వింటున్నా
వింటున్నా
గుండెవెనుక యేరులైన..చినుకుపాట వింటున్నా..!
పొంగలేక మౌనమైన..చినుకుపాట వింటున్నా..!
కడలులెన్ని దాచుకుందొ..చెప్పలేని చిన్నదోయి..
సడేలేక ముక్కలైన..చినుకుపాట వింటున్నా..!
లేదు దారి అని తెలిసిన..యోగినిలా తానైనది..
ఒకనిశ్చల మేఘమైన..చినుకుపాట వింటున్నా..!
కలల వీధి తలుపు మూసి..కూర్చున్నది ఆశ వీడి..
వలపులన్ని మోడులైన..చినుకుపాట వింటున్నా..!
మంచుపూల నవ్వులింటి..తేనెసాక్షి సంతకమే..
విరహపునది నేస్తమైన..చినుకుపాట వింటున్నా..!
గాలివాటు తెఱచాపకు..తీరమెలా దొరికేనో..
రాగసుధలు వాగులైన..చినుకుపాట వింటున్నా..!
