ధర్మమార్గం
ధర్మమార్గం
ధర్మమార్గం.
(తేటగీతి మాలిక)
మానవత్వంబునే నీవు మరువ వలదు!
కానిపనులను జేయుచు కలత పడకు!
దుష్టతతితోడ కూడుచు దొర్లి దొర్లి
ముఱికి కూపములో నీవు మునిగి పోకు!
కరుణ కల్గిన మానవా!కఱకుతనము
వలదు వలదోయి!నీ కింత బలుపు తగదు!
జాతి సౌఖ్యమున్ గోరిన శాంతి కలుగు!
బీద సాదలపై నీవు ప్రీతి జూపు!
భేదభావమున్ మది నుండి పెరకి వెయ్యి!
కులమ తంబులగోడలన్ గూల్చి వెయ్యి!
మనుజులెల్ల స మానమై మహిని కలసి
జీవ నంబును సాగించ శ్రేయమబ్బు!
నీదు వంశపు కీర్తిని నిలుపవోయి!
తాత తండ్రుల ఖ్యాతిని తల్చవోయి!
వారి బాటలో వెడలిన ప్రగతి కల్గు!
వినుము మానవా సూక్తులన్ విబుధచరిత!
కాసు కోసము సంస్కృతిన్ గాల్చకోయి!
సాధుమతివై చరించుమీ సంఘమందు!
యువత కాదర్శమై జాతి కూపిరూది
భరతమాతకు బిడ్డవై వర్థిలవయ!//
