అమ్మ..! @ వృద్ధాశ్రమం
అమ్మ..! @ వృద్ధాశ్రమం
సంధ్యా... ఎక్కడున్నావ్!!
త్వరగా రెఢీ అవ్వు, ఈ రోజు మనం ఆ రవి గాడింటికి వెళ్ళాలి. అసలే వాడు పట్టరాని కోపంతో ఉంటాడు. ఎన్నెల్లైందో వాడిని కలిసి.
కాదా మరి! అసలే మీ చిన్ననాటి మిత్రుడు, ఒకరి కుటుంబంతో ఒకరు చాలా చనువుగా మెలుగుతూ తోడబుట్టిన అన్నదమ్ముల కంటే సాన్నిహిత్యంగా ఉంటుండేవాళ్ళం అని ఎప్పుడూ ఆయన ఊసే చెప్తారు.
అత్తయ్య గారు, మావయ్య గారు దూరం ఐన తర్వాత మీ ఒంటరితనంలో మీకు తోడున్నారు.
మన ప్రేమని ఇంట్లో ఒప్పుకోకపోతే మన ఇద్దరి కుటుంబాల మధ్య సయోధ్య కుదిర్చి మనకు పెళ్లి చేసింది కూడా వాళ్ళే కదా!
ఆ తర్వాత మనం ఎక్కడికో విదేశాలకెళ్లి బాగా సెటిల్ అయ్యాం !
ఇన్నాళ్లు వాళ్ళని పట్టించుకోలేదనే ఆవేదన ఉంటుంది లేండి.
నీకు తెలియంది ఏముంది లేవొయ్!
అనుకోకుండా మన పెళ్లైక మీ నాన్న గారి సలహాతో ఫారెన్ వెళ్ళడం. తర్వాత అక్కడే ఇన్ని సంవత్సరాలు ఉండిపోవడం.
పదేళ్లు దాటింది, ఈ పదేళ్లలో వాడితో భౌతికంగానే దూరం అయ్యాను కానీ, నా ఆలోచనలో ఎప్పుడూ వాడి తలపే.
వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మ నాన్న నన్ను సొంత బిడ్డలా ఆదరించేవారు. ఛీ! ఛీ! వాళ్ళ అమ్మ నాన్న ఏంటి, నాకు సొంత అమ్మ నాన్నే వాళ్ళు. అసలు వాళ్ళు ఎలా ఉన్నారో! ఏం చేస్తున్నారో ఇప్పుడు.
"ఎంత దగ్గర వాళ్ళైనా రోజులో ఒక్కసారి ఆప్యాయంగా మాట్లాడకపోతేనే మనసులను విరిచి, మనుషులను దూరం చేస్తుంది ఈ కాలం.. అలాంటిది ఇన్ని సంవత్సరాలు అయ్యింది కదా అండి" అని అంటున్నా
నీకు కూడా తెలుసు గా, వాడి ఆచూకీ కోసం ఎంత మందిని సంప్రదించానో!!. ఇప్పటికీ దొరికింది.
అన్నట్టు మర్చిపోయాను, ఆ అడ్రస్ లో ఉన్న ఫోన్ నంబర్ కి కాల్ చేయమన్నాను చేసావా ??
హా..!! చేశాను అండి. కానీ, కలవలేదు.
అడ్రస్ అయినా కరెక్టో కాదో...??
మొన్న వాళ్ళున్న ఆ పాత ఇంటికి వెళ్తే నాకు ఆ చిన్ననాటి జ్ఞాపకాలే గుర్తొచ్చాయి. సిటీ కి వెళ్లి సెటిల్ అయ్యారని, అక్కడున్న ఇంటి పక్క వాళ్ళు అన్నారు. ఏంటో ఆ పరిసరాలు, అన్నీ అప్పట్లనే ఉన్నా, మనుషులు మాత్రం మారిపోయారు.
అవును!
రఘు, రవి ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు. రఘు పదేళ్ల క్రితమే విదేశాలకెళ్లి బాగా సెటిల్ అయ్యాడు. తనకున్న ఆ బాధ్యతలు, అక్కడ కొత్త ఉద్యోగం వల్ల, రవిని కొన్నాళ్ళు సరిగా పట్టించుకోలేదు. ఆ తర్వాత తన ఆచూకీ కోసం ప్రయత్నించినా.. అవి అంతగా ఫలించలేదు. మళ్ళీ ఇన్నాళ్ళకి ఇక్కడికి వచ్చి తన అడ్రస్ ఎలాగోలా కనుక్కున్నాడు.
ఆ అడ్రస్ పట్టుకుని పట్నంలో తన స్నేహితుడు రవి ఇంటికి చేరాడు రఘు.
ఆ ఇంటి బయట తలుపులు మూసి వున్నాయి.. కానీ, ఇంట్లో నుండి వచ్చే ఆ అలికిడి శబ్దాలు చెప్తున్నాయి ఇంట్లో ఎవరో ఉన్నారని.
తలుపుల వద్దకు వెళ్లి కాలింగ్ బెల్ నొక్కాడు రఘు.
ఎవరూ..?? అంటూ తలుపులు తీసింది రాధ (రవి భార్య).
వీళ్ళని చూసి ఆశ్చర్యపోయిన తను,
"అన్నయ్య మీరా!, ఎలా ఉన్నారు! అసలు ఎప్పుడొచ్చారు! ఫారిన్ నుండి అంటూనే,
వాళ్ళు బదులిచ్చే లోపు
అయ్యో నా మతి మండ , రాక రాక వచ్చినవాళ్ళని బయటే నిలబెట్టి మాట్లాడుతున్నా...
రండి అన్నయ్య లోపలకి , వదినా రండి!"
అంటూ ఇంట్లోకి సాదరంగా ఆహ్వానించింది.
ఏవండీ...!
ఏవండీ...!!(తన భర్తను పిలిచింది)
ఏమందోయ్ !!(రవి బదులిచ్చాడు)
అబ్బబ్బా...!! ఎక్కడున్నారండి , ఒకసారి ఇటు రండి మన ఇంటికి ఎవరోచ్చారో చూడండి అని ఒకింత సంబ్రమాశ్చర్యంతో పిలిచింది రాధ.
అసలేంటే నీ గొడవ ! అంటూ లోపల బెడ్ రూం నుండి వస్తూ, హల్ లో నిల్చుని ఉన్న తన చిన్ననాటి స్నేహితుడు
రఘును (చాలా రోజుల తర్వాత చూడడం వల్ల ఆశ్చర్యపోతూ...)
నువ్వు...! నువ్వు..!! ర్ర.. ర్రఘు కదూ?? అని తన కళ్ళకున్న ఆ కళ్లజోడు తీస్తూ, తన కంటి రెప్పల మాటు జారుతున్న కన్నీళ్లు ఆపుకుంటూ గట్టిగా రఘును హత్తుకున్నాడు.
"ఎన్నాళ్ళయింది రా నిన్ను చూసి,
అసలు ఏమైపోయావు రా??
ఇన్నాళ్లు నేను నీకు గుర్తులేనా??
ఎప్పుడొచ్చావు ఫారేన్ నుండి...??"
అని ఇన్నాళ్లుగా తన యదలో దాచుకున్న బాధలను ప్రశ్నల రూపంలో సంధించాడు రవి.
రవి మాటలు వింటున్న రఘు కి కూడా కళ్ళు చెమ్మగిల్లాయి. ఎంత అదుపు చేసుకుందామన్నా, తనకి ఆ కన్నీటి ధారలు ఆగలేదు. రవి ప్రశ్నలకు బదులు ఇవ్వలేక రఘు మనసు మూగబోయింది.
"అయ్యయ్యో!! వాల్లొచ్చి ఇంతసేపైనా అలా నిల్చోబెట్టి మాట్లాడతారే?,
"అలా కూర్చోండి వదిన..! అసలే ఎండని పడి వచ్చారు ఇదిగో ఈ చల్లటి మజ్జిగ త్రాగండి అన్నయ్య," అని రాధ వాళ్ళ చేతికి తను తెచ్చిన మజ్జిగను ఇచ్చింది.
వీళ్ళని ఇన్నాళ్ళ తర్వాత చూసినా ఆ ఆనందం పట్టలేకపోయాను. కనీసం కూర్చోమని కూడా అనలేకపోయాను. తప్పుగా అనుకోకమ్మ సంధ్య ఈ అన్నయ్య గురించి.
ఏరా రఘు ఇన్నేళ్లలో నీకు నేను ఒక్కసారి కూడా గుర్తుకు రాలేదా? బాగా ఎదిగిపోయావూ నన్ను ఇక మర్చిపోయావూ అనుకున్నా.
ఛ..!! ఛ..!! అవెం మాటలు రా... నేనక్కడికి వెళ్ళినా, రోజూ నీ ఆలోచనలే, తనకి నీ ఉసులే చెప్తుంటాను, ఫారెన్లో ఉన్నప్పుడు, ఇక్కడకి వచ్చాకా నీ అడ్రస్ కోసం ఎంతో ట్రై చేశా కానీ లభించలేదు.
ఇక్కడ నువ్వు తప్ప నాకేవరున్నరు చెప్పు, మా మావయ్య గారు , అత్తయ్య గారు కూడా మాతో పాటే అక్కడే ఉంటున్నారు. ఇదిగో ఒక వారం క్రితమే ఇక్కడికి వచ్చి మీ పాత ఇంటికి వెళ్తే, అక్కడ దొరికింది ఈ అడ్రస్. అయినా నీ సన్నిహితులు కూడా ఎవరూ లేనట్టున్నారు. అందుకే నాకు అడ్రస్ తెలుసుకోవడం కొంచెం కష్టం అయింది.
అవును రా..
మనుషుల కూడా సంపాదననే ఎదుగుదలను తమ మనసులకు ఆపాదించుకుని, కాలంతో పాటే ఈ పట్నం వైపు పరుగులు తీస్తున్నారు. అందుకే, దేశానికి నాడు పట్టుకొమ్మలు గా పిలువబడిన పల్లెలే నేడు మొడుబారుతున్నాయి.
అవును పిల్లలు.. ?? అని అడిగాడు రఘు.
స్కూల్ కి వెళ్ళారు అన్నయ్య.. అని బదులిచ్చింది రాధ!
మీ పిల్లల్ని తీసుకు రాలేదా??
లేదురా తనకి గర్బ సంచిలో ఎదో సమస్య అని చిన్నగా బదులిచ్చాడు రఘు. (రవి కి అర్థమైంది, సంధ్య వింటే బాధపడుతుందని అలా చిన్నగా చెప్పివుంటాడని)
చాలా రోజులు గడిచాయి కదా వాళ్ళ మాటలు మూగబోయి, ఇద్దరూ కళ్లతోనే మాట్లాడుకుంటున్నారు. ఆ నిశబ్దపు వాతావరణంలో గోడ గడియారం చేసే శబ్దానికి రఘు కళ్ళు ఏమరపాటుగా అటు వైపు తిరిగాయి. ఆ గడియారం పక్కనే ఉన్న రవి వాళ్ళ నాన్న గారి చిత్ర పటం అదే గోడకు వ్రెలాడడం చూసి, రఘు ఒకసారిగా కంగుతిన్నాడు.
అరేయ్...రవి!
నాన్న...??
అని రఘు తన ప్రశ్న పూర్తి చేయబోయే లోపే,
అవును నీకు తెలీదు కదూ??...
నువ్వు ఫారిన్ వెళ్లిన కొన్నాళ్లకే ఆయన కాలం చేశారు.
నీకు తెలుసు కదా ఆయన గురించి. ఒక తాగుబోతనీ, ఎన్ని సార్లు చెప్పినా వినేవాడు కాదు. చివరకి జబ్బు పడి, మంచాన పడ్డాడు. అందులోకి నా కోపం గురించి నీకు తెలియంది ఏముంది, ఆ మంచాన్న పడ్డప్పుడు కూడా సూటిపోటి మాటలతో చాలా మానసిక క్షోభ పెట్టాను. "అంతకు ముందు ఆయన చేసిన పనులే ఆయన ప్రాణాల మీదకు తెచ్చాయని, ఇప్పుడు అనుభవించండని." దెప్పి పొడిచేవాడిని. పాపం సగం అది బరించలేకే ఆయన మా మధ్య లేకుండా పోయాడు.
అది జరిగిన కొన్నాళ్ళకి అక్కడ వుండలేక, అమ్మ, తను, ఇద్దరి చంటి పిల్లలతో సహా నేను పట్నం వచ్చేసాను.
ఇలా బ్రతుకీడ్చాను.
మరి... అమ్మ ఎక్కడ రా??
అంటూ తన కళ్ళు ఇంటిని నలు వైపులా తడుముతున్నాయి.
హుం... అమ్మ...!!
"అమ్మకి బాగా చేదస్తం పెరిగిపోయింది. పిల్లలు , తను(రాధ) కూడా అమ్మ చేదస్తంతో విసిగి వేసారిపోతున్నారు. ఒక్క క్షణం కూడా వీళ్ళు తనతో ఇమడలేకపోతున్నారు.
అందుకే తనని వీళ్లకి కొంచెం దూరం పెడదామన్నారు.
ఈ పట్నంలో నాకంటూ తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు,
అందుకే,
ఒక వృద్ధాశ్రమం లో చేర్చాను.
ఇప్పటికీ దాదాపు ఏడాది అవుతుంది అనుకుంటా!
అప్పుడప్పుడు నేను వెళ్తాను, వీళ్ళు రారు. అమ్మకేమో వీళ్ళని చూడాలని ఉంటుంది. కానీ, వీళ్ళకి ఎందుకో తను నచ్చదు. మొన్నే వెళ్లి , కొంత డబ్బిచ్చి వచ్చాను. అక్కడ వాళ్ళు తనకి యే లోటు లేకుండా చూసుకుంటున్నారు లే. కానీ, మళ్ళీ మొన్నటి నుండి ఒకటే ఫోన్ కాల్స్. ఎందుకో రమ్మని అనుకుంటా!!
అసలే నా ఆర్థిక ఇబ్బందుల్లో నేనుంటే.."
అన్నాడు కొంచెం విసుగుగా
ఈ మాటలన్నీ వింటున్న రఘు కి, రవి చెప్తున్నదంత కోపం పుట్టిస్తున్నా, ఒక స్నేహితుడుగా తన అమాయకత్వాన్ని అర్ధం చేసుకున్నాడు.
రవి కళ్ళల్లోకి రఘు సూటిగా చూస్తూ ఇలా అన్నాడు.
"అరేయ్..!!
రఘు!
నువ్వేనా ఇలా మాట్లాడుతుంది. అసలు ఏంట్రా.. ఇదంతా..?
మీ అమ్మ గురించి నాకెంత గొప్పగా చెప్పేవాడివి. అదే కదా రా మీ అమ్మ గారి దగ్గర నాకు, మా తల్లిదండ్రులు దగ్గర నీకు సాన్నిహిత్యం ఏర్పరిచి, చనువు పెంచేలా చేసింది.
ఒకప్పుడు "అమ్మ నా కోసం చాలా కష్టపడుతుంది, తనని ఎలా అయినా కడ వరకూ బాగా చూసుకోవాలి, అసలు తన కోసం పెళ్లే చేసుకోనన్న వాడివి, ఇప్పుడు అమ్మనే వదిలేస్తావా" అసలు ఇది నువ్వేనా ??
చెప్తూ ఉండేవాడివి కదా రా??
ఉమ్మటింట్లో పెద్ద కోడలిగా తన జీవితం ఎంత నలిగిపోయిందొ. అయినా ఆ బరువంతా తన నెత్తిన వేసుకుంది.
అటు కట్టుకున్న భర్త కూడా ఒకానొక సమయంలో దురలవాట్లకు బానిసయ్యి, కుటుంబమనే బండిని లాగడం లో విఫలమైనప్పుడు, తనే కదా ఆ బాధ్యతంతా భుజాన వేసుకుంది.
ప్రతి కన్న తల్లి తన పురిటి నొప్పులప్పుడు పడే శారీరక ప్రసవవేదన చాలా ఎక్కువ అనుకుంటారు అందరూ...
కానీ, ఇలా అందరూ ఉన్నా తనని దూరం పెట్టారన్న ఆ మానసిక క్షోభ నిజానికి బరించలేనిది.
మా అమ్మ నాన్న లు నాకు శాశ్వతంగా దూరమైనా దగ్గర నుండి నేను పడుతున్న బాధ వర్ణించలేనిది, ఎవరూ తీర్చలేనిది. నాకిప్పుడు వాళ్ళు కావాలన్నా నేను చేరుకోలేను.
ఇప్పటికే, నిరంతరం నీకోసం కష్టపడి, నిన్ను కళ్ళల్లో పెట్టుకుని పెంచిన కన్న తండ్రిని, ఏదో తెలిసో తెలియకో తనకున్న ఆ బాధ పోగొట్టుకోవడానికి ఆయన తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాలను ఎంచి, నీకున్న అమాయకత్వంతో చివరికి ఆయన్ని పోగొట్టుకుని తప్పు చేసావు.
మరి అభం శుభం ఎరుగని ఆ మానవతమూర్తిని ఎందుకని దూరం చేసుకుంటున్నావు.
ఇప్పుడున్న ఆ కాస్త ప్రేగు బంధాన్ని, కూడా దూరం చేసుకుంటూ తప్పు మీద తప్పు చేస్తున్నావ్.
ఏంట్రా అన్నావ్..? డబ్బిస్తే అక్కడివాల్లు బాగానే చూసుకుంటారా??
ఆ డబ్బే అన్నింటికీ సమాధానం అయితే,
ఎంత కష్టమొచ్చినా నిన్ను పెంచి ఇంతటి వాడిని చేసింది. తనకున్న కష్టాల కొలిమిలో కూరుకుపోతూ నీలానే తను ఆలోచించి నిన్ను ఏ అనాధ లోనో నిన్ను వదిలేసి ఉంటే,
అంతెందుకు, రేపు ఇది చూసిన మీ పిల్లలు కూడా, మీ విషయంలో ఇలానే పాటిస్తే, నీ తల్లి బాధ కూడా అలాంటిదే కదరా!!
హుమ్... డబ్బనేది దేహానికి సుఖాన్ని పంచుతుంది కానీ, మనసుకు సంతోషాన్ని పంచలేదు.
సరే! సరే!
ఇదంతా కాదు కానీ, ఆ వృద్ధాశ్రమం అడ్రస్ చెప్పు కొంచెం. తనని నా దగ్గర తీసుకొచ్చి, తన చేతి వంట తిన్నా రుణం ఈ రకం గానైనా తీర్చుకోవాలి అనుకుంటున్నా.
ఇదంతా గమనిస్తున్న రాధ గుండె బరువెక్కింది. ఇక తన భర్త రవి గురించి చెప్పక్కర్లేదు.
రవి తన మనసులో ఇలా అనుకున్నాడు..
అవునూ... రఘు అమ్మ గురించి చెప్పిందంతా నాణానికి ఒక వైపు మాత్రమే.
కట్టుకున్న దాంతో, కట్టు బట్టలతో పట్నం వచ్చిన కొత్తలో అమ్మే కదా దైర్యమంతా తానై నాలో పట్టుదలను ప్రేరేపించి, ఒంటరి నాకు నీడలా తోడయ్యింది. అలాంటి తనని నేను ఒంటరిని చేసానా??
నేను , తను(భార్య) ఉద్యోగ రీత్యా అసలు ఇంట్లోనే వుండేవాళ్ళం కాదు. ఆ సమయంలో నా చంటి పిల్లలనీ లాలించి, వారికి తోడుంటూ అన్నీ తానై నిలిచింది. అలాంటి తనని అనాధని చేసానా??
నేను ప్రయోజకుడిని కావడం కోసం, తన రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి నన్ను చదివించి ఇంతటి ప్రయోజకుడిని చేస్తే, ఇప్పుడు నా స్వ ప్రయోజనాల కోసం తనని అప్రయోజకురాలని చేసానా??
నిజానికి అమ్మ..!, నాన్న దూరం ఐనప్పుడు ఒంటరవ్వలేదు,
అందరూ ఉండి, ఇలా తనని అనాధని చేసినప్పుడు తను ఒంటరయ్యింది.
ఇలా ఎన్నో ఎన్నెన్నో మదిలో ఆలోచనలు తన యధని కుదిపేస్తున్నాయి.
ఆ మాటల మాటున మూగబోయిన ఆ చప్పుడు తన గుండె ద్వారా "అమ్మ..!!" "అమ్మ..!"అంటూ నిట్టూర్చాడు.
అది విన్న రాధ కూడా వెంటనే తన తప్పు తెలుసుకుని భర్త ను కౌగిలించుకుని పశ్చాత్తాపపడింది.(ఇంచు మించు తన మనసులో కూడా అవే ఆలోచనలు మెదిలాయి అనుకుంటా??)
పదండి!! ఇప్పటికీ మించిపోయింది లేదు,
వెళ్లి అత్తయ్యగారిని ఇంటికి తీసుకోద్ధాం.
ఆ మాటతో,
పక్కనే ఉన్న రఘు మనసు కొంచెం తేలికపడింది.
ఇక అనుకున్నదే తడువుగా వాళ్ళ అమ్మ ఉన్న వృద్ధాశ్రమానికి చేరుకున్నారు రఘు, రవి దంపతులిద్దరూ.
రవి ఆ ఆశ్రమానికి వెళ్ళగానే, తన అమ్మని చూడాలనే ఆతృతతో రిసెప్షనిస్ట్(ఇంతకు ముందు ఆవిడ కాదు, కొత్త అనుకుంటా) దగ్గరకు వెళ్లి,
"నా పేరు రవి, మా అమ్మ గారి పేరు జీ. స్వరాజ్యం , ఆవిడని కలవాలి" అని కోరాడు.
ఆ రిసెప్షనిస్ట్ ఆ పేరును మూడు సార్లు పిలిచినా తను రాలేదు.
దీంతో రిసెప్షనిస్ట్ లోపలికి వెళ్ళింది.
రవి మనసులో ఎందుకో కొంచెం ఆతృతతో కూడిన అలజడి రేగింది.
"అదేంటి ఎప్పుడూ ఒక్క పిలుపుకే, పరిగెడుతూ వచ్చి నా చెంపలు తడుముతూ ఎనలేని ప్రేమ చూపే అమ్మ, ఈ సారెందుకో రావడం లేదు. బహుశా మూడు రోజుల క్రితం పిలిపించినా సరిగా పట్టించుకోలేదని కోపమా??
అయినా నాపై అమ్మకెందుకు కోపం లే??
అని తన మనసులో తను అనుకుంటూ ఉండగా...
ఇంతలో రిసెప్షనిస్ట్ రానే వచ్చింది.
ఆ రిసెప్షనిస్ట్ తన చేతితో తీసుకొస్తున్న ఒక చిన్న మట్టి కుండ వైపు తదేకంగా చూస్తున్నారు రవి, రాధ, రఘు మరియు సంధ్య.
ఇంతలో ఆ రిసెప్షనిస్ట్ వాళ్ళ దగ్గరకి వచ్చి,
రవితో..
"సారీ అండి, మీ అమ్మగారు మూడు రోజులు క్రితమే చనిపోయారు, చివరి క్షణంలో కూడా ఆవిడ మిమ్మల్ని చూడాలని ఎంతగానో పరితపించి పోయారు. ఈ విషయం చెప్పడానికి మీకు కాల్ చేస్తే రెస్పాండ్ అవ్వలేదు. ఆ తర్వాత ఆ అంతిమ సంస్కారాలన్నీ మేమే దగ్గరుండి జరిపించాము."
ఇదిగోండి ఆవిడ చితాభష్మం మీరోస్తే ఇవ్వమని ఆవిడ చివరిమాటగా చెప్పారట!!"
అని చెప్పగానే
రవి, ఆ రిసెప్షనిస్ట్ చేతిలో కుండని తీసుకుని ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
తన గుండె బద్దల్లయ్యింది, కళ్ళు సముద్రాన్ని తలపించాయి, ముక్కలైన మనసుతో, దిక్కులు పిక్కటిల్లేలా,
అమ్మ....!
అమ్మ...!!
అమ్మ...!!!
అని గుక్క పెట్టీ ఏడ్చాడు
"నేను తప్పు చేసానమ్మ, నన్ను క్షమించమ్మ!!
నువ్వు నన్ను అల్లారు ముద్దుగా పెంచితే, నేను నిన్ను అనాధ ని చేశాను."
అన్న తన ఆర్తనాదాలు ఆకాశాన్ని అంటాయి.
తనతో పాటే తన భార్య కూడా భర్తను పట్టుకుని బోరున విలపించింది.
వాళ్ళతో పాటే ఉన్న రఘు, సంధ్యల నిట్టూర్పులు కూడా మిన్నంటాయి.
కానీ, ఏం లాభం రవి తన ఆస్తిని(అమ్మ) కోల్పోయాడు. ఇక తన అమ్మ తనకి ఎప్పటికీ తిరిగిరాదనే విషయాన్ని రవి ఎప్పటికీ జీర్ణించుకోలేనిది.
పాఠకులకు:
వృద్ధాశ్రమలా వద్ద ఉండే ఆ తల్లిదండ్రుల వేదన చూస్తే, వాళ్ళలో పరకాయ ప్రవేశం చేసి ఇది రాస్తున్నట్టు అనిపించింది.
కథ కల్పితమే అయినా,
మీ హృదయాలను మీటి, కదిలిస్తుందని ఆశిస్తున్నాను.
ప్రతి కథలో రవిలాంటి మనకి, మన తల్లిదండ్రుల గురించి ఎవరో రఘులాంటి వారు వచ్చి చెప్పేవరకు కాకుండా, ముందుగానే వాళ్ళు మనకోసం చేసిన త్యాగాలకు రుణం తీర్చుకొకపోయినా, కనీసం వాటిని గుర్తించి వారికి కడవరకూ తోడుందాం.
వృద్ధాశ్రమాలను రూపు మాపుదాం.
పట్నపు అలవాటులకు, పాశ్చాత్య సంస్కృతికి అలవాటు కాలంతో పోటీ పడి పరిగెడుతూ, జన్మనిచ్చిన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్న ప్రతి వ్యక్తికి,
నా ఈ "అమ్మ @ అనాధశ్రమం" అంకితం.
రచన:
సత్య పవన్ ✍️
