"చెల్లి" పెళ్లి..! (An emotion
"చెల్లి" పెళ్లి..! (An emotion
"ఒరేయ్ పండూ...
దాని నిశ్చతార్థం ఎలాగో గట్టెక్కించేసాం..
ఇక మిగిలింది ఆ పెళ్లి తంతే...!
అది కూడా ఏ గొడవా లేకుండా సక్రమంగా అయిపోతే,
అదే చాలు...
దగ్గరుండి అన్ని నువ్వే చూసుకోవాలి కాబట్టి, పెళ్ళికి ఒక నెల ముందే సెలవు పెట్టీ రా రా ..!" అంటూ అమ్మ
వెంటనే అమ్మ దగ్గర ఫోన్ తీసుకుని,
"అమ్మ చెప్పినట్లు, నువు మీ పై ఆఫీసరుకి ఒకసారి చెప్పేసి పెళ్లికి నెల ముందే వచ్చేయ్ రా..!
నాకు కూడా ఈ మధ్య ఒంట్లో సరిగా బాగుండటం లేదు కదా..!
అన్నీ దగ్గరుండి నువ్వే చూసుకుందువు కానీ, అసలే మంచీ చెడ్డా చెప్పేవాళ్ళు కూడా నాకెవరూ లేరు. నువ్వుంటే నాక్కొంత ఆసరాగా ఉంటుంది" అంటూ నాన్న.
ఫోన్ పెట్టేసిన సరిగ్గా అదే టైం కి మా చిన్న మేనమామ (అమ్మకి అన్నయ్య) దగ్గర నుండి మరొక ఫోన్ కాల్...
"ఒరేయ్ సతీషూ..!
కిందో మీదో పడి, చెల్లి తాంబూలాల తంతు పూర్తిచేశారు. ఆ పెళ్లి బాధ్యత కూడా నువ్వే తీసుకుని, పెళ్లి పనులన్నీ నువ్వే చూసుకోవాలి, మీ అమ్మ నాన్నల వల్ల కాదు అదంతా చేయడం...
అందుకే, ఒకట్రెండు నెలల ముందే ఉద్యోగానికి సెలవు పెట్టేసి ఇక్కడికి వచ్చి, అన్నీ నువ్వే దగ్గరుండి చూసుకో.." అని ఆయన
"అసలే చెల్లి ఎంగేజ్మెంట్ కి మూడు రోజులు సెలవు కావాలని అడిగితే, ముక్కుతూ మూలుగుతూ ఇచ్చారు మా బాస్ వాళ్ళు లీవ్.
ఇప్పుడు...
ఎప్పుడో నాలుగు నెలల తర్వాత జరగబోయే పెళ్లికి నెల రోజులు సెలవులు కావాలని అడిగితే ఏమంటారో.." అని నేను వాళ్ల మాటలకు బదులిస్తుంటే,
"సెలవు ఇవ్వకపోతే జాబ్ మానేసి వచ్చేయి.. ఇక్కడ మీ చెల్లి పెళ్లి కన్నా ఆ జాబ్ ఏమీ అంత ముఖ్యం కాదు.
ఈ జాబ్ కాకపోతే, ఇంకొక జాబ్..
కానీ, ఇన్నేళ్లుగా నలుగుతూ వచ్చిన దాని పెళ్లి గొడవ ఇప్పుడు ఏ అవరోధం లేకుండా జరిగితే అదే చాలు దానికి(చెల్లి)." అంటూ వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరిగా నా ఆ సమాధానానికి అడ్డుకట్ట వేశారు.
వీళ్ళందరి ఇంటెన్షన్ ఒక్కటే
ఒక్కటి చెల్లి పెళ్లి, దానికి నేను నెల రోజులు సెలవు పెట్టడం, అది కుదరకపోతే ఆ జాబ్ నీ వదిలేయడం.
************
మీరే చెప్పండి(పాఠకులు)...
ఎంత చెల్లి పెళ్ళయితే మాత్రం, నెల రోజులు సెలవులంటే
ఎలా ఇస్తారు?
ఎవరిస్తారు?
అదేమైనా మన సొంత కంపనినా... ఎప్పుడూ పడితే అప్పుడు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి. అసలే ప్రాజెక్ట్ కి సంబంధించి కొన్ని కోట్ల బిల్లులు కూడా నా దగ్గరే ఉన్నాయి (కన్స్ట్రక్షన్ కంపనీలో బిల్లింగ్ కి సంబంధించిన ఇంజనీర్ నీ నేను). ఇప్పటికిప్పుడు ఇలా చెప్తే వాళ్ళకి కూడా ఇబ్బందే కదా పాపం. (అయినవాళ్ళు , కానివాల్ల అనే బేధం లేకుండా అందరి బాగోగుల గురించి అతిగా ఆలోచించే మనస్తత్వం నాకుండడం ఓ శాపం.)
అలా అనే కాదు కానీ, పైగా అంత కష్టపడి సంపాదించుకున్న జాబ్ మానేస్తే... తర్వాత ఇంకో జాబ్ దొరకడం కూడా కష్టమే, అది కూడా ఈ కోవిడ్ టైంలో...
చుట్టూ ఇన్ని సమస్యలు చుట్టుముడుతున్నా కూడా... ఎంతైనా ఇంట్లో వాళ్ళే మొదటి ప్రయారిటీ కాబట్టి, వాళ్ల మాట కాదనలేక వెళ్ళి మా బాస్లను లీవ్ గురించి అడిగితే, వాళ్ళు కూడా నేను ఊహించినట్టుగానే అన్నారు. నాకు లీవ్ ఇవ్వడం సంగతి అంటుంచితే, ఆఖరికి అసలు నా రిజిగ్నేషన్ కూడా యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళు.
పైగా వాళ్ళు దానికి చెప్పిన సమాధానం ....
"నీలాంటి హార్డ్ వర్కర్ నీ ఈ కంపెనీ వదులుకోవడం ఇష్టం లేదు, కావాలంటే ఆ టైంలో ఏదోక ఆల్టర్నేట్ చూస్తాం" అంటూ వాళ్ళు నన్ను బుజ్జగించారు.
చివరికి వాల్లన్నవి ఏవి జరగకపోవడం, నా ప్లేసులో వేరొకరిని నేనే అర్రంజ్ చేసినా వాళ్ళు ఒప్పుకోకపోవడం... నాన్న గారి ఆరోగ్యం దృష్ట్యా, ఇంట్లో వాళ్ల బలవంతం, ఇంకా పెళ్లికి కూడా చాలా తక్కువ టైం మాత్రమే ఉండడంతో...
చెల్లి పెళ్లి కోసం ఇక ఆ జాబ్ మానేయాల్సి వచ్చిందనుకొండి.
"వీడెంటి ఇంత పిచ్చొడిలా ఉన్నాడు...
చెల్లి పెళ్ళికి అడిగిన లీవ్ ఇవ్వకపోతే, ఎవరైనా పొట్ట నింపే జాబ్ వదులుకుంటారా..?
పైగా పోనీ అడిగెందేమైనా మూడు నాలుగు రోజులా... అడిగిన వెంటనే ఒప్పుకుని పర్మిషన్ ఇవ్వడానికి,
నెల రోజులు ఎవరిస్తారు అసలు!
తప్పదు అనుకుంటే, వాళ్ళని ఇంకొంచెం రిక్వెస్ట్ చెయ్యాలి.
లేదా ఇంట్లో వాళ్లకైనా అర్థమయ్యేట్టు నచ్ఛచెప్పాలి.
చదువుకున్న వాడివేగా కొంచెం అయినా ఓర్పు, సహనం ఉండాలిగా ఒకరి కింద పని చేస్తున్నప్పుడు..
ఏం మనిషో...! అసలితను"
అంటూ ఇది చదువుతున్న పాఠకులారా నన్ను తిట్టుకోకండి.
ఎందుకంటే... ఎవరో చెప్పారనో, ఏదో అన్నారనో నేనలా జాబ్ కి రిజైన్ చేయలేదు.
ఈ రోజు నేను బయటకి వెళ్లి జాబ్ చేయగలుగుతున్నాను అంటే, అది మా చెల్లి పెట్టిన భిక్షే!
ఇంట్లో నా తల్లిదండ్రులకి అది తోడుగా, చేదోడు వాదోడుగా ఉంటూ, వాళ్ళకి ఒక ఆసరాగా లేకపోతే, ఈ రోజు నేను బయటకి వచ్చి ఈ జాబ్ చేసేవాడినే కాదేమో?
అందుకే తన కోసం ఏదైనా చెయ్యాలనిపిస్తుంది. అలాంటిది ఈ చిన్న చిన్నవి ఎంత , ఓ లెక్కా చెప్పండి.
***************
ఇంతకూ... చెల్లెలి గురించి చెప్పలేదు కదూ..!
అమ్మ... నాకొక తల్లిగా జన్మనిస్తే,
తను ఒక చెల్లిగా నా గమ్యాలకు బాటలు వేస్తూ నా జీవితానికి ఓ పునర్జన్మనే ఇచ్చింది.
నా ప్రతి గమ్యానికి తొలి అడుగు తను.
నా ప్రతి దుఃఖంలో ఓదార్పు తను.
చదువులో రాణిస్తూ...
ఒక అన్నగా నేను తన ముందు ఏర్పరిచిన లక్ష్యాలను తను చేధిస్తూ...
ఒకొక్క మెట్టూ ఎక్కుతూ, చివరికి నాకన్నా పై మెట్టు మీదే నిలిచింది. వయసులో నాకంటే చిన్నదైనా కూడా...
(అన్నగా నాకొక గర్వకారణం తను సాధించే ప్రతి విజయం)
చదువులోనే కాదు, నాకోసం, కుటుంబం కోసం తన కెరీర్ నీ త్యాగం చేస్తూ జీవితంలో కూడా... ఇప్పటికీ తను నాకంటే ఓ మెట్టు పైనే ఉంది.
నాతో పోటీపడి, చదువులో నాకంటే ఉన్నతంగా నిలిచినా కూడా...
తను కూడా జాబ్ చేస్తే ఇంట్లో వాళ్ల బాగోగులు చూసేవారుండరని...
తనకున్న ఆశలను, కోరికలను పక్కనపెట్టి...
తన లక్ష్యాలను, ఆశయాలను త్యాగం చేయక తప్పలేదు.
ఈ చిన్న వయసులోనే అంతటి గొప్ప సహృదయం, పెద్ద మనసు తనది. అందుకే, తన కోసం నే ఎన్ని చేసినా తక్కువనిపిస్తుంది తప్పా, తప్పనిపించదు.
మీ పిల్లకి పెల్లెప్పుడు చేస్తారనీ అందరూ అడుగుతున్నారని అమ్మ నాన్న కంగారు పడుతూ... నా దగ్గరకి దాని పెళ్లి ప్రస్తావన తీసుకొస్తూ వాళ్ళు నాతో మొరపెట్టుకుంటున్న ప్రతిసారీ...
తన ఆ అమాయకత్వపు మనస్తత్వానికి ఏ ఇంటికి వెళ్తే, ఎలాంటి కష్టాల పాలవుతుందోనని...
తనకి ఆ టెన్త్ క్లాస్ పూర్తైన దగ్గర నుండి, ఈ పదేళ్ల నుండి దాదాపు తనకొచ్చిన డబ్బై, యనబై సంబంధాలు నా చేతులు ద్వారానే చెడగొట్టాను. అప్పుడే ఈ చిన్న వయసులోనే తనకి పెల్లెందుకనీ!
ఇంకా చదువుకుంటుంది కదా!,
అంటూ తన పెళ్లి కార్యాన్ని వాయిదా వేస్తూనే వచ్చాను.
తనకి పెళ్లి సంబంధం వచ్చిన ప్రతిసారీ బయపడేవాడిని. ఎక్కడ ఆ సంబంధం కుదిరి తను నాకు దూరం అవుతుందోనని. సంబంధం తీసుకొచ్చిన వాళ్ళని తిట్టుకునే వాడిని... చివరికి ఆ విధి రాసిన రాత తప్పించలేమన్న సంగతి నాకు తెలుసనుకోండి.
తనకి కూడా అప్పుడే పెళ్లంటే ఇష్టం లేదని చెప్పేది, ఇంకా చదువుకోవాలి, మంచి ఉద్యోగం చెయ్యాలి అనేది తన జీవితపు ఆకాంక్ష.. (ఇంట్లో పరిస్థితులకు అవేం నెరవేరలేదు).
ఏంటో అన్ని విషయాలలో ఆడపిల్ల ఇష్టా- ఇష్టాలను అడిగే ఈ పెద్ద వాళ్ళు(మా ఇంట్లో వాళ్ళే కాదు బయటివాల్లు కూడా).. పెళ్లి వరకూ వచ్చేసరికి అదే ఆడపిల్ల ఇష్టాన్ని లెక్క చెయ్యరు. నాకా అది నచ్చదు.
అందుకే, తన అభిప్రాయాన్ని తెలుసుకుని అది నా నిర్ణయంగానే చెప్పేవాడిని.
దాని మూలంగా ఇంటా బయటా నే చాలానే మాటలు పడ్డా... పెద్దగా బాధించలేదు. నోరుంది కదా అని బయట వాళ్ళు వాళ్ళిష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఎవరేమి అనుకున్నా రేపు మెట్టింట్లో తను సంతోషంగా ఉండడమే కదా... ఒక తోడ బుట్టిన వాడిగా నాకు కావాల్సింది. ఈ రోజు దాని పెళ్లి గురించి మాట్లాడిన వాళ్ళు, రేపు తనకి ఏదైన చిన్న కష్టమొస్తే ముందుకు వస్తారా..? రారు కదా..!
ఇంట్లో వాళ్ళకి కూడా ఇలానే నచ్ఛ చెప్పేవాడిని.
తన పెళ్లి కోసం, తనకి కాబోయే వారి కోసం, తను అడుగు పెట్టబోయే ఓ మంచి కుటుంబం కోసం వెచ్చించిన సమయాలు, వెతకని సంబంధాలు లేవు. ఎన్నో నిద్ర లేని రాత్రులలో, మరెన్నో మెలుకవ కలలే కన్నాను. చివరికి అది ఆసన్నమయ్యే క్షణానికి ఇంకొన్ని గడియలు మాత్రమే ఉన్నాయి.
తను నా నుండి దూరమవడానికి కూడా ...
తనకి పెళ్ళయ్యి అక్కడ ఎలా ఉండగలదోనన్న ఆందోళన ఒకవైపు, తను ఇక్కడ నుండి వెళ్లిపోతే, ఇన్నాళ్లుగా కంటికి రెప్పల కాచుకున్న అమ్మా నాన్నల పరిస్థితి, తర్వాత ఏంటోననే దిగులు మరొక వైపు. అందరూ పెళ్లి పనులతో సంతోషంగా గడుపుతుంటే, నేను మాత్రం ఇన్ని రకాల ఆలోచనలు కలిగి ఆర్టిఫీషియల్ నవ్వులతో సంతోషంగా ఉన్నట్టు పైకి నటిస్తున్నాను... కేవలం వాళ్ల సంతోషాన్ని పాడుచేయడం ఇష్టం లేకనే!
పోనీ సిటీ లో నా దగ్గరకి వచ్చేయండి అంటే వినే రకం కాదు వాళ్ళు(అమ్మా నాన్న). అయినా వాళ్ళని ఏం తప్పుపడతాం లేకాని, ఎంతైనా ఈ పల్లెటూరు గాలికి అలవాటు పడ్డవారు, నాకే ఈ ఊరు... వాకిలి... అన్నీ వదిలి వెళ్లాలంటే ఏదోలా ఉంటుంది. ఇక వాళ్ల వల్ల ఏమౌతుంది. ఆ సిటీ కల్చర్ కి అలవాటు పడడం కూడా కష్టమే.
అంతా మా చెల్లి, తన పెళ్లి కోసమే ఆలోచిస్తున్నారు తప్ప, ఆ తర్వాత జరిగే పరిణామాలు ఆలోచిస్తుంటే, ఆ నా ఆలోచనలకు నాకు సరిగా నిద్ర కూడా పట్టడం లేదు..
*******************
తన అమాయకత్వపు, నిర్మలమైన మనసు వల్లే, అదంటే ఇంట్లో బయట, అందరికీ అమితమైన ఇష్టం తనంటే. తనకి ఓ మంచి సంబంధం కుదరాలని కోరుకున్న వాళ్లు , ప్రార్థించిన వాళ్లు ఉన్నారు చుట్టాల్లో, చుట్టూ పక్క వాళ్ళలో... చివరికి నా స్నేహితుల్లో కూడా
మేమంటే గిట్టక, తన తప్పేం లేకపోయినా తనకొచ్చిన మంచి మంచి సంబంధాలు చెడగొట్టిన వాళ్ళు , చెడిపోయిన తర్వాత బహిరంగంగానే మా ముందు ఆనందించిన వాళ్ళు కూడా ఉన్నారనుకొండి అదే చుట్టాల్లో, చుట్టూ పక్క వాళ్ళలో...
వాళ్ల వంకర బుద్ధి తెలిసి, నేను వాటికి అడ్డు చెప్తుంటే, నాకు కోపం అంటూ అమ్మ, చెల్లి దగ్గర నన్ను చెడుగా చూపే ప్రయత్నం కూడా చేశారు అదే చుట్టాలు. నిజానికి ఆ కోపమే లేకపోతే, మా చెల్లి అమాయకత్వానికి అదొక అడ్డు గోడగా నిలిచి, వాళ్ల కపటి వేషాలను తిప్పికొట్టగలిగేదా అని అనిపిస్తుంది నాకు...
గులాబి లాంటి తన సుతిమెత్తని మనసుకి, ముళ్ళల్లా పెనవేసి ఒక కటినమైన హ్రుదయంతో... నేను ఇప్పటివరకూ తనని కాచుకుంటూ అంటిపెట్టుకునే ఉంటున్నా ..
అర్థచేసుకునే వాళ్లకు అర్ధమవుతుంది లెండి.
ఏ అవలక్షణం లేని నాకు, కోపమనే ఆ కాస్త అవలక్షణం కూడా లేకపోతే దేవుడిని అయిపోతాను కానీ, మనిషిగా ఎందుకు మిగిలిపోతాను చెప్పండి. ఇదెప్పుడు అర్థం చేసుకుంటారో ఈ వెర్రి జనం, ఈ పిచ్చి ప్రపంచం.
నచ్చిన వాళ్ళు మనకిష్టం లేని పని చేస్తే, అప్పటికప్పుడు బయటపడే ఆవేదన భావం కోపం.
నచ్చని వాళ్ళు మనకిష్టమైన పని చేసినా కుళ్లుతో లోలోపల ఏర్పడే అసూయ రూపం ద్వేషం.
ఆ రెండింటికీ మధ్య తారతమ్యం నా సొంత వాళ్ళతో పాటు, నా చుట్టూన్న సమాజం ఎప్పటికీ అర్థం చేసుకుంటుంది.
("అయినా ఇప్పుడు నీ గురించి ఎందుకు ఇక్కడ, అవసరమా..?" అని నా మనసు ఒక పక్క అంటూనే,
నీకు కోపం ఎక్కువ అనే వాళ్ళకి అదసలు ఎందుకొస్తుందో కూడా తెలియాలి గా అంటూ అదే మనసు దాని మనసు మార్చుకుని పరిపరి విధాల స్పందిస్తుంది)
అంత ద్రోహం చెయ్యాలని చూసినా, వాళ్లందరినీ క్షమించి వదిలేసి గుణం మా చెల్లిది, అమ్మది కూడా. నిజానికి చెల్లికున్న ప్రతి లక్షణం అమ్మ నుండి పుణికిపుచ్చుకున్నదే.
తర్వాత... తర్వాత.... కాలమే తన కీడు కోరుకున్న వాళ్ళ వంకర బుద్ధికి సమాధానం చెప్పింది.
బయటివాల్లే కాదు, నేను కూడా తనని అనేక సార్లు ఇబ్బంది పెట్టాను, కోప్పడ్డాను... విసుక్కున్నాను... అది ఇప్పటికీ జరుగుతూనే ఉందనుకోండి.
ఒక్కోసారి తన పై నేను చూపించే కేరింగ్ శృతిమించింది కూడా...
తన దగ్గరికి వెళ్ళి ఇన్నాళ్లు తెలిసో తెలియక ఏదైనా తప్పు చేసుంటే క్షమించమని అడగాలని, ఇవన్నీ తనకి చెప్పాలని ఉంది. కానీ, ఈ టైం లో తనకి నా మొహం చూపించడానికి కూడా భయం వేస్తుంది.
ఎక్కడ తన ముందే ఈ వేదన అంత వెళ్ళబుచ్చుతూ తల్లడిల్లిపోతానోనని!,
ఈ టైంలో కూడా తనకి అదంతా గుర్తుచేసి, బాధ పెడతానోనని...!
అలా అని ఇదంతా లోలోపలే దాచుకుని, మరింత నలిగిపోవడం కస్టమ్ గా ఉంటుంది.
అందుకే, నా మనసు లోతుల్లో కూరుకుపోయిన ఈ భావననంతా ఇలా రాస్తున్నాను. కనీసం రాస్తే నైనా నాలో ఉన్న ఈ వేదనంతా తీరుతుందనే ఒక చిన్న ఆశ నాది.
అమ్మ, చెల్లి ప్రేమ తప్ప మరొక ప్రేమ తెలియని నాకు, ఇప్పుడు అందులో ఆ సగం ప్రేమ కాస్త దూరం అవుతుంటే, పట్టలేని ఆవేదన నాది. అసలు ఆడపిల్లకి పెళ్లి చేసి వేరొకరింటికి పంపించాలనే ఆచారం..
ఎవరూ...?
ఎందుకు...?
ఎలా...? పుట్టించారోననే ఆవేశం నాది.
ఆడపిల్లని గడప దాటించడం అంటే ఆ కుటుంబానికి అదొక ఇష్టంతో కూడిన బాధ్యత...
మీ పిల్లని ఎప్పుడూ వదిలించుకుంటారు, ఎప్పుడూ వదిలించుకుంటారు అంటూ చుట్టూన్నా ఈ సమాజం మా వాళ్ళని పదే పదే ఇబ్బంది పెడుతూ దాన్నొక కష్టమైన, మోయలేని బరువులా తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు.
(ఇది ఎందుకు చెప్తున్నా అంటే, వేరొకరి ఆడపిల్ల పెళ్ళి విషయంలో కొందరు అనవసరమైన జోక్యం చేసుకుంటూ ఇలాంటి తప్పులు చేస్తున్నారనే ఆవేదనతో, ఇక చేయకుండా ఉంటారనే ఆశా భావంతో)
నా చెల్లిలి విషయంలోనే కాదు, ప్రతీ ఆడపిల్ల జీవితం ఇంతేనా..
అయినా ఆడపిల్ల అంటే వీళ్ళందరికీ ఎందుకు ఇంత లోకువా...
"ఆడపిల్ల ... ఆడపిల్ల ... ఆడపిల్ల...
ఎందుకోయి ఆడపిల్లంటే అంత అలుసు...
కొరివి పెట్టదనా...?
కాసులు పెట్టాలనా...??
జగతికి మూలమనా...?
ప్రగతికి కారణమనా...??
ఇష్టాలకి దూరమైనందుకా...?
కష్టాలకి బానిసైనందుకా...??
సమాజానికి భయపడా...?
సాంప్రదాయలకి లోబడా...??
ఇంటి పేరు మార్చుకుంటుందనా...?
ఒంటి తీరు ఏమార్చుకుంటుందనా...??
పుట్టింటిని విడిచిపెడుతుందనా...?
మెట్టింటిని నిలబెడుతుందనా...??
పడక సుఖం పంచుతుందనా...?
ప్రేగు బంధం పెంచుతుందనా...??
ఓర్పుతో ఒదిగినందుకా...?
ఊపిరితో ఉన్నందుకా...??
ఆడపిల్ల ... ఆడపిల్ల ... ఆడపిల్ల...
ఎందుకోయి ఆడపిల్లంటే అంత అలుసు..."
మా చెల్లికి,
ఒక అన్నగా...
తనతో గడిపిన ఈ పాతికేళ్ళు సరిపోలేదు. ఇంకా తనతో గడపాలని ఉంది.. సరదాగా కబుర్లు చెప్పాలని ఉంది.
ఒక స్నేహితుడిగా...
ఇప్పటికే తనతో ప్రతీ విషయం పంచుకుని తన నుండి సలహాలు తీసుకున్న నేను ఇక నుండి తీసుకోగలనో లేదో..
ఒక తండ్రినై..
తన తలని నా వొళ్ళో పెట్టుకుని,
తనకున్న ప్రతి కష్టాన్ని పంచుకుంటూ...
తన ప్రతీ ఇష్టాన్ని తెలుసుకుంటూ...
తనకి దైర్యం చెప్తూ.. తనని నిద్ర పుచ్చాలని, లాలించాలని ఉంది.
ఒక తల్లిగా ఆలోచిస్తూ...
ఈ కొద్దీ క్షణాలు మాత్రమే, తను మా ఇంటి మహాలక్ష్మి అనే తలంపు నా మనసులోకి వచ్చి నిలువునా చీరెస్తున్నట్టుంది. తను నా ఇంటి గడప దాటే ఆ క్షణం ఇంకొంచెం దూరమైతే బాగుండని నా మనసుకనిపిస్తుంది.
రేపటి నుండి..
తన ఇంటి పేరు మారిపోతుంది...
తన చుట్టూ ఉన్న పరిసరాలు మారిపోతాయి...
అమ్మా... నాన్న..., అన్నయ్య..., అంటూ తను పలికే పలుకులు బహుశా ఇక ప్రతిరోజూ మా ఇంట్లో కానీ, మాకు కానీ నేరుగా వినిపించకపోవచ్చు, ఒక్క ఆ ఫోన్లో తప్ప. అది కూడా తన అత్తింటి వారి అనుమతితోనే..
తన ప్రతీ ఇష్టాలను మా నుండి అడిగి మరీ నెరవేర్చుకున్న తను, ఇక నుండి చిన్న చిన్న ఇష్టాలకు కూడా వేరొకరి అనుమతి తీసుకోవాలి. వాటికెంత కష్ట పడాల్సి వస్తుందో తను మరి పాపం!
"ఒక ఆడపిల్ల మెట్టినింట్లో ఒక మెట్టు ఎక్కడం కోసం ..
తన పుట్టింట్లో ఒక మెట్టు దిగడమే అనుకుంటారంతా...
కానీ,
ఆ పుట్టిళ్ళ వారి గౌరవం కాపాడడం కోసం, వాళ్ల మర్యాదను దిగజార్చకుండా ఉండడం కోసం తను అనేక మెట్లు దిగడం."
చిన్నప్పటి నుండి తనని పేరు పెట్టి పిలవడం అలవాటు..
తను ఎన్ని సార్లు చెల్లి అని పిలవమన్నా పిలవలేదు...
ఇప్పుడు పిలవాలని ఎంత పెద్ద మనసు చేసుకున్నా...
నా నోట్లోంచి ఆ చిన్న మాట రావడం లేదు.
రేపు చెల్లి అని పిలవాలనుకున్నా పలకనంత దూరం వెళ్ళిపోతుంది... లేదు లేదు మేమే పంపించేస్తున్నాం.
ఎంత దూరం అంటే రాత్రి బస్సెక్కితే పొద్దున్న దిగే అంతటి దూరం. తనని పిలిచినా, గట్టిగా అరిచినా పలకనంత దూరం.
ఈ పాతికేళ్లలో ఎన్నోసార్లు తిట్టుకున్నాం.. కొట్టుకున్నాం...
ఇంట్లో నాకే వస్తువు కనిపించకపోయినా...
ముందు నేను పలికేది, లేదు లేదు అరిచేది తన పేరే..
ఇక ఆ పేరు ఈ ఇంట్లో తరుచుగా వినిపించదేమో..
అన్న ఆలోచన భరించలేనిది.
హైదరాబాద్ నుండి ఇంటికి రాగానే నాకు నీళ్ళిస్తూ...
స్వాగతం చెప్పే తన ఆప్యాయత చూపులు,
"ఎలా ఉన్నావ్ రా..!" అంటూ తను పలికే ఆ అనురాగపు పలుకులు నాకిక దొరకవేమో...
ఇక ముందు తనతో మాట్లాడాలని ఉన్నా, వేరొకరి అనుమతి పొందడం తప్పనిసరి కదా నాకు...
***************
ఇదంతా చూస్తున్న నాకే ఇంత బాధగా ఉంటే, ఇక అనుభవించే నా చెల్లి, నా చెల్లెల్లాంటి చిట్టి తల్లుల పరిస్థితేంటో... ?
ఇప్పటివరకూ ఒక కూతురిగా, సోదరిగా తన బాధ్యతను నిర్వర్తించిన తను.. , ఇక నుండి భార్యగా, తల్లిగా చివరికి ఓ కుటుంబ పెద్దగా కూడా తన కర్తవ్యాన్ని కొనసాగించాలి.
ఒక ఆడపిల్ల గా పుడితే ఇన్ని త్యాగాలు చెయ్యాలా?
ఇవన్నీ చూసి చూసి...,
ఇన్ని ఆలోచనలతో... నా మనసు చలించిపోతుంది.
రేపు నాకొచ్చే భాగస్వామి కూడా
ఈరోజు నా చెల్లి లాంటి ఒకింటి ఆడ కూతురేగా,
రేపు నా తల్లిలా అన్నీ త్యాగం చేస్తూ నా దగ్గర బ్రతకాల్సి వస్తుందేమోననే ఆవేదన నాది.
అందుకే, నాకీ పెళ్లి గిల్లి లాంటి రిలేషన్స్ ఇష్టం లేదంటూ ఎంత వారిస్తున్నా ఎవరికి అర్థం కాదు. నా మనసులో వేదన అర్థం కాక ఎగతాళి చేస్తున్నారు. ఇక్కడ నేను ఒక మగాడిగా.. మొగుడిగా కన్నా, ఒక చెల్లికి అన్నగా, తల్లికి కొడుకుగా ఆలోచిస్తున్నాననే విషయం ఎవరికీ పట్టడం లేదు.
ఓ కన్న తల్లి తన కూతురిపై కడుపులో పెట్టుకున్న అనురాగాన్ని తెలుపగలదు...
ఓ కన్న తండ్రి తన కూతురిపై కళ్ళల్లో దాచుకున్న ఆప్యాయతను తెలుపగలడు...
కానీ, తోడబుట్టిన వాళ్ళు తమ హృదయంలో ఏర్పరుచుకున్న ఇలాంటి ... నాలాంటి... ప్రేమను ఎలా తెలపాలో...
అందుకే నాకిదే సరైన వేదిక అనిపించింది. మరొక ఆలోచన లేకుండా ఈ కథతో మీ ముందుకు వచ్చేసాను.
***************
ఆడపిల్లకి పక్షపాతిగా రాశారు, నాణానికి ఒకవైపే కథ రాశారు అంటూ నన్ను వేలెత్తి చూపొద్దు.
ఎందుకంటే, ఇది నేను అల్లిన కట్టు కథ కాదు, నా మనసు లోగిళ్లలో పెన వేసుకున్న ఓ అనిర్వచీయమైన భావం.
ఈ కథ మీరు ఆదరించకపోయినా పర్లేదు కానీ, మా చెల్లికి మీ ఆశీస్సులు అందితే అదే చాలు.
ఈ కథ చదువుతున్న వాళ్ళందరికి ఇదే మా ఆహ్వానం.





రచన: సత్య పవన్ ✍️✍️✍️
