STORYMIRROR

Dinakar Reddy

Abstract Comedy

4  

Dinakar Reddy

Abstract Comedy

బుక్ ఫెస్టివల్

బుక్ ఫెస్టివల్

2 mins
301

ఏవైనా మూడు నవలలు కేవలం వంద రూపాయలకే. అరే వైభవ్. ఇక్కడ చూడ్రా అని పిలిచాడు నా స్నేహితుడు రమేష్.

చూడరా. ఏవైనా మూడు నవలలు. కేవలం వంద రూపాయలకే. నువ్వు నేనూ కలిసి ఆరు నవలలు కొందాంరా అని రమేష్ లెక్కలు వేస్తున్నాడు.


విజయవాడ బుక్ ఫెస్టివల్ మొత్తం తిరిగినా ఒక్కటంటే ఒక్క పాత తెలుగు పుస్తకమూ దొరికి చావలేదు అని నేనేడుస్తుంటే ఈ ఊరూ పేరూ లేని 1970 నాటి ఇంగ్లీషు నవలలు కొందామని రమేష్ గాడి గోలొకటి.


అసలేంట్రా నీ బాధ అని రమేష్ గాడు అడిగాడు. ఇలా పక్కకు రా అని బుక్ ఫెస్టివల్ ప్రదేశం మధ్యలో ఖాళీ స్టాల్ దగ్గరకు వెళ్ళాము.


ఒరేయ్ మట్టి బుర్రా . అసలు నేను బుక్ ఫెస్టివల్ కి వచ్చింది ఎందుకు. ఎవ్వరూ చదవని పాత తెలుగు కథల పుస్తకాలు కొని వాటి ఇన్స్పిరేషన్ తో నేను కొత్తవి రాయాలనే కదా అని నేను అక్కడికి వచ్చిన కారణం మళ్లీ వాడికి గుర్తు చేశాను.


రమేష్ నా నెత్తి మీద ఒక మొట్టికాయ వేశాడు. అబ్బా. ఏంట్రా నువ్వు అని నేను విసుక్కుని మళ్లీ మిగతా స్టాళ్ళ వైపు చూశాను.


ఒరేయ్ బంక మట్టి బుర్రా. కాస్త నే చెప్పేది విను అన్నాడు రమేష్.

నువ్వు అనుకుంటున్నట్టు పాత తెలుగు పుస్తకాల కథలు చదివి వాటిలోని విషయాలతో కొత్త కథలు అల్లుదాం అనే ప్లాను పనికి రాదు.


అప్పట్లో వచ్చిన కథా సంపుటాలు చదివిన వాళ్ళందరూ ఇప్పుడు ఫేస్బుక్ గ్రూపుల్లో బాగా చురుగ్గా ఉన్నారు. నువ్వు పాత కథలు మార్చి వ్రాసి పేరు కొట్టేయాలని అనుకుంటే మాత్రం వాళ్ళ దగ్గర నీ పప్పులు ఉడకవు అని తాపీగా చెప్పాడు రమేష్.


మరెలారా బాబు. అసలే ఈ మధ్య నాకు అవార్డులు అవీ వస్తున్నాయి. ఇహ మొదటికే మోసం వచ్చేట్లుంది అని ముక్కు గోకుతూ నిల్చున్నాను.


అదేలెండి కొంత మందికి బుర్ర గోక్కుంటే కొత్త ఐడియాలు వచ్చినట్లు నాకు ముక్కు గోకితే అప్పుడప్పుడూ కొత్త ఐడియాలు వస్తుంటాయి.


ఒరేయ్ వైభవ్. నీ ముక్కు గోకడం ఆపు. నా మాట విని రెండొందలు పెట్టి ఆరు ఇంగ్లీషు నవలలు కొను. వంద నాది వంద నీది. ఆ నవలల్లో నుంచి తెలుగులోకి కథల్ని వ్రాసుకో. నేను చదివి నీకు ట్రాన్స్లేట్ కూడా చేస్తాను. ఏమంటావ్ అని అడిగేసరికి ఇదేదో బాగుందని నేను కూడా ఒప్పుకున్నాను.


వచ్చే రాయల్టీల్లో సగం వాడికి ఇవ్వాలని షరతు ఉండనే ఉంది. ఇద్దరం కలిసి ఇంగ్లీషు నవలల ఉన్న ర్యాక్ వైపు నడిచాము.


మమ్మల్ని తీసుకెళ్ళండి అన్నట్లు ఆ పుస్తకాల పేజీలు గాలికి అటూ ఇటూ ఎగురుతున్నాయి.


Rate this content
Log in

Similar telugu story from Abstract