Dinakar Reddy

Abstract Comedy Inspirational

4  

Dinakar Reddy

Abstract Comedy Inspirational

బుక్ షెల్ఫ్

బుక్ షెల్ఫ్

2 mins
303


ఇదిగో ఉమా. నువ్వు గానీ మళ్లీ ఆ బుక్ షెల్ఫ్ తీసుకుని కొత్త ఇంటికి వెళదాం అన్నావో ఇంక బాగుండదు. అంతే. అని మా శ్రీవారు ఖరాఖండిగా చెప్పేశారు.


మూర్ఖులు సొంత ఇల్లు కట్టుకుంటారు. తెలివైన వారు అందులో అద్దె కట్టి నివసిస్తారు అనే సామెత మా శ్రీవారు బాగా వంట పట్టించుకున్నారు. ప్రతి ఆరు నెలలకూ ఆ ఇల్లు బాగుంది. ఈ ఇంట్లో నీళ్ళ సమస్య. ఈ వీధిలో ఏ ఇంట్లోనూ పార్కింగ్ లేదు. ఇలా రకరకాల కారణాలతో ఇల్లు మారడం మాకు వ్రతంలాగా అయిపోయింది.


ఆఖరికి ఆ సామాను చేర్చే వాళ్ళు మా శ్రీవారికి బెస్ట్ కస్టమర్ బిరుదు కూడా ఇచ్చేశారు.


అంతా బాగానే ఉంది కానీ మా శ్రీవారికి నా బుక్ షెల్ఫ్ నచ్చట్లేదు. అందులో ఉన్నవన్నీ తెలుగు పుస్తకాలు. అదీ కాక సాహిత్య అకాడెమీ అవార్డులు పొందినవన్నీ మా నాన్న నా పెళ్ళప్పుడు సారెతో పాటు పంపారు.


అయినా సారెతో పాటు పుస్తకాలు పంపడం ఏంటని బుగ్గలు నొక్కుకున్న వాళ్ళూ లేకపోలేదు. పుస్తకాలే జ్ఞానం. జ్ఞానమే సంపద అని నే కవర్ చేశాననుకోండి. అది వేరే విషయం.


ఈ తెలుగు పుస్తకాలు చూసి పిల్లలు ఇంగ్లీషు చదవరేమో అని మా శ్రీవారి బాధ. 


మా చంటి ఇంకా బుడుగు వయసుకి రాలేదు. మా అమ్మాయి ఇంకా నాలుగో క్లాసు చేరలేదు. కానీ మా శ్రీవారి బాధంతా ఇంగ్లీషు గురించే.


చూస్తూ చూస్తూ ఇన్ని పుస్తకాలు ఎక్కడ వదులుకోను. ఎవరింట్లో అయినా పెడదామంటే చెత్త అయినా అటక మీద పెడతారు కానీ ఈ పుస్తకాలు చూసి అమ్మో నాకొద్దు బాబోయ్ అని పారిపోయారు.


భానుమతి అత్తగారి కథలు నవ్వుతున్నాయి. అబ్బూరి ఛాయాదేవి గారి కథలు మార్గం ఆలోచించమంటున్నాయి.

కేతు విశ్వనాథరెడ్డి కథలు అలా ఎలా వదిలేస్తారు అంటున్నాయి. ఇక నవలలైతే ఖబడ్దార్ అని పేజీలు తిప్పి మరీ చెబుతున్నాయి.


కొత్త ఇల్లు చూసి వద్దామని పక్కింటి లక్ష్మిని తోడు తీసుకుని వెళ్ళాను. రెండు గదులు, చిన్న హాలు, వంట గది. బాత్రూం వెనుక పక్క కొంచెం విడిగా ఉంది. కాకపోతే ఇంటి కాంపౌండ్ లో కాస్త ఖాళీ జాగా ఉంది. డేరా పూలు, కనకాంబరాలు పెట్టుకోవాలి అని మనసులో అనుకున్నాను.

తిరిగి వచ్చేటప్పుడు చూశాను ఆ కాలనీలో లైబ్రరీని. 


కాలనీలో వాళ్ళే ఏర్పాటు చేసుకున్నారట. పెద్ద వాళ్లంతా ఉదయం పదకొండు నుండి ఒంటి గంట వరకూ తరువాత సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఏడు వరకూ అక్కడే కాలక్షేపం చేస్తారు అని తెలిసింది.


నా పుస్తకాల షెల్ఫ్ గురించి చెబితే వెంటనే తీసుకురమ్మన్నారు. 


నా ఆనందానికి పట్టపగ్గాల్లేవు. కొత్త ఇంట్లోకి మారగానే ముందు బుక్ షెల్ఫ్ లైబ్రరీలో ఇచ్చేశాను.


పోన్లే నీలాంటి తెలుగు పుస్తకాల పురుగులు దొరికారు. నీకూ కాలక్షేపం అవుతుంది అని అన్నారు. నెల రోజులు గడిచిపోయాయి.


పనులు పూర్తవ్వగానే లైబ్రరీకి వెళ్ళి సెక్రటరీని పట్టుకోవాలి. అదేనండీ యద్దనపూడి సులోచనారాణి గారి సెక్రటరీ నవలని.

 పెరట్లో కనకాంబరాలు నాకు భూమికి పెట్టిన అలంకారాల్లా కనిపించాయి.


Rate this content
Log in

Similar telugu story from Abstract