అమ్మ శాలువా
అమ్మ శాలువా
ఆ పాత శాలువా వదిలేసి, మంచి స్వెట్టర్ కొనుక్కోవచ్చు కదా అని అంటారు చూసినవాళ్ళు.
నేను స్వెట్టర్ వేసుకున్నా మళ్లీ శాలువా కప్పుకుంటాను. చలికాలం వచ్చిందంటే అమ్మా, నేనూ చెరో శాలువా కప్పుకుని, బాల్కనీలో పేపరు చదువుతూ మాట్లాడుకునే వాళ్ళం.
నేను మొక్కలకు నీళ్లు పోస్తూ ఉంటే అమ్మ ఏదో కూని రాగం తీసుకుంటూ కాఫీ చేసుకునేది.
ఎన్ని కొత్త స్వెట్టర్లు తెచ్చినా, ఆ పాత శాలువానే కప్పుకునేది. అందులో చలి వేయదు అని చెప్పేది.
మొన్నామధ్య ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ చీరలన్నీ బయట ఇచ్చేసాను. ఆవిడ పోయినా ఆ శాలువా మాత్రం భద్రంగా ఉంది బీరువాలో.
వచ్చేటప్పుడు అదే శాలువా తెచ్చుకున్నాను. చలి సంగతి ఎలా ఉన్నా, అది కప్పుకుని పొద్దున్నే అలా మొక్కలకు నీళ్లు పోస్తూ ఉంటే ఇంకా అమ్మ కూని రాగం తీస్తూ ఉన్నట్టే అనిపిస్తుంది.
