వెన్నెలలో
వెన్నెలలో
మరిగిపోనీ మనసునిలా..జ్ఞాపకాల వెన్నెలలో..!
బ్రతికిపోనీ విరహమిలా..జ్ఞాపకాల వెన్నెలలో..!
ఏ మధువుతో పనేముంది..గుండె గొంతున చేరాక..
కాలిపోనీ వలపులిలా..జ్ఞాపకాల వెన్నెలలో..!
పెదవిదాటి రానిమాట..తోడుచాలు ఈ జన్మకు..
ఉండిపోనీ ప్రేమనిలా..జ్ఞాపకాల వెన్నెలలో..!
పాడలేని రాగమొకటి..పొంగుతోంది ఓ నదిలా..
కరిగిపోనీ కలలనిలా..జ్ఞాపకాల వెన్నెలలో..!
ఏ చినుకున దాగినదో..చెలినవ్వుల చిత్రసీమ..
కలిసిపోనీ రంగులిలా..జ్ఞాపకాల వెన్నెలలో..!
జాబిలితో ముఖాముఖీ..జరుపుతోంది ఓ కిటికీ..
కురిసిపోనీ మౌనమిలా..జ్ఞాపకాల వెన్నెలలో..!
