బుజ్జాయి - మధ్యాహ్నం నిద్ర
బుజ్జాయి - మధ్యాహ్నం నిద్ర
అమ్మయితే ఎంచక్కా మధ్యాహ్నం భోజనం తరువాత జోకొట్టేది. బజ్జో బజ్జో బుజ్జాయి. మా బుజ్జాయి బజ్జుంటే నాకు పనులున్నాయంట. వంటిల్లు సర్దుకోవాలి అని. నేను మేలుకుని ఉంటే అమ్మ కొంగు పట్టుకుని వంటింట్లోని వస్తువులన్నీ కింద పడేస్తూ ఉంటాను.
అవును మరి. అసలు అల్లరి చెయ్యకపోతే పిల్లలు చురుగ్గా లేరని అమ్మలు బాధపడిపోతారుట. నాకెలా తెలుసు అనా. పక్కింటి నీరజా చెప్పింది. నీరజా కూడా పెద్దదేం కాదు. కానీ నాకంటే పొడువే. రెండు జడలు వేస్తుంది వాళ్ళ అమ్మ. అసలవి జడలు కాదు. పిలకలు అంతే. నాకేమో అమ్మ జుత్తు పైకి దువ్వి ఒక పిలక వచ్చేట్లు రబ్బరు బ్యాండు వేస్తుంది. అబ్బాయిలకి అంతే అట.
ఓ రోజు నేనూ నీరజా నేనూ ఆడుకుంటూ ఉంటే గది తలుపు మూసుకుంది. మరేమో మాకిద్దరికీ తలుపు తియ్యడం రాదు కదా. అమ్మకి ఒకటే కంగారు. ఎవర్నో పని చేసే అతణ్ణి పిలిపించి తలుపు గడియ బయట నుంచి విరగగొట్టించి మరీ మమ్మల్ని బయటకు తెచ్చింది.
బుజ్జాయి. ఎంత భయపడ్డానో తెలుసా అని నన్ను గట్టిగా హత్తుకుంది. అమ్మంతే. అన్నిటికీ భయపడుతుంది. పిల్లలన్నాక అల్లరి చేస్తారు కదా.
బుజ్జాయి మరీ అల్లరెక్కువ చేస్తున్నాడా. వచ్చే ఏడు నుంచి స్కూల్లో వేసేద్దాం అని అన్నాడు నాన్న.
అమ్మో స్కూలా. మూడేళ్ల పిల్లలు ఆడుకోకుండా స్కూలుకు వెళ్ళడం ఏంటి? అయితే నీరజకి అయిదేళ్ళు. స్కూలుకు వెళ్లదు. నాకు ఏబీసీడీలు అమ్మ నేర్పించింది.
నేను గబగబా న్యూస్ పేపరు మీద ఏబీసీడీలు వ్రాశాను. నాన్న చూసి విజయా! బుజ్జాయికి చదువు మీద బాగా ధ్యాస ఉన్నట్టు ఉంది. రోజూ మధ్యాహ్నం అక్షరాలు వ్రాయించు అని చెప్పాడు.
అమ్మ సరేనంది మురిసిపోతూ. అసలు ఆ దొంగ ముఖం నీరజను అనాలి. పిల్లలు అల్లరి చెయ్యాలి అని. స్కూలుకు పంపిస్తే తెలుస్తుంది.
అమ్మా జోకొట్టు అని నేను అమ్మ చెయ్యి పట్టుకుని లాగాను. జోజో బుజ్జాయి..
