ్రాంతి తీసుకుందాం అనుకుంటున్న సమయంలో అవంతి సమస్య - అఖిల పరిష్కారం అతనిని ఒక్క క్షణం ఆలోచింపజేశాయి.
ఆడదానికి కావలసింది ఓర్పు సహనం. అవి లేనివారికి మాటకారితనం ఉంటే చాలు. ఠక్కున అవతలవారి దూకుడుకు కళ్లెం పడుతుంది. కిటికీలోంచి బయట హాలో జరుగుతున్న వడ్డన అంతా కనిపిస్తోంది.
అక్క గారి మాటతో తలవంచుకుని వెళ్ళిపోతున్న అవంతిని అంబరీష్ ఫ్రెండ్స్ మళ్ళీ పిలిచారు.
‘’ మిస్. మిమ్మల్నే...”
‘’అమ్మో దొరికిపోయానురా భగవంతుడా’’ అనుకుంటూ అవంతి ధైర్యం తెచ్చుకుని ‘’ఏం కావాలి సార్’’ అంది వెక్కిరింతగా.
‘’మావాడికి బూరెలు అన్నా బూరెలాంటి బుగ్గలన్నా బలే ఇష్టమండి. రెండు వడ్డిస్తారా?’’ ప్రకాష్ అడుగుతున్నాడు.
సరిగా వినబడక అవంతి మళ్లీ అడిగింది.’’ ఏమిటి’’
‘’బూరెలండీ.. బూరెలు కావాలి’’ అవంతి బూరెలు పట్టుకొచ్చింది.
అప్పుడు మొదలెట్టారు అసలైన అల్లరి వారందరూ.
‘’ ఏవండీ మా వాడికి రెండేయండి.వాడికి బూరెలు అంటే చాలా ఇష్టమండి’’ ప్రకాష్ మహేష్ ని చూపిస్తూ.
మహేశ్ కి రెండు బూరెలు వేసింది అవంతి.
‘’ వాడికి 4 వేయండి’’ అన్నాడు మహేష్ వంశీని చూపిస్తూ.
‘’ అబ్బే. వద్దండి వాడలాగే చెబుతాడు’’ వంశీ అడ్డుగా చేతులు పెడుతూ అన్నాడు.
‘’ మీరు వేస్తారా వేయరా?’’ మహేష్ సీరియస్ గా అడిగాడు.
అవంతి గబగబా వంశీ చేతుల మధ్య ఖాళీలోంచి నాలుగు వేసింది.
‘’ వేసేయండి అన్నీ. మీకు ఎవరంటే ఇష్టమైతే వాళ్లకి వేసేయండి. మేము ఎండిపోయిన చేతులు నాక్కుంటూ కూర్చుంటాము’’ అన్నాడు ప్రకాష్ వెక్కిరింతగా.
అవంతి నిస్సహాయంగా నిలబడిపోయింది.
ఆమె కళ్ళలో గిర్రున నీళ్ళు తిరిగాయి. అక్క మాట వినకుండా వచ్చినందుకు బాగా అయింది తనకు.అసలు ఇలాంటి వాళ్లను పిలిచినందుకు బావగారు తన్నాలి.’ చెప్తాను బావ నీ పని’ అనుకొని బూరెల బకెట్లు అంతా ప్రకాష్ ఆకులో గుమ్మరించి అక్కడినుంచి విసురుగా వెళ్ళి పోయింది అవంతి.
********
‘’అక్కా... బావ గారికి తల స్నానం చేయించాలట/ చేశాక నిన్ను తీసుకుని మన ఇలవేల్పు అయిన సంతాన వేణుగోపాలస్వామి ఆలయానికి వెళ్ళి రావాలట. వస్తూ కొండమీద రాట్నాలమ్మ తల్లి దర్శనం చేసుకుని ఆమెను మట్టుకు రావాలట. అలా అయితే నీ కడుపు తొందరగా పండుతుందట. లే...లే... బావగారిని స్నానానికి రమ్మను. చేయిస్తాను.’’ అవంతి పెద్ద ఆరిందాలా వచ్చి అఖిలతో చెప్పింది.
‘’స్నానమేగా... ఆయన చేసేస్తారు లేవే..’’ తేలికగా అనేసింది అఖిల.
‘’ నీ బొంద. ఈ స్నానంతో బావగారు ఎలాంటివారో తెలుస్టారట’’. మామూలు స్నానం అనుకుంటున్నావా ఏమిటి? 11 బకెట్ల జల్లెడ స్నానం.’’
‘’జల్లెడ స్నానమా ? అదేమిటే?’’
‘’ పట్టణంలో అమ్మనాన్నల దగ్గర పెరిగిన పిల్లవు. కాలిగోటి నుంచి కంటిపాప వరకు మ్యాచింగ్ అయితే నేర్చుకున్నావ్ కానీ నువ్వు మగాళ్లను స్టడీ చేయలేదే అక్కా! మరి నేను నాకు జ్ఞానం వచ్చినప్పటినుంచి అమ్మమ్మ దగ్గర పల్లెటూర్లో పెరిగాను కాబట్టి మడి-దడి, ఆచారం. సాంప్రదాయం, పూజా-పునస్కారం నోములు వ్రతాలు ఇవన్నీ వంటబట్టాయి. మన కరణంగారి భార్యా వెంకటేశ్వరమ్మ గారు, పోస్ట్ మాస్టారి భార్య వసుంధరమ్మగారు అందరూ అక్కడ నిరీక్షిస్తున్నారు. పని కట్టుకుని నా స్నేహితురాళ్లని పది మందిని కూడా తీసుకొచ్చాను.బావగారిని తీసుకుని గబగబా రా...’’ అవంతి కంగారుగా వెళ్లి పోయింది.
అంబరీష్ అఖిలతో కలిసి స్నానాల గదికి వస్తూనే విస్తుపోయాడు. అక్కడ సుమారు 15 మంది ఆడవాళ్ళు వివిధ సామాన్యుల తో రెడీగా ఉన్నారు.
విశాలమైన పెరడులో కుడి పక్క నిలబడి స్వాగతం చెబుతున్నట్టుగా అరటి, జామ. సపోటా, మామిడి చెట్లు ఉన్నాయి. వాటికి అవతల విశాలమైన బావి, బావి చుట్టూ విశాలమైన సిమెంట్ పళ్ళెం, వాడిన నీరు బయటకు పోయేందుకు ఏర్పాటు ఉన్నాయి. ఎడమ పక్క విశాలంగా తాటాకులతో కట్టిన స్నానాల గది పడకగది అంతా విశాలంగా ఓపెన్ గా ఉంది.
‘’ఇదేమిటి అఖిలా? స్నానానికి కూడా సినిమా షూటింగ్ లెవెల్లో ఏర్పాట్లా?’’ అఖిల బదులు అవంతి సమాధానం ఇచ్చింది.
‘’ ఏంటి బావ మరీను? అంత సిగ్గాయితే ఎలా? ఈ స్నానం అలాంటిలాంటిది కాదు. నువ్వు ఒక్కడివే బేబీ బాత్ చేయడానికి ఇది నీ పట్టణం కాదు. ఇక్కడ మా పద్ధతిలోనే జరగాలి.’’ అంటూ చనువుగా చేయిపట్టి లోపలకు తీసుకుపోయింది. అఖిల కూడా లోపలకు రాబోతుంటే ‘’ అబ్బా అక్కా! మీ ఆయన్ని నేనేమి కొరుకు తినం లేవే. మీ ఆయన శీలానికి నేను కాపలాగా ఉంటాగా. అయినా అసలు ‘శీల’ పరీక్షకే ఈ ఏర్పాటంటా.’’ అని ఆపేసి నూనె గిన్నె పట్టుకున్న ఆమెతో అంది.
’’ పెద్దమ్మ గారు రండి’’ అంటూ బావగారిని స్నానాల గదిలో విశాలమైన స్టూలు మీద కూర్చోబెట్టింది.’’ కళ్ళు మూసుకోండి బావగారు. లేకపోతే ‘మావన్నీ మీకళ్ల పడతాయి.’’ద్వందార్ధంగా అంది అవంతి.
ఆ పెద్దావిడ హిప్నటైజ్ చేసే మంత్రగత్తెలా అతని ముందు నిలబడి ఘుమగుమలాడుతున్న నూనెను అదేదో మంత్రం చదువుతూ మాడు మీద మూడు సార్లు అద్ది తల మర్దనా చేసింది.
‘’ నీ తల్లి లాంటి దాన్ని. ఏమనుకోకు నాయనా’’ అని ఒళ్లంతా నూనె పూసి నిష్క్రమించింది.
ఆ తరువాత మరోక పెద్ద ముత్తయిదువ సున్నిపిండి, పాలమీగడ, కొద్దిగా పసుపు కలిపిన మిశ్రమాన్ని అతని శరీరం నిండా పూసింది. అలా పర స్త్రీల మధ్య - పుట్టి బుద్ధేరిగి ఏనాడూ స్నానం చేయకపోవడంతో సిగ్గుతో ముడుచుకుపోసాగాడు అంబరీష్. పైగా అతనికి కితకితలు చాలా ఎక్కువ.
అప్పుడు దిగారు అవంతి స్నేహితురాళ్ళు రంగంలోకి. ఒకరు వీపు, ఒకరు ఛాతి, ఇద్దరు చెరో చెయ్యి మరొక ఇద్దరు చెరో కాలు పట్టుకొని ఒళ్ళంతా ఎర్రగా కందిపోయేలా ఒళ్ళంతా నలిచి పెట్టారు. అందులో అతనికి ఒళ్ళంతా రోమాలేమో, అవి వూడి వచ్చేలాగా నలిచారు.
‘’ ఏం బావగారు ఎలా ఉంది? నేను ఇక్కడే ఉన్నాను. కంగారుపడకండి ‘’అంటూ నవ్విస్తూ అల్లరి చేస్తూ అవంతి ఆ కార్యక్రమం పూర్తి చేసింది.
కుంకుడు కాయ రసంతో పరిశుభ్రంగా తలంటారు. ఇప్పుడతను సర్ఫ్ బాగా వేసి గిలక్కొట్టిన నీళ్ళ బకెట్లా నురగలతో నిండి ఉన్నాడు.
‘’ ఏమే. ఆ జల్లెడ ఇలా అందుకోండి’’ అవంతి ఓ స్నేహితురాలితో అంది.
‘’ ఊరంతా తిరిగి తిరిగి తెచ్చాను జాగ్రత్తమ్మా. కనీసం స్నానం అయ్యేంతవరకైనా పని చేసేలా చూడండి.’’ అంటూ అవంతికి అందించింది ఆ అమ్మాయి.
ఒక అమ్మాయి అంబరీష్ వెనక బల్లమీద అతని తలపై జల్లెడ పట్టుకుని నిలబడింది. మరొక అమ్మాయి సుగంధ పరిమళాలు వెదజల్లుతూ గులాబీరేకులు తేలియాడుతున్న ఒక్కొక్క బిందె నీళ్లు అందిస్తుంటే, మరొక అమ్మాయి అవంతి పక్కన నిలబడి ఇద్దరూ కలిసి జల్లెడలో పోయసాగారు. అది పాతకాలపు ధాన్యం జల్లించుకునే జల్లెడ. దానికి రెండు మూడు కట్లు ఊడిపోయి, తుమ్మితే ఊడిపోయే ముక్కులా ఉంది.
మొత్తానికి ఒక బిందె వెనుక మరొకటి ...అలా పదకొండు బిందెల చన్నీళ్ళు ఆపకుండా, అంబరీషుని కనీసం సరియైన ఊపిరి కూడా పీల్చుకొనివ్వకుండా స్నానం పూర్తి చేయించారు వాళ్ళు.
ఆఖరి బిందె పోస్తుండగా అనుకున్నట్టుగానే జల్లెడ అడుగున వెదురు అంతా ఊడిపోయి ఆ పలుచని వెదురు బద్దలు అన్నీ అతని శరీరం మీద తలోకటీ వ్రేలాడసాగాయి,
అవంతి, ఆమె స్నేహితురాళ్లు నవ్వాపుకోలేక విరగబడి నవ్వసాగారు. ఏం జరిగిందోనని బయట ఉన్న అఖిల కంగారుగా లోపలకు పరిగెత్తుకువచ్చి జారి పడబోయి అంబరీషుని బలంగా వాటేసుకుంది. అతని మీద వెదురు బద్దలు జారీపోయేలా ఆఖరిగా స్నానం చేయిద్దామని అవంతి ఆమె స్నేహితురాలు ఎట్టి పోస్తున్న నీళ్లు అంబరీష్ తో పాటు అఖిల మీద కూడా పడి ఆమెను కూడా నిలువెల్లా తడిపేసాయి.
‘’చాల్చాల్లేవే నీ అల్లరి. ఆయనకు అసలే చన్నీళ్లు పడవు. ఆయనకు ఏమైనా తేడా చేస్తే బాధపడేది నువ్వా? నేనా?’’ చిరు కోపంగా అని తన భుజం మీదున్న తువ్వాలు అతని మీద వేసి అతని తలను తన గుండెలకు అదిమి పెట్టి గబగబా తుడిచి ‘’మీరు రండీ’’ అంటూ అతనిని తీసుకు పోయింది అఖిల అక్కడ నుంచి,
‘’ ఇప్పుడు కాదులే. కాసేపు ఉన్నాక నేను చెప్పే విషయం ఉంటే నువ్వు నిజంగానే బాధ పడతావు.’’ వెళ్తున్న అక్క వైపు వెక్కిరిస్తున్నట్టుగా అని ‘’ లేకుంటే తన ఫ్రెండ్స్ నన్ను ఏడిపిస్తారా?’’’అంటూ తన స్నేహితురాళ్లతో కలిసి విజయం సాధించినట్లుగా చప్పట్లు కొట్టు సాగింది అవంతి.
*********
అంబరీష్ ని తయారు చేసి తను రెడీ అవుతుంటే అఖిల దగ్గరికి వచ్చింది అవంతి.
‘’ అక్కా నువ్వు బాధ పడడనంటే నీకు ఒక విషయం చెప్తాను.’’
‘’ ఏమిటి? ఐదు నిముషాలు కూడా కాలేదు. మళ్ళీ అల్లరా?’’
‘’లేదక్కా.. సీరియస్ గా చెబుతున్నాను, నిజంగా!’’
‘’ అయితే చెప్పు’’
‘’ బావగారు... బావగారు పతివ్రతుడు కాదక్కా!’’
అఖిల అవాక్కయింది ఒక్క క్షణం. తర్వాత పకపకా నవ్వింది.
‘’నీ బొంద. మగవాడు పతీవ్రతుదేమిటే?’’ బలవంతంగా నవ్వు ఆపుకుంటూ అంది.
‘’ ఆడదాన్ని పతివ్రత అంటే మరి మగవాడిని పతివ్రతుడు అనేగా అంటారు. బావగారు చేసినవన్నీ పాపపు పనులే.’’
‘’అంటే?’’
‘’ అంటే... ఆయన క్యారెక్టర్ అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ధాన్యపు జల్లెడ ఆయన తల మీద పెట్టి అందులో నీళ్ళు పోస్తే మొత్తం అన్ని కారిపోవడమే కాదు. ఆ వెదురు జల్లెడ అడుగుభాగం కూడా ఊడిపోయింది. ఆయన ఎంత “అపతివ్రతుడు” కాకపోతే అలా జరుగుతుంది చెప్పు?’’
‘’జల్లెడలో నుంచి నీళ్లు పోస్తే కారిపోక ఉంటాయా? అదేదో పాతకాలపు జల్లెడ అయి ఉంటుంది అందుకే అడుగు ఊడిపోయింది.’’
‘’అబ్బా.. నిజమైన పతివ్రతుడైతే జల్లెడలోంచి ఒక్క చుక్క నీరు కూడా కారదక్కా. ఇది నిజం నీవు ఇలా అంటావనే నేను సాక్ష్యంతో వచ్చాను.’’
ఏమిటా సాక్ష్యం?’’
‘’ పూర్తిగా వినకుండా నన్ను తిట్టకూడదు మరి’’
‘’తిట్టనులే చెప్పు’’
‘’ మనకు మన సాంప్రదాయాలు కట్టుబాట్లు పెద్దల నుంచి సంక్రమించినవే కదా. రామాయణం, మహాభారతం భాగవతం వీటన్నిటిని ప్రతి తెలుగు తల్లి తన బిడ్డకు అంతోఇంతో నూరిపోస్తుంది కదా. అలాగే భర్త శీలవంతుడా కాదా అని తెలుసుకోవడానికి నేను ఒక పుస్తకం చదివాను. ఆ కధలో ప్రకారమే బావ గారికి స్నానం చేయించాను.’’
‘’ ఇంతకీ కథ ఏమిటంటే...వింటున్నావా?’’
‘’ వినకపోతే వూరుకుంటావా? చెప్పు.’’
‘’ నారదుడికి ఈ లోకంలో మహాపతివ్రత ఎవరు? అని సందేహం వచ్చిందట. మహావిష్ణువు ను అడిగితే ఆయన ఒక మునీశ్వరుని భార్యను భూలోకంలో చూపించాడట. ఆవిడే మహా పతివ్రత అని ఎలా స్వామీ నాకు తెలిసేది అని అడిగాడట నారదుడు. అందుకాయన ‘ఆమె నెత్తిమీద ఒక ధాన్యపు జల్లెడ పట్టి అందులో నీరు పోసి చూడు ఒక్క రంధ్రంలనుంచి కూడా నీరు కారకుండా ఉంటే ఆమె మహాపతివ్రత ‘అన్నాడట
నారదుడు భూలోకం వచ్చి ఆ మునీశ్వరుని భార్య అనుమతి తీసుకుని ఆమె తలపై జల్లెడ ఉంచి నీరు పోసాడట. ఒకే ఒక రంధ్రంలో నుంచి నీరు కారిందట. నారదుడు ఆమెను ‘అందుకు కారణం ఏమిటి అమ్మా’ అని అడిగాడట. అందుకు ఆమె ఇలా సమాధానం చెప్పిందట.
‘ స్వామి నాకు తెలిసి ఒకే ఒక తప్పిదం చేసాను. అదికూడా తెలీక చేసిందే. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కదా!
అది చిక్కటి శీతాకాలం. నా భర్త స్నానానికి నదీ తీరం వెళ్లారు. నేను కుక్కి మంచం లో కూర్చుని నా బిడ్డకు పాలు తాపుతూ కిందకుంపటి సెగను అరచేతితో బిడ్డ శరీరానికి అడ్డుతున్నాను. అంతలో నా భర్త తలుపు తెచ్చుకుని హఠాత్తుగా లోపలకి వచ్చేశారు. ధర్మశాస్త్రం ప్రకారం భర్త అనుమతి ఇవ్వకుండా భార్య అతని ముందు కూర్చోకూడదు. ఈ సూక్ష్మ దర్శనం ధర్మం తెలిసిన నేను లేద్దామని ప్రయత్నించాను. లేస్తే బిడ్డ కుంపట్లో పడుతుంది. లేవకపోతే భర్త ఎదురుగా అపరాధం చేసినదానినౌతాను. అయినా లేవలేకపోయి అశక్తురాలిగా ఉండిపోయాను. నాకు తెలిసి నేను చేసిన పాపం అదే’’ అందట.
‘’ మరి బావ నెత్తిన జల్లెడ అడుగు కూడా ఊడిపోయింది. దీన్నిబట్టి బావగారు ఎంత పాపాత్ముడో, ప్రతివ్రతుడి లక్షణాలు లేని వాడు అర్థమవుతోంది’’ అవంతి మాటలు పూర్తికాకుండానే అఖిల గయ్యిమని లేచింది.
‘’ఓసినీ అసాధ్యం కూలా.. ఎక్కడో ఏదో పురాణ కధ చదివి దాన్ని ఈ వేళ మీ బావ మీద ప్రయోగిస్తావా? నీకసలు బుద్ధుందా? అందుకే అమ్మతో సవా లక్ష సార్లు చెప్పాను. నిన్నీ పల్లెటూర్లో అమ్మమ్మ దగ్గర ఉంచితే తనలాగే నిన్నూ తయారు చేస్తుంది అని, అమ్మఅమ్మ వినలేదు. నువు అమ్మమ్మకి అమ్మలా తయారయయావు. ఆ నాటి పరిస్థితులు. పద్ధతులకు అనుగుణంగా వాళ్ళు బతికారు కాబట్టే మహాపతివ్రతలుగా చరిత్రలో మిగిలారు.
కాలానుగుణంగా మనిషి మారాలే! అప్పటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా? అయినా నాకు తెలియక అడుగుతాను. నువ్వు లంగా, ఓణీ ఎందుకు వేసుకుంటున్నావే? ఈనాటి పద్దతులబట్టే కదా. పోనీ ఆ ముని కన్యాలా డ్రస్ వేసుకుని ఒక రోజు వూళ్ళో తిరిగి చూడు. జనాలు ఏమంటారో తెలుస్తుంది. అందుకని పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని అందంగా ఆరోగ్యంగా ఆలోచించడం నేర్చుకో. మీరు పది మంది ఆయన చుట్టూ చేరి ఆయనని ముట్టుకుని పట్టుకుని స్నానం చేయించారు కదా. దాంతోనే ఆయన పాతివ్రత్యం గంగలో కలిసిపోయింది. పోనీ మగాడికి పాతివ్రత్యం ఏమిటిలే అనుకుందాం. మీ బావగారిని ముట్టుకున్న నువ్వు నీ ఫ్రెండ్స్ పతివ్రతలు కారుగా. పాత చింతకాయ పచ్చడి ఆలోచనలు మాని నాతో పట్నం రా. నీకు కౌన్సిలింగ్ ఇప్పించి పూర్తిగా మార్చకపోతే రేపొద్దున వచ్చే వాడి బతుకు యమగండమే పాపం. ఆయన ఎలా ఉన్నారో ఏమిటో... ఆయనకేమైనా తేడా రావాలి .నీ పని చెబుతాను.’’ అంటూ అంబరీష ఉన్న గదివైపు పరుగెత్తింది అఖిల.
అవంతి ఆలోచనలో పడిపోయింది.
****************
ఆ రాత్రి అంబరీష్ కి బాగా జలుబు చేసి జ్వరం వచ్చింది.
ఆ సాయంత్రం వేణుగోపాలస్వామి ఆలయానికి వెళ్ళడం పైగా చల్లటి గాలిలో తిరగడం వల్ల కాబోలు.
ఆ రాత్రంతా అంబరీష్ పక్కన తలకు అమృతాంజనం రాస్తూ కరెంటు పోతే విసనకర్రతో విసురుతూ, డోసేజీ ప్రకారం టాబ్లెట్ వేస్తూ గంటగంటకు ఏదో ఒక ద్రవపదార్థం తాగిస్తూ... రాత్రిల్లా కంటికి రెప్పలా చూసుకుంది అఖిల.
ఉదయం రిలాక్స్డ్ గా అనిపించింది అంబరీష్కు.
లేటుగా లేచిన అఖిల అవంతితో మాట్లాడలేదు ఉదయం లేచిన దగ్గర్నుంచి,
స్నానం అయ్యాక అఖిల అంబరీష్ గదిలోకి వచ్చింది - ఇడ్లీ. కారంపొడి, నెయ్యి, మంచినీళ్లతో.
‘’జ్వరంగా ఉంది కదోయ్. తినగలనా?’’ అడిగాడు
మంచం మీద డిందునానుకుని కూర్చున్న అతని పక్కనే కూర్చుంటూ ‘’నేను తినిపిస్తాగా మీకు. ఏం కాదు. కానివ్వను నేను. జ్వరమా పాడా. నేను ఉండగా దేన్నీ మీ దరిదాపులకు కూడా రానివ్వను’’ అంటూ ఇడ్లీ ముక్క విరిచి కారంపొడిలో అద్ది అతని నోటికి అందించింది అపురూపంగా.
దానిని నమిలి తింటూ అఖిల రెండవ చేతిని తన చెంపలకు ఆనింసుకుని తన్మయత్వంతో కళ్ళు మూసుకున్నాడు అంబరీష్. ఆ వెచ్చని స్పర్శ కు ఒక్క క్షణం పరవశురాలైన అఖిల తమాయించుకుని ‘’ముందు టిఫిన్ తినేయండి. ఆ తర్వాత మిమ్మల్ని డిస్టర్బ్ చేసే వారు ఎవరూ ఉండరు.’’
ఆమె వైపు అనురాగంతో చూస్తూ అతను తింటుంటే అతని సన్నిధే తన పెన్నిధి అన్నంత హృద్యంగా ఆమె అతనికి తినిపించి మంచినీరు అందించింది.
‘’ ఆ మూర్ఖురాలు చేసిన పనికి మీరు ఏమీ అనుకోకండి. అవంతికి రోషం ఎక్కువ. ఎవరైనా తనను ఏడిపిస్తే భరించలేదు. తను మాత్రం ఎవరినైనా ఏడిపిస్తుంది. నాకు తెలిసి మీ ఫ్రెండ్స్ ఏడిపించినప్పటినుంచి దానికి మహా ఉక్రోషంగా ఉంది. అందుకే దానిని ఉదయం లేచాక పలకరించలేదు.’’
‘’అదేంటి అఖిలా తప్పు కాదు? తనంటే పల్లెటూరులో పెరిగింది. నువ్వు చక్కగా చదువుకొన్నదానివి. ఇలాంటి సమయంలో పరిస్థితిని చక్కదిద్దాల్సిన నువ్వే అలా చేయడం బాగుండలేదు.’’
అది మీకు చేయించిన స్నానం బాగుండి ఉంటుంది. అందుకే నా మాటలు మీకు కష్టంగా ఉన్నట్లున్నాయి. అది సరేగాని మీకు ఇబ్బంది అనిపించలేదా? నేనయితే దడదడలాడి పోయాను తెలుసా’’ అంది నవ్వుతూ. ‘’చాలా హ్యాపీగా అనిపించింది నా జీవితంలో అలాంటి స్నానం ఎప్పుడూ చేయలేదు. అబ్బా !ఆ దృశ్యం తలుచుకుంటేనే మనసు దూదిపింజలా తేలిపోతుందనుకో. వార్డు పల్లెటూరు ఆడ పిల్లలా. కంచులు. వేళ్ళమధ్య కండరాలు ఇరికించి పైనుంచి కిందికి మర్దిస్తుంటే ‘vow’ అనిపించింది అనుకో. అన్నట్లు... నేనే స్నానం చేసేది కదా... అని మామూలుగా టవల్ కట్టుకొని వచ్చేశాను.’’
‘’అంటే మిమ్మల్ని మొత్తం వాళ్లు చూశేసారంటారా? ఛీ పాడు. వాళ్ళు చివరవరకు స్నానం చేయించారు అంటే మీరు జాగ్రత్తగానే కూర్చున్నారన్నమాట. ‘’
‘’ నిజంగా చూసేసారు అనుకో ఏం చేద్దువు?’’
‘’ చూడడం వేరు. అనుభవం లేదుగా..’’
‘’ అనుభవం అంటే?’’
‘’ మీ జ్వరం పుణ్యమా అని ఫస్ట్ నైట్ రేపటికి వాయిదా పడింది గా. అది జరిగాకా తెలుస్తుంది ‘అనుభవం’ అంటే ఏమిటో?’’
‘’ ఇప్పుడే ఆగలేక పోతుంటే!’’ ఆమె అతని గుండెలపై తలవాల్చి నడుం చుట్టు చెయ్యి వేసి దగ్గరగా హత్తుకున్నాడు.
సరిగ్గా అప్పుడు వినిపించాయి వెక్కిళ్ళు!
ఉలిక్కిపడి దూరంగా జరిగారు ఇద్దరు. అవంతి ఎప్పటినుంచి ఏడుస్తుందో కళ్ళు వాచిపోయి ఎర్రగా మంకెనపూవుల్లా ఉన్నాయి.
మంచం పట్టే దగ్గరగా వచ్చి అంది ‘’ బావ నన్ను క్షమించవా! అక్క ఉదయం నుంచి నాతో మాట్లాడలేదు!’’ అంది మరింత వెక్కుతూ. ‘’
‘’అవంతి నువ్వు సరదాగా చేసిన ఎందుకు చేసినా మా ఇద్దరిని ఒకరినొకరు బాగా అర్థం చేసుకునే చేశావు. నిజంగా నీ మీద నాకు కోపం లేదమ్మా..’’అఖిల అవంతిక కళ్ళు తుడిచి బుగ్గ చిదిమింది.
‘’ మీ బావకు మళ్లీ స్నానం చేయిస్తావా?’’ అఖిల మాటలకు అంబరీష్ ‘’నేను రెడీ;; అన్నాడు.
‘’ ఏంటి బావ మరీను’’ అంటూ అక్కడి నుంచి పారిపోయింది అవంతి!!!
సమాప్తం

