ఆఖరి క్షణంలో (కథ)
ఆఖరి క్షణంలో (కథ)
ఆఖరి క్షణంలో...!(కథ)
సమయం సరిగ్గా ఉదయం పదిగంటలు.
ఆ పురపాలక సంఘ ఆఫీస్ ముందు ఆగిన కారులోంచి సూర్యప్రతాప్ ఠీవిగా దిగి హుందాగా ఆఫీసులో కి అడుగు పెట్టాడు. పది మంది దాకా విజిటర్స్ కూర్చుని ఉన్నారు. కమీషనర్ గారిని చూస్తూనే అందరూ లేచి నిలబడ్డారు.
వారికి ప్రతినమస్కారం చేసి వెళ్లబోతున్నవాడల్లా ఒక వృద్ధుని చూసి ఆగిపోయి దగ్గరగా వచ్చాడు.ఆయన కళ్ళల్లోకి తేరపార చురుగ్గా చూసి వంగి వారి పాదాలకు నమస్కరించి తిన్నగా తన గదిలోకి వెళ్ళిపోయాడు.
"పది." అన్నాడు అద్దాల ఛాంబర్ లో కూర్చుని ఇంటిపన్ను కట్టించుకుంటున్న నాగరాజు.
"ఏమిటి పది.మీరే నాకివ్వాలి"అని కౌంటర్ బయట కస్టమర్ అంటే..."పొద్దున్నే అప్పేంటి.నా దగ్గర డబ్బుల్లేవు."అంది పక్క కౌంటర్ లోని సుశీల.
‘’ ఎహ, మిమ్మల్ని కాదేహ. సార్ ఆ పెద్దాయనకి ఇది పదోసారి నమస్కారం పెట్టడం. మిగతావాళ్ళని వదిలేసి ఆయనకే ఎందుకు పెడతన్నాడబ్బా?’’
‘’వాళ్ళ నాన్న గుర్తోచ్చాడేమో...?’’ అంది సుశీల అనవసరంగా పమిట సద్దుకుంటూ...
ఇంతలో ఆ పెద్దాయన చేతిలోని సంచి తన చేతిలోకి తీసుకుని ‘’మిమ్మల్ని అయ్యగారు రమ్మంటున్నారు బాబు.’’ అటెండర్ ఆయన చేయిపుచ్చుకుని కమీషనర్ గదిలోకి తీసుకువెళ్ళడం గమనించి నోరుమూసుకున్నారు.
ఆయన లోపలికి అడుగు పెడుతుండగానే ‘’ రండి మాస్టారూ...’’ అని తన సీట్లోంచి లేచి తన టేబుల్ ఎదురుగా ఉన్న వీల్ చైర్లో కూర్చుండజేసి తన బల్లమీద సిద్ధంగా ఉన్న మంచినీళ్ళ గ్లాస్ మీద మూత తీసి స్వయంగా అందించాడు సూర్యప్రతాప్.
రెండేళ్లుగా అదే ఆఫీసు చుట్టూ తిరిగినా ఏనాడు ఏ అధికారి అలా తనకు తానుగా పిలిచి గౌరవించలేదు.
ఆయనకీ చాలా ఆశ్చర్యంగానే ఉంది. ప్రతాప్ అందించిన గ్లాస్ తీసుకుని గడగడా మంచినీళ్ళు తాగేసాడాయన.
‘’మీకు కృతజ్ఞతలు బాబు.నాపేరు ...’’ అని చెప్పబోయాడాయన.
‘’మీ పేరు శశిధరం గారని నాకు తెలుసు మాస్టారు.. నేను ఇక్కడ కమీషనర్ గా ఛార్జ్ తీసుకుని సరిగా ఇరవై రోజులైంది. మిమ్మల్ని పదిరోజులనుంచి చూస్తున్నాను.మీరు ఈఆఫీసుకి ఏం పనిమీద వచ్చారు? ఎందుకు ఇన్నిరోజులుగా ఈ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు?నిర్మొహమాటం గా చెప్పండి. ‘’అడిగాడు అనునయంగా.
ఆయన ముందు తటపటాయించాడు. అనంతరం తన చేతి సంచి లోంచి కొన్ని కాగితాలు తీసి ప్రతాప్ కు అందించి తరువాత విపులంగా చెప్పసాగాడు.
అరగంట అనంతరం సూర్యప్రతాప్ ముఖం కోపంతో జేవురించింది.
‘’ బి-3ని ఒకసారి రమ్మను.అర్జెంట్.’’ అటెండర్ కి ఆర్డర్ జారీ చేసాడు ప్రతాప్.
మూడునిముషాలలో బి-౩ ప్రతాప్ దగ్గరకు కంగారుగా వచ్చాడు.
‘’సార్. గుడ్-మార్నింగ్ సర్.పిలిచారట.’’
‘’అవును పిలిచాను. వీరిని పదిరోజులనుంచి పొద్దున్న అంటే సాయంత్రం, సాయంత్రం అంటే పొద్దున్న అని తిప్పుతున్నావట. ‘’ సీరియస్ గా అడిగాడు ప్రతాప్.
‘’ఈయన విషయానికా సర్ పిలిచారు? ఎప్పుడూ ఉండే గోలే లెండి.’’ అన్నాడు తేలికగా.
‘’సర్.ఈవేళ మంగళవారం. మీరు మళ్ళీ మంగళవారం రండి.మీ సమస్య పరిష్కారానికి అవసరమైన కాగితాలు అన్ని నేను తీసుకున్నాను.మీ సెల్ఫోన్ నెంబర్ కాగితాలన్నిటి మీద వేసారుగా.మీ పని పూర్తీ చేయించే బాధ్యత నాది. మీరు వెళ్ళిరండి.’’ అన్న ప్రతాప్ అటెండర్ వైపు తిరిగి ‘’ సార్ని దగ్గరుండి ఆటో ఎక్కించిరా.వెళ్ళు...’’అని లేచి శశిధరం గారికి నమస్కరించాడు.
చేతులెత్తి నమస్కరించబోయిన ఆయన చేతులు పట్టుకుంటూ ‘’ తప్పు మాస్టారు.మీరు పెద్దలు..ఇవి ఆశీర్వదించాలి గాని మా ఆయుష్షును తగ్గించకూడదు.’’ అన్నాడు.
మాస్టారు ఏమనుకున్నారో ప్రతాప్ తల అప్రయత్నంగా నిమిరి మెల్లగా బయటికి వెళ్ళారు.
‘’ ఇప్పుడు చెప్పు. ఆయనది ఎప్పుడూ ఉండే గోలా? ఎందుకని?’’ నవ్వుతూ అడిగాడు.
‘’ ఆయన దగ్గర నేను పదోతరగతి చదువుకున్నాను సర్.చిన్న తప్పు చేసినా వీపు విమానం మోత మోగించేవాడు. చిన్నోల్లం.ఏదో కుర్ర వేశాలేస్తాం. అన్నీ ఈయనకే కావాల. మా నాన్నకేమో ఈయనంటే నమ్మకం.చదివితే ఈయనకాడే చదవాలనేవాడు.ఈయన స్కూల్లో, మా నాన్న ఇంట్లో ఒకటే దంపుడు. ఎప్పుడు దొరుకుతాడా అనుకున్నాను. ఇప్పుడు దొరికాడు. ఆరోజు ఆయనది. ఈరోజు నాది. పగ తీర్చుకోవాలి కదా సర్?’’
అన్నాడు కసిగా.
‘’ఆ వయసులో కక్ష సాధింపు సినిమాలు ఎక్కువగా చూసేవాడివా?’’
‘’ అవుననుకోండి. నేను పదోతరగతి లెక్కల పరీక్షలో తప్పాను. మిగతా అన్ని సబ్జేక్ట్ లు పాసయ్యాను. ఆరోజుల్లో మేము చదివిన స్కూల్లోనే మాపదో తరగతి పరీక్షలు రాసేవాళ్ళం. ఆతర్వాత జంబ్లింగ్ పద్దతి వచ్చిందనుకోండి. మానాన్న ఈయన దగ్గరకెళ్ళి ‘ మావాడిని ఎలాగైనా పరీక్ష పాస్ అయ్యేలా చేయండి సామీ. లేకపోతే ఆడి తోటివాళ్ళందర్లోను చులకనైపోతాడు. ఒక సంవత్సరం వెనకబడిపోతాడు.’ అని వెక్కి వెక్కి ఏడ్చి ఆయన కాళ్ళు పట్టుకున్నాడంట. ఇపుడు వినండి అసలు విషయం.’’
‘’ఏమైంది? ‘’ ఉత్సాహంగా అడిగాడు ప్రతాప్.
‘’మేము మాస్టర్లం.నిజాయితీ గలవాళ్ళం.పిల్లల్ని భావి భారత పౌరుల్ని చేస్తాం – అని ప్రసంగాలు చెప్పే ఈయన నేను పరీక్ష రాస్తుంటే ముప్పై మార్కుల ప్రశ్నలు పెన్సిల్ తో చేసి ఆకాపీలు నా దగ్గరకు వచ్చి రహస్యంగా అందించి, రాసేసాకా రబ్బరెట్టి చేరిపేయమన్నాడు. అలాగే చేసాను. చివరి అరగంటలో బిట్ పేపర్ జవాబులన్నీ ఆయనే రూమ్ కి వచ్చి ఇన్విజిలేటర్ కు ఇచ్చి చెప్పమనేవాడు. ఇదే అదనుగా ఆ ఇన్విజిలెటర్ మిగతా పిల్లలందరికి చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బులుచ్చుకునేవాడు. లెక్కల రెండు పేపర్లకీ అలాగే చేసాడు.నేను లెక్కలు అరవై నాలుగు మార్కులు వచ్చి పాసయ్యాను.
మా నాన్న ‘నువ్వు పది పాసయ్యవంటే అంతా సార్ గారి దయరా.ఆ మహానుభావుడి ఋణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను.’ అని తెగ ఫీలైపోయాడు. ఇంటర్, డిగ్రీ పూర్తయ్యాయి. ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్లాను. మూడు రోజులకే మా నాన్న గుండెపోటుతో చచ్చిపోయాడు.మా నాన్న ఇక్కడే బిల్ కలెక్టర్ గా చేసేవాడు. ఆయన పోయేటప్పటికి నేను డిగ్రీ పాసైపోవడం వల్ల నాకు మూడు నెలల్లోనే ఉద్యోగం ఇచ్చేసారు సర్. నీతులు చెప్పే ఈ మాస్టర్లు ఇంత చేస్తారు సర్. ఆయనను చూస్తె నాకు గౌరవించాలని అనిపించదు సర్. అందుకే నాకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాను.’’అన్నాడు.
‘’నీపేరు రంగబాబు కదూ..’’ప్రతాప్ కంఠతీవ్రతకు ఒక్కసారి రంగబాబు వెన్నులో వణుకు వచ్చింది.
అప్పటివరకు ఒక కాజువల్ స్నేహితుడితో మాట్లాడినట్టు మాట్లాడిన రంగబాబు నిటారుగా అయి చేతులు కట్టుకున్నాడు.
‘’సార్.’’ అన్నాడు భయంగా.
‘’మీరసలు మారరేంటయ్యా? ఆరునెలలు కత్తిసాము నేర్చి మూలనున్న ముసలమ్మని ‘రావే యుద్ధానికి’ అని పిలిచాడట నీలాంటివాడే. చదువు నేర్పి, నువ్వు పరీక్ష పాస్ అయేలా చేసి నీ పదవతరగతి జీవితాన్ని గట్టు దాటించిన మాస్టారు చేసిన సేవని మర్చిపోయి ఆయన నిన్ను కొట్టాడని కక్ష పెంచుకుని ఈవేళ ఇలా ఉసురు పెడుతున్నావే? ఇది తప్పు అని నీ అంతరాత్మ నిన్ను ఒక్కరోజు కూడా నిలదీయలేదా? ఆఫీస్ పనులమీద వచ్చిన మిగతావాళ్ళ దగ్గర లంచాలు తెసుకుంటూనే ఉన్నారుగా. అలాంటి వృద్ధుల్ని ఉసురు పెడితే మహా పాపమయ్యా.’’
తన బల్లమీద ఉన్న ఆయన కాగితాలు చేతిలోకి తీసుకుని ‘’ ఇవన్నీ ఏమిటో తెలుసా? ఆయనకున్న ఒక్క సమస్యకి పది రిమైండర్ లు.తన తదనంతరం విధవరాలైన తన కుమార్తె కు తన కుటుంబ పించిను చెందేలా ఏర్పాటు చేయమని గత ఏడాది దరఖాస్తు చేసాడాయన. దాన్ని గుర్తు చేస్తూ మళ్ళీ మళ్ళీ పెట్టుకున్న దరఖాస్తులివి.వచ్చిన కమీషనర్ లు ఇనిషియల్ వేసి నీకు పంపుతూనేఉన్నారు. కానీ నీలో చలనం లేదు.
విసుగు చెంది ప్లాన్ వేసి పబ్లిక్ ఒక్క సారి బుక్ చేస్తే చాలు. వెళ్లి జైల్లో కూర్చుంటావ్. వెళ్లు. ఆయన సర్వీస్ రిజిస్టర్ మొత్తం ఆయన ఫైల్ అయిదు నిముషాల్లో నా ముందు ఉండాలి.’’ అతని మాటలు అమ్మవారి కి బాలి ఇవ్వబోతున్న మేక మెడమీద పెట్టిన కట్టి అంచులా పదునుగా ఉన్నాయి.
అయినా ఏదో చెప్పబోయాడు రంగబాబు.’’ సార్....అదీ...’’
‘’డూ ఇట్ వాట్ ఐ సే ‘’ ప్రతాప్ అరిచిన అరుపుకు ఆ గదే కాదు ఆ కార్యాలయం లోని గదులన్నీ దద్దరిల్లిపోయాయి.
ఏం జరిగిందా అని ఒక్క ఉదుటున లోపలి వచ్చాడు అటెండర్.
’’వాటర్’’ అని సైగ చేసాడు అతనికి ప్రతాప్.
అతన్ని తప్పించుకుని కందగడ్డ ముఖం తో తన సీటు వైపు పరుగెత్తాడు రంగబాబు. అరగంట వెతికాకా బీరువాలో ఆఖరి అరలో అందరి ఎస్.ఆర్. ల కన్నా అట్టఅడుగున మిగతా ఎస్.ఆర్. లకు పునాదిరాయి లా కనిపించింది అది. అప్పటికి చెమటతో స్నానం చేసిన అతను ముసిపాలిటీ బురదలో దొర్లిన దున్నపోతులా ఉన్నాడు. దాన్ని కట్టి ఉన్న ఆయన ఫైల్ తీసుకుని ప్రతాప్ దగ్గరకు వచ్చాడు రంగబాబు.
‘’ఇంకొకసారి ఇలాంటి నిర్లక్ష్యం నేను గమనించానో జాగ్రత్త. పని చెయ్యలేదని నిన్ను అనుకోరు. చేయించలేని నా పనితనాన్ని ఆడంగితనం అనుకుంటారు. వెళ్ళు. పిలిచినా వెంటనే మాత్రం రా.టీ, టిఫిన్ అంటూ సీట్లో కనిపించలేదో అపుడు చెబుతాను నీపని.వెళ్ళు.వెళ్ళవతలకి.’’ సీరియస్ గా అని ఫైల్ ముడి విప్పి దాన్ని పరిశీలించడం లో ములిగి పోయాడు సూర్యప్రతాప్.
బతుకుజీవుడా...ఇంకా ఎన్ని దొబ్బులున్నాయో...అనుకుంటూ మున్సిపాలిటీ బలిసిన పందిలా వచ్చి తన సీట్లో కూలబడ్డాడు రంగబాబు.
*********
వారం రోజుల తరువాత తనను రమ్మని ఒక రోజు ముందే తన గుమ్మంలో కమీషనర్ గారి జీపు ఆగడం చూసి పేపర్ చదువుకుంటున్న శశిధరం గారు చాలా ఆశ్చర్యపోయారు.
ఎదురుగా వెళ్లి లోపలి స్వాగతించారు. ఆయన పాదాలకు నమస్కరించి ఆయన్ని అనుసరించాడు సూర్యప్రతాప్.మాస్టారి ఎదురుగా కూర్చుని తన వెనుక వచ్చిన అటెండర్ తో ‘’ఫైల్ అక్కడ పెట్టి నువ్వు జీప్ దగ్గర ఉండు. పదినిముషాలలో వస్తాను.’’ అన్నాడు.
అటెండర్ వెళ్ళిపోయాడు.అంతలో మాస్టారి కుమార్తె వచ్చి కాఫీ ట్రే తండ్రి ఎదురుగా పెట్టి సూర్యప్రతాప్ కి నమస్కరించింది.
‘’కాఫీ తీసుకోండి బాబు.తనే బాబు మా అమ్మాయి. ఈ అమ్మాయి కోసమే నా తాపత్రయం.’’ అన్నారాయన గాద్గాదికంగా.
‘’మాస్టారు ఇదిగో మీ పని పూర్తీ అయింది. మీ తదనంతరం మీ కుటుంబ పించను మీ అమ్మాయికి వస్తుంది. అన్ని కాగితాలు ఈ ఫైల్ లో ఉన్నాయి మాష్టారు. ఇక మీరు ఆఫీసుకు రానవసరం లేదు.అందుకే మీ ఎస్. ఆర్. కూడా మీకు అప్పగిస్తున్నాను. మరి నేను వెళ్ళిరానా సర్?’’ అన్నాడు సూర్యప్రతాప్ లేస్తూ.
శశిధరం గారి కళ్ళల్లో ఆమాటలకు గిర్రున నీళ్ళు తిరిగాయి. లేచి నిలబడి ప్రతాప్ చేతులు పట్టుకుంటూ ‘’బాబూ.మీరు రోజూ నమస్కరిస్తుంటే పెద్దరికానికి గౌరవమిస్తున్నారనుకున్నాను. కానీ మీ చర్య అలా లేదు.ఏమీ అనుకోక పొతే మీరెవరో చెప్పండి బాబు.’’ అన్నారాయన.
సూర్య ప్రతాప్ నవ్వుతూ ఆయన కళ్ళు తుడిచి ‘’ ఆరోజు నేను పెట్టుకున్న కన్నీటిని ఇలాగే తుడిచి నా బ్రతుకును నిలబెట్టిన దైవం మీరు. చేసిన సహాయాన్ని మర్చిపోతే అంత కృతఘ్నుడేవరూ ఈ లోకంలోఉండరు సార్. మీ సమస్య పరిష్కరించగలిగాను. అదే నాకు ఆత్మసంతృప్తి. ఇంతకీ నేను ఎవరో గుర్తువచ్చానా సర్? ‘’ప్రశాంతంగా తన కుర్చీలో వెనక్కు జారగిల బడుతూ అడిగాడతను.
‘’వయసు పెరిగి జ్ఞాపక శక్తి తగ్గినా మాట వాస్తవమే అయినా కొందరిని మర్చిపోలేదు బాబు. అయితే వారిలో నువ్వెవరివో పోల్చుకోలేకపోతున్నాను. అంతే.’’ అన్నారాయన కళ్ళు కాస్త విశాలం చేసుకుని చూస్తూ.
‘’చెబుతాను మాస్టారు. వినండి .మీరు ప్రధానోపాధ్యాయునిగా ఫలానా పాఠశాలలో పనిచేస్తున్నప్పుడు హౌసింగ్ బోర్డ్ లోని ఒక ప్రైవేటు కాన్వెంట్ ద్వారా నన్ను పదోతతగతి పరీక్షకు ఆఖరి నిముషంలో కట్టించాడు అందులోని గుమాస్తా.
రెండువందల రూపాయల ఫైన్ తో ఆఖరిరోజున కట్టడానికి వచ్చింది నేను ఒక్కడినే. ముందు మీరు తిరస్కరించినా...తరువాత నేను ఏ పరిస్థితులలో ఫీజు కట్టడానికి వచ్చానో మీకు చెప్పాను. మా నాన్న గోడౌన్లో కూలి పని చేసి సంపాదించింది ఇంట్లో ఇవ్వకపోగా అమ్మ రెక్కలు ముక్కలు చేసుకుని న్యాయంగా సంపాదించిన సొమ్మంతా ఆమెను చితక్కొట్టి తీసుకుపోయేవాడు.పైగా అతనికి ఒక ఉంపుడుకత్తే.తాగి ఎప్పుడూ అక్కడే పడివుండేవాడు.
‘’నాన్న..నువ్వైనా చదువుకుని బతకగలిగే ఒక్క ఉద్యోగం సంపాదించుకో నాన్న.మీ చెల్లికి నాకు ఈ బాధ తప్పదు-అని అమ్మ నన్ను కాన్వెంట్ ప్రిన్సిపాల్ గారికాళ్ళు పట్టుకుని నన్ను చదివించింది.ఆయన సగం ఫీజు తీసుకుని నాకు చదువుకునే అవకాశం ఇచ్చారు. ఫీజు కట్టవలసిన సమయం లో ఆయన అమెరికాలో ఉన్నారు.
గుమాస్తా నాకు తెలియదు పొమ్మన్నాడు.నేను మీవద్దకు వచ్చి ఫీజు ఎంతో అడిగాను. ఆ 125 రూపాయలు నాన్న కంట పడకుండా దాచడానికి అమ్మ ఎన్నో దెబ్బలు తింది.కానీ నేను టైంలో కట్టలేక పోయాను. ఏభై రూపాయల ఫైన్ కూడా దాటిపోయింది.లాభం లేదని నేను కాన్వెంట్ మానేసి కిరాణా కొట్లో పనిచేసాను.పదిరోజులకి 250 ఇచ్చాడు.
దాన్ని పట్టుకొచ్చి మీకు ఇచ్చాను. ఆరోజు మీరు నన్ను తీసుకుని బ్యాంకుకి వెళ్లి నా ఒక్కడికి అన్ని ఫారాలు పూర్తిచేసి ‘’బాగా చదువుకో...ఒక్కదేబ్బలో పాస్ అయిపోవాలి తెలిసిందా..’’ అని భుజం తట్టి పంపించారు.
మార్చి నెలలో నెలలో పరీక్ష ఎల్లుండి అనగా ఆరోజు ఉదయం హాల్ టికెట్ కోసం వచ్చాను.మీరు అంతా వెతికారు.నాకు హాల్ టికెట్ రాలేదు.నాపేరు నామినల్ రోల్స్ లో లేదు.మీరు కంగారు పడిపోయారు.
‘’ నీకు హాల్ టిక్కెట్ అప్పగించే పూచీ నాది.అంతవరకూ నువ్వు నాతోనే ఉండు.’’ అని మొత్తం ఫైల్స్ అన్నీ వెతికారు.మీదగ్గరున్న ఆఫీస్ కాపీలన్నీ చూసారు.మీరు అన్నీ జిల్లాకేంద్రంలో అప్పగించి రసీదు తీసుకున్నారు. వెంటనే మీరు ప్రభుత్వ పరీక్షల జిల్లా అధికారి గుమాస్తాకు ఫోన్ చేసారు.
ఆయన తనదగ్గరున్న వివరాలు పరిశీలించి నా ఓ.ఎం.అర్. ఫారం అసలు హైదరాబాద్ ప్రధాన కార్యాలయానికి జిల్లావారు అందజేయలేదని, తప్పు జరిగిందని చెప్పారు. మీరు దాదాపు ఫోన్ లో ఏడుస్తూ మాట్లాడారు.’’బాబు.ఒక విద్యార్ధి జీవితం నాన్న అది.ప్లీజ్..దయచూపించండి.ఏంచేయమంటారో సలహా చెప్పండి.’’ అని మీరు ప్రాధేయపడిన విధానానికి అతను పరిష్కారం చెప్పాడు.
అతను చెప్పిన ప్రకారం మీరు నా ఓ.ఎం.ఆర్.షీట్ మరియు ఐ.సి.ఆర్.ఫారాలు కొత్తది పూర్తిచేసి వాటికి మీదగ్గర ఆధారాలు అన్ని గుచ్చి మాకాన్వెంట్ గుమాస్తా చేత అక్కడి గుమాస్తాను కలవమని చెప్పి ఫోన్ నెంబర్ ఇచ్చి ఆరాత్రే హైదరాబాద్ పంపించారు.
మా గుమాస్తా మీదగ్గర లంచం తీసుకుని మరునాడు కేంద్రకార్యాలయానికి వెళ్లి అన్ని ఫారాలు అక్కడి గుమాస్తాకు అందించి నా ఒక్క పేరును చేతితో రాసిన నామినల్ రోల్ తో ఆరాత్రి అక్కడ బయల్దేరి మరునాడు ఉదయం ఆరింటికి మీకు అందజేశాడు.
ఆఖరిక్షణంలో మీరు నా పరీక్షాకేంద్రం చీఫ్ గారికి ఒక అఫీషియల్ ఉత్తరంతోపాటు నామినల్ రోల్ కాపీ ఇస్తూ నన్ను గాఢంగా కౌగలించుకుని తమరు కళ్ల నీళ్లు పెట్టుకున్నారు.
నాకోసం మీరు పడిన కష్టం చూసి నాకూ ఏడుపు వచ్చేసింది.మీరు నా కళ్ళు తుడుస్తూ...’’ఇది నీ కష్టార్జితంతో ఫీజు కట్టి రాస్తున్న పరీక్ష.మొదటిసారే ఫస్ట్-క్లాసులో పాస్ అవ్వాలి సుమా.’’ అని దీవించి పంపారు. నాకు 523 మార్కులు వచ్చాయి. ఆతరువాత నేను వెనుదిరిగి చూసుకోలేదు. ఏ పరీక్ష హాల్ టికెట్ చూసినా మీరే నాకు స్పూర్తి. ఆ స్పూర్తితోనే ఈస్థాయికి ఎదిగాను మాస్టారు. ఈ జీవితం మీరు పెట్టిన బిక్ష. అమ్మ నా దగ్గరే ఆరోగ్యంగా , ఆనందంగా ఉంది సర్.ఇపుడు చెప్పండి సర్ ...నేను గుర్తు వచ్చానా సర్?’’
‘’బాబు.నువ్వు నువ్వు సూర్యప్రతాప్. నువు మొదలు పెట్టిన మొదటి క్షణంలోనే నాకు అంతా గుర్తుకు వచ్చేసింది. కానీ నా ప్రతీ చర్యని నువు కళ్ళకు కట్టినట్టు చెబుతుంటే ఆశ్చర్యపోతూ వింటున్నానయ్యా. ఎలా మర్చిపోగలనయ్యా?
ఒక విద్యార్ధికి ఎవరివల్లనైతే నేమి ఒక సంవత్సరకాలం భవిష్యత్తు అందకారమైపోతోందన్న బాధ నన్ను నిలువునా వణికించింది నాన్న.అందుకే నువ్వు పరీక్షకు హాజరయ్యేలా చేయగలగడం కోసం నేను ఆఖరిక్షణం వరకు పోరాడి గెలిచాను.వుహు.కాదు నిన్ను గెలిపించాను.ఆ గెలుపుకు కృతజ్ఞతగా నువ్వు నాకు ఈ పనిచేసిపెట్టావా బాబూ.ఆ భగవంతుడు నిన్ను చల్లగా చూడు గాక.’’ అన్నారు వృద్ధాప్యం వల్ల వచ్చిన కన్నీళ్లు కారుతున్న కళ్ళను తుడుచుకుంటూ.
‘’మీ నోట నాపేరు పలకబడటమే నా అదృష్టం సర్. వస్తాను సర్.ఖాళీ చేసుకుని మరోమారు తమ దర్సనం కోసం వస్తాను సర్.’’ అని హటాత్తుగా లేచి మాస్టారి పాదాలకు నమస్కరించి చమర్చిన కళ్ళను తుడుచుకుని వేగంగా వెళ్ళిపోయాడు ప్రతాప్. ఆయన మనసు అతనిపట్ల శిష్యప్రేమతో నిండిపోగా సంతృప్తిగా ఫైల్ తీసి చదువుకోవడం మొదలెట్టారు శశిధరం గారు.
సమాప్తం
