దురభిమానాలు
దురభిమానాలు
ఏ మతం లోనైనా మనశ్శుద్ధి కలవారు చాలా అరుదు. అన్ని మతాల వారు పర మతాలలోని లోటుపాట్లు చెప్పేవారే తప్ప, తమ మతాన్ని త్రికరణ శుద్ధిగా అనుసరించేవారు కనుమరుగై పోతున్నారు.
మతం మనిషికి ఎంత ఉపకారం చేసిందో అంత అపకారము చేసింది. చేస్తోంది. మత సంబంధమైన రైట్యువల్స్, కార్యక్రమాలు చెయ్యడంతో పాటు మానవతా దృక్పథం కూడా మనిషికి ఉండాలని చాలా మతాలు, మత పెద్దలు చెప్పడం లేదు. పైగా మతం పేరుతో జరిగే నరమేధాన్ని అడ్డుకోవడం లేదు. పైపెచ్చు దానికి ఆజ్యం పోస్తున్నారు.
మతం అంటే మూఢత్వం, మూర్ఖత్వం, మూఢ
నమ్మకాలు అని ఇప్పటి యువతీయువకులు అనుకుంటున్నారు. ముఖ్యంగా హిందూ మతంలోని వారు ఇలా అనుకుంటున్నారు.
మిగతా మతాల వారికి అలా అనుకునే, మాట్లాడే స్వేచ్ఛ లేదు. భిన్నత్వం కల భారతదేశంలో, ఈ భిన్నత్వాన్ని మత గురువులు, మత, కుల పెద్దలు, రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం వాడుకుంటున్నారు. భారతీయుల్ని ఐక్యంగా మనసా, వ
చసా, కర్మణా ఉండనివ్వడం లేదు.
వీళ్ళ భీభత్సం ఎక్కువ ఐపోయింది. మతాన్ని అందరూ చీదరించుకునే స్థాయికి ఇంచు మించు అన్ని మతాలు దిగజారిపోయాయి.
మంచి చెప్పే మతాలే కరువయ్యాయి. రైట్యువల్స్ కి పరిమితమై, తత్త్వం మరచి,
మతాన్ని అంటరాని దానిగా మార్చేశారు.
ఎవరైనా మా మతం గొప్పది, మంచిది అంటే నవ్వొస్తోంది. మతాలన్నీ మానవతా దృక్పథం లేనివారి చేతిలో చిక్కి ఆ ఉక్కు పిడికిలిలో ఊపిరాడకుండా సతమతం అవుతున్నాయి.
అలాగే కులాల, ప్రాంతీయ, ఉపజాతీయతా, సిద్ధాంత దురభిమానాలు భారతీయుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వీటి ఆగడాలకి అడ్డూ, ఆపూ, అదుపూ లేవు. మానవతా దృక్పథం ఉన్నవారు ఈ దౌర్జన్యాలని, దౌర్భాగ్యాలని ఎంతో నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతున్నారు. ఏమీ చేయలేక మథన పడుతున్నారు. ఓటర్లు, ప్రజలు ఈ నకిలీ సరుకునే ప్రోత్సాహిస్తూ వారి వెనుక నడుస్తున్నారు. ఈ స్థితిలో మంచి మాటలు దున్నపోతు మీద వాన కురవడం వంటిది.