సంగీత సామ్రాట్టు
సంగీత సామ్రాట్టు
త్యాగ రాజు తాన్ రాముని దయను కోరి
చిత్తమందున నిల్పి సంసేవ్యుడగుచు
వివిధ శాస్త్రములన్ చదివిన విబుధుడాయె
సరస సంగీతసామ్రాజ్య చక్రవర్తి
బిరుదు పొందిన ధన్యుడు పృథ్వి యందు.
రామ పదరేణువై త్యాగ రాజొకండు
భక్తి కీర్తనల్ బాడుచు పరవశించి
సామవేదమున్ సాధన సలుపుచుండి
పరమ పథమును బొందె నీ భక్త వరుడు.
రామ నామమున్ బల్కుచు సామగతిని
తేటతెల్లము చేసి తాన్ దీర్చిదిద్ది
క్రొత్త పుంతలు త్రొక్కించి కూర్చినాడు
సంగతులనన్ని యును రాగ జలధి యందు.
త్యాగ రాజయ్య బాణీల నాదరించి
సాంప్రదాయమున్ వీడక శ్రద్ధతోడ
నేటి తరముల గాయకుల్ నేర్చికొనుచు
గాన కళపైన చూపిరి గౌరవమ్ము.
పెన్నిధివలె నీ జాతికి పేరు తెచ్చి
నిలిచియుండె నీ త్యాగయ్య నేటివరకు
స్ఫూర్తి నిచ్చెడి యాతని కీర్తి సుధలు
తారలున్నంత కాలము తళుకు మనును.
జగతి యాందొక ధ్రువతార జన్మమొంది
రామ భక్తితో సంగీత రాజ్యమేలి
పుణ్యచరితుడై మిగిలెనీ పుడమి యందు
భక్తి మీరగ త్యాగయ్య పాటలెపుడు
తల్చు కొందురు లోకులీ ధరణి యందు.
పరమ భాగవతోత్తమ వరుని తల్చి
భక్తితో నిడుచుంటినే వందనములు //
