STORYMIRROR

కాశీవిశ్వనాధం పట్రాయుడు

Classics Children

4  

కాశీవిశ్వనాధం పట్రాయుడు

Classics Children

చాపకింద నీరు

చాపకింద నీరు

2 mins
17

చాప కింద నీరు


సిరిపురం గ్రామంలో సన్యాసయ్య, సన్యాసమ్మ దంపతులు నివసిస్తూ ఉండేవారు. ఇద్దరూ వ్యవసాయ కూలీలు. 'రెక్కాడితే కానీ డొక్కాడని' జీవితం వారిది. అయితే సన్యాసయ్యకి పొగ తాగే అలవాటుంది. 'ధూమపానం ఆరోగ్యానికి హానికరమని భార్య చెప్పినా విన కుండా 'ఎవరు పదికాలాలు బతుకుతారు.' అని వాదించేవాడు సన్యాసయ్య.


కొంతకాలానికి సన్యాసయ్యకి ఆకలి మందగించడం, తొందరగా అలసిపోవడం మొదలైంది. వయసు ప్రభావం అనుకున్నాడు, పెద్దగా పట్టించుకోలేదు. ఇంకొంతకాలానికి నికి సన్యాసయ్య ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో భర్తను తీసుకుని పెద్దాసుపత్రికి వెళ్ళింది సన్యాసమ్మ. అక్కడ అన్ని పరీక్షలు చేశాక రాచపుండు 'చాప కింద నీరు'లా విస్తరించిందని, పరిస్థితి చేయి దాటిపోయిందని, డాక్టర్లు చెప్పారు. చేసేదేమీ లేక ఇంటికి తిరిగి వచ్చారు భార్యాభర్త.


భర్త అనారోగ్యానికి, చాప కింద నీరుకి సంబంధం ఏమిటో అర్థం కాని సన్యాసమ్మ, ఎలాగైనా ఆ విషయం తెలుసుకుని భర్తకి స్వస్థత చేకూరేలా చెయ్యాలి అనుకుంది. ఊళ్లో ఉన్న వృద్ధుడు, తన దగ్గరి బంధువు సోమయ్యను కలిసింది. చాపకింద నీరు అంటే ఏమిటి? దానికీ తన భర్త అనారోగ్యానికి గల కారణం ఏమిటో చెప్పమని కోరింది. ఆమె అమాయకత్వానికి నవ్వుతూ సోమయ్య చెప్పడం ప్రారంభించాడు.


'పూర్వం సీతారాంపురం గ్రామంలో ధనయ్య అనే కిరాణా వ్యాపారి నివసించేవాడు. పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన వ్యాపారం చేసేవాడు.


ఓ ఏడాది వర్షాలు ఎక్కువగా పడ్డాయి. గదిలో ఉన్న సరుకులు చెమ్మకు పాడైపోతాయనే ఉద్దేశ్యంతో గచ్చుమీద చాపలు రిచి వాటిమీద సరుకులన్నిటీని ఉంచాడు. గోడల వెంబడి నీరు చెమర్చి చాప కిందకు చేరింది. ఆ విషయాన్ని ధనయ్య గమనించలేదు. కాలం గడిచింది చాప కింద నీరు ఉండటం వల్ల కొద్దిరోజులకు చాప నానిపోయి, దాని మీద సరుకులన్నీ తడిసి ముద్దయ్యాయి. జరిగిన నష్టాన్ని చూసి లబోదిబో మన్నాడు ధనయ్య.


ముందుగా గ్రహించడానికి అవకాశం లేకుండా, ఎలాంటి ముందస్తు సంకేతాలు లేకుండా పెద్ద నష్టం జరిగినప్పుడు లేదా వ్యాధి ముదిరి అనారోగ్యం పాలైనప్పుడు వాడే జాతీయం ఇది. అంతేకానీ చాప కింద నీటి వల్ల నీ భర్త ఆరోగ్యం పాడవలేదు. నువ్వు చెప్పినా వినకుండా పొగతాగడం వల్లే నీ భర్త అనారోగ్యం పాలయ్యాడు' అని వివరించాడు సోమయ్య. చాప కింద నీరు అంటే ఏమిటో తెలుసుకున్న సన్యాసమ్మ కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాల్లో ముందటి కంటే మరింత జాగ్రత్తలు తీసుకోవడం మొదలు పెట్టింది.


(ప్రజా శక్తి చిన్నారి లో 22-8-2024 న ప్రచురితమైంది)


Rate this content
Log in

Similar telugu story from Classics