వృద్దాప్యము
వృద్దాప్యము
తిరుగుచున్నది మనసు తాన్ స్థిరములేక
పెరుగు చున్నవీ కోరికలు పెద్ద వగుచు
నరక మైనట్టి బ్రతుకులో నలిగిపోయి
శరణు వేడితి మాధవా!కరుణ జూపు!
పఱుగు పెట్టుచు కాలమున్ మఱచి పోతి
బరువు బాధ్యతల్ పీడించ బాధపడితి
దిక్కు తోచక నిలుచుండి దీననైతి
శరణు వేడితి మాధవా!కరుణ జూపు!
జన్మ జన్మల వాసనల్ చంపుచుండె
కర్మలన్నవి పట్టి నన్ గాల్చివేయ
భయమునొందితి నో దేవ!భక్తి తోడ
శరణు వేడితి మాధవా!కరుణ జూపు!
తల్లి తండ్రివి నీవని తలచుకొనుచు
బ్రతుకు బండిని లాగుచు పండిపోతి
వడలి పోయిన తనువుతో నడచి వచ్చి
శరణు వేడితి మాధవా!కరుణ జూపు!
మసక బారిన కండ్లతో మసలు టెట్లు?
చేతి కఱ్ఱయే గతినాకు చేవతగ్గె
ముసలి తనమందు బాధలే ముసురుకొనగ
శరణు వేడితి మాధవా!కరుణ జూపు!
వణుకు చున్నది కంఠము వయసు లేదు
వృద్ధురాలనై పడియుండి హృదయమందు
నిల్పు కొంటిని నీరూపు నీరజాక్ష!
మ్రొక్కు కొందును మాధవా!ముక్తి నిడుము.//
