ఉత్కంఠభరితంగా..
ఉత్కంఠభరితంగా..


నువ్వు వెళ్లేచోటికల్లా వచ్చి
నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు
కానీ అడుగుల్ని ఆపలేను
చూపుల్తో తినెయ్యాలని కాదు
కానీ కన్నులను కాదనలేను
నీ ఉనికిని ఆఘ్రాణిస్తూ
నిత్యం ఉరికే భావాన్ని
ఊరికే నన్నుండమంటే ఎలా
ఈ ప్రేమ
వైరుధ్యానికి పరాకాష్ట
వివశత్వపు కర్మకాండ
చీకటి మబ్బులకు
కాటుక దిద్దిన సాహసం
నవారు మంచంలో
ఇరుక్కున్న కాలు పడే యాతన
చప్పిడి జీవితంలో
విపరీతమైన చప్పుడు చేస్తూ
ఎవరి జీవితాన్నయినా
ఉత్కంఠభరితంగా మార్చేస్తుంది
గుర్రపు వేగం పెరిగి
దుమ్ము పైకి లేచినట్లు
భయాన్ని అద్దుతుంది
ఆలోచనల అంతరంగంలో
మరో కొత్త పేజీ
మరో కొత్త మనిషి
అదే పాత ప్రేమ
చావని పాత్రలతో చంపే ఓ చిరునామా