Venkata Rama Seshu Nandagiri

Romance


4  

Venkata Rama Seshu Nandagiri

Romance


చిగురించిన ప్రేమ

చిగురించిన ప్రేమ

5 mins 169 5 mins 169

ఎదురుగా సముద్రం లో అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. సుజన మనసు లో ఆలోచనలు ఆ సముద్రపు అలలతో పోటీ పడుతున్నాయి. సుజన పరిసరాలను మరచి తన ఆలోచనా స్రవంతిలో మునిగి పోయింది. నెమ్మదిగా చీకట్లు అలుము కున్నాయి. బీచ్ లో జనం పలుచ బడుతున్నారు. గట్టిగా ఎవరో అరవడంతో ఈ లోకం లోకి వచ్చిన సుజన కంగారుగా చుట్టూ చూసింది. ఎవరో బాబు అలల దగ్గరగా వెళ్ళబోతుంటే తల్లి గట్టిగా పిలిచింది. సుజన కూడా లేచి బైటికి దారితీసింది.

' అయ్యో, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అమ్మా, నాన్న ఎదురు చూస్తుంటారు. అసలు ఎప్పుడూ ఒంటరిగా రాని తాను ఒక్కతే రావడం, సమయాన్ని కూడా గమనించకుండా ఆలోచనలలో మునిగిపోవడం. ఛ, తప్పు చేశాను' తనలో తానే మధన పడుతూ ఆటో ఎక్కి ఇంటి దారి పట్టింది.

' అసలిదంతా అజయ్ వలన కాదూ. ఊరి నుండి రాగానే కలుస్తానని, అప్పుడే తమ భవిష్యత్ గురించి ప్రణాళిక సిద్ధం చేసుకొని తల్లిదండ్రులతో మాట్లాడదామని చెప్పాడు. తను చెప్పిన ప్రకారం అయితే క్రిందటి వారం వచ్చి తనని కలవాలి. కానీ ఏది, ఫోన్ కూడా లేదు.' ఇంతలో ఇల్లు రావడం తో ఆటోకి డబ్బులిచ్చి గుమ్మం లో అడుగు పెట్టేసరికి తల్లి రాజ్యలక్ష్మి కోపంగా ఎదురువచ్చి " ఏమిటే ఇది, ఎక్కడికి వెళ్ళావ్. అసలే రోజులు బాగా లేవు. మేం ఇక్కడ బెంగ పెట్టుకొని ఉంటే, ఫోన్ కూడా ఆఫ్ చే‌సేశావు ఏమైంది." గట్టిగా అడిగింది

"సారీ అమ్మా, చార్జింగ్ అయిపోయింది. చూసుకో లేదు. ఫ్రెండ్స్ తో బీచ్ కి వెళ్ళాను. అనుకోకుండా ఆలస్యమైంది." అంది సుజన

"పోనీ రాజ్యం, కారణం చెప్పింది కదా. వెళ్ళమ్మా. త్వరగా వస్తే భోజనం చేద్దాం." అన్నాడు తండ్రి రామారావు.

అమ్మయ్య అనుకుంటూ గదిలోకి వెళ్ళింది సుజన.

భోజనం అయ్యాక మంచం మీద పడుకున్నా ఆలోచనలు వదల లేదు. తనకి కాలేజీ లోనే అజయ్ పరిచయం అయ్యాడు. ఇద్దరూ ఒకరినొకరు ఇష్ట పడ్డారు. ఉద్యోగం వచ్చాక పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. చదువు పూర్తయి పోగానే అజయ్ కి ఉద్యోగం వచ్చింది. ఒక ఏడాదిలో కొంచం స్థిరపడి చేసుకుంటే బాగుంటుంది అని అజయ్ అనడంతో అదీ నిజమే అనిపించింది సుజనకి.

ఈ లోపున ఇంట్లో కొన్నాళ్ళు ఉద్యోగం చేస్తానని తర్వాత పెళ్లి చేసుకుంటానని సుజన తల్లిదండ్రులను అతి కష్టమ్మీద ఒప్పించింది. తల్లిని ఒప్పించడం చాలా కష్టమైంది.


సుజనకి ఉద్యోగం రావడం, అజయ్ కి ఆరు నెలలు. ఫారిన్ కి కంపెనీ పనిమీద వెళ్ళవలసి రావడం జరిగింది. ఈ ఆరునెలలు తల్లి ని ఆపడం సుజనకి గగనమైంది.15 రోజుల క్రితం అజయ్ తిరిగి వచ్చాడు. అజయ్ వెంటనే శెలవు తీసుకుని ఒక్క సారి ఇంటికి వెళ్లి ఇంట్లో వాళ్ళని ఒప్పించి వస్తానని, అప్పుడే సుజన ఇంట్లో ఇద్దరూ కలిసి చెప్పవచ్చని అనడంతో తాను ఒప్పుకుంది.

కానీ వెళ్ళిన దగ్గర నుండి సరైన కాంటాక్ట్ లేదు. వెళ్ళగానే ఫోన్ చేసి సమయం చూసి చెప్తానని చెప్పాడు. తర్వాత ఫోన్ చేసినా ఆ విషయం ఇంకా మాట్లాడలేదని దాటవేశాడు. ఇప్పుడు పది రోజుల నుంచి ఫోన్ లేదు. తను చేస్తే స్విచ్ఛాఫ్ అని వస్తోంది. ఏం చేయాలో పాలు పోవడం లేదు.

ఇలాంటి ఆలోచనలతోనే తెల్లారి పోయింది. గబగబా లేచి తయారయ్యి ఆఫీస్ కి వెళ్లి పోయింది. ఆఫీస్ లో ఉండగా ఫోన్ కి మెసేజ్ వచ్చింది. ఏదో కొత్త నెంబర్ నుండి. అది అజయ్ ది. ఆఫీస్ బైట వెయిట్ చేస్తాను. సాయంత్రం త్వరగా రమ్మని

ముందు కోపం వచ్చింది. ఇన్నాళ్లు కాంటాక్ట్ లోకి రానందుకు రానని చెప్పాలనిపించింది. కానీ విషయం తెలు‌సుకోవాలి కాబట్టి ఓకే అని మెసేజ్ ఇచ్చింది.

అన్నట్లుగానే. సాయంత్రం ఆఫీసు బైటఉన్నాడు అజయ్. తను రాగానే బైక్ స్టార్ట్ చేసాడు. తను మౌనంగా వెనుక కూర్చుంది. దారిలో ఏమీ మాట్లాడలేదు. ఎప్పుడూ వెళ్ళే చోటుకి చేరుకొని మౌనంగా కూర్చున్నారు. ఆ మౌనం ఇద్దరికీ భరించరానిదిగా ఉంది.

" నా మీద చాలా కోపంగా ఉన్నట్లున్నావ్." అన్నాడు అజయ్ మౌనాన్ని చెరిపేస్తూ.

"లేదు చాలా ఆనందంగా ఉంది. నిన్ను అసలు మిస్ కాలేదు. ఎందుకంటే నువ్వు అనుక్షణం నన్ను ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నావు కదా." అంది వెటకారంగా.

అజయ్ చేతులు జోడించి " అమ్మా, తల్లీ, నీకు అప్డేట్ ఇవ్వకపోవడం నా తప్పే. కానీ అక్కడ నా పరిస్థితి ఎలా ఉందో అన్న ఆలోచన వచ్చిందా నీకు." అన్నాడు కినుక గా.

"నవ్వుతారు ఎవరైనా, అబ్బాయివి అయి ఉండి ఆడపిల్ల లాగా నా పరిస్దితి అంటూంటే" అంది మరింత కోపంగా.

"అవును. పరిస్థితులు, తల్లిదండ్రులు, వారితో ఇబ్బందులు మీకే ఉంటాయి, మరి మాకు ఉండవు" అన్నాడు అజయ్ చిరు కోపంతో.

అతని కోపం చూసితాను నవ్వబోయి ఉడుక్కుంటాడని ఊరుకుంది సుజన.

"సరే , అక్కడ తమరి కష్టాలేమిటో చెప్పండి, విని తరిస్తాం." అంది తాను కూడా కోపాన్ని ప్రదర్శిస్తూ."అబ్బే, మాకేంటి, మేం ఆడింది ఆట, పాడింది పాట. మా వాళ్ళు వెళ్ళగానే, 'ఏరా ఎవర్నైనా ప్రేమిస్తే చెప్పు, ముహూర్తాలు పెట్టిస్తాం' అన్నారు." అన్నాడు అజయ్ వెటకారంగా.

"సరే, ఇప్పటి కైనా జరిగింది చెప్తావా. టెన్షన్ తో చంపుతున్నావ్." అంది సుజన.

" నీకు వినే మూడ్ ఉందో, లేదో అని..." అన్నాడు.

"అయితే, దాచుకో, నాకు మూడ్ లేదు" అంది బుంగమూతి పెడుతూ.

"అబ్బా, ఫేస్ అలా పెట్టకు. మరీ ముద్దుగా అనిపిస్తావు. నేను కొంచెం ముందుకు వస్తే కోపగిస్తావ్." అన్నాడు అజయ్ కొంచెం దగ్గరగా వచ్చి.

"ఏయ్, ఇప్పటికైనా చెప్తావా, నన్ను వెళ్ళి పొమ్మంటావా." అంది చూపుడు వేలు తో బెదిరిస్తూ.

" సరే, నేను జరిగిన విషయాన్ని చెపుతాను. విను. నేను మన గురించి చెప్పాలని వెళ్ళేసరికి అమ్మ, నాన్న వాళ్ళ వాళ్ళ ప్రతిపాదనలతో సిద్ధంగా ఉన్నారు. నేను ఏమీ చెప్పకుండానే అమ్మ పెద్ద మామయ్య కూతురుని చేసుకోమని, నాన్న తన చెల్లి కూతురుని చేసుకోమని మొదలు పెట్టారు. నా మాట వినే ఉద్దేశం ఇద్దరికీ లేదు. అప్పటికీ ధైర్యం చేసి మన విషయం చెప్పబోతుంటే నా మీద అభిమానం, ప్రేమ ఉంటే నేను చెప్పిన వాళ్ళనే చేసుకోమని ఇద్దరూ ఒకటే పట్టు. అదే సమయంలో నీ ఫోన్. నీకేం చెప్పాలో అర్థం కాని పరిస్థితి." అంటూ ఆగాడు అజయ్.

సుజన కళ్ళల్లో ఆందోళన, భయం చూసి ప్రేమ గాఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని గట్టిగా పట్టుకొని "ఏది ఏమైనా నిన్ను వదులు కోలేను. అమ్మా, నాన్నలను ఎలాగైనా ఒప్పించాలి అని తల మునకలుగా ఆలోచిస్తూండగా అనుకోకుండా మా అమ్మమ్మ ఆరోగ్యం బాగోలేదని తెలిసి అక్కడికి వెళ్ళాం. ఇంక మా అమ్మ మళ్ళీ మొదలు పెట్టింది. అమ్మమ్మ కోసం అంటూ. ఏంచేయాలా అని ఆలోచిస్తూన్నంతలో‌ మా చిన్న మామయ్య వచ్చాడు. అతను నన్ను చూసి సమస్య ఏంటని అడిగేసరికి మన విషయం మొత్తం చెప్పాను. అమ్మ, నాన్న ల మాట కూడా చెప్పాను. అప్పుడు మామయ్య తనకొదిలేయమని తాను చూసుకుంటానని హామీ ఇచ్చాడు. కానీ మా అమ్మ నా వెనక పడటంతో నాకిష్టం లేదని గట్టిగా చెప్పి ఆ చిరాకు లో ఫోన్ గిరాటేయడం తో ఫోన్ ముక్కలైంది." అన్నాడు అజయ్.

"ఇంత జరిగిందా" అంది సుజన బాధగా"అంతా అయిపోయి నేను తిరిగి వచ్చాక చెప్తుంటేనే ఇలా బాధ పడుతున్నావు. అదే నేను అక్కడ ఉన్నప్పుడే ఈ విషయాలన్నీ చెప్తే ఇంకెంత గాభరా పడేదానివి." అడిగాడు అజయ్.

నిజమే అన్నట్లు తలూపింది సుజన.

అజయ్ కొనసాగిస్తూ " మామయ్య తను చూసుకుంటానని అన్నప్పుడు సరే అన్నా. కానీ నాకే అనిపించింది ఈ విషయం లో నేను అమ్మా, నాన్నలతో ఇప్పుడే మాట్లాడ లేకపోతే జీవితంలో ఇంక ఏ ధైర్యంతో ముందుకు పోగలను. వెంటనే నేనే అమ్మ, నాన్న లతో మాట్లాడి నా మనసు లో మాట చెప్పి నిన్నే చేసుకుంటానని చెప్పాను. అమ్మ కొంచెం నసిగినా, నాన్న కలగ చేసుకొని నా ఆనందం కన్నా ఏదీ ముఖ్యం కాదని నన్ను ప్రోత్సహించారు. దాంతో అమ్మ కూడా తనకి అభ్యంతరం లేదని చెప్పింది. ఇదీ విషయం. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళతో నువ్వు మాట్లాడతావా లేక నేను అడగనా! " అన్నాడు అజయ్.సుజన ఒక్క నిమిషం ఆలోచించి రేపు చెప్తానని ఇప్పటికే ఆలస్యం అయింది కాబట్టి వెళ్దామని లేచింది. సుజనని ఇంటికి దగ్గరగా వదిలి తను కూడా రూంకి వెళిపోయాడు అజయ్.

ఇంటికి వెళ్ళిన సుజన భోజనం పూర్తి అయ్యాక తల్లికి పనుల్లో సాయం చేసింది. ఏమిటి విషయం అన్నట్లు చూసింది తల్లి రాజ్యలక్ష్మి. నవ్వేసి ఊర్కొంది సుజన. పనులయ్యాక తల్లి వెంట తండ్రి గదిలోకి వచ్చింది.

సుజనని చూసి తండ్రి " రామ్మా, కూర్చో. ఏమైనా చెప్పాలా." అని అడిగాడు

"అవును నాన్నా, అమ్మా నువ్వు కూర్చో." అంది సుజన. తల్లిదండ్రులు ఆమెనే చూస్తున్నారు చెప్నమన్నట్లుగా.

సుజన అజయ్ తో పరిచయం, ప్రేమ అన్ని విషయాలు చెప్పి, అజయ్ తల్లిదండ్రులను ఒప్పించాడని, వారి తో కూడా మాట్లాడటానికి వస్తాడని చెప్పింది. మనసు లో బెరుకుగాఉన్నా ధైర్యంగా వారినే చూస్తోంది.

"అదేంటి మేనత్త కూతురు తన కొడుకు కోసం నిన్నడిగితే‌ 'సరే' అన్నాను‌ ఇప్పుడేమని చెప్పాలి." అంది తల్లి రాజ్యలక్ష్మి.

"అదెలా మాటిస్తావ్. నా మేనమామ మనవడికి ఇస్తామని మాట ఇచ్చి ఉన్నాం కదా." అన్నాడు తండ్రి కోపంగా.

వారిద్దరి మాటలు అర్థంకాక అయోమయంగా చూస్తూ " ఏంటి అమ్మా, ఏంటి నాన్నా? నాకు తెలియకుండా. ఏం జరుగుతుంది?" అడిగింది సుజన గాభరా పడి.

అప్పుడు వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకొని చిన్నగా నవ్వారు. ఆశ్చర్యంగా చూస్తున్న సుజనతో తండ్రి "అబ్బాయి మాకీవిషయం ముందే చెప్పాడమ్మా. తల్లిదండ్రులతో మాట్లాడి వస్తానని. ఈరోజు మధ్యాహ్నం నన్ను ఆఫీస్ లోనే కలిసి ఆ విషయం కూడా చెప్పాడు తల్లీ. అబ్బాయి యోగ్యుడు. మంచి రోజు చూసుకుని వాళ్ళ ఊరెళ్ళి మాట్లాడుతానమ్మా. నువ్వు దిగులు పడకమ్మా. వెళ్ళి పడుకో." అన్నాడు. ఆనందాశ్చర్యాలలో మునిగి పోవడం ‌సుజన వంతైంది.

మరునాడు కలుద్దామని అజయ్ కి మెసేజ్ పెట్టిప్రశాంతంగా నిద్ర పోయింది సుజన.మరునాడు ఆఫీస్ అవగానే అజయ్ రావడంతో ఇద్దరూ తమ అలవాటైన చోటు కి వెళ్ళాక "ఇప్పుడైనా చెప్పావా" అడిగాడు అజయ్.

"ఏమిటి చెప్పేది, ఎంత చెప్పినా ఒప్పుకోలేదు." అంది తల దించుకుని."ఏయ్, నా వైపు చూసి చెప్పు" అని తన ముఖాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు.

"గొప్ప గా ముందే వాళ్ళ కి చెప్పి నాకు టెన్షన్ పెడతావా." అంది చిరుకోపంతో.

చటుక్కున ఆమె ని హత్తుకుని " సుజనా, నువ్వు నా కెక్కడ దూరమోతావేమో అన్న భయం. అబ్బాయిని నాకే ఇంత కష్టమైతే నీకెంత క‌ష్ట మౌతుందేమోనని అలా చేసాను. ఏదేమైనా మనవాళ్ళు ఒప్పుకున్నారు, అది చాలు." అన్నాడు అజయ్.

సుజన ఆనందంతో మరింతగా హత్తుకుపోయింది  


                *******Rate this content
Log in

More telugu story from Venkata Rama Seshu Nandagiri

Similar telugu story from Romance